నీరజJRC కాలేజీ లో బి.ఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఇంటికి కాలేజీ కి చాలా దూరం,అయినా ఆమె నడిచే వెళ్ళేది. వేసవి సెలవుల తర్వాత కాలేజీ reopen అయ్యింది.ఓ రోజు అలా నడిచి వెళుతుంటే , ఓ వీధి మొదట్లో నలభై ఏళ్లాయన నించుని, నీరజని చూడగానే ," నువ్వు JRC కాలేజ్ కదమ్మా? అని అడిగారు.
నీరజ అవునండి" అన్నది.
నేను PWD ఇంజనీర్ నమ్మా, మా అమ్మాయి రాగిణి ని మీ కాలేజీ లోనే చేర్చాము,మాకీ వూరు కొత్త కొంచం అలవాటయ్యిందాకా , నీ వెంట తీసుకెళతావా ?" అని అడిగారు.
రాగిణి పొడవుగా, సన్నగా చక్కగా వున్నది.అలా రోజూ నీరజ వెంట వచ్చేది. టౌన్ వాతావరణం ఆమెకి కొత్త , మొదటినుండీ సిటీ లో పెరిగిన అమ్మాయి అందుకే కాలేజి కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నీరజతోనే వస్తుండేది.
ఆ రోజు కాలేజీ డే, రాగిణి ఆమె ప్రక్కనే కూర్చుంది. ప్రోగ్రాం చూడటం లో మునిగిపోయిన నీరజ ముందు గమనించలేదు కానీ,ఓ గంట తర్వాత రాగిణి బలహీనమైన గొంతుతో " అక్కా, అక్కా" అంటున్నది.ఆమె పూర్తిగా చెమటతో తడిసి పోయి వున్నది.
నీరజ ఉలిక్కిపడి రాగిణి కేసి చూసి," ఏమయ్యింది"/ అని అడిగింది.
" ఏదో నా తొడని పట్టుకొని వదలడంలేదు" అన్నది బలహీనమయిన గొంతుతో, వణికిపోతూ.
ఆ కాలేజీ కి ఆడిటోరియం లేదు. ఆరుబయట ప్రోగ్రాం జరుగుతున్నది.చుట్టూ గందరగోళంగా వున్నది. నీరజ కు ఏమి చేయాలో తోచలేదు. కొంచం సేపు అలోచించి, తన దగ్గిరవున్న పెద్ద కర్చీఫ్ తీసి, లోపలి కి చేయి పెట్టి, మెత్తగా తగులుతున్న దాన్ని గట్టిగా పట్టుకొని
, బయటకు లాగింది. బయటకు తీయగానే ,కుర్చీఫ్ ని దూరంగా విసిరేసింది, నల్లని పక్షి ఏదో కీచుమంటూ అరుస్తూ ,ఎగిరి పోయింది.
అది గబ్బిలం!
అసలా కాలేజీ నిజంగా ఒక కాలేజీ లా ఉండదు. రేకుల షెడ్స్, అర్ధ చంద్రాకారం లో వుండి, రాత్రి పూట అలా గబ్బిలాలకు ఆశ్రయమిస్తూ ఉంటాయి. మర్నాడు వాళ్ళ అమ్మ , నాన్న నీరజకు థాంక్స్ చెబుతూ, నువ్వు ఆ గబ్బిలాన్ని లాగక పొతే భయం తో మా అమ్మాయి చచ్చిపోయి ఉండేది" అన్నారు.
రెండో సంవత్సరం రాగిణి లో చాలా మార్పు వచ్చింది. నీరజ తో రావటం మానేసింది. నీరజ పట్టించుకోలేదు. ఆమెకూడా సెకండ్ ఇయర్ లోకి వచ్చింది, అలవాటయి ఉంటుందిలే అనుకుంది.
ఆ తర్వాత చాలా ఏళ్లతర్వాత నీరజకు రాగిణి వాళ్ళ అమ్మగారు కనిపించారు. రాగిణి గురించి అడిగింది " ఎలా వుంది" అని.
" " ఏమి చెప్పను తల్లీ, అది సతీష్ అనే దాని క్లాస్ మెట్ వలలో పడింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనే. మా మాట వినకుండా, వాడిని డిగ్రీ కాకముందే పెళ్ళీ చేసుకుంది. వాడికి చదువు, ఉద్యోగమూ ఏమీ లేదు, పైగా తాగుడుకు అలవాటు పడ్డాడు, ప్రస్తుతం డ్రగ్స్ కి కూడాఅలవాటు పడ్డాడు. వాడు దీన్ని గబ్బిలంలా పట్టుకొని వదలడు, అదీ అంతే, గబ్బిలం లా వాడినే పట్టుకొని వేలాడుతోంది." అన్నది ఏడుస్తూ.