అర్హత - డి.కె.చదువుల బాబు

Atrhata

అర్హత శ్రవణపురంలో విద్యానందుడనే వైద్యుడు ఉండేవాడు.ఆయన వైద్యం చేశాక ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన కాడికీ పుచ్చుకునేవాడు.ఆయన దగ్గర ఐదుగురు శిష్యులున్నారు.అడవికెళ్ళి వైద్యానికి అవసరమైన ఆకులు, మొక్కలు, వేర్లు, గింజలు,కాయలు,పువ్వులు,తేనె, సుగంధద్రవ్యాలు మొదలగు వాటిని సేకరించి తెచ్చేవారు. విద్యానందుడు వాటిని వివిధ జబ్బులకు తగు పాళ్లలో కలిపి,మిశ్రమం చేసి, గుళికలు గా చేసి ఆశ్రమం లోపలి గదిలో ఉన్న పాత్రల్లో భద్రపరిచే వాడు.ఏ పాత్రలో గుళికలు,లేపనాలు ఏ జబ్బుకు వాడాలో పాత్రల మీద వ్రాయబడి ఉండేది.ఏ జబ్బుకు ఏ పదార్థాలను వాడాలో,ఏ పాళ్ళలో కలపాలో మాత్రం శిష్యులకు చెప్పేవాడు కాదు. ఒకరోజు విద్యా నందుడు శిష్యులతో "నేను కొన్ని పదార్థాలకోసం పట్నానికి వెళ్తున్నాను.వచ్చే వరకూ రోగులకు సేవలందించండి" అని చెప్పి వెళ్ళాడు. ఆరోజు కడుపు నొప్పితో బాధ పడుతున్న వ్యక్తిని తీసుకుని ఆయన భార్య వచ్చింది.ఇద్దరు గాయాలతో వచ్చారు. శిష్యుల్లో పవనుడనే వాడు లేచి వెళ్ళి రోగిని వివిధ రకాలుగా ప్రశ్నించి, పరీక్షించాడు. మామూలు కడుపునొప్పి అని నిర్థారించుకుని గదిలోకెళ్ళి గుళికలు తెచ్చి మింగించి కొద్దిసేపు ఉండమన్నాడు. కొంతసేపటికి కడుపు నొప్పి తగ్గిపోయింది.వైద్యం చేసినందుకు ఏమివ్వాలని రోగి భార్య అడిగితే చెప్పాడు.గురువు లేడుకదా అని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఉన్న నలుగురు శిష్యులు లేచి వచ్చి "ఇంత తక్కువ డబ్బుకు ఈ మందు రాదు" అంటూ పవనుడు చెప్పినదానికి నాలుగింతలు పెంచి చెప్పారు.ఆమె అంత ధనం ఇచ్చుకోలేను.పేదవారమని చెప్పినా వాళ్ళు "ఇవ్వాల్సిందే"అన్నారు.పవనుడు వాళ్ళతో వాదించి మందలించాడు.ఆమె ఇచ్చినంత తీసుకుని పంపాడు. గాయాలతో వచ్చిన వారికి లేపనం పూసి,కట్టు కట్టాడు.మింగడానికి గుళికలు తెచ్చి ఇచ్చాడు.వాళ్ళతో కూడా ఎక్కువ ధనం రాబట్టాలని ప్రయత్నించిన నలుగురినీ మందలించాడు.వాళ్ళు వెళ్ళిపోయాక పవనుడితో "గురువుగారికి కొంత ఇచ్చి ఎక్కువ వసూలు చేసిన ధనం మనం పంచుకుంటే సరిపోతుంది కదా!" అన్నారు.ఇలాంటి తప్పుడు పనులు నాకు నచ్చవన్నాడు పవనుడు.తర్వాత వచ్చిన రోగులకు పవనుడే వైద్యం చేశాడు. నాలుగు రోజుల తర్వాత విద్యా నందుడు శిష్యులతో "మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నల డుగుతాను.సమాధానాలు చెప్పండి" అన్నాడు.అడగమన్నారు శిష్యులు. "అత్యంత విలువైనది ఏది?"అడిగాడు‌ విద్యానందుడు.. "వజ్రాలు,రత్నాలు,బంగారం,"అంటూ సమాధానమిచ్చారు నలుగురూ. పవనుడు "ఆరోగ్యం"అన్నాడు. వైద్యుడు మొదట రోగికి ఇవ్వాల్సింది ఏమిటి? అడిగాడు విద్యా నందుడు. నలుగురూ నాలుగు రకాలుగా చెప్పారు. పవనుడు మాత్రం "నమ్మకం, భరోసా" అని చెప్పాడు. "రాజు,పేదవాడు వైద్యం కోసం వస్తే ఎవరికి ముందు వైద్యం చేస్తారు?"అడిగాడు విద్యానందుడు. రాజుగారికి అన్నారు నలుగురు. "విచక్షణ తో ఎవరికి వైద్యం అత్యవసరమో వారికి చేయాలి" చెప్పాడు పవనుడు. "వైద్యుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏమిటి?" నలుగురూ నాలుగు రకాలుగా చెప్పారు. పవనుడు మాత్రం"ఓర్పు" అని చెప్పాడు. "మీ వద్ద కొచ్చిన రోగికి చికిత్స కోసం అవసరమైన మందులు మీ వద్ద అయిపోయాయి.అప్పుడు ఏం చేస్తారు?" అడిగాడు విద్యానందుడు. "చేయగల్గిందేముంది. మందులు లేవని తిప్పి పంపిస్తాము" అన్నారు నలుగురూ. "నేను ఆ పరిస్థితి రానివ్వను. ముందుచూపుతో నిల్వ ఉంచుకుంటాను" అన్నాడు పవనుడు. "మీకు వైద్యం నేర్పితే గురుదక్షిణగా ఏమిస్తారు?"అడిగాడు విద్యా నందుడు. "మీరు కోరినంత ధనమిస్తాము" అన్నారు నలుగురూ. "నేను మీలాగే నిస్వార్థంగా సేవచేసి మీ శిష్యుడిగా మీ పేరు నిలబెడతాను"చెప్పాడు పవనుడు. విద్యానందుడు వారితో "నాయనా నాకు వయసు పై బడింది. మందులు తయారు చేసే విధానం, నా వైద్యం వివరాలు మీకు నేర్పాలనుకున్నాను.మిమ్మల్ని పరీక్షించడానికే నేను ఊరెళ్ళాను.నేను ఊరెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను గమనించమని ఆశ్రమం శుభ్రం చేసే రామయ్య కు చెప్పాను.రోగులపట్ల మీ ప్రవర్తనను రామయ్య నాకు చెప్పాడు.మీ చేతుల ద్వారా, మాటల ద్వారా మీలో బద్దకాన్ని ,అత్యాశను గమనించాను.పవనుడు చెప్పిన సమాధానాలైన ఆరోగ్యం, ఓర్పు, నమ్మకం, విచక్షణ,నిస్వార్థ సేవాభావం,ముందుచూపు మొదలగు లక్షణాలు జీవితంలో వైద్యుడికే కాదు ప్రతి ఒక్కరికీ అవసరం.నా పరీక్షలో నెగ్గిన పవనుడే అన్ని విధాలా నా వారసుడిగా అర్హుడు"అన్నాడు. శిష్యులు నలుగురూ తమ ఆలోచనా విధానం మార్చుకుని,మారుతామని పవనుడి వద్ద శిష్యులుగా ఉంటామని,విద్యానందుడిని క్షమించమని కోరారు

మరిన్ని కథలు

Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా