మూగమనసులు - సంధ్యారాణి సిరిప్రగడ

Mooga manasulu

నూతన వధూవరులైన ప్రవళిక, పృథ్వీరాజ్ లు కలిసి సంతోషకరమైన జీవితం కోసం ఎన్నో ఆశలతో ఢిల్లీకి బయలుదేరారు. వీరిద్దరికీ ఇది రెండోవ పెళ్ళి. పృథ్వీరాజ్ మొదటి పెళ్ళి గట్టిగా ఒక సంవత్సరం నిలిచింది.

హైదరాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్ మాజీ భార్య మయూరి, సరైన కారణం లేకుండానే విడాకులు తీసుకుంది. ఎల్‌ఎల్‌బి చదువుతున్న సమయంలో పృథ్వీరాజ్ తండ్రి విశ్వనాథ్‌కి క్లాస్‌మేట్ అయిన రంగారావుకి మయూరి ఏకైక కుమార్తె. విశ్వనాథ్ మరియు రంగారావు ఒకే కళాశాలలో చదివారు, కొన్ని సంవత్సరాలు ఒకే కోర్టులో కలిసి పనిచేశారు, చివరికి వేర్వేరు వృత్తి మార్గాలను అనుసరించారు. విశ్వనాథ్ న్యాయమూర్తి కావడానికి పరీక్షలు రాసి ఢిల్లీలో పోస్టింగ్ పొందగా, రంగారావు హైకోర్టులో లాయర్‌గా కొనసాగుతున్నారు. స్నేహితులిద్దరూ ముందుగానే అనుకుంటూ ఉండేవారూ, వీరిద్దరికీ వివాహం చేయాలని. విశ్వనాథ్, సుధ దంపతులకి పృథ్వీరాజ్ నాలుగవ కుమారుడు. విశ్వనాథ్ కుటుంబం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా, రంగారావు ఇంటికి రావడం, పిల్లలు అంతా కలిసిపోయి ఆడుకోవడం, అలా కలిసిమెలిసి పెరగటంతో, పెద్దయ్యాక పృథ్వీరాజ్, మయూరి కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. మయూరి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేయగానే, పృథ్వీరాజ్ ఐపీఎస్ ఉద్యోగంలో చేరడంతో, పెద్దలు వీరికి వివాహం చేశారు. పెళ్ళయిన కొద్ది రోజుల నుంచే మయూరి ఏ రోజు సంతోషంగా కనిపించలేదు.

పృథ్వీ ఎంతగానో ఆమెను సంతోషపరచడానికి, ఇష్టమైనవన్నీ తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయినా కూడా సంతోషంగా లేదు. అడిగితే చెప్పేదికాదు. "మా పుట్టింటికి వెళ్తా!" అనేది. అలా వెళ్ళి ఒక రెండు మూడు నెలలు అక్కడే ఉండేది. మళ్ళీ పృథ్వీరాజ్ వెళ్ళి బతిలాడి తీసుకొని వచ్చేవాడు. మళ్ళీ ఒక నెల రోజులు ఉండేది, మళ్ళీ "వెళ్తా, వెళ్తా" అనేది. అలా ఒక ఆరు నెలలు రావడం పోవడం.. రావడం పోవడంతోటే సరిపోయింది. కాపురం ఏరోజు సరిగ్గా సాగలేదు. పృథ్వీ ఆమె దగ్గరికి రావడానికి ప్రయత్నించినప్పుడల్లా "నాకు తలనొప్పిగా ఉంది, ఒంట్లో బాలేదు, ఇప్పుడు కాదు." అంటూ సమాధానం ఇచ్చేది, దూరదూరంగా జరిగేది. అమ్మాయి ఎందుకిలా చేస్తుందో అని కుటుంబానికి కూడా ఏమీ అర్థం అయ్యేది కాదు!. అలా ఆరు నెలలు దాటిన తర్వాత గట్టిగా నిలదీసి అడిగేసరికి "నన్ను వదిలేయండి! నాకు ఈ కాపురం వద్దు. నాకు డైవర్స్ కావాలి" అంటూ గోల మొదలైంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా, అత్తమామలు నచ్చ చెప్పినా, ముగ్గురు తోడికోడళ్ళు, బావలు వద్దని చెప్పినా కూడా అసలు వినిపించుకోలేదు. "సరైన కారణం లేకుండా నీకు విడాకులు ఎందుకు?" అని అడిగినా కూడా "నాకు విడాకులు కావాలి, నేను రాను." అని మొండిగా కూర్చుంది. "కనీసం సంవత్సరం కూడా కాపురం చేయకుండా, సరైన కారణాలు లేకుండా కోర్టు విడాకులు ఇవ్వదు." అని చెప్పినా కూడా "మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేసుకుందాం." అని గొడవ స్టార్ట్ చేసింది. రెండు కుటుంబాలు ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి "ఇక తప్పదు! అమ్మాయితో ఇష్టం లేని కాపురం చేయించలేము." అని చెప్పి, సంవత్సరం తర్వాత మ్యూచువల్ డైవర్స్ ఇప్పించారు. పృథ్వీ ఆ తర్వాత మరో పెళ్ళి చేసుకోవడానికి సంకోచించగా, కుటుంబం అంతా కలిసి మళ్ళీ పెళ్ళి చేయడానికి, నా నా తంటాలు పడి అతన్ని ఒప్పించారు. ముఖ్యంగా ప్రవళిక గత జీవితం గురించి చెప్పి ఒప్పించారు. ప్రవళిక మొదటి పెళ్ళి గురించి, ఆమె జీవితం గురించి తెలిసిన వారు ఎవరైనా అయ్యో పాపం అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఆమె మొదటి పెళ్ళి ఎవరితో చెప్పుకోడానికి కూడా చాలా ఇబ్బంది పడేంతగా, కలలో కూడా ఊహించని విధంగా, అతి భయంకరంగా ముగిసిపోయింది. ఇంటి ముందు కారు ఆగింది.

పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు, ఇతర కుటుంబ సభ్యులందరూ కారు దిగి వధువు ప్రవేశం కోసం గుమ్మం దగ్గర ఆగారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పృథ్వీ ఇంకా ప్రవళిక పెద్దగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచుకున్నా, త్వరగా తంతు అయిపోతే బాగుండు, ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వారి పేర్లు, ఊరి పేర్లు చెప్పించారు. మంగళ హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చారు. కొత్తగా వచ్చిన కోడలికి స్వీట్ తినిపించారు, ఇక రూమ్ లోకి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించారు. ఇద్దరూ రూమ్ లోకి వచ్చారు. "కూర్చో ప్రవళిక" అన్నాడు పృథ్వీ. కాస్త మొహమాటంతో బెడ్ పై కూర్చుంది ప్రవళిక. "ఇది ఇక నుంచి మన రూమ్. స్వేచ్ఛగా ఉండొచ్చు. ఏం కావాలన్నా భయపడకుండా అడుగు." చెప్పాడు పృథ్వీ. "అలాగే" అంటూ తల ఊపింది ప్రవళిక. "నువ్వు రిలాక్స్ అవ్వు. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను." అంటూ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోయాడు పృథ్వీ. నెమ్మదిగా తల ఎత్తి రూమంతా కలియ చూసింది ప్రవళిక. ఐపీఎస్ ఆఫీసర్ అవడంతో రూమ్ లో పెద్దగా డెకరేటివ్ ఐటమ్స్ ఏమీ లేవు. అవసరమైనవి మాత్రమే ఉన్నాయి. వారం రోజులుగా పెళ్ళి హడావిడి. ఎంత వద్దన్నా వాళ్ళ అమ్మా నాన్న గ్రాండ్ గా పెళ్ళి చేశారు. బాగా అలసిపోయింది. కాస్త నడుము వాల్చింది ప్రవళిక. వెంటనే నిద్రలోకి జారుకుంది. అలా ఒళ్ళు తెలియకుండా ఓ రెండు గంటలు నిద్రపోయింది. తలుపు చప్పుడు అయ్యేసరికి మెలుకువ వచ్చింది. మెల్లగా లేచి తలుపు తీసింది ప్రవళిక. ఎదురుగా వాళ్ళ పెద్ద తోడికోడలు సునయన. "బాగా నిద్రపోయినట్టున్నావే. రా భోజనం చేద్దువు గాని, 9: 30 అయింది." అంది సునయన. "ఒక టెన్ మినిట్స్! కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను." అంది ప్రవళిక. "సరే త్వరగా వచ్చేయ్ మేమందరం కింద వెయిట్ చేస్తుంటాం నీకోసం." అంది సునయన. ఎప్పుడో పొద్దున హైదరాబాద్లో బయలుదేరుతున్నప్పుడు స్నానం చేసింది. వళ్ళంతా చెమటలు, ఒళ్ళు నొప్పులు. దాంతో కొంచెం వేడినీళ్ళతో స్నానం చేస్తే బాగుంటుంది అనిపించింది. గీజర్ ఆన్ చేసుకుంది. వేడి నీళ్ళు ఒంటిమీద పోసుకుంటే ఎంతో హాయ్! ఒంట్లో నొప్పులు అన్ని పోయాయి. త్వరగా స్నానం చేసి, తయారయ్యి కిందికి వచ్చింది ప్రవళిక. అందరూ నవ్వుతూ పలకరించి "రా భోజనం చేద్దాం." అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళారు. కానీ ఆమె భర్త పృథ్వీరాజ్ మాత్రం కనిపించలేదు. ఆమె చూపులని గ్రహించిన ఆమె పెద్ద బావగారు రాజేంద్ర "వస్తాడమ్మా. నువ్వు చూసేది రాజ్ కోసమే కదా! ఏదో పనుండి వెళ్ళినట్టు ఉన్నాడు. వస్తాడులే! వాడికి ఇలా అలవాటే, అర్ధరాత్రి, లేదంటే తెల్లవారుజామున, అలా కుదరకపోతే రేపు తెల్లారాకనో వస్తాడు. టెన్షన్ పడకు." చెప్పాడు. "అలాగా!!" అన్నట్టు "ఒక చిన్న చిరునవ్వు నవ్వింది!" ప్రవళిక. ప్రవళిక మెట్టినింట తన జీవితాన్ని మొదలుపెట్టింది. కుటుంబ సభ్యులందరూ చాలా బాగున్నారు. వారం రోజుల తర్వాత రిసెప్షన్ జరిగింది. ఎక్కువశాతం అతిథులందరూ ప్రొఫెషనల్ సర్కిల్ వారే. జడ్జి విశ్వనాథ్ స్నేహితులు చాలా మంది లాయర్లు, జడ్జీలు వచ్చారు. పృథ్వీరాజ్ పెద్ద అన్నయ్య రాజేంద్ర డాక్టర్. ఆయన తరపు ఫ్రెండ్స్, రెండో అన్నయ్య అమరేంద్ర ఆర్బీఐ లో జాబ్ చేస్తాడు, ఆయన తరుపు బ్యాంకు స్నేహితులు, అలాగే అతని మూడవ అన్నయ్య విజయేంద్ర. ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసరే. ఆయన తరుపు స్నేహితులు చాలామంది వచ్చారు. అందరూ కొత్త జంటని ఆశీర్వదించి వెళ్ళారు. ప్రవళిక అత్తగారు సుధ. ఆవిడ ఎంతో ఆప్యాయత గల వ్యక్తి. కోడళ్ళందరినీ కన్న కూతుర్లుగా చూసుకుంటారు. ఆవిడకి కూతుర్లు లేరు కాబట్టి ఆ లోటు వాళ్ళలో చూసుకుంటూ ఏ రోజు ఇబ్బంది లేకుండా వాళ్ళతో కలిసిమెలిసి సంతోషంగా గడుపుతున్నారు. అంతా బానే ఉంది కానీ పృథ్వీ ఒక వర్క్ హాలిక్. వేలాపాల లేకుండా, పని మీదే ఉంటాడు. పని కోసం ఎంత సమయం అయినా కేటాయిస్తాడు. వారానికి రెండు మూడు రోజులు ఇంటికి వస్తాడు. సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఇంకా మొదలు కాలేదు. మొదలయ్యే అవకాశం కూడా దగ్గరలో కనిపించట్లేదు. ప్రవళిక కి తెలుసు పృథ్వీ ఈ పెళ్ళికి సుముఖంగా లేడని. అందుకే ఈ విషయంలో తను కూడా తొందరపడట్లేదు, అతన్ని అర్థం చేసుకుంటుంది. పోద్దునంతా కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, రాత్రి అయితే ఒంటరిగా రూమ్ లో ఉండటం, మధ్య మధ్యలో హైదరాబాద్ లోని వాళ్ళ అమ్మ నాన్న తో మాట్లాడటం, ఇదే ప్రవళిక దినచర్య. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా చూసుకుంటుంది. అంతేకాదు పృథ్వీరాజ్ మొదటి పెళ్ళి ఎందుకు విజయవంతం కాలేదో కూడా తనకిప్పుడు అర్థమవుతుంది. ఇద్దరూ చిన్నప్పటినుంచి ఒకరినొకరు బాగా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా కూడా కలిసి సంతోషంగా కాపురం చేయలేకపోయారు. పృథ్వీరాజ్ డ్యూటీ మైండ్ వల్ల మయూరి తో ఎక్కువగా సమయం గడిపేవాడు కాదని తెలుస్తుంది. బహుశా అందుకే ఆమె విడాకులు తీసుకుంది. ఒక సాయంకాలం ప్రవళిక టీ తాగుతూ బాల్కనీలో కూర్చుంది. ఇంతలో తన మొదటి భర్త తల్లి సుహాసిని ఫోన్ చేశారు అమెరికా నుంచి. "ఏమ్మా ప్రవళిక నీ గురించి విన్నాను, చాలా సంతోషంగా ఉంది రా, నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోవడం. నేను మీ మామగారు అదే సారీ మీ అంకుల్ ఎంతో సంతోషించాము." చెప్పింది సుహాసిని. "థాంక్యూ ఆంటీ. మీ అందరి సంతోషమే నేను కోరుకున్నా, ముఖ్యంగా మీరు, అమ్మానాన్న నన్ను తలుచుకొని బాధపడకుండా ఉండాలని." చెప్పింది ప్రవళిక. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమె తన కొడుకుని తలుచుకుని బాధపడుతూ "ఇంత మంచి అమ్మాయి, కోడలుగా మాకు జీవితాంతం ఉండే అదృష్టం లేదు." అంటూ ఫోన్ పెట్టేసింది. ప్రవళికకి తన గత జీవితం కళ్ళ ముందు కదలాడింది. చాలా కాలంగా ఒకే కాలనీలో ఉండే ప్రవళిక, ఆమె మొదటి భర్త షమ్మీ రెడ్డి మంచి స్నేహితులుగా ఉండేవారు. షమ్మీ వాళ్ళ నాన్న మంచి బిజినెస్ మాన్. తన తర్వాత బిజినెస్ చూసుకోవాల్సింది షమ్మీ అని ఎంత చెప్పినా కూడా వినకుండా షమ్మీ 'ఐపీఎస్ తన డ్రీమ్ అని, అదే సాధించాలని' కలలు కనేవాడు. అలాగే ప్రవళిక ఎంత స్నేహంగా ఉన్నా, మొదటి నుంచి ఆమె వ్యక్తిత్వం చూసి ఆమెను ఇష్టపడేవాడు. ఐపీఎస్ సాధించగానే ప్రవళికని పెళ్ళి చేసుకోవాలని కోరుకునేవాడు. ఈ విషయం ప్రవళికతో ఎన్నోసార్లు చెప్పినా ఆమె మాత్రం అందుకు ఇష్టపడేది కాదు. మనం మంచి స్నేహితులం అలాగే ఉండాలి అనేది. అనుకున్నట్టుగానే షమ్మీ ఐపీఎస్ సాధించాడు. ఇక వెంటనే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టారు. షమ్మీ మాత్రం ప్రవళికనే పెళ్ళి చేసుకుంటానని మొండి పట్టుదల పట్టాడు. ప్రవళిక వాళ్ళ అమ్మానాన్నతో కూడా మాట్లాడాడు. చివరికి ఇరువైపుల పెద్దలు ప్రవళికని ఒప్పించారు.

"ప్రేమించే మనిషి దొరకడం చాలా అరుదు, పైగా మంచి స్నేహితుడు కాబట్టి ఎక్కువగా ఆలోచించొద్దు పెళ్ళి చేసుకో." అని ప్రవళిక వాళ్ళ నాన్న నచ్చ చెప్పారు. వాళ్ళ నాన్న కూడా నచ్చ చెప్పడంతో ప్రవళిక పెళ్ళికి ఒప్పుకుంది. ప్రవళిక వాళ్ళ నాన్న ఒక ఐఏఎస్. తన దాహతుకు తగ్గట్టు గొప్పగా పెళ్ళి ఏర్పాట్లు చేశాడు. షమ్మీకి ఫస్ట్ పోస్టింగ్ వరంగల్లో ఇచ్చారు. చాలా సిన్సియర్గా తన డ్యూటీ చేస్తూ అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అక్కడ నక్సలైట్ల సమస్య చాలా ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది నక్సలైట్లనీ తన మాటల చాతుర్యంతో "ఇది మంచి జీవితం కాదు." అని "వాళ్ళ కుటుంబాల దగ్గరికి తిరిగి రావాలని. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని." తగు సలహా ఇచ్చాడు. అలా తిరిగి వచ్చిన వాళ్ళకి "పోలీసుల నుంచి ఎలాంటి నష్టం జరగదని, వాళ్ళ గత చరిత్రను మొత్తం పోలీస్ రికార్డు లో లేకుండా చేస్తానని." చెప్పాడు. చాలామంది నక్సలైట్లు అతన్ని నమ్మి నక్సలైట్ జీవితాన్ని వదిలేసి వాళ్ళ కుటుంబాలకి చేరువయ్యారు. దాంతో ఆ కుటుంబాలన్నీ చాలా సంతోషించాయి. షమ్మీ దగ్గరికి వచ్చి కన్నీటితో అతనికి ధన్యవాదాలు చెప్పారు. తనకి పెళ్ళి కుదిరిందని, తనని హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేయాలని తన పై అధికారులను షమ్మీ కోరాడు. వాళ్ళు కూడా సంతోషంగా అతన్ని హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అందరినీ తన పెళ్ళికి ఆహ్వానిస్తూ వరంగల్ కి వీడ్కోలు పలికి హైదరాబాద్ వచ్చేసాడు షమ్మీ. వచ్చీరాగానే ఎంతో హడావుడి. షాపింగ్ అనీ, 'బట్టలు నగలు' అంటూ వాళ్ళ అమ్మ సుహాసిని అతన్ని కాళీ లేకుండా షాపులన్నీ తిప్పేసింది. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి గొప్పగా చేయాలని వీళ్ళు. ఒక్కగానొక్క కూతురి పెళ్ళి గొప్పగా చేయాలని వాళ్ళు, ఎక్కడా తగ్గకుండా బంధువులనీ, స్నేహితులనీ పిలిచారు. 'సంగీత్, మెహందీ, హల్దీ...' ఇలా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం అన్నీ చాలా గొప్పగా హై లెవెల్ లో చేశారు. పెళ్ళి రోజు రానే వచ్చింది. షిమ్మీ ఎంతో సంతోషంగా తన కలల రాణిని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ, వచ్చిన బంధువులూ, స్నేహితులూ తన కాబోయే భార్యను చూసి 'అందగత్తె' అని పొగుడుతుంటే మురిసిపోయాడు. ప్రవళిక కూడా తన స్నేహితుడు తన భర్త కాబోతుంటే జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుందని నమ్మింది. తనకోసం షమ్మీ వాళ్ళ కుటుంబం మాంసాహారం కూడా మానేస్తా అని మాట ఇచ్చేసరికి చాలా పొంగిపోయింది. కుటుంబం మొత్తం ఆ త్యాగం చేయడం చూసి ఎంతో గర్వ పడింది. పెళ్ళిలో ఎక్కడా మాంసాహారం లేదు. షమ్మీ తరపు బంధువులు కొంచెం అలిగినా అదేమీ పట్టించుకోలేదు షమ్మీ కుటుంబం. తాళి కట్టే సమయం రానే వచ్చింది. మంగళవాద్యాలు మిన్నంటుతున్నాయి! బ్రాహ్మణుడు తాళిబొట్టు షమ్మీకి ఇచ్చి అమ్మాయికి కట్టమని చెప్పాడు. షమ్మీ 'మూడు ముళ్ళు' వేశాడు. అక్షింతలు 'వర్షపు జల్లులుగా' మీద పడుతున్నాయి. ప్రవళిక తన గుండెల పై వాలిన మంగళసూత్రాన్ని, కొత్తగా ఇకపై ఇది తన ఆభరణం అని సంతోషంగా చూసుకుంటుంది. "ఫట్... ఫట్..." గన్ ఫైర్. రెండు బుల్లెట్లు షమ్మీని గురిపెట్టి అతని గుండెల్లోకి దూసుకుపోయాయి. నిల్చున్నవాడు అలాగే ప్రవళిక మీద పడిపోయాడు. హాల్ అంతా గోలగోలగా మారింది, అందరి అరుపులతో దద్దరిల్లింది. అసలు ఏం జరిగిందో అర్థం అయ్యేసరికి అందరూ భయపడి వణుకుతూ అటు ఇటు అంతా హాల్లోంచి బయటికి రావడానికి పరిగెడుతున్నారు.

ప్రవళిక, షమ్మీ కుటుంబాలు ఏం జరిగిందో ఒక్క నిమిషం అర్థం కాక, జరిగింది తెలుసుకునేసరికి షాక్ లో ఉండి పోయారు. ప్రవళిక వాళ్ళ నాన్న సురేష్ "పట్టుకోండి! వాళ్ళని పట్టుకోండి!" అంటూ ఎక్కడి నుంచి అయితే గన్ ఫైర్ జరిగిందో అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టాడు. సుహాసిని కొడుకుపై పడి ఏడుస్తూ... "షమ్మీ ..షమ్మీ" అంటూ అరుస్తుంది. ప్రవళిక షాక్ లో బిగుసుకుపోయింది. నిర్గాంత పోయి చూస్తూ. నిశ్చేష్టురాలైంది. ఒక ఐపీఎస్ పెళ్ళికి భద్రత కావాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎంతో మంది పోలీసులు ఉన్నారు అక్కడ. ఎంతో మంది ఐఏఎస్ స్నేహితులు ఉన్నారు. అందరూ నిర్ఘాత పోయారు. "ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అసలు ఏమైంది? పెళ్ళికొడుకుని చంపాల్సిన అవసరం ఏంటి?" అంటూ అందరూ ప్రశ్నలు సంధించుకుంటున్నారు. జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో షమ్మీని చంపిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. ప్రవళిక నిస్తేజంగా అందరూ చెప్పే సానుభూతి మాటలు వింటూ... జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు భయంకరంగా ముగియడంతో కన్నీళ్ళైనా రాని శిలలా మారింది. ఆ పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, చంపింది నక్సలైట్లనీ, షమ్మీ రెడ్డి ఎంతోమందిని జనజీవని స్రవంతిలో కలిపినందుకు నక్సలైట్లు అతని మీద పగ పట్టారని, అందుకే చంపారని పోలీసులు తేల్చారు. చంపిన వాళ్ళని పట్టుకున్నారు కానీ ఆ స్కెచ్ వేసిన, ప్లానింగ్ చేసిన ఆ నేరస్తుడు , నక్సలైట్ల నాయకుడు మాత్రం ఇంకా దొరకలేదు. అతను ఇంకా వరంగల్ అడవులలో తిరుగుతున్నాడు. ప్రవళిక దురదృష్టానికి ఆ విధిని నిందిస్తూ అందరూ వెళ్ళిపోయారు. ప్రవళిక తల్లీ తండ్రి ఏం చెప్పి ఆమెను ఓదార్చాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటే, షిమ్మీ తల్లీ తండ్రి ఎదిగిన కొడుకుని పోగొట్టుకొని, దీన స్థితిలో ఉన్నారు. "పిన్నీ... పిన్నీ..." అంటూ మూడో తోడికోడలు 'వాని' కూతురు, రెండేళ్ళ 'సాహితీ' పిలుస్తుంటే, అప్పుడు తన గతంలో నుంచి బయటకు వచ్చింది ప్రవళిక. తను గమనించలేదు, ఎప్పుడు వచ్చాడో తెలియదు! పృథ్వీ వచ్చి, స్నానం చేసి రెడీ అయి కూర్చున్నాడు. "ఏంటి సాహితీ?" అడిగింది ప్రవళిక. "పిన్నీ , ఐస్క్రీమ్ తిందాము. వస్తారా? మీరు, బాబాయ్, అక్క, అన్నయ్యలు, అందరము వెళ్ళి తినొద్దాము. సరేనా?" అంది సాహితీ. "సరే. వెళదాము." అంది ప్రవళిక. "బాబాయ్, పిన్ని ఓకే అంది. పదండి వెళదాము." పరిగెత్తుకుంటూ పృథ్వీ దగ్గరకొచ్చింది సాహితీ. "సరే పదండి." అంటూ లేచాడు పృథ్వీ. పిల్లందరినీ తీసుకుని బయటికి వచ్చారు ఇద్దరూ. "పిన్నీ...పిన్నీ..." అంటూ తోడికోడళ్ళ ఆరుగురు పిల్లలు చుట్టూ తిరుగుతూ మాట్లాడిస్తూ ఉంటే, తన మనసులోని బాధ, బరువు కాస్త తగ్గినట్టనిపించింది. పృథ్వీ కూడా పిల్లలతో సరదాగా మాట్లాడుతూ, వాళ్ళడిగింది కొనిస్తూ, జోకులేస్తూ, నవ్వుతూ, వాళ్ళతో కలిసిపోయిన తీరు చూసి ప్రవళిక మనసుకి హాయిగా అనిపించింది. ఎన్నో రోజుల తరువాత తను కూడా మనస్ఫూర్తిగా నవ్వింది. ఇంటికి వెళ్ళి డిన్నర్ చేశారు. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు. పెళ్ళి అయ్యాక మొదటిసారి పృథ్వీ, ప్రవళిక బయటికి వెళ్ళటం, కాస్త సమయం గడిపి రావటం, ఎప్పుడూ వీళ్ళు ఇలాగే చిలకా గోరింకల్లా కలిసి ఉండాలని మనసులో కోరుకున్నారు. ఈరోజు కాస్త మనసు తేలిగ్గా అనిపించింది ప్రవళికకి. ఎన్నో రోజుల నుంచి, ఏదో బరువు మోస్తున్నట్టు ఉండేది. మొదటి పెళ్ళి అలా అయింది, రెండో పెళ్ళి ఎలా అవుతుందో? ఎలా ఉంటుందో జీవితం అని, భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ, భయపడుతూ ఉండేది. రెండు నెలలుగా చూస్తుంది పృథ్వీని. ప్రత్యేకించి తనతో పెద్దగా ఎలాంటి సంభాషణలు చేయకున్నా, తన దగ్గరికి రావడానికి ప్రయత్నించకున్నా, ఎక్కువగా సమయం డ్యూటీ లోనే ఉన్నా, ఉన్న కాసేపు తన కుటుంబ సభ్యులతో గడపడానికి బాగా ఇష్టపడతాడు అని తెలుసుకుంది. బహుశా అతని మొదటి పెళ్ళి అనుభవం వలన ఇంకా అతను మనస్ఫూర్తిగా తనని భార్యగా స్వీకరించలేదని ప్రవళిక భావించింది. ప్రవళిక ఇలా ఆలోచిస్తుండగానే పృథ్వీ తనని పిలిచాడు!. "ఏమిటి" అన్నట్టు పృథ్వీ వైపు తలతిప్పి చూసింది ప్రవళిక. "రేపు పొద్దున్నే నేను హైదరాబాదుకి వెళ్తున్నా, పని ఉంది. ఒక మూడు రోజుల వరకు రాలేకపోవచ్చు." చెప్పాడు పృథ్వీ. "సరే." అన్నట్టుగా తల ఊపింది ప్రవళిక. రెండు రోజులు చూస్తుండగానే గడిచిపోయాయి. మూడో రోజు పొద్దున్నే ఐదు గంటలకి ఫోన్ హైదరాబాదు నుంచి "పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ!" అంటూ అమ్మ నాన్న దీవెనలు. కిందికి దిగగానే మెట్టినిట్లో కూడా అత్తగారు, మామగారు, తోడికోడళ్ళు, బావలు, పిల్లలు... అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ ప్రేమని చూపించారు ప్రవళికకి. ప్రవళిక వాళ్ళ అత్తగారు సుధ, ప్రత్యేకించి బ్రేక్ ఫాస్ట్ లో ప్రవళికకి ఇష్టమైన 'మసాలా దోశ' 'వడ', లంచ్ లో బిర్యానీ, పూరి, బేండీ ఫ్రై, గులాబ్ జామున్ చేయించింది. పెళ్ళి అయ్యాక తన చిన్న కోడలికి మొదటి పుట్టినరోజు అని సాయంత్రం కేక్ కూడా కట్ చేయాలని ఆమె ప్లాన్ చేసింది. మధ్యాహ్నం ప్రవళిక వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది." "హలో, అమ్మ చెప్పు!" "టీవీ చూస్తున్నావా ప్రవీ?" "లేదమ్మా! ఎందుకు?" "చూడవే! న్యూస్ ఛానల్ పెట్టు." అంటూ ఫోన్ పెట్టేసింది ప్రవళిక వాళ్ళ అమ్మ లక్ష్మి. పెద్దగా ఇష్టం లేకపోయినా, వాళ్ళ అమ్మ ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పింది కదా! అందుకోసం టీవీ ఆన్ చేసింది ప్రవళిక. తెలుగు న్యూస్ ఛానల్ పెట్టింది. వరంగల్ జిల్లా అడవుల్లో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది అని బ్రేకింగ్ న్యూస్ వస్తూంది. కొన్ని క్షణాలు ప్రవళికకి ఏమీ అర్థం కాలేదు "ఏంటి? ఈ ఎన్కౌంటర్ న్యూస్ చూడమని నాకెందుకు చెప్తుంది అమ్మ!" అంటూ కాస్త ఆలోచించింది. తర్వాత స్క్రోలింగ్లో "ఐపీఎస్ షమ్మీ రెడ్డిని చంపిన నక్సలైట్ల నాయకుడు 'వీరన్న' నీ పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు" అని వస్తోంది. "ప్రత్యేకించి ఢిల్లీ నుంచి వచ్చిన ఇంటలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని తెలుస్తోంది." అని న్యూస్ యాంకర్ చెప్తోంది. మళ్ళీ ఫోన్ అమ్మ దగ్గర నుంచి. ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రవళిక. "ఆ అమ్మా, చూస్తున్నా" అంది ప్రవళిక. "మనసుకు ప్రశంతంగా ఉంది ప్రవీ! నీ జీవితములో ఆనందం లేకుండా చేసినవాడు చచ్చాడు. ఇప్పుడే సుహాసినితో మాట్లాడాను. ఆవిడేమందో తెలుసా! 'ప్రవళికకి ఆమె భర్త ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్' అంది." ఉద్విగ్నభరితంగా చెప్పింది లక్ష్మి. కళ్ళలో నీళ్ళు తిరిగాయి ప్రవళికకి. "ప్రవళికా... " అత్తగారి మాట వినపడడంతో అటు చూసింది ప్రవళిక. "రామ్మా భోజనం చేద్దాం" అంది అత్తగారు. "వస్తున్నా అత్తగారు" అని ఆమెకి చెప్పి, "అమ్మా మళ్ళీ మాట్లాడుతా" అని ఫొన్ పెట్టేసి అత్తగారితో వెళ్ళింది ప్రవళిక. సాయంత్రం నుంచి అందరూ పృథ్వీ కోసం ఎదురుచూస్తున్నారు! అతనోస్తే కేక్ కట్ చెయ్యాలని. తొమ్మిదైయింది. అప్పుడొచ్చాడు. "ఏరా ! ఇంతాలస్యం. ఈరోజు నీ భార్య పుట్టినరోజు పెట్టుకుని!" అంది సుధ. "తెలుసమ్మా, కాని డ్యూటీ అయిపోవాలి కదా! సరే నేను ఫ్రెష్ అయి వస్తాను." అంటూ వెళ్ళాడు. బెడ్ రూములో వెయిట్ చేస్తున్న ప్రవళిక, పృథ్వీని చూడగానే ఆనందంతో లేచి నిలుచుంది. ప్రవళికని చూసి, చూపు తిప్పుకోలేకపోయాడు పృథ్వీ!! ఒక్కక్షణం అలాగే చూస్తూ నిలబడిపోయాడు. వెంటనే తేరుకుని "ఫ్రెష అయి వస్తా నువ్వు కిందకెళ్ళు." అని చెప్పి బాత్రూమ్లోకి వెళ్ళాడు. పృథ్వీ కిందకి రాగానే కేక్ కట్ చెయ్యటం అందరూ హర్షధ్వానాలు చెయ్యటం జరిగాయి. "నీ భార్యకు బర్త్ డే గిప్ట్ ఏమి ఇచ్చావు?" అంటూ అడిగారు అన్నలూ, వదినలు. ఒక చిరునవ్వు సమాధానంగా ఇచ్చి, తన గిటార్ తీసుకుని "ఓ సాతిరే... తేరే బినాబి క్యా జీనా" అంటూ పాటందుకున్నాడు. ఆటలు పాటలు , అయ్యాక డిన్నర్ చేసి రూంలోకి వచ్చారు ప్రవళిక, పృథ్వీ. వెనకనుంచి వస్తూ పృథ్వీని గట్టిగా పట్టుకుని "థాంక్ యు!" అని మెల్లిగా చెప్పింది ప్రవళిక. తను ఎందుకు తాంక్స్ చెప్పిందో అర్థం చేసుకున్న పృథ్వీ, వెనుతిరిగి అమెని నుదిటిపై ముద్దు పెట్టుకుని, తన కౌగిలిలో బంధించాడు. ఇద్దరి 'మూగ మనసులు' తేలిక పడి ముడివేసుకున్నాయి. ---సమాప్తం

మరిన్ని కథలు

Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ
Nruga maharaju
నృగ మహరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి