అవసరానికి.. - Dr. Lakshmi Raghava

Avasaraaniki

“రేపు నరహరి దగ్గరికి గుంటూరు వెళ్ళాలి. డ్రైవర్ మురళికి ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు తెల్లారగానే బయలుదేరుతాను” అన్నాడు డాక్టర్ రామచంద్ర భార్య నీరజతో.

“అదేంటి సడన్ గా “

“చాలా రోజులైందికదా ఒక సారి కలవాలి. నరహరితో మాట్లాడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. శంకరం కూడా వస్తాడు.”

“అలాగా.. మరి క్లినిక్ మూసేస్తారా ఈ రెండురోజులూ?”

“లేదు, రాఘవను చూసుకోమన్నా.. ఒక గంట క్లినిక్ లో కూర్చుంటాడు”

“అన్ని ఏర్పాటు అయ్యాయన్న మాట” నవ్వుతూ అంది నీరజ. అంతేనన్నట్టుగా తల ఊపాడు రామచంద్ర.

*****.

రామచంద్ర, శంకరం, నరహరి స్కూల్ నుండీ మంచి

మిత్రులు. ఇన్నేళ్ల తరువాత కూడా ఒకరికొకరు కాంటాక్ట్ లో ఉన్నారు. కలిసేది అరుదు అయినా ఒకరి సంగతి ఒకరు తెలుసుకునేవారు. రామచంద్ర బాగా తెలివైనవాడు అందుకే డాక్టర్ అయ్యాడు. మంచి ప్రాక్టీసు ఉంది.

శంకరం ఒక ప్రైవేటు ఆఫీసులో మేనేజర్ గా ఉన్నాడు. అతను మొదటినుండీ నెమ్మదిమనిషి, ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి తీసుకునే వాడు. అతని నేర్పరితనం, నిజాయితీ నచ్చే మంచి ప్రమోషన్లు ఇస్తూ గౌరవించింది మేనేజ్మెంట్.

నరహరి ఎప్పుడూ తొందర మనిషే. ఏదైనా అనుకుంటే ముందు వెనుకలు ఆలోచించకుండా చేసేవాడు. మాటలతో మనుషులను ఇట్టే పడేసేవాడు. అతని మాటలకే ఉద్యోగాలు వచ్చేవి కానీ ఏ కoపెనీలోనూ కుదురుగా ఉండేవాడు కాదు. ఉద్యోగాలు మారుస్తూ పోతేనే ఎదుగుదల అనే అతని మాటలను రామచంద్ర, శంకరం ఒప్పుకునేవారు కాదు.

పెళ్లి విషయం లోనూ అంతే నరహరి, శంకరం పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలని బాగా చదివించుకుంటూ ఉంటే నరహరి మాత్రం పెళ్లి ఒక జంజాటం అనీ, ఉన్నన్ని రోజులూ జీవితం ఎంజాయ్ చేయడానికనీ అందుకే పెళ్లి చేసుకున్నా, పిల్లలని కన్నా బాధ్యతలు పెరిగి అనుక్షణం నరకమే అనుభవిస్తామని అని వాదించే నరహరి మనస్తత్వాన్ని మార్చడానికి ఇద్దరు స్నేహితులకూ వీలు కాలేదు. ఎప్పుడు కలిసినా ‘తన సంపాదన తనే అనుభవించడం లో ఒక తృప్తి’ అని చెప్పే నరహరికి జీవితంలో ఏమికోల్పోతున్నాడో తెలియచెబుతామని చూశారు. సంసారం ‘సుఖం’ కోసమైతే అది బయట బాగానే దొరుకుతుoదని అతను వాదిస్తే, ఒక పవిత్ర బంధానికి అతనిచ్చే నిర్వచనం కష్టం కలిగించేది. ఇలాటి దృష్టి ఉన్నఅతనికి అనురాగాలు, ఆప్యాయతలూ గురించి చెప్పడం వేస్టు అనిపించి మానుకున్నారు. కలిసినప్పుడల్లా తన జీవితం ఎంతో మధురం అని చెబుతూ మురిసేవాడు నరహరి.

నరహరికి ఈ మధ్య మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చి రెస్టులో ఉన్నాడని తెలిసాక డాక్టర్ గా రామచంద్ర చూడాలనుకుంటూ శంకరానికి ఫోన్ చేసి రమ్మనడంతో ముగ్గురూ ఇలా కలవడానికి వీలవుతూంది.

నరహరి ఇల్లు చేరేసరికే శంకరం కారులో వచ్చి ఉన్నాడు. ముగ్గురూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నరహరి కాస్త సన్నబడినా ఉత్సాహంగా ఉన్నాడు.

“మనకు బాగలేనప్పుడే తెలుస్తుంది నరహరీ దగ్గరివాళ్ళు ఉండాలని. పెళ్లయి ఉంటే నీ భార్య ఉంటే తోడుగా ఉండేది కదా’ అన్న శంకరం మాటలకి

“నీవు నన్ను వదిలిపెట్టవు కదా. భార్య లేకపోతేనేమి డెయిలీ వచ్చి చూసుకోవడానికి ఒక మేల్ నర్సు వస్తాడు. ఇతర పనులకు వేరే మనుషులు వస్తారు. అందరికీ జీతాలు ఇస్తాను కాబట్టి బాగానే చూసుకుంటారు. వద్దనుకుంటే మానిపించేస్తాను. ఈ సౌకర్యం భార్యతో ఉండదు కదా“ గట్టిగా నవ్వాడు నరహరి ఎప్పటి లాగానే.

“సరేలే... నీకు చెప్పడం ఎందుకు ” అని శంకరం న్యూస్ పేపర్ అందుకున్నాడు.

“నరహరీ... నీవేమో ఏ బాదరాబంధీ లేదు హాయిగా ఉన్నానని చెప్పినా, మేమిద్దరం ఒక కమిట్మెంట్ తో భార్యా పిల్లలతో సుఖంగా ఉన్నాము. మాకు బాధ్యత కలిగి ఉండటం ఒక సంతోషం. ఇది ఎన్నిసార్లు నీతో వాదించినా ఒకటే కానీ ఈ టాపిక్ వదిలి వేరే మాట్లాడుదామా..”అన్నాడు రామచంద్ర.

తరువాత శంకరం ఆఫీసు విషయాలు, ప్రమోషన్ తో పెరిగిన బాధ్యతలు... సక్సెస్ వచ్చినప్పుడు కలిగే సంతోషం అన్నీ చెప్పుకొచ్చాడు. రామచంద్ర తన క్లినిక్ విషయాలు, పేషంట్లు గురించి సరదాగా చెప్పాడు.

సాయంకాలం ఇంటి ముందు లాన్ లో కూర్చున్నారు ముగ్గురూ...

ఉన్నట్టుండి రామచంద్ర “నరహరీ, నీవు మాకేదైనా చెప్పాలనుకుంటున్నావా?” అని అడిగాడు

“నేనా? ఏమీ లేదే...” ఇబ్బందిగా అన్నాడు నరహరి.

“ఫ్రెండ్స్ అన్నాక మనసులో మాట చెప్పుకోవాలని అనిపిస్తుంది కదా..” ఆగాడు రామచంద్ర.

శంకరానికి రామచంద్ర మాటలు ఏమీ అర్థం కాలేదు.

“ఈ మధ్య ఆరోగ్యం విషయమే కొంచెం ఆందోళన కలిగింది...అంతే” భుజాలు ఎగరేశాడు ఫన్నీగా.

“అంతేనoటావా? పోయిన వారం నాదగ్గరికి “వాసు” అన్న అబ్బాయి వచ్చాడు...” రామచంద్ర మాటలకి అదిరిపడ్డాడు నరహరి “వాసు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు??” అన్నాడు బెదురుగా.

“నా దగ్గరికి ఎందుకు వచ్చాడో తరువాత చెబుతాను. అసలేం జరిగిందో నువ్వు చెప్పు..”

నరహరి కొద్ది నిముషాలు మాట్లాడలేదు. శంకరంకు ఆశ్చర్యంగా ఉన్నా నిశ్శబ్దంగా ఉన్నాడు.

నరహరి నెమ్మదిగా తేరుకుని “మీకు చెప్పాలసి వస్తుందని అనుకోలేదు..”

“అలా ఎప్పుడూ అనుకోకు నరహరీ. మనసులో మాట హాయిగా చెప్పుకోగలిగేది ఒక్క ఫ్రెండ్స్ తోనే“

రామచంద్ర మాటతో నరహరి మెల్లిగా “బంధాలూ, బాధ్యతలూ వద్దని పెళ్లి వద్దనుకున్నాను..కానీ సుఖం కావాలని శరీరం కోరుకుంటుంది కదా... అయితేనేం కావాలంటే డబ్బులకి ఎటువంటి సుఖం అయినా దొరుకుతుంది అనుకున్నా, అలా చేసినoదువల్ల వచ్చే జబ్బులకు భయపడ్డాను. అందుకే ఆఫీసులో అనుకూలంగా ఎవరు దొరికినా ప్రయత్నించేవాడిని. అలా కొంతమంది నా డబ్బుకు ఆశ పడ్డారు. నాకూ సుఖం దొరికేది...అలా గడచిపోయింది. ఇప్పుడా ఇంటరెస్ట్ కూడా లేదు. ఇల్లు కొనుక్కున్నాను. కొంచెం ఆస్తి ఆసరాగా పెట్టుకున్నాను. కావలసినంత అనుకూలాలు చేసుకున్నాను. అంతా బాగుంది అనుకుంటూ ఉన్నప్పుడు ఒక ఉత్తరం వచ్చింది మూడు నెలల కిందట.. కళావతి అన్నఆమె దగ్గరనుండీ. ఆమె మా ఆఫీసులో పనిచేసేది. చాలా నెమ్మది మనిషి. ఒకరోజు తనకు డబ్బు అవసరం ఉందని ఆఫీసు ద్వారా లోను గురించి అడిగింది. సర్వీసు తక్కువ ఉన్నవాళ్లకు లోను దొరకదని చెప్పాను. ఆరోజు సాయంకాలం నన్ను అడిగింది ఈ ఊరికి కొత్త కాబట్టి డబ్బు ఎక్కడైనా ఇప్పించగలరా అని. ఆమె అవసరాన్ని వాడుకున్నాను నా డబ్బుతో. కానీ ఎప్పటికీ బయటకు రాకూడదని భయపెట్టాను. ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన కళావతిని నేను సులభంగానే మరచిపోయాను. కానీ ఈ మధ్య ఆమె దగ్గర నుండీ వచ్చిన ఒక ఉత్తరం లో రాసిన విషయం కలవరపరిచింది. నావల్ల ఆమెకు కలిగిన సంతానం ‘వాసు’ అనీ, నన్ను ఇబ్బంది పెట్టకూడదనే ఇన్ని రోజులు ఎప్పుడూ చెప్పడానికి ప్రయత్నించలేదని, ఇరవై ఏళ్లు దాటిన వాసు తన తండ్రి గురించి వేస్తున్న ప్రశ్నల వల్ల ఈ విషయం తెలుపుతున్నానని...రాసింది. మొదట కోపం వచ్చింది. కొడుకు నావల్లే పుట్టాడని గ్యారెంటీ ఏమిటి? అందామనుకుంటే ఆవిడ అందరితో తిరిగే రకం మనిషి కాదని, అత్యవసర పరిస్థితులలో నాకు లోoగిపోయింది అని నా మనసుకు తెలుసు. అయినా ఇప్పుడేమిటి? అని ఊరుకున్నాను.

మళ్ళీ ఉత్తరం వచ్చింది. వాసు ఒకసారి చూడడానికి వస్తాడని.. అప్పుడు మరీ కోపం వచ్చింది. నా అడ్రెస్ తెలుసుకుని, నన్ను కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఏదో ఆశించే ఉంటుంది. నా ఆస్తి కోసమా?... లేకపోతే ఇన్నిరోజులు తన ఉనికి కూడా తెలపంది, ఒక్కసారిగా కొడుక్కి తండ్రి కావాల్సి వచ్చిందా? అని చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఈ ఉత్తరాలు నన్ను ఇరకాటం లో పెట్టడానికే అని కొద్దిరోజులు నార్త్ టూర్ కెళ్ళి వచ్చాను. వెనక్కి వచ్చాక హటాత్తుగా ఒకరోజు ఒక అబ్బాయి నాకోసం వచ్చాడు. ‘ఎవరూ’ అంటూ చూసిన నాకు నన్నే చిన్నప్పుడు చూసుకున్నట్టుగా అనిపించి ఉలిక్కిపడ్డాను.

“నా పేరు వాసు” అనగానే నీకూ నాకూ సంబంధం లేదనడానికి నేనే భయపడాల్సి వచ్చింది. ధైర్యం తెచ్చుకుని ‘మీ అమ్మకు, నాకు ఏమీ సంబంధం లేద’న్నాను అతడేమీ చెప్పకుండానే “అప్పటి సంగతులు ఏవీ మాట్లాడడానికి రాలేదు” అన్నాడు నెమ్మదిగా

‘మరి ఏమి కావాలి?’ అన్నాను. “మీరు నా తండ్రిగా అంగీకరిస్తే చాలు”

“ఈ రోజు తండ్రి గా అంటావు రేపు నా ఆస్తికి వారసుడు అని వస్తావు” అని చడా మడా తిట్టాను. అతను మాట్లాడకుండా వెళ్ళి పోయాడు. నాకేమీ అర్థం కాలేదు. అసలు ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వెళ్ళినట్టు ? క్రమంగా వాడి ఆలోచనలు దూరం పెట్టాలని చూస్తూంటే ఇప్పుడు నీవు వచ్చి ఇలా చెప్పడం ఏమిటి??నీకేం చెప్పాడు?” రామచంద్ర వైపు ఆతృతగా చూస్తూ అన్నాడు నరహరి.

“వాసు నా దగ్గరికి వచ్చిన కారణమూ అదే.. నిన్ను గురించి తెలుసుకున్నట్టే నేను నీ ఫ్రెండ్ అనీ డాక్టర్ అనీ తెలుసుకుని మరీ వచ్చాడు.”

“అదే ఎందుకు అని?”

“వాసు పెద్దవాడయ్యాక “నా తండ్రి ఎవరు?” ప్రశ్నించడం వలన కళావతి మొదట వాసు గురించి ఉత్తరం ద్వారా తెలిపినాకే నీ దగ్గరికి పంపింది. నీవు తిట్టి పంపాక నాదగ్గరకు ఎందుకు వచ్చాడో తెలుసా?”

“నా ఆస్తి కోసమే ఉంటుంది..”

“కాదు. DNA test ద్వారా తండ్రి అన్న ప్రూఫ్ చేసుకోవాలనుకుంటున్నాడని ... నీవు ఏదైతే వద్దని అనుకున్నావో అదే బంధం ఈ విధంగా వచ్చింది. ఋజువైతే నీవు వద్దన్నా అతను నీ కొడుకవుతాడు నిస్వార్థంగా..ఇప్పుడు చెప్పు కొడుకును కావాలనుకుంటావో వద్దనుకుంటావో ..”ఆపాడు రామచంద్ర.

‘అంటే ఏమి చేయాలంటావు?’ చిరాగ్గా అన్నాడు నరహరి.

“నీవెంత వద్దనుకున్నా నీ సుఖానికి నిదర్శనం వాసు పుట్టడం... తల్లి చెప్పకున్నాతన జన్మగురించి తెలుసుకుని తండ్రిగా అంగీకరించమని మాత్రమే అడుగుతున్నాడు. మాటలతో నీవు ఒప్పుకోవని తెలిశాకే సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఇందులో నీకేం నష్టం లేదు.. ఈ టెస్ట్ ద్వారా అతను నీ కొడుకో కాదో తెలుస్తుంది. అతను నీ ఆస్తి కావాలనలేదు కదా..ఇక ప్రాబ్లమ్ ఏమిటి ?” సూటిగా అడిగాడు రామచంద్ర.

“ఇప్పుడలా చెప్పి ఆపైన నా ఆస్తి కాజేయలనే ఉద్దేశ్యం ఎందుకు ఉండకూడదు?” అన్న నరహరి ప్రశ్నకు రామచంద్ర

“కాదు. ఈ కాలం లో DNA టెస్ట్ గురించి అందరికీ తెలుసు దాని కోసం వాసు నన్ను వెతుక్కుంటూ రావాల్సిన పనిలేదు..అయినా వచ్చాడు అంటే నేను నీ ఫ్రెండ్ కాబట్టి. నాతో వాసు చెప్పినదాన్ని బట్టి, తన పుట్టుక అమ్మను ఎంతో ఇబ్బంది పెట్టిందనీ, ఎంతమందిచేతో మాటలు పడినా ఎదుర్కొన్నదనీ, తనకు ఈ విషయం కొoత వయసు వచ్చాక ఇతరుల ద్వారా తెలిసి అమ్మను నిలదీస్తే నరహరి గురించి చెప్పిందని, తనకు తండ్రి ఉన్నాడని అందరికీ తెలిసేలా చేసి, ఇన్ని రోజులు తల్లి మోసిన చెడ్డపేరు పోయేలా చేయడం తన కర్తవ్యం అనుకుని నీ దగ్గరకు వస్తే నీవన్న మాటలకు బాధపడి, నాతో DNA టెస్ట్ సర్టిఫికెట్ ద్వారా ప్రూవ్ చేసుకోవచ్చు కదా? అని అడిగాడు.. నీతో గోడవ పడకుండా నా ద్వారా నీకు ఒక హెచ్చరిక ఇవ్వాలనుకున్నాడు. వాసు ని చూశాక నాకు తెలిసింది కళావతి అతన్ని ఎలా పెంచిందో? కావాలనుకుంటే ఆమె అప్పుడే నిన్ను అల్లరి పెట్టేది. వాసు కూడా తన అమ్మ కోసం, సమాజం కోసం నిన్ను తండ్రిగా చూపించాలనులనుకుంటున్నాడు..నీ ఇంటికి వచ్చినప్పుడే అతను నీ మీద తిరగబడి నాలుగు మాటలు అని ఉండవచ్చు. కానీ నాదగ్గరకు వచ్చి అడిగిన విధానం అతను ఎంత డీసెంట్ గా పెరిగాడో తెలిపింది.” రామచంద్ర ఆగాడు.

అంతా విన్న శంకరం నరహరిని చూస్తూ “ఒక సారి ఆలోచించు, తెలిసి చేసినా, తెలియక చేసినా ప్రకృతి కార్యం జరిగి ఫలితం వచ్చింది. నీకు తెలియకుండా జరిగినా వారి స్వార్థం కనిపించడo లేదు. సమయానికి డబ్బు ఇచ్చి ఆదుకున్న నీకు అపకీర్తి తేవాలని, అపకారం చేయాలని అనుకోవడం లేదు. తండ్రిగా అంగీకరిస్తే నీకు వచ్చే నష్టం లేదు.’ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ..’ అన్న సామెత గుర్తువస్తూంది. ఆలోచిస్తే ముసలి వయసులో వీరే నీకు ఆసరా గా ఉంటారేమో..” అంటూన్న శంకరాన్ని నిర్వికారంగా చూశాడు నరహరి. రామచంద్ర అందుకుంటూ

“ఎప్పుడూ ఆస్తి కోసం... అంటూ ప్రతిదీ అనుమానపు దృష్టి తో చూడకు. అందరూ ఒకే లాగా ఉండరు నరహరీ,ఆమెకు నీ మనస్తత్వo తెలుసు కాబట్టి నీకు ఈ విషయం తెలపలేదేమో. ఇన్నిఏళ్లు గడచినా నిన్నుఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, ఇన్నేళ్ళు ఊరుకున్న ఆమె ఆత్మాభిమానం సడలింది వాసు తండ్రిని సమాజానికి పరిచయం చేయాలని కోరుకున్నప్పుడే. అంతే కానీ నీతో జబర్దస్తీ గా ఉండిపోవాలని కాదు. ఈ వయసులో ఒక తోడు ‘నా’ అనబడే మనుషులు కావాల్సింది నీకే. నాకు మాత్రం ఇది నీకు వచ్చిన ఒక సదవకాశo…దీన్ని వదులు కోకుండా తల్లినీ, కొడుకునీ ఆహ్వానించి మిగిలిన జీవితం కలిసి ప్రశాంతo గా గడిపితే బాగుంటుంది. సంసార జీవితం లో ప్రేమలు ఎలా ఉంటాయో తెలుస్తుంది కూడా ” అన్నాడు రామచంద్ర.

కొన్ని నిముషాలు తలదించుకున్నాడు నరహరి నిశ్శబ్దంగా.

తనకు బాగాలేనప్పుడు చుట్టుముట్టిన ఒంటరితనం గుర్తుకువచ్చింది. ‘నా వాళ్ళు’ అన్న పదానికి ఎంత పవర్ ఉందో మొదటిసారిగా తెలిసివచ్చింది. కళావతి, వాసుల నెమ్మదితనం పై నమ్మకo పెరిగింది. అన్నిటికీ మించి తన మంచి కోరే ఇద్దరు స్నేహితుల ఆరాటం లోని ప్రేమ తెమ్మెర మనసును తాకుతూంటే లేచి ఇద్దరినీ దగ్గరకు తీసుకున్నాడు తృప్తిగా.

అతనిలో వచ్చిన మార్పు స్నేహితులిద్దరికీ ఆనందాన్ని కలుగజేసింది.

*****

మరిన్ని కథలు

Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా