అహంకారం తెచ్చిన శాపం - గొట్టాపు శ్రీనివాస రావు

Ahakaram techhina sapam

చాలా కాలం క్రిందట దేవుడు భూమిని జీవరాశిని సృష్టించినప్పుడు, తనకోసం ఒక పూలతోటను కూడా సృష్టించాడు. అందులో అనేక రకాల పూలు ఉండేవి. పూలన్నీ ఎల్లప్పుడూ దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని స్తుతిస్తూ ఉండేవి. వాటన్నింటిలో పెద్దవి, అందమైనవి, అత్యంత సువాసన గలవి అయిన గులాబీ మరియు మల్లి ఒకే పరిమాణంలో ఉండేవి. అవి కొంతకాలం తర్వాత పోట్లాడుకోవడం ప్రారంభించాయి. "నేను ఈ వనంలోనున్న పూలన్నింటి కన్నా అందగత్తెని."మల్లితో చెప్పింది గులాబీ. "అలా అనుకోవడం నీ అవివేకం. నా అందంతో సరితూగే పుష్పం ఈ భూమి మీదే లేదు" గులాబీతో వాదనకు దిగింది మల్లి. "నాతో సరితూగే అందం గాని సువాసన గాని నీకు లేవని తెలుసుకో." రెట్టించింది గులాబీ. "అందంలో గానీ, సువాసనలో గానీ నేనే గొప్ప."వాదించింది మల్లి. ఒకరు గొప్పంటే ఒకరు గొప్పంటూ మొదలైన వాదన వారిరువురి మధ్య కొట్లాటకు దారి తీసింది. రెండు పూవులకూ గాయాలయ్యాయి. రెక్కలూడిపోయి, అందవిహీనంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దేవుడు అక్కడకు వచ్చి, ఆరా తీసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకున్నాడు. ముందుగా ఆ రెండు పూవులనూ తన మహిమతో గాయాలు మాయం చేసి, యథాస్థితికి తీసుకువచ్చాడు. "గులాబీ! నీ సువాసనలో సగం కోల్పోదువు గాక. మల్లీ! నీవు చిన్నగా మారిపోదువు గాక." అని శపిస్తూ వాటి అహంకారానికి తగిన శిక్ష విధించి, గొడవలాడవద్దని హెచ్చరించి అక్కడ నుండి మాయమైపోయాడు దేవుడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా మళ్లీ గొడవలు ప్రారంభించాయి గులాబీ మరియు మల్లి. "అంతా నీవల్లే జరిగింది." నిందించింది మల్లి గులాబీని. "కాదు నీ అనవసర వాదన వల్లే ఇదంతా జరిగింది." కోపంతో అరిచింది గులాబీ. మళ్లీ ప్రారంభం అయింది గులాబీ, మల్లి మధ్య జగడం. ఈసారి వనంలోనున్న పూలన్నీ రెండు సమూహాలుగా విడిపోయి, ఒక సమూహం గులాబీని, మరో సమూహం మల్లిని సమర్ధిస్తూ గొడవలాడి, ఆ భగవంతుని హెచ్చరికను బేఖాతరు చేశాయి. నీ అంతు చూస్తానంటే నీ అంతు చూస్తానంటూ రెండు సమూహాలూ గట్టిగా కొట్టుకున్నాయి. వాటన్నింటికీ గాయాలయ్యాయి. మళ్లీ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ముందుగా వాటి గాయాలను తన మహిమతో మాయం చేసి, "మీ అహంకారానికి మరియు నా హెచ్చరికను బేఖాతరు చేసినందుకు మీరు మూగవారు అయిపోదురుగాక. మిమ్మల్ని మొగ్గ దశలోనే తుంచి స్త్రీలు వారి కొప్పులో అలంకరిం చుకుందురు గాక." అని శపించాడు దేవుడు.

మరిన్ని కథలు

Korukunna mogudu
కోరుకున్న మొగుడు
- కొడాలి సీతారామా రావు
Inquiry
ఇంక్వైరీ
- DR BOKKA SRINIVASA RAO
Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vruddhapyam varama? sapama?
వృద్ధాప్యం వరమా ? శాపమా?
- మద్దూరి నరసింహమూర్తి
Adigite cheptaa
అడిగితే చెప్తా
- కొడవంటి ఉషా కుమారి
Evaru takkuva kaadu
ఎవరూ తక్కువ కాదు!
- రాము కోలా దెందుకూరు
Sahajeevanam
సహజీవనం
- ప్రభావతి పూసపాటి