అమ్మ సాక్షిగా.. - బంటుపల్లి శ్రీదేవి

Amma sakshigaa

త్రాచుపాములా నల్లగా ఉన్న వెడల్పాటి రోడ్ మీద వెళ్తున్న వైట్ కలర్ సుమో….అందులో హుందాగా కూర్చుని ప్రయాణిస్తున్నాడు కొత్తగా జిల్లాకి వచ్చిన కలెక్టర్ మిస్టర్ బిన్.

మారుమూల పల్లెల్లో ఉన్న ‘అనాధ శిశు ఆశ్రమాన్ని’ విజిట్ చేసి తిరుగు ప్రయాణం చేస్తూ....

“ఇక్కడ కాస్తా బండి ఆపు అప్పారావ్” అన్నాడు కలెక్టర్ బిన్

“ఆ.....అలాగే సార్” అంటూ డ్రైవర్ అప్పారావ్ రోడ్ పక్కన ఆపాడు.

వెనకాల ఫాలో అవుతున్న ఇంకో అంబాసిడర్లో నుంచి ఒకాయన దిగి, “సార్ ఇక్కడ..అంటే ఈ చుట్టుపక్కల ‘అనాధ శిశు ఆశ్రమాలు గాని అనాధ ఆశ్రమాలు’ గాని ఏమీ లేవు సార్...

మనం ఓ 40కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే మండల హెడ్ క్వార్టర్ వస్తుంది, అక్కడ దగ్గరలో ఓ అనాధ ఆశ్రమం ఉంది ...కాని ఇప్పటికే సాయంత్రం అయింది...మీరు వెళ్దాం అంటే వెళ్దాం సార్” అంటూ చేతులు కట్టుకున్నాడు ప్రోగ్రాం ఆఫేసర్ బ్రహ్మానందం.

ఇవేవి వినకుండా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు కలెక్టర్ బిన్.

ఇదేమిటి ఈయన వినకుండా ముందుకు పోతున్నాడు...కొంపదీసి నేచురల్ కాల్ కి పోతున్నాడా! ఈయన. ఇప్పుడు ఈయనని ఫాలో అవ్వాలా! ఆగిపోవాలా అన్న మీమాంసతో కాసేపు ఆగి, మళ్ళీ రెండు అడుగులు వేసి...మళ్ళీ నడుస్తున్నాడు బ్రహ్మానందం.

కాస్తా ముందుకు పోగానే రెండు చేతులు పైకి లేపి దండం పెట్టి కాసేపు కళ్ళు మూసుకున్నాడు బిన్.

అదేంటి? ఇక్కడ గుడి లేదు, బడి లేదు ...ఎవరికీ దండం పెడుతున్నాడు ఈయన అని ఇంకాస్తా ముందుకెళ్ళి ఏంటిది అని పరికించి చూసాడు బ్రహ్మానందం.

గుండెలో ఒక్కసారిగా రైళ్ళు పరిగెత్తాయి, ఏదో స్పురణకి వచ్చి గొంతులో తడారిపోయింది బ్రహ్మానందానికి...

ఇదో చెత్తకుండీ ...అయినా ఇక్కడ నిలబడి దండం పెడుతున్నాడేమిటి? అని ఇంకాస్తా దగ్గరగా పోయాడు బ్రహ్మానందం.

అది ఒక చెత్త వేసే కుండీ. చుట్టూ చాలా నీట్ గా ఉంది...ఆ చెత్తకుండీ చుట్టూ పూలదండ కూడా ఎవరో వేసారు ...అంతే కాదు ఆ కుండీకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజకూడా చేసిన ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఆ చెత్త కుండీలో ఈ మధ్యకాలంలో ఎవరూ చెత్త వేసినట్టుగా లేదు అనుకున్నాడు బ్రహ్మానందం మనసులో

అక్కడ ఉన్న రాయిని పక్కకి లాగి అక్కడ కాసేపు కూర్చున్నాడు కలెక్టర్ బిన్.

ఒక్క అడుగు అమాంతంగా ముందుకు వేసి “సార్....మీరు ...ఇక్కడ....ఈ చెత్త కుండీ ముందు ..ఎందుకు...కూర్చున్నారు ..రండి సార్ ఇంకాస్తా ముందుకేల్తే అక్కడ ఒక స్కూల్ ఉంది మీరెంత టైం కావాలంటే అంత సేపు కూర్చోవచ్చు”...అన్నాడు అతనిని అక్కడ నుంచి త్వరగా బయటకు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో బ్రహ్మానందం.

“నేను ఎక్కడ కూర్చున్నా అక్కడకి ఈ ‘డస్ట్ బిన్’ రాదు బ్రహ్మానందం...ఇక్కడ కాసేపు నన్ను కూర్చోనియ్యండి అన్నాడు బిన్

“అది.....అది.....చెత్త ....చెత్తకుండీ ....సార్” అన్నాడు.

“ఆ....నాకు తెలుసు ...ఇది చెత్తకుండీ అని....దీనికి నాకు విడదీయలేని సంబంధం ఉంది బ్రహ్మానందం” అన్నాడు బిన్.

“సార్.....దీనికి.... మీకు ....”అన్నాడు సందేహంగా...

“అవును బ్రహ్మానందం ...నా జన్మస్థలం ఇదే ....ఇదే నన్ను కుక్కల నుండి, పందులనుండి కాపాడి తనలో నన్ను దాచుకుంది” అంటూ ఆ చెత్తకుండీని ప్రేమగా తాకాడు బిన్.

తుళ్లిపడి ఏదో గుర్తొచ్చి “ఆ’.....అని నోరేళ్ళబెట్టాడు బ్రహ్మానందం.

“నిజమే! నువ్వు కరెక్ట్ గానే విన్నావ్ బ్రహ్మానందం” అన్నాడు బిన్.

గొంతులో వెలక్కాయ పడ్డట్టు ...పొడి పొడిగా దగ్గి “ఇది ఇది ...నిజమా సార్...అదెలా ? “అన్నాడు.

“ఈచెత్తకుండీ ఉత్తి చేత్తకుండీలా మీకందరికీ అనిపిస్తుంది, కాని నా దృష్టిలో ఇది కేవలం చెత్త కుండీ కాదు నన్ను పెంచిన అమ్మ కూడా” అన్నాడు బిన్.

అదెలా? ప్రస్నార్ధకంగా ముఖం పెట్టిన బ్రహ్మానందాన్ని చూసి...

అవును ఇది నా కన్న తల్లి అంటూ చెప్పనారంబించాడు కలెక్టర్ బిన్.

***

పదో క్లాస్ చదువుతున్నరోజులనుకుంటా!

“ఏమిరా బిన్,అలా ఉన్నావ్,బడికి పోవా”అన్నాడు తాత

“లేదు తాతా...పోవాలని లేదు ....”అన్నాను

“అదేందిరా,ఇయ్యాల ఏమైనాదేటి?” అని మళ్ళీ తాత అడిగాడు

మౌనంగా ఉండిపోయా ! నానుంచి సమాధానం రాకపోయేసరికి,

“ఒరే కిట్టయ్యా నీ నేస్తం బడికి పోవాలని లే..అంటుండే..

ఉదయం నీతో పాటు వచ్చిండు కదా..సెత్త బాగా ఊడిసిండా? ఆడికేటైనాది ఉదయం పూట బాగానే ఉన్నాడా” అని అడిగాడు నా దోస్త్ ని …..

“తాతా ఈయాల అనాద శవం దొరికింది ...శ్మశానానికి ఎల్లి కాల్చి బూడిద చేసినమ్,అక్కడ బాగా ఏడిసిండు,ఎందుకో?” అన్నాడు కిట్టయ్య.

“ఏడిసిండా! ఎందుకు?

మన పని గదరా,అనాద శవం దొరికితే ...దాన్ని కాల్సి , బూడిద సేయడం కొత్త కాదు గదా!” అన్నాడు తాత.

“ఏమో తాతా.. అక్కడ నుంచి వచ్చాక ఉలుకూ, పలుకూలే...ఉదయం నుంచి అలాగే ఉన్నాడు” అన్నాడు కిట్టయ్య.

“సర్లే..ఒదిలేరా , ఆడే నిదానం గా సెప్తాడు” అన్నాడు తాత.

కాసేపుపోయాక,“బిన్,బిన్ నెగునెగురా!తిండితినవా!ఏమైందిరా ఈ పూట...ఏడిసినావట...నువ్వు పోవద్దులేఇక, శవాన్ని సూసి బయపడతన్నావా! బిడ్డా...నువ్వు పోవద్దులే రేపటి నుంచి....నేనే బోతా” అన్నాడు తాత.

“ఏమో తాత,ఈరోజు శవం కాలుస్తుంటే ...భలే భాదైంది,ఏడుపొచ్చింది ...ఎందుకో మనసంతా గుబులైంది తాత” అన్నాను.

“మనుషులం కదా బిడ్డ ......అలాగనే అవుతాది, నీ సేత్తో మూడు నాలుగు అనాధ శవాలను తగలబెట్టినావ్ కదా బిడ్డా” అలవాటైన పనేగదా! అన్నాడు తాత

“లే..తాతా,ఇప్పటివరకు ఎప్పుడు ఇలా కాలే...కాని.కానీ ...ఇంత బాద ఎప్పుడు లేదు తాతా,ఆడ శవం తాతా....పాపం పిచ్చిదాని లెక్క ఉంది పెద్ద వయసేమీ గాదు,చిన్నగా ఉండే, పాపం అనాధలా సచ్చింది , మనసుని మెలిపెట్టి,గుండె భారమవుతోంది తాతా ఆ యమ్మని అలా సాలా సేపు చూస్తూనే ఉండిపోయా” అంటూ తాతని పట్టుకుని ఏడ్చాను

“బిన్,ఏడవద్దురా!” అంటూ నా తల నిమిరాడు తాత.

“రా ...ఆడికి పోదాంరా!” అంటూ చెత్త కుండీ దగ్గరకి తీసుకుపోయాడు తాత.

ఎప్పుడు నాకు బాదైనా,ఆ చెత్త కుండీకి చెప్పుకుని ఏడిస్తే....బాద పోతుంది” అంటాడు తాత.

“ఏంది తాతా, ఎప్పుడూ ఇక్కడికె తీసుకొస్తావ్? “ అన్నాను యదావిదిగా ..

“ అదోలా నవ్వే తాత...ఈ సారి నవ్వలే..ఏదో చెప్తున్నాడు”..నేను వింటున్నా..

“పద్నాలుగేళ్లక్రితంజరిగినముచ్చట, ఓవేకువ జామున..పచ్చులన్నీ తిండిగింజలకోసం ఇహారానికి బయలుదేరాయి, పొద్దు ఇంకా పొడవలే, సూరీడుఒచ్చేముందు ఆకాశంలో నల్లని మబ్బులు మంచుని తొలిగించుకుని బయటకు వత్తున్నాయి. ఈది దీపాల ఎలుతురులోనే సెత్తకుండీలు ఖాళీ జెయ్యాలని బయలెల్లా!

ఈ ‘సెత్తకుండీ’ నాలుగుదినాలనుండి ఊడవలేదు...అందుకే సిందరవందరగా కుండీ సుట్టురా సెత్త పేరుకుపోయి ఉన్నాది. అందులో ఉన్న ఎంగిలి మెతుకులకోసరమన్నట్టు, రెండు కుక్కలు ఒకే చెత్త కుండీ దగ్గర గొట్టుకుంటున్నాయి… అది నా కళ్ళకి ఔపడ్డాదిరా! ......ఆ కుక్కలని అదిమి కొట్టి దూరంగా పంపేసి, చెత్త తొట్టెలో చెత్తని చేతులతో తీసి బండిలో ఏస్తున్నా.. అదిగో అప్పుడు ఇనబడింది ఒక పసి కూన ఏడుపు.....

ఆత్రంగా రెండు చేతులూ లోపలికి జొప్పించానా! మెత్తగా సెయ్యికి తగిలినాది, అదేటో అని బయటకు తీశా..పసిగొడ్డు” ఇష్....పానముంది, బిడ్డని ...సూడకపోయి ఉంటే ఈ కుక్కలు తినేసేవి ..వాసన పసిగట్టే కుక్కలు ఇక్కడ సేరినై కాబోలు అంటూ పొత్తిళ్లలో పెట్టుకుని ఒక్క అంగలో ఇంటికి ఉరికినా! ఎవరి కంటా పడకుండా ...

అది ఎవరో తెలుసా!బిడ్డా ..... ‘నువ్వే’...” అంటూ నాగడ్డాన్ని పైకెత్తి నా కళ్ళల్లోకి ఆనందంగా చూసాడు తాత.

“ఆ.....నే...నా!గొంతు తడారిపోయింది నాకు .......నేను చెత్త కుండీలో, చెత్త కుప్పలో దొరికానా!

ఇది నిజమేనా!....నిజంగా నిజమేనా !” అన్నాను

“ఎందుకు బిడ్డా నీతో పరాసకాలు ఆడుతానా !....ఈ సెత్తకుండీ నిన్ను నాకు ఇచ్చింది” అన్నాడు తాత

నువ్వు బాగా అల్లరి సేసినప్పుడు, నీ ఏడుపు నేను ఆపలేకబోయినప్పుడు... అమ్మ లెక్క కనబడే ...ఈ చెత్త కుండీ కాడికి నిను తీసుకొని వత్తా....సిత్రంగా ఈ కుండీ సూడగానే ....నీ ఏడుపు ఆగిపొద్ది బిడ్డా!” అన్నాడు తాత.

“ఆశ్చర్యపోయా... నిజంగా నిజమా తాతా!” అన్నాను

“నిజంగా నిజమేరా!” అన్నాడు తాత

“మనసులో తెలియని భాద, సిత్రంగా గుండెపిండేసే బాద, తాతని గట్టిగా పట్టేసుకున్నాను.

“అయితే నాకు అమ్మా, నాన్న లేరా” అన్నాను ఏడుస్తూ

జాలిగా నా వైపు చూసిన తాత “లేకుండా ఈ భూమి మీదకు ఎలా వస్తావ్ బిడ్డా! ఉండే ఉంటారు ..కాని వాళ్ళు బతికి ఉన్నారో లేదో తెలవదు కదా!...అయినా ఈ తాత ఉన్నాడు గదా బిడ్డా! ఏడవకు అని నన్ను ఓదార్చాడు నా తల నిమురుతూ తాత...”

“తాతా! అప్పటినుంచి ఈడనే నీదగ్గరే ఉన్నానా! నన్ను తీసుకుపోవడానికి ఎవరూ రాలేదా!” అని అడిగాను.

“లేదు బిడ్డా ఎవరూ రాలేదు”...నిన్ను కావాలనుకుంటే ఈడ ఎందుకు వదిలి పోతారు బిడ్డా!అని మనసులో అనుకున్నాడు తాత. “అయినా ఈ తాతకోసం దేవుడు ఈడ వదిలిపోమ్మని సెప్పిండు, అందుకే వదిలేసి పోయారు. నాకోసం వచ్చినావ్ గదా అందుకే నాకంటనువ్ పడేటట్టు చూసిండు ఆ దేవుడు అన్నాడు నన్ను ఒదారుస్తూ తాత”

“నాకు ఇంట్లో ఆడ తోడు లేకపోయే..నిన్నెవరు సాకుతారు? అని కూడా ఆలోచనలేకపోయే ..వచ్చీ రానట్టు పెంచినా...ఆ రోజునుంచి నాకు తోడైనావురా బిన్ .....నడక వచ్చిన దగ్గర నుంచి రోజూ నాతో పాటే చెత్త ఊడ్చడానికి వచ్చేవాడివి. డస్ట్-బిన్లు ఇంటింటికి పోయి తీసుకొచ్చేటోడివి. మరి కొద్దిగా పెద్దైనాకా బడికి పోతావా! అని అడిగినా!”

పోతానన్నావ్ .నేను ముద్దుగా ‘అబ్బిగాడు’ అనే నీ పేరు బడిలో రాయించినా!..... నీకు ఆ పేరు నచ్చకపోయే...

అందరూ మస్తు పేర్లు పెడుతుండే, నువ్వు అబ్బిగా, సుబ్బిగా అని పిలవకు అనేవాడివి. మంచి పేరు పెట్టలే ....అని అలిగినవ్, నన్ను తిట్టినవ్.అపుడు అయిదారేళ్లు ఉంటాయనుకుంటా.అపుడు మార్చినా ...నీ పేరు అబ్బిగాడి నుంచి ‘బిన్’ “ అని అన్నాడు తాత.

“ఆ పేరే బడిలో రాయిన్చినా!....అది నీకు నచ్చి నా పేరు మంచిగా పెట్టినవ్ తాతా, మంచి పేషన్ గా పెట్టినవ్ అని నన్నుఅప్పుడు ముద్దెట్టుకున్నావ్ తెలుసా!” అన్నాడు తాత

“అవునా !” అన్నాను.

“తాతా! ఇంతకీ నాపేరు బలే పెట్టావే, ఎవరు చెప్పారు, ఈ పేరు పెట్టమని? అని తాతని అడిగాను”

“నేను సదువుకోలేదు బిన్,నాకెవరు సెప్తారు?సెత్త కోసం పోతే పతీఒక్కల్లు “ ఇదిగో డస్ట్ బిన్, ఇదిగో డస్ట్ బిన్” అని అంటుండే.....

అది బాగుంది కదా! అని అందులో ఉన్న సివరి పేరు “బిన్” అని నేనే పెట్టా. జబర్దస్త్ గా ఉంది గదా! బిడ్డా నీ పేరు ….అన్నాడు తాత”

“ఛీ..డస్ట్ బిన్ లో ‘బిన్’ నాకు పెట్టావా! అన్నాను అసహ్యంగా”

“ఆవునురా అబ్బిగా!.నీ లా... నే....సదువుకోలేగా!..ఇంతకీ ‘బిన్’ పేరు బాగుంది కదరా! ..ఆ పేరుకేమీ తక్కువ?, బడిలో నీ పేరు బాగుంది అన్నారని సిన్నప్పుడు ముద్దు ఇచ్చినావ్ గదా! అన్నాడు తాత.”

“ఆ...ఆ..బాగుంది బాగుంది ....కానీ అర్ధమెంటో తెలుసా!...... ఛీ మా అమ్మైతే మంచి పేరు నాకు పెట్టేది అన్నా కోపంగా ....”

“అదిగో మరి?.అమ్మ ఉంటే నా దగ్గర ఎందుకుంటావ్ జెప్పు?

అయినా అంత తెలివి నాకేడుందిరా? అర్ధం తెలుసుకుని పేరు పెట్టడానికి నేనేమీ కలెక్టర్ నా? రోడ్ లు ఊడిసే ఉద్యోగమాయే,నా బతుక్కి ఏమీ తెల్దు..

నాకు తోసింది పెట్టినా!

అర్ధం నాకు తెలవదు,నీకు సమజైతే చెప్పరాదే.?” అన్నాడు తాత

“అర్ధమా.? అసలు బిన్ అంటే ఏంటో తెలుసా నీకు…..కుండీ, బుట్ట,తోట్టే ....నా పేరు కుండీ అని బెట్టినవ్ ....డస్ట్-బిన్ అంటే “చెత్త దాచే కుండీ ” అని అర్ధం ... ఇంకా నయం…. “డస్ట్-బిన్”….. అని పెట్ట లేదు ఉత్త ‘బిన్’ పెట్టావ్“ అన్నాను కోపంగా...

“ఓ గదా!..నాకు తెలవదు గదా బిడ్డా!.తప్పైపోయింది అన్నాడు తాత , అంతలోనే అయినా! నేను డస్ట్ బిన్ అని పెట్టలే గదా! ’బిన్’ ఒక్కటే గదా! అంటే ....’కుండీ ’.....అంటే ఆ కుండీలోఎన్ని ఇత్తనాలు మోలిపించచ్చో నీకు తెలుసా బిడ్డా! నువ్వు ఈ కుండీలో మంచి మంచి అలోసనలు ఇత్తనాలుగా పండించి పెంచుకోవచ్చు , అంటే ఈ కుండీలో మంచి అలోసనలే మొలవాలన్నమాట అని నా తలని జూపించి నా తలమీద ఒక్క మొట్టికాయ వేసాడు తాత. మంచి సదువు సదువుకో బిడ్డా! కుండీలో సెత్త ఏత్తే సెత్తే ఉంటాది, ఆ సెత్తే బయటకి వత్తాది. అంటే మంచి అలోసన ఇత్తనం ఏసేవనుకో మంచి ఫలితం వత్తదిరా బిడ్డా! అలా నీ తెలివితేటలనే ఇత్తనం ఏసీ బాగా పెంచావనుకో మంచి బతుకు వత్తాది బిడ్డా! నువు గొప్పోడవుతావ్ అన్నాడు తాత నన్ను ఒప్పించడానికన్నట్టు.....తాత చెప్పిన లాజిక్ నాకు బాగా నచ్చింది, చిన్నగా నవ్వాను” ….

బుంగమూతి పెట్టుకున్న తాత, “సర్లే ,ఒకేల నేను బెట్టిన పేరు నచ్చకపోతే,.మార్పు జేసుకో మీ బడిలో సారోళ్ళతో మాట్లాడి అనగానే,తాతని గట్టిగా పట్టుకున్నాను.”

“నువ్వు పెట్టిన పేరుబాగుంది, చాలా అర్ధముంది.ఈ పేరే ఉంచుకుంటా ఆన్నాను” ...తాత ముఖంలో చెప్పలేని సంతోషం. నన్ను తన గుండెకి హత్తుకున్నాడు” ఆ సంఘటన నాకింకా గుర్తుంది.

“అందుకా నువ్వు, నేను ఎప్పుడు ఏడ్ఛినా ఇక్కడకే తీసుకొస్తావ్” అన్నాను

“నీ ఏడుపు నేఁ జూడలేను..ఊరకోబెట్ట,నా తరం గాదనుకో,.అందుకే

ఈ కుండీ జూసీ నువ్వు ఏడుపు ఆపేత్తావ్......అందుకే ఈడకు తీసుకు వచ్చా బిన్....నువ్వు ఇలా ఏడిసి, గీపెడితే ఎలారా?.

నువ్వు పెద్ద సదువులు సదవాలా,కలక్టర్ గిరీ సెయ్యాలా,మనలాంటోల్ల బతుకులు మార్సాలా!”అన్నాడు తాత

“కలెక్టర్ గిరీ అంటే ఏంటి తాత” అన్నా.

“అది పెద్ద ఉజ్జోగమ్, కార్లు, బంగ్లాలు,పనోళ్ళు మస్తుంటారు బిడ్డా!..... కష్టం , సుఖం జెప్పి, నీ సాయం అడగ.... అందరూ నీ దగ్గరకే వత్తారు అన్నాడు” తాత

“ఆ వయసులో తాత మాటలు బలే కిక్ ఇచ్చాయి నాకు”

ఆ ‘చెత్త కుండీ’ దగ్గరకి వెళ్ళి ప్రేమగా నా చేత్తో తాకాను....

నేను డిగ్రీ లో చేరినప్పుడనుకుంటా! ఆ చెత్త కుండీ మీద బొగ్గుతో “బిన్, కలెక్టర్,” అని రాసుకున్నా,అదిగో అప్పుడు ‘ఫిక్స్’ అయింది ‘నేను కలెక్టర్ కావాల’ని,ప్రతి రోజు ఇక్కడకి వచ్చేవాడ్ని, నా పేరు చూసుకునేవాడ్ని.....కలలు కనేవాడ్ని, కలలోనే జీవించేవాడ్ని, ఆ కలనే ప్రేమించేవాడ్ని” అని ఆపాడు బిన్….

కొన్ని రోజుల తర్వాత...... ఒక రోజు రాత్రి చదువుతున్న నా దగ్గరకి తాత వచ్చాడు

“బిన్, బిన్ ఆ రోజు యాదకుందా! నీకు

ఆ రోజు ఒకమ్మ పిచ్చిదని,.వయసు చిన్నదని,చనిపోయింది, నువ్వు, నీ నేస్తం ‘కాష్టని’కి బోయి శవం కాలుతుంటే బాదవుతోంది, మనసు మెలిపెట్టింది అని ఏడిసినవ్,మస్తు బాద పడినవ్ ...యాదుందా! బిన్

ఆయమ్మ...ఎవరో తెలుసా!” అన్నాడు తాత.

“ఆత్రంగా ...ఆ...ఆ యాదుంది...తాత” అన్నాను

‘మీ అమ్మ’ అన్నాడు తాత”.

“ఇది నిజమా! తాతా! ఆయమ్మని చాలా సేపు చూసాను ఆరోజు, అంతాకలలా ఉంది, నా చేతులతో అమ్మని బూడిద చేశా!....

ముందే ఎందుకు చెప్పలేదు” అన్నాను.

“నాకూ తెలీదురా!..

అనాధ శవాలను బూడిద సెయ్యడానికి నాతో పాటు వచ్చేవాడివి, కొద్దిగా పెద్దయ్యాక, నీ నేస్తం,నువ్వు ఏళ్ళేవారు, ఎప్పుడూ ఇంత బాద పడింది నే ....జూడలే బిడ్డా. ఆ రోజు, మనసు ఎందుకు మెలిపెట్టిందో .....ఎందుకంత బాద పడ్డావో నాకు అర్ధం కాలే. కానీ ఆమెకి నీకు ఏదో రత్తసంబంధం ఉందేమో! అనిపించి,.ఆ కుండీ సుట్టూ ఉన్నోళ్లను పోయి అడిగినా....

దగ్గరలో ఉన్న బుచ్చయ్య తాతని కలిశా”..

“ఒక పిచ్చిది రోజూ రాతిరేల ఆ చెత్తకుండీ చుట్టూ తిరిగేదంటనే... ఆ చెత్తన్తా బయటకు తీసి...నా బాబు నా బాబు అని పిచ్చిగా అరుసుకుంటూ బోయేదట... అదిగమనించిన బుచ్చయ్య తాత

ఎందుకలా తిరుగుతున్నావని .....చెత్తంతా కుండీ నుంచి బయట బడేసి....యాగి జేత్తున్నావని అడిగినాడట.”...

“నా బాబుని ఇక్కడ దాచేసారు ” ఇప్పుడు కనపడటం లేదని? ....ఏడ ఉన్నాడో ఎతకాలి....అని పిచ్చి చూపులు చూస్తూ తిరిగినాదట ...ఒక రోజు ఇక్కడే చనిపోయిందట.మన వాళ్ళే తీసుకెళ్లి బూడిద చేశారట గదా! అని చెప్పాడు బుచ్చయ్య తాత” అన్నాడు తాత.

ఆ రోజు తాతకు అర్ధమైంది. ఆమే మాఅమ్మ అని,ఆ రోజు నేను పడ్డ భాద కి అర్ధం రక్త సంబందం అని,

తాత చెప్పగానే.......ఈ “చెత్త కుండీ ” వద్దకు పోయి గట్టిగా కౌగలించుకుని ఏడ్ఛాను.

నా వెనకనే వచ్చిన తాత, “ఏడు..బిడ్డా ..ఏడు..మనసు అలిసిపోయేదాకా ఏడు..నీ బాద తీరేదాకా ఏడు.

ఆ దేవుడున్నాడే,భలే సిత్రాలు జేసెటోడయ్యా..ఆ రోజు జాము దాటిందంటే,కుక్కలు నిన్ను తినేసేవే బిడ్డా! అదృష్టమో, నేను జేసినా పుణ్యమో! నువ్వు నాకు దొరికినవ్.కుండీలో నిన్ను, ఆడమనిసి తోడే లేని నాకు అప్పగించిండు, ఆ కుండీలో నువ్వు కనపడకపోయేసరికి ఆ తల్లి గుండె పగిలిపోయి ఉంటాదిరా! ఆయమ్మ కన్న పేగు కదిలిపోయి ఉంటాది, నీకోసం పిచ్చిదైంది అమ్మ....నిన్ను ఎతుక్కుంటూ వచ్చి పాపం అక్కడే పానాలిడిసింది…

జేసిన తప్పు తెలుస్కున్నడో ఏమో!నీతోనే కొరివి పెట్టించిండు. ఆ బెమ్మ (బ్రహ్మ) లీలలయ్యా.....బెమ్మ లీలలు” అన్నాడు తాత.

కడుపులోనుంచి ఏడుపు తన్నుకొచ్చిందినాకు. అమ్మ నాకోసం పిచ్చిదైపోయింది. నాకు ముందు తెలిసి ఉంటే...నేను నా దగ్గరకే తెచ్చుకునేదాన్ని. దేవుడు ఎందుకు తాత ఇలా చేసాడు... తనే నా తల్లి అని నాకు తెలియక ముందే నా ప్రాణం విలవిలలాడింది కాని నా చేతులతో కాల్చి బూడిద చేసింది మా అమ్మనే అని తెలిసి ప్రాణం పోతున్నట్టుంది తాతా అని వలవల ఏడ్చేసాను. ఏడుస్తున్న నా దగ్గరకి వచ్చిన తాత,ఇక సాలయ్యా,సాలు, నీ తల్లికి నువ్వే తలకొరివి బెట్టినవ్,అది సాలు ఈ జీవితానికి. మరే తల్లి బయపడి బిడ్డని తోట్టేపాల్ జెయ్యారాదే బిడ్డా! జెయ్యారాదే.....ఈ కట్టం ఏ బిడ్డకి రావద్దు బిడ్డా అన్నాడు” తాత కూడా ఏడుస్తూ ...

అలా ఏ బిడ్డా చెత్తకుండీలలో, తుప్పలలో... నాలా దొరక్కుండా సేయ్యాలంటే ఏమి చెయ్యాలి తాతా ఆన్నాను.

నువ్వు పెద్ద సదువులు సదవాలా! కలెక్టర్ వి కావాలా! అనాధ పిల్లలకోసం ఆశ్రమాలున్నట్టే, ఇలాంటి సoటి బిడ్డలకోసం కూడా ఒక సోటు ఉండాలి బిడ్డా! తప్పు జేసికొందరు, తప్పించుకోడానికి కొందరు, ఈ సమాజానికి బయపడి కొందరు బిడ్డల్ని ఈ కుండీలలలో, తుప్పల్లో వదిలేసి బోతారయ్యా! ఆల్లు రహస్యంగా వదిలెయ్యడానికి కూడా జరా బద్రత ఉండేలా మంచి సోటు జూపిన్చాలయ్యా!.” అన్నాడు తాత..

“ఆమాటలు నామనసులో నాటుకున్నాయ్.అంతే...అలుపెరుగక చదివాను, సాధించాను..తాతన్నట్టూ దేవుడి లీల...తాత నన్ను పెంచాడు, కలెక్టర్ని చేశాడు ఒక చెత్త ఎత్తుకునే మేస్త్రీ మనవడు కలక్టర్ అయ్యాడని మురిసిపోయాడు.... ఆ చెత్త కుండీలో చెత్త ఎయ్యనీడు,ఎందుకు అని అడిగితే,ఈ చెత్త కుండీ యేరా నాకు కలెక్టర్ మనవడ్నిఇచ్చింది అంటూ నవ్వుతాడు తాత....నా తల్లి జ్ఞాపకాలు నా దగ్గర లేవు ...ఉన్న ఒకే “ఒక్క జ్ఞాపకం- ఆమె శవం” అది నా కళ్ళముందే ఎప్పుడూ తిరుగుతోంది, నా ఈ చేతులతోనే బూడిద చేసాను. నా తల్లి ఋణం తీర్చుకున్నాను. ఇదీ నా సుదీర్గ ప్రస్థానం “డస్ట్ బిన్ నుంచి ...బిన్ వరకు” అంటూ ముగించాడు కలెక్టర్ బిన్.

మీ గుండెలో బారమంతా దిగిపోయింది సార్...రండి మీ అమ్మలాంటి ఈ చెత్తకుండీ దగ్గరకొచ్చి జిల్లా కలెక్టర్ అయిన మీరు మీ గురుంచి చెప్పుకున్నారు....మీరు చాలా గొప్పవారు సార్, మీ తాత మిమ్మల్ని చాలా సంస్కారవంతంగా పెంచాడు. మీ తల్లి కూడా సంస్కారవంతమైనదే అయి ఉంటుంది ...ఆమెకి ఏమి కష్టమొచ్చిందో, కన్నపేగుని ఇక్కడ వదిలేయాల్సి వచ్చింది...ఏదైనా దేవుడు మీకు మంచి జీవితం ఇచ్చాడు సార్...నలుగురికి ఉపయోగపడే మనసు ఇచ్చాడు ...రండి సార్...రండి అన్నాడు డ్రైవర్ అప్పారావ్.

బ్రహ్మానందానికి ఏమనాలో తెలియలేదు. కళ్ళల్లో నీళ్ళు..... చెంపల మీద జాలువారుతున్న కన్నీళ్లు అప్రయత్నంగా తుడుచుకున్నాడు బ్రహ్మానందం.

అక్కడ నుంచి మౌనంగా వెళ్లి కార్ డోర్ తీసి “కూర్చోండి సార్” అన్నాడు బ్రహ్మానందం. కారులో హుందాగా కూర్చున్నాడు కలెక్టర్ బిన్.

ఇంటికి వెళ్ళిన బ్రహ్మానందం తన రూంలొకి వెల్లి తలుపు వేసుకుని కాసేపట్లొనే బయటకి వచ్హాడు. బండి తీసి కలెక్టర్ అఫీసుకి బయలుదేరాడు...బయట ఉన్న దఫేదారుడికిచ్చి ఈ కవర్ కలెక్టర్ బిన్ కి అందజెయ్యమని చెప్పి వెనుతిరిగాడు బ్రహ్మానందం.

అప్పుడే మీటింగ్ పూర్తి చేసుకుని వచ్చి కుర్చీలో వెనక్కి వాలిన కలెక్టర్ బిన్...టేబుల్ పై తనపేరు మీద ఉన్న కవర్ చూసి ఇదేంటి? ఈ కవర్ పై నా పేరు....ఈ సంచి ఏంటి ....ఎవరు పంపి ఉంటారు అని ఆ కవర్ తెరిచి చదివాడు.

డియర్ బిన్ కి ప్రేమతొ దీవించి రాయునది.......

నువ్వెవరో ? నీ గతమేంటో నేను తెలుసుకున్నాను ...

ఇదేంటి జిల్లా కలెక్టర్ ని పట్టుకుని నువ్వు అని సంభోదిస్తున్నావ్ అని ఆశ్చర్యపోవద్దు. అలాగని, నేనెవరు ? ఏంటి? అని ఆరాలు తీయవద్దు, నేను నా గురుంచి పరిచయం చేసుకునేoత మహా మనీషిని కాదులే...కాబట్టి నా పరిచయం అప్రస్తుతం. ఎందుకంటే నేను సాధారణ మద్యతరగతి మామూలు మనిషిని, తప్పు చేసి వచ్హిన చెల్లెలుకి కాసింత ఓదార్పు కూడా అందివ్వని ఓ దౌర్భాగ్యపు అన్నయ్యని. నా చెల్లెలతో గడిపిన తీపి గురుతులను నా దగ్గర బద్ర పరుచుకోగలిగాను, కాని నా చెల్లికి పుట్టిన బిడ్డకి బద్రత ఇవ్వలేకపొయాను. ఓ చెత్త కుండీలో పసివాడిని పడేసి , బిడ్డ చనిపోయిందని చెప్పిన ఘనుడుని నేను , కళ్ళముందే నా చెల్లి పిచ్చిదయింది. చనిపోయిన బిడ్డని ఎక్కడ పడేసావు అని రోజూ నిలదీసిన నాచెల్లికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే చేతగాని అన్నని. కొన్నేళ్ళ తరువాత నిజంచెప్పి ఆ చెత్త కుండీ దగ్గరకు తీసుకెల్లి చూపించిన ద్రోహిని. ఆ చెత్త బుట్ట దగ్గర పిచ్హిదాన్లా తిరుగుతున్న నా చెల్లిని, "ఎవరో పిచ్హిది" అని, అందరిలా నేను దూరంగా ఉండి చూసి వెల్లిపొయిన పిరికి వాడిని. నేను పుట్టింది ఉన్నత కులమైనా, తాతంత విశాలమైన మనసైనా లేని, మానవత్వం లేని, మనిషిగా గుర్తింపబడుతున్న, మనిషి రూపం లో ఉన్న మృగాన్ని...

పద్నాలుగేళ్ళు తనని బందీచేసాను, అక్కడనుంచి తనని బందీచెయ్యలేకపోయాను. తను పిచ్చిదానిలా మారడానికి కారణం నేనే, నువ్వు చెత్తకుండీ పాలు కావడానికి కారణం కూడా నేనే. తనని మామూలు మనిషిని చెయ్యాలని ప్రయత్నం చేసాను...కాని చెయ్యలేకపోయాను..చివరికి పిచ్చిదానిలా ఆ కుండీ చుట్టూ తిరుగుతూ ఇంటికి కూడా రాకుండా ‘పిచ్హిదాన్లా’ ఆ చెత్తకుండీ చుట్టూ తిరుగుతూ అక్కడే గడిపేది. ఆ కుండీలో చెత్తని బయటకు తీస్తూ, ఒల్లొ పోసుకుంటూ పిచ్హిగా పిచ్చి చూపులు చూస్తూ...అక్కడే ఉండిపొయిన నా చెల్లిని ఓ సారి చూసి వద్దామని తెల్లవారు జామున ఎవరికంటా పడకుండా బయలుదేరి వచ్హిన నాకు ...తన శవాన్ని బండి ఎక్కిస్తూ పద్నాలుగు, పదీహేనేళ్ళ పిల్లలిద్దరూ ఆ శవాన్ని ఎత్తి మునిసిపాలిటీ బండిలో వేసుకుని వెల్లడం నేను చూసాను ...కాని అది “నువ్వే” అయి ఉంటావని ఊహించలేదు.

నా చెల్లెలు చేసిన పుణ్యం కాకపోతే ....తన కొడుకే తనకి తల కొరివిపెట్టాడ౦టే తను ఎంత అదృష్టవంతురాలో కదా !

నా మీద నాకు అసహ్యం వేస్తోంది ,జుగుప్స కలుగుతోంది ..మనిషిగా నేను ఈ రోజు మళ్ళీ చచ్హిపొయాను….

ఈ రోజు నీ గురంచి విన్న తరువాత..నూవ్వెవరో తెలిసాక నాకు తెలియని ఓ ఆనందం..నీ తల్లికి నువ్వే తలకొరివి పెట్టే నీ అదృష్టాన్ని చూసి కాస్తా అసూయగా కూడా ఉంది..

ఈ రోజు కలెక్టరుగా ఎదిగావు .. నీ ఉన్నతి చూసి నీ దగ్గరకి రావటం సంస్కారం కాదు. సమాజంలో నాలాంటి వాళ్ళకి బుద్ది చెప్పే ప్రక్రియ నాతో మొదలు పెట్టినా నాకు ఆనందమే..అందుకు సిద్దం గానే ఉన్నా..కాని నీకు మామయ్య లా కాదు....ఓ నేరస్థుడిలా పరిచయం కావడమే బాగుంటుందేమో కదా!

నీ గతం విన్నాక నాతో ఉన్న నా చెల్లి జ్ఞాపకాలు నీ దగ్గరే ఉంటే బాగుంటుంది అనిపించింది, నీకు తల్లిని ఇవ్వలేక పోయా !....కనీసం జ్ఞాపకాలనైనా ఇస్తే బాగుంటుంది అనిపించింది అవి నీకు ఎంత అపురూపమో నాకు తెలుసు అందుకే పంపుతున్నా ...

ఇట్లు ఓ నేరస్తుడు

ఉత్తరం చదివిన బిన్…… కలెక్టర్ అన్న సంగతి మర్చిపోయి దారాళం గా కళ్ళనుంచి జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ చిన్న బాగ్ లో ఉన్న వస్తువులను బయటకి తీసాడు

అమ్మ ఫొటో...ఎంత ముద్దుగా ఉంది... ఎంత అందంగా ఉంది అమ్మ ….చనిపోయిన ఆమె ముఖం నా మనసులో ఒక్కసారి మెదిలింది. అమ్మా...”నువ్వు నాతో ఉన్నట్టే ఉంది”...అనుకుంటూ అమ్మ ఫోటోని గుండెలకు హత్తుకున్నాడు. తాను అందంగా వేసుకున్న పెయింటింగ్ బుక్, రంగుల పెన్స్చిల్స్, నా కొసం అందంగా అల్లుకున్న చిన్న స్వెట్టర్ చేతితో సుతారం గా తడుముకుంటూ....అమ్మకు సంబందించిన ఈ వస్తువులు ఇచ్హిన మామయ్య మీద కోపం రావట్లేదు. అమ్మని ఇవ్వలేక, తనదగ్గర దాచుకున్న అమ్మ వస్తువులు ఇచ్హిన మామయ్యమీద జాలి కలుగుతోంది అనుకుంటూ అమ్మ ఫొటో ను ఈ మద్యే చనిపోయిన తాత ఫోటో పక్కనే పెట్టి తదేకంగా చుస్తూ ఉండిపోయాడు బిన్.

చెత్త కుండీలో నేను ...కలెక్టర్ సీటులో..కూర్చోవటం ఎంత చిత్రం గా ఉంది ఈ దృశ్యం ...ఎంత గొప్పగా ఉంది నా జీవన ప్రయాణం ....

“అమ్మ ఉంది ...కాని అమ్మ దగ్గర పెరగలేదు, అమ్మకి తలకొరివి పెట్టాను కాని కొడుకు గా కాదు ఒక అపరిచితుడులా....ఎంత విచిత్రం కదా నా జీవితం

ఇక తాత ...పసి గొడ్డుగా సాకాడు ....నాకు విద్యా బుద్దులు నేర్పించి గౌరవనీయమైన కలెక్టర్ సీటులో కూర్చోబెట్టాడు ...ఏ జన్మ సంబంధమో ....ఏ భందమూ లేని తాతకి నేను మనవడిని అయిపోయాను.....

సంబంధం ఉన్నా ....మా మామయ్య అమ్మ జ్ఞాపకాలను నాకందించి నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు అనుకున్నాడు మనసులో...

మామయ్య....నా కున్న ఒకే ఒక బందం బ్రహ్మానందం మామయ్య....ఈ జిల్లాకి పోస్టింగ్ పడగానే ఎంక్వైరీ చేయిస్తే...నాకు తెలిసింది నాకు ఒక మామయ్య ఉన్నాడని, అతను ఈ బ్రహ్మానందమే అని తెలిసి...మా అమ్మలాంటి చెత్తకుండీ దగ్గరకి అతనిని తీసుకుని వెళ్ళాను. ఆ చెత్త కుండీ దగ్గరకి ఎందుకు వెళ్తున్నారు సార్....అక్కడ వద్దు అని ఆరోజు నన్ను ఆపాడు...నా కధ, కన్నీటి వ్యధ నేను చెబుతుంటే మామయ్య కళ్ళల్లో నుంచి జాలివారుతున్న కన్నీళ్లు నాకు స్పష్టంగా కనిపించాయి. అతనిలో అపరాదభావం కొట్టొచ్చినట్టుగా నాకు కనిపించింది. అయినా మామయ్యమీద నాకు కోపం లేదు ...రాదు ....ఎందుకంటే, నాకున్న ఏకైక బందం బ్రహ్మానందం మామయ్యా మాత్రమే అనుకున్నాడు కలెక్టర్ బిన్.

నాలా ఏ బిడ్డా చెత్తకుండీ పాలు, రోడ్ పాలు పడకుండా చూసుకుంటానమ్మా...అనుకుంటూ ఇలా చెత్తకుండీలలో, ముల్లపొదల్లో, కాలువల్లో, రోడ్ల మీద దొరికే పిల్లలను ఆదరించే ఓ అమ్మఒడిని సృష్టించాలి. శిశువులకోసం ఏర్పాటు చేసే ఆశ్రమాలు మంచి వసతులు ఉండేలా తీర్చి దిద్దాలి ఎందుకంటే, వీళ్ళంతా రేపటితరం బావి పౌరులు. వీళ్ళు సక్రమమైన మార్గంలో పెరగాలంటే, పిల్లలు లేని మంచి తల్లి తండ్రులను చూసి,దత్తత ఇవ్వాలి. అమ్మా నాన్నల సంరక్షణలో పెరిగేలా చూడాలి....’అమ్మసాక్షిగా...’ ఈ దిశగా నా ప్రయాణం సాగాలి అనుకున్నాడు కలెక్టర్ బిన్.

డస్ట్ బిన్ లో మొదలైన నా ప్రయాణం…….”మిస్టర్ బిన్” గా నన్ను ఇక్కడకి చేర్చిందమ్మా! నీ ఋణం, తాత ఋణం కూడా తీర్చుకోలేనిదే సుమా! అనుకుంటూ తాత పక్కనే ఉన్న అమ్మ ఫొటోని చేత్తో తడిమి తడిమి చూసుకున్నాడు కలెక్టర్ అయిన మిస్టర్ బిన్ .

మరిన్ని కథలు

Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు
Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Nee nagumomu naa kanulara
నీ నగు మోము నా కనులారా....
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Bharya anukoolavathi shatru
భార్యా అనుకూలవతీ శత్రుః
- జి.ఆర్.భాస్కర బాబు
Mosam
మోసం
- వెంపరాల దుర్గా ప్రసాద్
Kapati
కపటి
- Viswanath coushik