మందాకిని - సడ్డా సుబ్బారెడ్డి

Mandakini

'విచ్చుకున్న పూవు గుర్తుంటుందో లేదో కానీ, గుచ్చుకున్న బాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ప్రసీద- నా గుండెలకు గుచ్చుకున్న బాణం'
ప్రసీద గురించి నేను డైరీలో వ్రాసుకున్న వాక్యం అది.
అప్పట్లో నా డైరీ అంతా ప్రసీద తోనే నిండిపోయింది.
ప్రసీద ది - కూర్గ్ దగ్గర్లోని తలకావేరి ! తనని మొట్టమొదటి సారి చూసినప్పుడు- నన్ను అమితంగా ఆకర్షించింది - ఆమె కళ్ళు, ఆ కళ్ళు పలికించే భావాలు.
ఒక మనిషి పుట్టిపెరిగిన వాతావరణం, అలవాట్లు, అక్కడ ప్రకృతికి మనిషికి వుండే సంబంధం .. వాళ్ళ ఆలోచనలతోపాటూ శరీరాన్నీ ప్రభావితం చేస్తాయేమో. అందుకే ఎక్కువ వర్షాధారాల రాష్ట్రాలైన అస్సాం, కూర్గ్ లాంటి ప్రదేశాల్లో మనుషులు, వారి రూపం, అలవాట్లు .. మిగిలిన సమాజం కంటే భిన్నంగా ఉంటాయి.
అందుకేనేమో- ప్రసీద కళ్ళు - మీనాల్లా ఉంటాయి. అవి - కొన్ని సార్లు ఆప్యాయతల్ని పంచుతాయి, అనురాగాల్ని పెంచుతాయి.
ఐతే - ఇన్నికోట్ల మంది ప్రజల్లో, ఒక మనిషికి మరో మనిషికి స్నేహమో, మరో సంబంధమో ఉండాలంటే, అది కొన్నేళ్లపాటు కొనసాగాలంటే.. ఖచ్చితంగా మన తలరాత అయి ఉండాలి. లేకపోతె, ఒకే స్నేహపు గుంపులోని కొద్దిమంది మాత్రం ఏళ్లతరబడి సంబంధాలు కొనసాగిస్తే, మరికొందరు మాత్రం మధ్యలోనే విడిపోతారు. అంతా కాలమహిమ'
మొన్నటివరకూ నేను ఇటువంటి అభిప్రాయంతోనే ఉండేవాడిని.
కాదని - మొన్నమొన్నే తెలిసింది
'యోగ వాసిష్ఠం' లో వసిష్ఠుడు రాముడికి చెబుతాడు
' రామా! మనుషులు తమకు దుఃఖం కలిగినపుడు ' దేవుడా నాకే ఎందుకీ కష్టం' అంటారు. సంతోషం కలిగినపుడు ' అంతా అదృష్టం' అంటారు. ఈ దేవుణ్ణి గానీ, అదృష్టాన్ని గానీ ఎవడైనా చూశారా, తలరాత ఎలావుంటుందో ఇంతవరకూ ఎవ్వడైనా చదివాడా? కాబట్టి ఓ రామా- ఒకడు ఏదైనా సాధించినప్పుడు అతడి కృషి మనకు కనపడితే- అది -దృష్టం (కనపడింది కాబట్టి). అతడి కష్టాన్ని మనం గుర్తించకపోతే, కనపడక పొతే - దాన్ని మనం అదృష్టం (దృష్టం కానిది) అంటున్నాము. ఇవన్నీ జ్ఞానుల దృష్టిలో మూర్ఖమగు అభిప్రాయాలే. ఈ ప్రపంచంలో మనకు ఒక సమర్ధుడికంటే ఇంకా సమర్ధమైన వ్యక్తి కనపడుతున్నాడు కదా. మరి ఆ బేధం ఎక్కణ్ణించి వస్తుంది. అంటే... ఒకవ్యక్తి చేసిన ప్రయత్నం కంటే, మరొకడు చేసిన ప్రయత్నం ఇంకా ఎక్కువ అన్నమాట.
ఒక రైతును గమనించు. సంవత్సరమంతా అతడు కష్టపడి పండించిన పంట అంతా ఒక్క తుఫానుకి కొట్టుకుని పోతుంది. అతడు దిగులు పడ్డా, మళ్ళీ పునరేకీకరణయై మళ్ళీ మొదలుపెడతాడు. అట్లే, ఒక వ్యాపారస్తుడు, కష్టపడి ఆర్జించిన సొమ్మంతా నష్టపోయినపుడు కూడా, తిరిగి ప్రయత్నించి లాభము ఆర్జించటానికి చేసే ప్రయత్నమే ఉత్తమం.
ఒకడు ఎంత ప్రయత్నిస్తే అంత విజయం సాధిస్తాడు. ఏ వ్యక్తి దేని కొరకు ఎంతగా ప్రయత్నిస్తాడో, ఆ వ్యక్తి దానిని అంతవరకే పొందగలడు. ఉదాహరణకి ఒక వ్యక్తి కి గొప్పగా పేరో, డబ్బులో సంపాదించాలన్న లక్ష్యం ఉందనుకో. అతడెప్పుడూ దానిగురించి ఆలోచిస్తూ, దానికోసం ప్రణాళికలు వేసుకుంటూ, అందుకు కావలసిన వనరులు సమకూర్చుకుంటూ అడుగు ముందుకు వేస్తుంటాడు. చేసే ప్రతి పనీ దానికి అనుగుణంగానే ఉండేట్టు చూసుకుంటాడు. కష్టాలు వస్తే అధిగమిస్తాడు. ఇతరుల సలహాలు సూచనలు, అవసరమైతే సహాయం స్వీకరిస్తాడు. అలా ఒక్కోఅడుగూ వేసుకుంటూ.. మెల్లగా తనలక్ష్యాన్ని చేరుకుంటాడు.
మరొకడు ఉన్నాడనుకుందాం . తనకిష్టమైన వ్యక్తి గురించి నిరంతరం ఆలోచిస్తూ, ఆ మనిషి సమక్షంలోనే గడపాలని, జీవితంలో ఆ వ్యక్తి చెయ్యిఅందుకోవాలని పరితపిస్తుంటాడనుకో. అలాంటి వ్యక్తి చేసే పనులన్నీ అందుకు అనుగుణంగా ఉండేట్లు చూసుకుంటాడు. ఆ ప్రక్రియలో తాను అనుకున్నది సాధించొచ్చు కూడా.
మరి పై రెండు ఉదాహరణల్లో- ఇద్దరూ కష్టపడ్డారు, కష్టమో నష్టమో ఇద్దరూ తమతమ లక్ష్యాల్ని చేరుకున్నారు. వాళ్ళ వాళ్ళ కర్మలు, ఆలోచనలు, చేతలు అన్నీ లక్ష్యం వైపుగా ఉండి అవి సాధించుకున్నారు. మరి ఇందులో - దేవుడు ఎక్కడున్నాడు. అతడి దయ ఎలా పనిచేసింది. తలరాత అంటే ఏమిటి? పై ఉదాహరణల్లో అది ఎక్కడ ఎప్పుడు ఎలా పనిచేసిందో ఎవరికైనా తెలుసా? మరి అది ఎంత అసంబద్ధమైన మాట. కేవలం మూర్ఖులే దేవుడు, దయ, తలరాత... అని తమ ప్రయత్న రాహిత్యాన్ని సమర్ధించుకుంటుంటారు. మనిషి ఏదైనా తన స్వయంకృషి ద్వారానే సాధించుకుంటాడు తప్ప... దేవుడి దయ లాంటివి ఏవి వుండవు'
వసిష్ఠుడు చెప్పాక రాముడు మారాడో లేదో నాకైతే తెలీదు గానీ.. అప్పటివరకూ నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలూ, భావాలూ, ఆలోచనలూ ... తునాతునకలై పోయాయి.
చిత్రంగా అప్పుడే ప్రసీద పట్ల నా అభిప్రాయం కూడా పూర్తిగా మారిపోయింది.
ఆ పరంపరలో ఓ రోజు ఫోన్ చేసింది. నేను ఫోన్ ఎత్తి ' ఏమిటి? ఎక్కడున్నావు?' అడిగాను.
'హాస్పిటల్ ' లో అంది. ఒక్కక్షణం నేను ఆశ్చర్యపోయి 'ఏమైంది నీకు' అడిగాను
'నాక్కాదు. మా చెల్లికి. తనకి న్యూమోనియా వుంది'
'నీకో చెల్లి కూడా ఉందా?'
'హా ' సింపుల్ గా అంది
'ఇక్కడ వర్షం ఎక్కువ. దానికితోడు సంవత్సరమంతా వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సమస్య తనకి చిన్నప్పటినించీ వుంది. ఇదిగో ఇలా వర్షం ఎక్కువైతే ఆ ప్రాబ్లెమ్ ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఊపిరి పీల్చటం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే హాస్పిటల్ కి వచ్చాము'
'మరి డాక్టర్ ఏమన్నాడు' నాకెందుకో ఆమె గురించి చాలా కేరింగ్ గా అనిపించి అడిగాను.
మన ఇంట్లో ఒక చెల్లో తమ్ముడో ఉంటే మనం అంత కేరింగ్ గా ఉండకపోవచ్చు. కానీ, అదే బయట మనకు తెలిసిన వాళ్ళు అదీ మనసుకు దగ్గరైన వ్యక్తి ఐతే తల్లడిల్లిపోతాం. ఇది తప్పా ఒప్పా అనేది తర్వాత సంగతి. ఇంట్లో అక్క అందంగా వున్నా 'నువ్వు ఈ రోజు అందంగా వున్నావక్కా' అని చెప్పలేని వ్యక్తి బయట అక్క వరస అయ్యే వ్యక్తి ని చూసి ' ఈ రోజు చాలా బాగున్నావు' అనగలడు. అదెందుకంటే - అదంతే. అవతలి వ్యక్తి అంటే తనకు మానసికంగా ఉన్న క్లోజనెస్. దానికి రీజనింగ్ ఉండదు.
' ఏమి అనలేదు. మందులిచ్చాడు. వేడిగా వున్నవే తినమన్నాడు. ఎప్పుడూ చెప్పేదే. ఇంకొంచం పెద్దైతే ఈ సమస్యలన్నీ తట్టుకోగలిగే శక్తి వస్తుందన్నాడు'
'అవునా.. మరి మీ చెల్లి వయసెమిటి ఇప్పుడు?'
'పందొమ్మిది'
'మరి నీ వయసెంత ప్రసీదా?'
'ఇరవై నాలుగు'
అదీ ప్రసీద మనస్తత్వం. హిపోక్రసి ఉండదు. మాట్లాడినంతసేపూ మనసుకు ఏ ఫిల్టర్లు వేసుకోదు. మనసులో వున్నది ఏమి దాచుకోదు. అవతలివాళ్ళకి ఇది చెప్పొచ్చా, చెప్పకూడదా అని ఆలోచించదు. తనగురించి తప్పుగా అనుకుంటారేమోననే ధ్యాసే ఉండదు. ఐతే- దీనివల్ల లాభమా నష్టమా? ఏమో..కొన్ని విషయాలు అప్పటికప్పుడు నిర్ణయించేయటం విజ్ఞత అనిపించుకోదు.
'ప్రసీదా! ఒక విషయం అడగనా?' కొంచం మొహమాటంగా అడిగాను. నిజానికి తనని ఆ ప్రశ్న అడగక్కరలేదు.
'అడగండి'
'మీ కుటుంబం ఏమి చేస్తుంది?'
'అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాన్నకి బేకరీ లో జాబ్. చెల్లి చదువుతుంది. నేను ఉద్యోగప్రయత్నాల్లో వున్నాను'
చప్పున ఆమె సమాధానమైతే చెప్పింది కానీ, నాన్న బేకరీ లో జాబ్ అన్నచోటే నా ఆలోచన ఆగి పోయింది. ఆ మాటే ఆమెను అడిగాను
తనంది
'అవును సర్. ఇక్కడ ఎక్కువమందికి పొలాలు, పంటలు వుండవు. ఎక్కువగా కొండ ప్రాంతం కాబట్టి.. పంటలు తక్కువ. దానికి తోడు సంవత్సరమంతా వర్షపాతం, సాధారణ పంటలు పండవు. రైతుల దగ్గిర ఉన్న ఎకరా ఎకరా లు తీసుకుని వందల హెక్టార్లు గా మార్చి కార్పొరేట్ కంపెనీలు వాటిని టీ ఎస్టేట్లుగా నిర్వహిస్తుంటాయి. అందువల్ల ఇక్కడ జీవనోపాధి మాకనే కాదు అందరికీ దాదాపు ఇదే, ఇలాంటివే. ఇకపోతే, ఇక్కడ టూరిస్టులు ఎక్కువ కాబట్టి, కాటేజిలు, రెస్టారెంట్లు, బేకరీలు...ఎక్కువ. అందుకే నాన్నకి అక్కడ జాబ్'
ప్రసీద మాటలువిని నాకెందుకో కొంచం బాధనిపించింది. బహుశా బయటినించి చూస్తే.. అలావుంటుందేమో.
నేనన్నాను ' ప్రసీదా! అంతకష్టపడుతూ అక్కడే వుండే బదులు, మీ దగ్గర్లోని మైసూరుకో, మంగుళూరుకో, కన్నూరుకో వెళ్ళొచ్చుకదా, ఈ పాటి జాబ్ అక్కడ కూడా దొరుకుద్ది. దానికితోడు, మీరేదయినా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు'
' ఆలాఅని ఏం లేదు సర్, చేసుకోవచ్చు. కానీ, ఇది మా స్వంత వూరు, సొంత ఇల్లు, ఖర్చులు తక్కువ, నాన్న సంపాదనే మా కుటుంబానికి ఆధారమైనా మేము ఎప్పుడూ దేనికీ ఇబ్బంది పడింది లేదు. మీరన్నట్టు, ఏ మైసూరుకో, మంగుళూరుకో వెళ్లొచ్చు. పార్ట్ టైం జాబ్ చెయ్యొచ్చు. కానీ, అక్కడ సిటీ కాబట్టి అద్దెలెక్కువ, ఖర్చులెక్కువ, చెల్లి ఫీజులు కూడా ఎక్కువే. చివరికి అంతా లెక్క చూస్తే.. ఆ సంపాదన ఆ ఖర్చులు.. మొత్తం ఒకటే.
దానికి తోడు.. ఇక్కడ వాతావరణం వేరు సర్. ఆకాశం ప్రకృతికి ఎప్పుడూ ఆకుపచ్చటి దుప్పటి కప్పినట్టుంటుంది. మేఘాలు పాలసముద్రంలో స్నానమాచరించి వచ్చినట్టు వస్తుంటాయి. ఇక ఇక్కడ ప్రవహించే జలపాతాలు, సెలయేళ్ళు.. మాకు రోజూ ఒక కొత్త ఉత్సాహాన్నిస్తాయి. గ్రీష్మం తాలూకు దెబ్బ ఎంత తగిలినా వసంతం కోసం ఎదురుచూసినట్టు, ఇక్కడ ప్రకృతే మాకు ఒక ఇన్స్పిరేషన్.
మీరన్నట్టు.. సిటికొస్తే .. అక్కడేముంటుంది సర్. జిలుగు జిలుగు లైట్లు, పై పై పూతల ఆనందాలు.. మనసు అట్టడుగున దాచిపెట్టుకున్న కష్టాలు. ఐనంతమాత్రాన, ఇదంతా తప్పని నా ఉద్దేశం కాదు. ప్రతిమనిషీ పుట్టి పెరిగిన వాతావరణం, సమాజం, పరిస్థితులు.. వాళ్ళ వాళ్ళ ఆలోచనని, మానసికస్థాయిని నిర్దేశిస్తుంది. ప్రభావితం చేస్తుంది. నాకు ఆలా అనిపించింది. మీకు మరోలా అనిపించొచ్చు'
ప్రసీద చెప్పిన పాఠం విని నాకాశ్చర్యం అనిపించింది. ఒకమ్మాయి.. పట్టుమని పాతికేళ్ళు లేనిది.. ఇంత విశ్లేషణా శక్తి ఉంటుందా? ఏమో.. ఆమె చెప్పినట్టు... మనిషి ప్రకృతికి దగ్గరగా ఉంటే... వస్తుందేమో?
'ఐతే .. ఒక ప్రశ్న అడగనా ప్రసీదా?'
'చెప్పండి'
'రేపు నీ పెళ్లి సిటీ లో వ్యక్తితో కుదిరితే చేసుకోవా? చేసుకున్నా వెళ్ళవా?'
ఆమె నవ్వింది. ఫోన్ లోనే నవ్వింది. ఆ నవ్వుకి .. ముత్యాలేమైనా రాలిపడ్డాయేమో.. దగ్గర్లో ఉంటే ఏరుకునేవాడిని
' నేనింకా అంతదూరం ఆలోచించలేదు సర్. ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే అప్పటి సమయానుకూలతను బట్టి నిర్ణయం తీసుకుంటాను. ఖచ్చితంగా వెళ్లాల్సివస్తే వెళతాను. అందులో తప్పేం వుంది. ఒక అభిప్రాయం దృఢంగా ఉన్నంత మాత్రాన, మనిషి మారకూడదన్న నియమం ఏమి లేదుకదా? ఆమాటకొస్తే .. నిరంతరం మనిషి పరివర్తన చెందడమే కదా జీవితం'
ఆమె మాటలు.. నాకు అమితమైన ఆనందాన్నిస్తున్నాయి. ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు, వందలకొద్దీ పుస్తకాలూ, వేలకొలది అనుభవాల సారం... కేవలం నాలుగు మాటల్లో ఆమె ఎంత సులభంగా చెప్పింది?
పొద్దుగుంకినప్పటినించి మర్రిచెట్ల లోంచి వూడలువూడలుగా దిగజారుతున్న చీకటి, చెలమై, చెరువై , యమునై, సముద్రమై, భూమిని ఆకాశాన్నీ ముంచేసినట్టున్న చీకటి, రాధ కంటి కాటుకలా, కృష్ణుడి ఒంటి నలుపులా.. చిక్కబడిన చీకటి.. నేనో మేధావిననే గర్వంతో కూడుకున్న చీకటి.. ఆమె మాటల దివ్వెలతో.. పటాపంచలైంది.
* * *
మంచికైనా, చెడుకైనా మనిషికి మనసే ఆధారం. అలాంటి మనసులో ఈ మధ్య ప్రసీదే తిష్టవేసుక్కూర్చుంటుంది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్ర పోయేవరకు.. ఏ పని చేస్తున్నా మదిలోకొచ్చి పలకరింపుగా నవ్వేది. నేనొకదాన్ని ఉన్నానన్నట్టుగా గుర్తు చేసి వెళ్ళేది. అలాంటి సమయంలో ఓ రోజు- టెలీపతియో మరొకటో.... తానే ఫోన్ చేసింది
' ఒక రహస్యం. ఎవ్వరికీ చెప్పకూడనిది. కానీ మీకు చెప్పాలనిపించింది'.
నేను ఆసక్తి గా 'ఏమిటో ఆ దేవరహస్యం. చెబితే వింటాను' అన్నాను
'రహస్యమంటే రహస్యం కాదులే. కానీ రహస్యమే' అల్లరిగా నవ్వింది ' మా అత్తయ్య .. వయసు ముప్పై ఉంటుందిలే. ఒక పాప- ఏడెనిమిది ఉండొచ్చు. ఏం చేసిందో తెలుసా?' అని ఆగి ' ఒకబ్బాయి తో సీక్రెట్ గా చాటింగ్ చేస్తూ మా మావయ్యకి దొరికిపోయింది'
తర్వాతేమైంది?
' తర్వాత బాగా గొడవ జరిగిందిలే. అయినా- ఆమె ఇంతకుముందు కూడా ఒకసారి అలానే చేసింది. అప్పుడు వార్నింగ్ ఇచ్చి వదిలేసారు'
'అయినా- చాటింగ్ చేస్తే తప్పేం వుంది.' అన్నాను
'చాటింగ్ లో ఇద్దరూ కలుసుకోవాలనుకుంటున్నారనీ, వీలయితే లేచిపోదామనుకుంటున్నారనే విషయం కూడా బయటపడిందిలే' నింపాదిగా అంది.
'మరి మీ మావయ్య ఏమి అనలేదా?'
'ఎందుకు అనలేదు? తననిక భరించటం తనవల్ల కాదనీ, విడాకులు తీసుకుందామనుకుంటున్నాడు. కానీ, వాళ్ళ కూతురు, చిన్నపిల్ల. దానిపరిస్తితే అర్థం కావటం లేదు' దిగులుగా అంది
'మరిప్పుడేం చేయాలనుకుంటున్నారు?'
'ఏమో తెలీదు. ప్రస్తుతం సమస్య అక్కడే వుంది. తర్వాత ఎటువేపు దారితీస్తుందో' అర్ధోక్తిలో ఆపుచేసింది.
'అదిసరే మరి ఈ విషయం నాకెందుకు చెప్పటం?'
'ఏమో తెలీదు. జరిగింది ఎవరికైనా చెప్పాలనిపించింది. మీరు గుర్తొచ్చారు. చెప్పాను'
కాసేపటికి తాను ఫోన్ పెట్టేసింది. దాదాపు పదినిమిషాలు అవే ఆలోచనలు. అందులో ఎవరిదీ తప్పో? ఎవరిదీ ఒప్పో? ఆ అబ్బాయిదా? ఆమెదా? వాళ్ళ మావయ్యదా? సమస్య గురించి క్షుణ్ణంగా తెలీకుండా తప్పెవరిదో ఆలోచించటం మూర్ఖత్వం కాదా? దాని గురించి ఆలోచిస్తుంటే సడన్ గా ఒక ఒకవిషయం గుర్తొచ్చింది.
వెంటనే ఫోన్ చేసి' అవును ప్రసీదా! ఆమె సీక్రెట్ చాటింగ్ చేస్తున్నవిషయం ఎలా బయటపడింది?' ఒక డిటెక్టివ్ నవల్లో సీక్రెట్ ఏజెంట్ రహస్యాన్ని కనిపెట్టినట్టు అడిగాను.
'అదా.. మా మావయ్యకి ఎందుకో అనుమానం వచ్చింది. మాతో చెబితే, మా చెల్లి ఆమె వాట్సాప్ హాక్ చేసింది. తర్వాత అమెకొచ్చే ఫోన్ లు, మెసేజీలు, ఫోటోలు..అన్నీ చూసి మావయ్యకి చెప్పిందిలే'
'ఇంతకీ మీ మావయ్య ఏమి చేస్తాడు ప్రసీదా?' అడగకూడదనుకుంటూనే అడిగాను.
క్షణంలో వెయ్యోవంతుకూడా ఆలోచించకుండా ప్రసీద చెప్పింది 'ఆటో డ్రైవర్'
ముందే చెప్పినట్టు ప్రసీద మనసులో ఫిల్టర్లు లేవు. వుండవు. పెట్టుకోదు. నిజం చెబుతుంది. నిజమే చెబుతుంది. ఇది నిజాయితీ కి సూచనా? అమాయకత్వానికా?
ఐతే - మొత్తానికి ప్రసీద గడుసుదే - లేకపోతె వేరేవాళ్ళ ఫోన్ ట్రాప్ చెయ్యటమేమిటీ?
* * *
దాదాపు ఆర్నెల్లు గడిచాయి.
ఈ ఆర్నెలల్లో... మాటల ప్రవాహం కొనసాగుతూనే వుంది. ఆ మాటల్లో కష్టాలు - కన్నీళ్లు, బాధలు - ఆనందాలు, ప్రణాళికలు- ప్రయత్నాలు.. అన్నీ ఒకరిగురించి మరొకరికి తెలుస్తూనే వున్నాయి. కానీ, ఎప్పుడో చూసిన ఆమె రూపం క్రమంగా మసకబారటం మొదలుపెట్టింది. మళ్ళీ తననొక్కసారి చూడాలన్న కోరిక పుట్టింది.
అప్పుడే ఒక ఆలోచన వచ్చింది- దీని పర్యవసానం ఏమిటి? అసలు ఇది ఏ రకమైన బంధం? అన్నా చెల్లలా? గురు శిష్యులా? ప్రేయసీప్రియులా? స్నేహబంధమా? లేక వీటన్నిటికీ అతీతమైనదేమైనానా?
తనని చూడాలనిపించి వెదుక్కుంటూ తలకావేరి బయలుదేరా. రైలు, బస్సు, కారు, ఆటో...
ఇన్నాళ్లూ ఫోన్లోనే... కానీ ఇప్పుడు తనని నిజంగా చూడబోతున్నానన్న ఆనందం. ఇంకొంచం సేపట్లో ఆమె రూపం నా ముందు ఆవిష్కృతమవబోతుంది. ప్రసీద ఎలా ఉంటుంది? అప్పట్లాగే ఉంటుందా? లేక వయసుతెచ్చిన మార్పులవల్ల ఇంకా అందంగా తయారై ఉంటుందా?
ఇన్నాళ్లూ నన్ను కలల్లో తేలియాడించిన.. ప్రసీద!
నా ఊహల్లో రాణియైన.. ప్రసీద!!
దాదాపు సంవత్సరం పాటు ఫోన్లలోనే మనసులు ఆవిష్కృతం చేసుకున్న జంట..
ఒకరికొకరు ఎదురుపడితే.. పడాల్సివస్తే...
ఇంతకీ ఆమె ఎలా ఉంటుందో...
కన్నులు కలువరేకులు, పెదవులు తమలపాకులు, పలుకులు తేనె వాకలు, అరవిందం పొత్తిళ్ళలో హిమబిందువులా ఉంటుందా? అరవింద నయన శరముల సరవింద నయనువు జూప... అన్నట్టుంటుందా? ఏ ఊహ వేసిన బొమ్మవో, ఏ చేయిపూసిన వన్నెవో, అపరంజి కుంకుమ చిన్నెవో, సంజెవో, మబ్బు పింజెవో.. అన్నట్టుంటుందా?
తలచుకుంటేనే గుండె మంగళహారతి ఇస్తుంది. గొంతు కైవార గీతి పాడుతుంది.
తనను చూడగానే ఆమె ఎలా స్పందిస్తుంది? ఆశ్చర్యంగా చూస్తుందా? గోదారిలో కదిలే నావలా.. కదిలే మేఘపు నీడలా.. వసంత మామిడి పూతలా.. బంగారుపూతలా.. మందగమనలా... ఆర్తిగా దగ్గరకొస్తుందా?
అసలింతకీ ఆమె ఏమి చేస్తుంటుంది? సినిమాల్లో చూపించినట్టు.. చిన్నగా కురుస్తున్న వాన చినుకుల్లో .. కుచ్చెళ్ళు ఎత్తిపట్టి.. గజ్జెలు ఘల్లుఘల్లు మంటుంటే..అలవోకగా ఎగిరే చిలుకలా.. పైట నెత్తిన కప్పుకుని..
కన్నులు మిన్నులవ్వగా... మనసు తుళ్ళింతలవుతుంటే మెల్లగా తలుపు తట్టాను.
అటువైపు ఎవరో నడుస్తూన్న చప్పుడు... కాలిఅందెల రవళి దగ్గరవుతున్న సవ్వడి..తలుపు దగ్గరకొచ్చిన శబ్దం
'ఎవరూ' అంటూ తలుపులు తెరుచుకున్న క్షణం.
గుమ్మానికి అటువైపు ప్రసీద ....ఇటువైపు నేను...
అదే - ముగ్ధ మనోహర రూపం!
పచ్చటి పసిడి ఛాయ వొళ్ళు- మీనాల్లాంటి కళ్ళు!!
అదే అద్భుతమైన వర్చస్సు!!
విరులో, మరులో, ఝరులో, సందెవెలుగు కాంతులో, చంద్రార్కపు జిలుగులో, పిల్లతెమ్మెర హోరులో, పాలనురగల తరగలో, కిన్నెరసాని హొయలొ...
పట్టుపావడా కట్టి, పాదాల అంచులచుట్టూ పారాణి పట్టీ!
కాదు.. నైటీ లో .... ప్రసీద!!
* * *
సమాప్తం

మరిన్ని కథలు

Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.