నీ నగు మోము నా కనులారా.... - సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు

Nee nagumomu naa kanulara

"మీ ఆలోచన కూడా అదేనా, నాన్న!" అంది హిమబిందు చెంపల మీద నుండి జారుతున్న కన్నీటి బిందువుల్ని ఒక చేత్తో తుడుచుకొంటూ. ఇంతలో ఆమె ఒడిలో నిద్ర పోతున్న మూడు నెలల పాప కెవ్వుమంది. తల్లడిల్లిన ఆ తల్లి మనసు, బిడ్డని గబుక్కున గుండెలకు హత్తుకొంది. "నా బంగారు తల్లిని ఇక్కడ విడిచి, పరాయి దేశంలో వున్న భర్త దగ్గరకు ఒంటరిగా వెళ్లాలా?" హిమబిందు స్వగతంలో అనుకొన్నా, అప్రయత్నంగా ఆమె పెదవుల్ని చీల్చుకొంటూ బయిటకు వచ్చేసాయి ఆ మాటలు. ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది. ఆ మాటలు విన్న జగదాంబకు ఒళ్ళు మండిపోయి, "నీ పుత్తడిబొమ్మకు వచ్చిన లోటేమి లేదులే, మేమేవ్వరం పిల్లల్నే కననట్టు, వాళ్ళ ఆలనా పాలనా నాకు తెలియనట్టు తెగ గింజుకు పోతున్నావ్. నిన్ను పెంచి పోషించి, ఒక ఇంటిదాన్ని చేసిన మీ అమ్మ మాటలు, అంత కష్టంగా వున్నాయా తల్లీ నీకు! ఐనా నిన్నడం ఎందుకమ్మా! తప్పంతా మీ నాన్నదిలే. నువ్వు 'క' అంటే ' క' , ' కి ' అంటే ‘ కి' అలా సాగింది నీకు. ఒకవేళ ఏదైనా నేను చెప్పబోతే, నా మీద ఇంతెత్తు ఎగిరేవాడాయన. నీ అలక తీర్చడానికి నాకు ప్రాణాలు పోయేవి. ఏం చేస్తాం ఆ పల్లెటూరిలో, మట్టికొంపలో పడి కొట్టుకుని అక్కడే ఛావండని రాసిపెట్టి ఉందేమో ఈ దరిద్ర ముఖానకి.." అంది మధ్య మధ్యలో వెటకారాలు జోడిస్తూ. ఆమె మాటలు వినలేక, తండ్రి సదానందం, "అబ్బా!చాల్లెవే నీ పెంటగోల. పిల్ల ఆలోచనలో తప్పేముంది? ఆ పసిపిల్లని మన దగ్గరే వదిలి, దాన్ని మొగుడు దగ్గరకెళ్ళమని నువ్వంటావ్. పరదేశంలో ఉద్యోగం చేస్తున్న దానిమొగుడికి తరచు ఇక్కడికి రావడం కుదరదు కదా, అందుకే తన పిల్లని కూడా తనతో తీసుకుపోవాలని దాని తపన. ఆ చిన్నపిల్ల ముద్దుముచ్చట్లూ, ఆటపాటలు, సరదాలు వాళ్ళకీ తీరాలిగా! ఐనా నా పిచ్చి గాని, నా మాట ఎప్పుడు విన్నావు గనక, పంతానికి పట్టింపులకిది సందర్భంకాదు పెళ్ళి చేసిన తరువాత, ఎవరి కుటుంబం వారిది. ఎవరి బాధలు వాళ్ళవి..." అంటూ నసిగాడు. భర్త మాటల్ని ఖండిస్తూ, "మూసుకోండి, తెలివితేటలు మీకూ, మీ కూతురికే ఉన్నాయి.” వంటింట్లో గిన్నెలు చెంబులు విసిరి కొడుతూ, చేతులుపుతూ, మూతి ముప్పై వంకర్లు తిప్పింది జగదాంబ. ఒక్కసారి తుఫాన్ వెలిసిన నిశ్శబ్దం ఆవరించింది. ********** కన్న కూతురి పురిటికి సహాయం కోసం వచ్చారు జగదాంబ, ఆమె మొగుడు. అల్లుడు విదేశంలో ఉన్నందున, కూతురి కోరిక మేరకు, పురిటికి ఆరు నెలల ముందే వచ్చారు. కూతురు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో, డబ్బులకి లోటు లేదు. ప్రముఖ నగరంలో, సకల సదుపాయలతో నిండివున్న గేటెడ్ కమ్యూనిటీలో చక్కని విల్లాలో ఉంటున్నారు వాళ్లు. జగదాంబది స్వార్థ బుద్ది. సదుపాయాలతో బాటు పైసా ఖర్చు లేకుండా గడిచిపోతోంది కూతురింట్లో. అల్లుడు తల్లిదండ్రులు, చుట్టపు చూపుగా రావాలే తప్పా, వాళ్ళు పెత్తనం చెలాయించ కూడదు. అది జగదాంబ పోలసీ. కూతురి కుటుంబం కోసం తను ఎన్నో త్యాగాలు చేస్తున్నట్లు చెబుతుంది అందరికి. తను ఇక్కడే ఉండి, మనవరాలి, ఆలనా పాలనా చూడగలనని, కూతురిని అల్లుడి దగ్గరకెళ్ళమని ఎప్పటి నుంచో పోరుతోంది. కూతురికి నచ్చ చెప్పడానికి శతవిధాలా ప్రయత్నిం చేస్తోంది. మొగుడికి కూడా ఇదే నూరి పోసింది. ********* “ఇదేమి చోద్యమే ఇలా దిగబడ్డాడేమిటీ, అల్లుడు వస్తున్నాడని నీకైనా తెలుసా?” కూతుర్ని ప్రశ్నించింది జగదాంబ. “ఏమో నాకు మాత్రం ఏం తెలుసు? ఏదో మీటింగ్ ఉందట రేపు. ఆ హడావిడిలో ఉన్నారు.” అంది హిమబిందు. “అయ్యో అలాగా! పిల్లని ఎత్తుకొనే సమయం కూడా ఉండదేమో పాపం. ఏం ఉద్యోగాలో, ఏం సంపాదనలో. కానీ తప్పదు, ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలిట. అవకాశం దొరికినప్పుడే సంపాదించు కోవాలి”అంది సానుభూతి ఒలగపోస్తూ. “సంపాదన ఒక్కటే కాదమ్మా! దానితో బాటు పిల్లల బాధ్యత కూడా…” అని తన అభిప్రాయాన్ని చెప్పబోయింది హిమబిందు. కూతురి మాటని మధ్యలోనే త్రుంచేస్తూ, “అబ్బో దానిదేముంది? పెంట పెరిగినట్టు పెరగాలిట పిల్లలు. మేమంతా పెరగలేదు? ఇప్పుడంటే మీకు డబ్బులు, సుఖాలు పెరిగి, అతి కష్టం మీద ఒక్కడినో, ఇద్దరినో కని…” ఇంకా చెప్పబోయింది జగదాంబ. “అబ్బా ఆపు. ఆయన వచ్చే వేళయ్యింది.” కసురుకొంది కూతురు. ********* మరునాడు ఉదయమే లేచి తన ముద్దుల కూతుర్ని ఎత్తుకొని, మురిసి పోతూ, మాటల మధ్యలో అసలు విషయం చక్కగా వినిపించాడు అల్లుడు సూర్యం. కంపెనీ నియమ నిబంధనల ప్రకారం, కుటుంబంతో ఆ దేశంలోనే ఉండాలట. కుటుంబంతో లేకపోయినా, కంపెనీ వారు, ఇప్పటిదాకా భత్యాలు చెల్లించారుట. కానీ, ఇకపై ఆలా సాగదని కరాఖండిగా చెప్పేసారట. భార్యతో బాటు పిల్లని కూడా తీసుకుని వెళ్ళాలిట. ఆ మాటల సారాంశం గ్రహించి, కక్కలేక మింగలేక చాలా మథనపడి పోయింది ఆ అత్త. కూతుర్ని ఏరు దాటగానే తెప్ప తగలేసిన మనిషని, మొగుడ్ని బెల్లం కొట్టిన రాయని దుర్భాషలాడింది. తన పథకం పారనందుకు చింతిస్తూ, తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యింది జగదాంబ. “నీ నగు మోము నా కనులారా…” అంటూ పాడుతూ, చిన్నారి చిట్టితల్లిని ఊయలలో నిద్రపుచ్చింది హిమబిందు. ఏకాంత వేళ, ‘రావే..వేళాయనే చెలీ!’ అంటూ ద్వందార్ధాలతో పాడుతూ, దగ్గరికి తీసుకున్న భర్తని ఆరాధనగా చూసింది హిమబిందు. తమ ఇంటిని అద్దెకిచ్చి, చంకలో పిల్లని పెట్టుకొని మొగుడితో విమానం ఎక్కడానికి సన్నాహాలు మొదలెట్టారు ఆ దంపతులు. **********

మరిన్ని కథలు

Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు
Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Amma sakshigaa
అమ్మ సాక్షిగా..
- బంటుపల్లి శ్రీదేవి
Bharya anukoolavathi shatru
భార్యా అనుకూలవతీ శత్రుః
- జి.ఆర్.భాస్కర బాబు
Mosam
మోసం
- వెంపరాల దుర్గా ప్రసాద్
Kapati
కపటి
- Viswanath coushik