ఎంతచెట్టుకు అంత గాలి - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Enta chettuki anta gaali

కూర్మవరం గ్రామంలో రామనాథం, రంగనాథం అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఇద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. రామనాధం డాక్టర్ అయ్యాడు. భార్యాపిల్లలతో పట్నంలో స్థిరపడ్డాడు.

రంగనాధం నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తూ స్వగ్రామంలో స్థిరపడ్డాడు. సంక్రాంతి పండుగకు రామనాధం కుటుంబంతో స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులు ఇరువురు కలుసుకున్నారు. కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకున్నారు. “ఒరేయ్ రంగనాథం ఇంకా పాత ఇంట్లోనే ఉంటున్నావా?” అని అడిగాడు రామనాథం. “మిత్రమా నీకు తెలియనిదేముంది నాది చిన్న ఉద్యోగం, తక్కువ జీతం. ఒక్కడిని సంపాదిస్తే నలుగురం తినాలి. నువ్వంటే వైద్యుడివి లెక్కలేనంత సంపాదన. నీలా నాకు ఎలా అవుతుంది చెప్పు” అన్నాడు రంగనాథం.

“నువ్వలా అంటే నేనేం చెప్తాను? నా ఖర్చులు, ఇబ్బందులు నాకు ఉంటాయి. నయాపైసా ఖర్చు లేకుండా నువ్వు సైకిల్ మీద ఉద్యోగానికి వెళ్లి వస్తావు. పట్నం వెళ్ళాలి అంటే పల్లెవెలుగు బస్సులో వెళ్తావు. నేను కారు మీద ప్రయాణిస్తే పెట్రోలుకు ఎంత ఖర్చవుతుంది? అవసరం మీద విమాన ప్రయాణం చెయ్యాల్సివస్తుంది, అది కూడా ఖర్చుతో కూడుకున్నదే. నేనుండేది పట్నంలో వేలకు వేలు ఇంటి అద్దె, కరెంటు బిల్లు కట్టాలి. పోనీ ఇల్లు కడదామంటే లోన్ తీసుకోవాలి. కారు కోసం లోన్, ఆరోగ్యానికి ఇన్సూరెన్సులు, ఆదాయం మీద పన్నులు, పిల్లల చదువులకోసం లక్షలు ఇలా ఎంతో డబ్బు వెచ్చించాలి. ప్రతీ ఒక్కటీ ఖర్చుతో కూడుకున్నదే. నా ఉద్యోగంలో ఉండే ఒడిదుడుకులు, ఒత్తిడులు నాకు ఉంటాయి” అని చెప్పాడు రామనాథం.

"హుఁ నిజమే! ఎంత చెట్టుకు అంత గాలని సంపాదన పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి" అన్నాడు రంగనాధం. రామనాధం కూతురు ప్రమీల ఆరేళ్ళది. "నాన్నా! 'ఎంత చెట్టుకు అంత గాలి' అంటే ఏమిటి?" అని అడిగింది. "నేను చెప్తాను రామ్మా" అని రంగనాధం ప్రమీలను బయటకు తీసుకువచ్చాడు. సన్నటి గాలి వీస్తోంది. చిన్న మొక్కలు ఊగుతున్నాయి.

"అటు చూడు, చిన్న మొక్కలు ఊగుతున్నాయి కాబట్టి తక్కువ గాలి వీస్తోంది. అదే పెద్ద చెట్ల కొమ్మలు ఊగితే ఎక్కువ గాలి వీస్తుంది కదా! దీనినే ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అంటారు. ఇది ఒక సామెత. రాబడికి తగిన ఖర్చు ఉంటుందని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడుతున్నారు” అని చెప్పాడు రంగనాధం.

"అవును మామయ్యా!" అంది ప్రమీల. ఇంతలో పెద్ద చెట్ల కొమ్మలు కూడా ఊగి పెద్ద గాలి వీచింది. "అదిగో... అదే... ఎంత చెట్టుకు అంత గాలి... నాకు అర్థమైపోయింది" చప్పట్లు కొట్టింది ప్రమీల. "ఎంత చెట్టుకు అంత గాలి" అనగా, ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే, అతనికి అంతే స్థాయిలో సమస్యలు లేదా ప్రతిఘటనలు ఉంటాయి అనే అర్థం. ఈ సామెతను సాధారణంగా ఓ పెద్ద పదవి, అధిక ప్రతిష్ట కలిగిన వ్యక్తులు ఎదుర్కొనే సవాళ్లను వివరించడానికి వాడతారు.

మరిన్ని కథలు

Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.