పుట్టు మచ్చ - ఎమ్.వి.జె. భువనేశ్వరరావు

puttu machha

"వింధ్య హిమాచల యమునా గంగా...
ఉచ్చల జలదిత రంగా..."

రాహుల్ నోటి నుండి ఆకస్మాత్తుగా విన్పించిన ఆ రాగాలాపన విని ఉలిక్కిపడి, అటువేపు చూసింది వింధ్య.

వింధ్య అప్పుడే ఆఫీసు నుండి వచ్చింది...

అక్క సంధ్య ఇంట్లో లేదు...

బావ రాహుల్ ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు...

ఆ రాగాలాపనలో 'వింధ్య' అనే మాటని ఒత్తి, నొక్కి చెప్పటం ఆమెని కొంచెం ఆలోచించేలా చేసింది...

"ఏంటి బావా... ఈ మధ్య దేశభక్తి బాగా ఎక్కువైనట్లుగా ఉంది... తరచూ జాతీయ గీలాపన చేస్తున్నావు..." ఆలవోకగా అడిగేసింది...

రాహుల్ ముఖం ఆనందంగా వెలిగిపోయింది.

"మరదళ్ళ పై భక్తే గాని... దేశభక్తి మగాళ్ళ కుంటుందంటావా చెప్పు..." నర్మగర్భంగానే ప్రశ్నించాడు.

"అంతే కదా.. ఏమో నిజంగా దేశభక్తేనేమోనని తెగ ఆనందపడిపోయాను..." అంటూ బాత్రూంలోనికి దూరింది వింధ్య.

స్నానం చేస్తోందే కాని మెదడు నిండా లేనిపోని ఆలోచనలు వింధ్యను చుట్టుముట్టేస్తున్నాయి.

బావ చూపులు కూడా ఇది వరకటిలా లేవు...

మాటల సంగతి ఇక సరే సరి.

అక్క అరనిమిషం లేకపోతే చాలు అపరిచితుడులా మారిపోతున్నాడు... ప్రవర్తనలో కూడా తేడా వచ్చేస్తోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే -

అక్క ఉంటే రాముడు... లేకపోతే కలియుగ కృష్ణుడు.

బావ తననుండి ఏదో ఆశిస్తున్నాడని సూటిగా అర్ధమవుతూనే ఉంది.

ఈ విషయం అక్కతో మాట్లాడితే... ఏమనుకుంటుందో ఏమో! అక్కే బావని గట్టిగా నిలదీస్తే వారిద్దరి మధ్య గొడవవుతుందేమో!

స్నానం పూర్తయిపోయింది కాని వింధ్య ఒక నిర్ణయానికి రాలేకపోయింది.

***

వింధ్య అక్క సంధ్యకు తోడుగా ఉండడం కోసం హైద్రాబాద్ వచ్చింది... అనుకోకుండా అదృష్టవశాత్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం దొరకడంతో... అక్కతో పాటే ఉండిపోయింది.

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి వెళ్ళిపోతానని చెప్పినా వింధ్యని సంధ్య వెళ్ళనివ్వలేదు. దాంతో పెళ్ళయ్యేదాకా అక్కతోనే ఉండమని తల్లిదండ్రులు కూడా చెప్పడంతో మరో మార్గం లేకుండా పోయింది.

నిజానికి సంధ్య అందం విషయంలో వింధ్య కే మాత్రం తీసిపోదు... రంగు, శరీర సౌష్టవం, ఎత్తు, లావు - అంతా సమానమే. ఒక్కమాటలో చెప్పాలంటే సంధ్య ఈజ్ ఈక్వల్ టూ వింధ్య. వస్త్రధారణలో తప్ప ఇద్దరికీ ఏ విషయంలోనూ వ్యత్యాసం లేనే లేదు.

సంధ్య చీరకట్టులో ఉంటే, వింధ్య చూడీదార్ లలో మెరుస్తూ ఉంటుంది. వింధ్య కు పై పెదవి పై పుట్టుమచ్చ ఉంటుంది.
పై పెదవి మీద నున్న గోధుమరంగు పుట్టుమచ్చను గుర్తిస్తే తప్ప... ఒకే రకంగా ఉన్న సోదరీమణుల్ని పోల్చుకోవటం, గుర్తించటం అంత సులభం కూడా కాదు...

అదే ఇప్పుడు వింధ్య కు సమస్యయి కూర్చుంది...

పొరపాటున చీరకట్టిందా... వెనక నుండి హత్తుకునే ప్రయత్నం చేయడం - 'సారీ... వింధ్యా... సంధ్యనుకున్నాను...' అని చెప్పేయటం రాహుల్ కి అలవాటుగా మారింది...

ఇక దాంతో వింధ్య చీర కట్టడమే మానేసింది.

ఏదేమైనా ఇక ఈ విషయంలో ఇక తాత్సారం చెయ్యటం కుదరదు... అక్కకి చెప్పేయటమో... బావకి నచ్చినట్లు నడుచుకోవటమో... తొందరగా పెళ్ళి చేసేసుకోవటమో...

ఈ మూడు ప్రత్యామ్నాయాలు మాత్రమే తన ముందున్నాయ్... రెండు రోజుల పాటు ఎడ తెరిపి లేకుండా సాగిన మానసిక సంఘర్షణలో నుండి, ఓ పరిష్కారం తళుక్కుమని మెరవటంతో ఆ రాత్రి ఆనందంగా నిద్రపోయింది.

****

హాలులో టీవీ చూస్తున్న తనని, లాఘవంగా సరాసరి తన గదిలోనికి లాక్కుపొయిన వింధ్యను చూసి ఒకింత ఆశ్చర్యపోయాడు రాహుల్.

తలుపులు మూసేయడంతో... రాహుల్ తలపులు కూడా మారిపోయాయి.

"ఈ ఒక్కసారికే... మరి! ఇదే తొలిసారి... ఇదే ఆఖరు సారి..! బావా... మరలా నానుండి ఇలాంటిది ఆశించకూడదు... నువ్వు."

మురిపెంగా ఆ మాటలు చెవిలో పడగానే... రాహుల్ కి శరీరమంతా సన్నగా తన్మయత్వంతో వణికింది...

స్థాన భ్రంశమైన చున్నీ... ఆమె ఎద సంపదను తేట తెల్లం చేస్తూనే ఉంది...

పై పెదవి మీదున్న 'పుట్టుమచ్చ'ను చూడగానే రాహుల్ లో కోరిక కోడెనాగులా బుసలు కొట్టింది...

రతీ మన్మధులై చెలరేగిన తరువాత... ఆమెను మురిపెంగా హత్తుకుంటూ... "మరలా ఇంకొక్కసారి" అన్నాడు రాహుల్.

ఆమె అతని వేపు కోపంగా చూసింది.

రాహుల్ కి భయమేసింది... మరుక్షణమే అనుమానం కూడా కలిగింది...

"వింధ్యా... నువ్వేనా..." అడిగాడు, ఆదుర్దాగా. రంగుతో అద్దిన, తన పెదవి పై నున్న పుట్టుమచ్చను తుడిచేసుకుంటూ..

"ఏం క్రొత్త అనుభవం దొరికిందిప్పుడు? పెళ్ళి చేస్కున్న భార్యను నేనుండగా, నీకు నా చెల్లెలు కూడా కావాల్సి వచ్చిందా... అన్నలా పెళ్ళి చేయాల్సిన మీరే... కాటేయబోయారంటే ఇక అది ఎవరిని నమ్ముకోవాలి?

కనీసం రూప లావణ్యాలలో కూడా మేమిద్దరమూ వేరు వేరు కాదే! కవలలమైన మేమిద్దరమూ ఒకరికి మరొకరు ప్రతిరూపమే కదా... ఇప్పటికైనా మీ మగబుద్ధిని మార్చుకుని... మర్యాదగా మసలుకోవడం నేర్చుకోండి..."

ఉగ్ర నరసింహావతారమెత్తిన సంధ్య కళ్ళల్లోకి సూటిగా చూడలేక... తలదించేసుకున్నాడు సిగ్గుతో రాహుల్...

***

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ