క్షమలో ధరిత్రి. - Aduri.HYmavathisrinivasarao,

Kshama lo dharitri

గేటు తీసుకుని లోనికి నడిచాను. వాచ్ మ్యాన్ బీడీ త్రాగుతూ దూరంగా ఉన్నాడు. నన్ను చూసి బీడీ చేతులోనే పెట్టుకుని వచ్చి,పైనుండీ క్రిందివరకూ వాచ్ చేస్తూ చూసి "ఎవరికోసం?" అన్నాడు.
"ఇక్కడ ఉద్యోగంలో చేరను వచ్చాను "అన్నాను .
"ఏదీ నీ అపాయింట్మెంట్ ఆర్డర్ చూపూ "అని నిర్లక్ష్యంగా అని 'ఈ మొహమే ఇక్కడ ఉద్యోగంలో చేరేది ' అన్నట్లు చూశాడు.
అపాయింట్ మెంట్ ఆర్డర్ కవర్ వానికి చూపాను. పైనున్న ఆఫీస్ స్టాంపుచూసి "సరే పో "అన్నాడు నిర్లక్ష్యంగా.
లోపలికి వచ్చిచూస్తే పెద్ద ఆఫీసు .అంతా తలలు వంచుకుని ఎవరి క్యాబిన్లలో వారు ఏదో పని చేసుకుంటున్నారు. ‘ఎవరిని అడిగితే మ్యానేజర్ క్యాబిన్ చూపు తారూ?, ఇక్కడ అటెండర్ కనపడలేడే ! ఏం చేయాలా అనుకుంటుండగా ఒకామె ఎదురొచ్చింది.
తలెత్తి చూసి" ఎవరికోసం అండీ!" అంది.
'బతికానురా భగవంతుడా!'అనుకుని "ఇక్కడ ఉద్యోగం లో జాయినవను వచ్చాను" అంటూ అపాయింట్ మెంట్ ఆర్డర్ చూపబోగా,"అవసరం లేదు రండి నాతో" అంటూ మేనేజర్ అని బోర్డ్ ఉన్న క్యాబిన్ లోకి డోర్ మీద తట్టి ,తీసుకెళ్ళింది .
తలెత్తి ముందు ఆమెనూ, తర్వాత ఆమెవెనుక ఉన్న నన్నూ చూశాడు ఆశాల్తీ . "నమస్తే సర్ ! ఈమెకు ఇక్కడ ఉద్యోగం మచ్చిందిట, జాయినవను వచ్చారు ,పేరూ---” అని నావైపుచూడగా , --- "లావణ్య"అని నాపేరు చెప్పాను.
"ఆహా! పేరు బాగుంది నీలాగే, పనెలా ఉంటుందో చూడాలి " అన్నాడా మ్యానేజర్. వీనిని జాగ్రత్తగానే మ్యానేజ్ చేయాలికాబోలు అనుకున్నాను .
"సత్యా !ఇక నీవు వెళ్ళు"అన్నాడు నన్ను అక్కడికి తెచ్చిన ఆమెతో.
"సర్! ఈ మె సీట్ ఎక్కడో చెప్తే చూపి వెళతాను. పాపం కొత్తకదా!" అంది సత్య .
"అదంతా నేను చూసుకుంటాను. నీవెళ్ళి నీపని చూసుకో , అన్నట్లు ఎంత దాకా వచ్చిందీ అప్పజెప్పిన పని "అన్నాడు.
"ఇంకా మీ దాకా తేను కాలేదు. అయ్యాక పంపుతాను" అంటూ నాకేసి కంటితో ' జాగ్రత్త ' అన్నట్లు సైగ చేసి వెళ్ళింది.
వీనిని జాగ్రత్తగానే మ్యానేజ్ చేయాలికాబోలు అనుకున్నాను, మరోమారు .
"రా! లావణ్యా! కూర్చో "అంటూ మర్యాద చేశాడు .
"ఫరవాలేదుసార్ ! మీరు మేనేజర్ మీముందు కూర్చోడమేంటీ! నాపని ఎక్కడో చెప్తే వెళ్ళి మొదలుపెడతాను, అనుమానం వస్తే మిమ్మలే అడగాలనుకుంటాను." అన్నాను.
"ఔను లావణ్యా! ఇక్కడ సంతకం పెట్టు.రోజూ 9.30 గం.కు ఈ రిజిస్టర్ నాటేబుల్ మీదకువస్తుంది.అప్పటిదాకా బయటున్న ఆటేబుల్ మీద ఉంటుంది. నీకెప్పుడైనా లేటైతే ఇక్కడికివచ్చి సంతకం చెయ్యి, కొత్త దానివికదా ! లేట్ మార్క్ వెయ్యనులే." అంటూ , నాపేరు వ్రాసి,, చోటు చూపుతూ సంతకం చేసే రిజిస్టర్ నాముందుకు జరిపి, పెన్ అందించ బోయాడు.నేను చప్పున నాబ్యాగ్ తెరచి పెన్ తీసుకుని సంతకం చేసి బుక్ అతనిముందుకు జరిపాను.
"సరే రా! నీక్యాబిన్ చూపుతాను " అంటూ నన్ను తాకుతున్నట్లే బయటికి నడిచాడు.
నేను కాస్త దూరంగానే నడుస్తూ అనుసరించాను.
అతని క్యాబిన్ లోంచీ నేను కనిపించేలా ఉన్న క్యాబిన్ లో సీటు చూపించి, " ఇక్కడే నీ సీటు.ఇంతకు ముందు ఇక్కడ పనిచేసే వాడు ఉత్త వెధవ. పని చేయకుండా ఆడపిల్లలు పనిచేసే చోటికెళ్ళి పెత్తనం చేసేవాడు, ఆవెధవను నేనే ట్రాన్స్ ఫర్ చేయించాను.తిక్క కుదిరింది .ముందుగా ఈ ఫైల్స్ అన్నీచదువు, ఇంగ్లీష్ వచ్చుగా , అనుమానం వస్తే నన్నే అడుగు ,మిగతావారిపని పాడు చేయకు. రేపటినుండీ నీవు ఏమి చేయాలో నీకే తెలుస్తుంది , కంగ్రాట్స్ ,ఇంతమంచి ఆఫీసులో నీకు ఉద్యోగం రావడం నీ అదృష్టం." అంటూ చేయి అందించబోయాడు షేక్ హ్యాండ్ ఇవ్వను.
నేను చేతులు ఎత్తి నమస్కరించాను." ధన్యవాదాలు సార్! మీ అంత మంచి మేనేజర్ ఇక్కడుండటం నా అదృష్టం "అన్నాను.
ఉబ్బి తబ్బి బ్బవుతూ విశాలవదనంతో నవ్వుతూ " ముందుముందు తెలుస్తుంది నామంచితనం " అంటూ బయటికి నడిచాక, నేను నాదైవానికి నమస్కరించుకుని, సీట్లోకూర్చున్నాను.
తలెత్తి చూస్తే మేనేజర్ ముఖం కనిపించింది. నావైపేచూస్తున్నాడు.ఇబ్బందే తలెత్తి నప్పుడ ల్లా అతడినిచూట్టం. ' క్యాలెండర్ ఒకటి తెచ్చి ఇక్కడ అడ్డుగా పెట్టుకోవాలి ' అనుకున్నాను.
లంచ్ వరకూ ఆఫైల్స్ చదువుతూ కూర్చున్నాక , ఇందాకటి సత్య అనే ఆమె నా దగ్గరకువచ్చి "రండి లంచ్ చేద్దాం. క్యాంటీన్ కు లేటుగా వెళితే ఏమీ మిగలవు. రండి లావణ్యా!" అని ఆదరంగా పిలిచింది. ఫైల్స్ మూసి, టేబుల్ సొరుగులో భద్రపరచుకుని ఆమెతో వెళ్ళాను.
"చూడండి లావణ్యా! చెప్తున్నాననుకోక ఈ ప్రవర్తకుడితో కాస్త జాగ్రత్తగా ఉండండి, వీని ప్రవర్తన అంత బాగోదు. మీరు కొత్తవారుగనుక చెప్తున్నా ను."అంది.
ఆమె ఆఫీసుగురించిన వివరాలు ,అక్కడి కీచకులు, దుర్యోధనులు, దుశ్శాసనుల గురించీ , చెప్తుండగా మౌనంగా వింటూ లంచ్ ముగించి ఎవరి క్యాబిన్ లో వారం పనిచేసుకుంటుండగా , ప్యూన్ అన్ని క్యాబిన్ల కూ వినిపించేలా అరుస్తూ-- " హెచ్చరిక హెచ్చరిక, ఆఫీసర్ గారు వస్తున్నారు. "అని అరుస్తూ ఆఫీసంతా తిరిగి అరిచి వెళ్ళాడు.
నేను అలర్ట్ గాకూర్చుని ఆ ఆఫీసర్ గారెవరో చూద్దామని ఆసక్తిగా ఉన్నాను. మరో పది నిముషాల్లో ఫుల్ సూట్ లో ఉన్న ఒక శాల్తీ ముందు వెనుక ప్యూన్స్ నడుస్తుం డగా అట్టహాసంగా, పొట్ట ఊపుకుంటూ నడుస్తూ రెండువైపులా ఉన్న క్యాబిన్స్ లోకి చూస్తూ , తన ఆఫీస్ గదిలోకి కాబోలు వెళ్ళినట్లు న్నాడు.
సెక్షన్ మ్యానేజర్ పిలిస్తున్నాడనే పిలుపు విని లేచి అటెండర్ వెన కాలే వెళ్ళాను . అక్కడ ఒక పెద్దపాటి క్యాబిన్ లో, పెద్దపాటి పొట్టతో ఒక కోటు ధరించిన ఒక ఆర్భాటకుడు కూర్చుని ఉన్నాడు.నన్ను చూడగానే "ఏమ్మా! ఉద్యోగంలో చేరాక నన్ను చూడవద్దా1 నాతో మాట్లాడవద్దా! నేరుగా వెళ్ళి ఏసీ గదిలో హాయిగా కూర్చోడ మేనా? నేనొకడ్ని ఇక్కడ ఉన్నానని తెలీదా!" అన్నాడు కాస్త ఘాటుగానే.
"నమస్తే సర్! నన్ను మేనేజర్ గారు సీటు చూపించి కూర్చుని పనిచేయమన్నారు. నాకు .."అని నేను చెప్తుండగానే , "ఓహో వారు సెక్షన్ హెడ్స్ పనికూడా చేసేస్తు న్నాడా!మమ్మల్నీ లేపేయాలని ప్లాన్ చేస్తున్నాడా!, వాడబ్బతరం కూడాకాదు.! చేరిన అందమైన అమ్మాయిల నందరినీ తానే ముందుగా చూసి పరిచయం చేసే సుకోవాలి కాబోలు,వెధవ బుధ్ధి, సరే రోజూ ఒకమారు నాదగ్గరికి వచ్చి ఏం పనిచే యా లో అడిగి, చేసినది నాకు చూపి వెళుతుండు, అన్నట్లు నీపేరేమన్నావ్! "
" ఇంకా ఏమీ అనలేదు సార్! లావణ్య ,మరైతే మేనేజర్ గారూ రోజూ పని తనకు చూపమన్నారు, ఎవరికి ముందు నాపని చూపాలిసార్! నాకు కొత్త కదా అందుకని అడుగుతున్నాను."అన్నాను .
"ఓహో అలాగా! ముందు నన్ను కలసి ఏమిపనిచేయాలో రోజూ తెలుసుకుని వెళ్ళు.ఆ రోజుకు ఇచ్చిన పనయ్యాక నాకు సబ్ మిట్ చేయి,"
"మరి మేనేజర్గారు..."
"నేను సెక్షన్ ఇంచార్జిని నాకే నీపని ఎంత ఐందో చెప్పాలి. వెళ్ళిక" అన్నాక నేను నాక్యాబిన్ లోకి వచ్చాను.
కాస్సేపటికి మరో పిలుపు ఈమారు ఆఫీసర్ గారి నుంచీ,లేచి వెళ్ళాను. " ఇదో చూడూ! నేనసలే మంచి వాడిని కాను..."
"విన్నాను సార్"
"ఏం విన్నావూ ఆ అహా అసలు ఏం విన్నావూ!" అంటూ రెట్టించాడు.
"మీరు చాలా స్రిక్ట్ అనీ , పనిపట్ల రావణాసురులనీ ,పనిచేయకపోతే ఊరుకోరనీ విన్నాను. "
"ఆహా మంచిగానే విన్నావు, కరెక్ట్. సరే మీపేరేమన్నావూ!"
"నాపేరు లావణ్య సర్! ఉదయం మ్యానేజర్గారు నన్ను జాయిన్ చేసుకున్నారు సర్, పని చూపారు. వర్క్ అర్థం చేసుకుని రేపటినుండీ మొదలు పెట్టమన్నారు సర్! ఇంతకు ముందే సెక్షన్ ఇన్ చార్జ్ కూడా పిలిపించి అడిగారు సర్! రేపటి నుండీ పనిచేయమన్నారు సర్!" అని చెప్ప గానే,
"మంచిది బాగా పనిచేసుకో, త్వరత్వరగా ప్రెమోషన్స్ పొందు.సక్రమంగా ఆఫీసుకు రా! ఆఫీసర్ల మెప్పుపొందు అందంగా ఉండటంకాదు,పనికూడ అందంగా చేయా లి తెలిసిందా! ఇక వెళ్ళు. " అంటూ నాకేసి పైనుండీ క్రిందివరకూ గుచ్చుగుచ్చీ ఒకలాగా చూస్తుండగా నేను గబగబా నాక్యాబిన్ లోకి వెళ్ళి ఫ్లాస్క్ లో నీరు గట గటా త్రాగేశాను.
'బాబోయ్ ! అంతా ఒకే తెగ, రావణాసుర, దుర్యోధన బంధువర్గంలా ఉన్నారు 'అనుకున్నాను.
సాయంకాలం ఆఫీసు కాగానే బయటికి వచ్చాను. అక్కడ పురుష ఉద్యోగులంతా గుంపుగా ఉన్నారు. "నమస్తే మేడం! మీరు లావణ్యకదూ! ఈరోజే చేరారు కదూ ! మాకేం పార్టీలేదా! మాతో పరిచయం చేసుకోరా! మంచి లాభదాయకమైన సీట్లో చేరారు. రాబడే రాబడి. వద్దన్నాడబ్బు. "అంటూ అటకా యించారు.
సత్య ముందుకువచ్చి "ఉండండి బాబూ! అవిడ్ని ముందు మన ఆఫీసులో సెటిలవ నివ్వండి. ఆతర్వాత పార్టీలూ, కాఫీలూనూ, పదండి లావణ్య గారూ! వెళదాం, లేకపోతే వీరు గంటవరకూ మిమ్మల్నివదలరు, మీరూట్ బస్ పదన్నారు కదూ! అదికాస్తా వెళ్ళిపోతుంది, మూడు బస్సులు మారాలి" అంటూ లాక్కెళ్ళింది. దూరంగా వెళ్ళాక "లావణ్యగారూ! వీరంతా రావణాసుర సంతతి.ఇక్కడ విభీషణుడు లేడు.కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించండి. "అంటూ మరికొన్ని ఆఫీసు వ్యవహారా లు, అక్కడి ఉద్యోగుల విషయాలు చెప్తూ బస్ స్టాప్ వరకూ నడిచింది. ముందుగా నాబస్ రావటాన నేను ఎక్కాను.
అలా ఆ ఆఫీసులో నా ప్రస్తానం మొదలైంది. నేను అక్కడ చేరి పదిరోజులైంది ప్రతి మాగాడు మహిళా ఉద్యోగు ల స్నేహం కోరేవాడే. పైనుండీ క్రిందివరకూ అంతా ఒకే జాతి. ఆరోజు అంతా పార్టీ ఇవ్వందే వదలమన్నారు ..
ఆసాయంకాలం పార్టీ . నేను లేడీస్ రూంలో నాడ్రెస్ మార్చుకుని వెళ్ళాను. రోజూ సాధారణ చీరలు కట్టుకెళ్ళేనేను పార్టీకి ముందు మంచి పంజాబీడ్రెస్లో వెళ్ళాను. ఆఫీస్ హాలుక్రిక్కిరిసి ఉంది.అంతా మా ఆఫీసు ఉద్యోగులే.
నేను స్టేజ్ మీదికి వెళ్లగానే అంతా చిత్రంగా నన్ను చూడ సాగారు.ఒక బిళ్ళ బంట్రోతు నాబ్యాగ్ స్టేజ్ మీద పెట్టి, కుర్చీ జరిపి, వెనక నిలబడ్దాడు. స్టేజ్ మీదకు నాసిబ్బంది వచ్చి నిలుచుని" మేడం మనజిల్లా కొత్త కలెక్టర్ గారు , అన్ని ఆఫీసు లూ తనిఖీ చేసే పనిలో ఉన్నారు. ముందుగా ఈ ఆఫీసు ఐంది. ఇక్కడి మహిళా ఉద్యోగులు గత కలెక్టర్ గారికి పంపుకున్న అర్జీలను చూసి మేడం తనిఖీజరిపారు." అని చెప్పాక "నేను లేచి "అందరికీ శుభసాయంకాలం.మహిళాఉద్యోగులు అనేకా నేక కారణాలవలన తాము చదువుకున్న చదువు సార్థకం చేసు కోనూ , అర్ధిక కార ణాలవలనా ఉద్యోగాలు చేస్తారు. మహిళ అంటే కేవలం ఆఁడుది అనుకోకండి. పురుషులకంటే తక్కువది అనుకోకండి. ఒక మహిళ మీకు జన్మనిచ్చిన తల్లైతే, ఇంకో కోమలి మీ సోదరి, మరో వనిత మీ వంశానికి ఉత్తర తరాన్ని ప్రసాదించే సృష్టికారిణి, మరో మానవతి మీ కుమార్తెగా మీరు జన్మనిచ్చినరూపవతి. ఇంకో ముదిత మీకు కోడలుగా మీ వంశవృధ్ధికి వచ్చే వధూటి. ,ఇలా మహిళలు అంతా పూజనీయులే, మీ ఇంట్లోవారే, ఆఫీసులో మీతోపాటు ఉద్యోగాలు మీకంటే అధి కంగా పెర్ ఫెక్టుగా చేస్తూ ఇళ్ళకెళ్ళి మళ్ళీ గృహకృత్యాలు నిర్వహించుకుంటూ సంసారాలను నడిపే అసలైన మేనేజర్లు వారే. రెండు గంటలు లేటుగా, లేక గంట ముందుగా వచ్చి మహిళా ఉద్యోగులను చూపులతో తినేసే వారూ, వారానికో మారు ఆఫీస్కువచ్చేవారూ కాదు మ్యానేజర్లు, ఆఫీసర్లూ. హాస్యాలకూ, నవ్వులాటలకూ, నీచ తలంపులకూ , సరదాకూ , కాలక్షేపాలకూ కాదు వారు. ఎక్కడైతే స్త్రీగౌరవింప బడుతుందో అక్కడ దేవతలు వెలసి ఉంటారు.
యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనేమాట విశ్వసించండి.
‘ కార్యేషుదాసీ కరణేషుమంత్రీ -
రూపేచలక్ష్మీ క్షమయాధరిత్రీ. ‘- అన్నారు. దాసీగా చూడకండి మీ పరిచారిక కాదు. తనకు నియమింపబడిన, భగవంతుడు ప్రసాదించిన పనికి అంకిత మయ్యే ది మహిళ. వ్యంగ వ్యాఖ్యలు రెండు అర్థాల పదాలూ వాడుతూ మహిళా ఉద్యోగుల ను అవమాన పరచేవారు ఇక ఇక్కడ ఉండరు. నాకు అందిన ఋజువులతో కూడి న సమాచారం ప్రకారం నేను ఏమైనా చేయగలను{అంటూ నా టేబుల్ మీది ఒకఫైల్ ఎత్తి చూపాను.}, కానీ మీలో మార్పునుకోరుతూ మీకు ఒక అవకాశం ఇస్తున్నాను.
మీ సంసారాలకు అన్యాయం చేయడం కాక మీ లో మానవతావిలువలు నింపుకుని మాన్యంగా జీవించమని కోరుతున్నాను. మీ సీట్లన్నీ మారిపోతాయి. అలాకూర్చుని పరిపూర్ణ మానవుల్లా పనిచేసుకోండి. రేపటినుండీ ఆఫీసులో అడుగిడగానే సంతకా లు కాదు అక్కడ ఉంచిన మిషన్లో వేలిముద్రలు వేయాలి, అదే మీ సంతకమవు తుంది. ఆఫీసర్ నుండీ ప్యూన్ వరకూ అందరికీ ఓకేరూల్. సమయ పాలన .ఇక విందు సేవించండి." అంటూ ముగించాక, అంతా భయభయంగా ఆశ్చర్యంగా నన్ను చూస్తూ తలలు ఊస్తుండగావేదిక దిగాను..
***

మరిన్ని కథలు

Varna yavanika
వర్ణ యవనిక
- జి.ఆర్.భాస్కర బాబు
Parikinee
పరికిణీ
- రాము కోలా దెందుకూరు
Atchi vachhina moorkhulul
అచ్చి వచ్చిన మూర్ఖులు
- డి.కె.చదువుల బాబు
Avakaram
అవకరం
- డి.కె.చదువుల బాబు
Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు