అది వరంగల్ కేంద్రకారాగారము.
ఖైదీలంతా క్రమశిక్షణగా తోటపనిలో నిమగ్నమై ఉన్నారు. వరంగల్ జైలు కూరగాయలంటే మార్కెట్లో మంచి గిరాకీ..
“నాగయ్యా నిన్ను పెద్దసారు పిలుస్తాండు” అంటూ పిలిచాడు జైలు కాపలాదారు పోలీసు పోచయ్య.
మొక్కలకు నీళ్ళు పెడుతున్న నాగయ్య నిశ్చేష్టుడయ్యాడు. గుండెల్లో భయం బాణంలా గుచ్చుకొని కంపించి పోయాడు.
“అయ్యా నావల్ల ఏమైనా తప్పు జరిగిందా..?” వణక్కుంటూ అడిగాడు.
“నాకేం తెలుసురా..!” అంటూ గద్దించాడు పోచయ్య.
నాగయ్య చేతిలోని నీళ్ళక్యాను జారి కింద పడింది.
“తొందరగా పోరా.. ఆలస్యమైతే సారు గరమైతడూ..” అంటూ చేతిలోని లాఠీని ఊపుతూ బెదిరించాడు.
బిక్కు, బిక్కు మంటూ నాగయ్య అల్లంత దూరంలో ఉన్న జైలర్ గదికి దారి తీసాడు. వెనుకాల పోచయ్య ముసి. ముసి నవ్వులు పూయిస్తుంటే ఒంట్లో మరింత వణకు పుట్టింది. ‘ఛీ.. ఛీ.. వెధవ బతుకు.. బతుకు పాడుగాను’ అంటూ.. తనలో తాను గొణుక్కున్నాడు. అప్రయత్నంగా కన్నీళ్లు జలపాతాలయ్యాయి. కావాలని చేయక పోయినా మహాఘోరమే జరిగింది.. అని మనసు క్షోభిస్తుంటే.. ఆనాటి సంఘటన కళ్ళ ముందు కదలాడసాగింది.
***
“ఏమయ్యా..! ఆపాడు తాగుడు బందుపెట్టు. ఏదో పండుగలకు, పబ్బాలకు తాగుతానవంటే.. అదో తీరుగ ఉంటది. పిల్లలకు సదిరి చెప్పుకోవచ్చు. కాని ఇదేంది.. నిత్తె తాక్కుంట తందనాలాడుతానవ్. పిల్లల ముందల ఇజ్జత్ పోతాంది. వాడకట్టల తల్కాయె ఎత్తుకోలేక పోతాన” అని కడకొంగుతో కన్నీళ్లు తుడ్చుకుని ముక్కు చీదింది నర్సమ్మ.
“ఇగో.. నర్సీ నీకు చివరాకరి సారిగా చెప్తాన .. నేను ఎవల సొమ్మూ దోసుకొని తాగుత లేను. నారెక్కల కట్టం నేను తాగుతాన. నువ్వేమైనా సంపాయించుకచ్చి ఇత్తానవా?.. పోరగాండ్ల ముందు ఎందుకు చెయ్యి చేసుకోవాలని దంపడ్తాన. లోకంల ఎవలూ తాగుతలేరా.. అందరి పెండ్లాలు నీ లెక్కనే వదురుతాండ్లా..? ఈ ఛడి సూడు.. చమ్డా తీత్తా!” అనుకుంటూ నరసమ్మ ముఖం ముందు గడియారంలోని పెండ్యూలంలా ఊపి తడకకేసి పెద్దశబ్ధం వచ్చేలా కొట్టాడు నాగయ్య.
ఎలాగైనా మందు మాన్పించాలానే ఆలోచనలతో సతమత మవుతున్న నర్సమ్మ.. ఆవేదనలో అప్రయత్నంగా తారాజువ్వలా నాగయ్య మీదకు లంఘించింది.
“నాకు ఎదురు మాట్లాడుడే కాకుండ.. మీదికెల్లి నామీదకే వత్తవా..!” అని.. ఎదురుగా
శివశ్శక్తిలా వస్తున్న నర్సమ్మను తాగినమైకంలో బలాన్నంతా పుంజుకొని గట్టిగా తోసేశాడు నాగయ్య. నర్సమ్మ గోడకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిరి వెల్లికిలా రోలు మీద పడిపోయింది. రుబ్బురాయి తగిలి తల రక్తసిక్తమయ్యింది. బిక్కు, బిక్కుమంటూ దూరంగా నిల్చొని చూస్తున్న పిల్లలిద్దరూ గావు కేకలు పెట్టుకుంటూ.. పరుగెత్తి వెళ్లి నర్సమ్మ మీద వాలిపోయారు.
పిల్లల రోదనలకు వాడలోని జనం సుడిగాలిలా వచ్చారు. అప్పటికే నర్సమ్మ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అనుకోని సంఘటనకు నాగయ్య తాగిన మైకం వదిలి పోయింది.. కాని పోలీసులు వదలలేదు. హత్యానేరం కింద కేసు నమోదు చేసారు. కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
పోలీసులు తమ కర్తవ్యనిర్వహణలో కాస్త కఠినంగా వ్యవహహరిచక తప్పదేమో! గాని.. వారికి హృదయం లేక పోలేదు. నాగయ్య పిల్లలను వాడజనం పట్టించుకోక పోవడం.. బంధులెవరూ లేక పోవడం.. అనాథాశ్రమంలో చేర్పించే యత్నంలో పిల్లల ఆధార కార్డులు కావాల్సి వచ్చింది.
పెద్ద బాబు రమణ వయసు ఆరు సంవత్సరాలే కాని మాటల్లో ఆరింద. ఒకటవ తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఆధార్ కార్డులున్నాయని చెప్పి.. పరుగెత్తుకు వెళ్లి తెచ్చిచ్చాడు. పోలీసులకు పని సులువయ్యింది. అమ్మాయి పేరు రజని నాలుగు సంవత్సరాల వయసు. ఈమధ్యనే బడిలో చేరిందని చెప్పాడు రమణ.
పిల్లలను అదే ఊళ్ళోని అనాథాశ్రమంలో చేర్పించామని.. కొంత డబ్బు సాయం గూడా చేసామని పోలీసులు చెప్పడంతో నాగయ్య మనసు కాస్త నెమ్మదించింది. కాని పిల్లలకు తన ముఖం చూపించే ధైర్యం చాలక.. ఆ ప్రస్తావన జైల్లో తీసుకు వచ్చేవాడు కాదు. తను మనసు చంపుకున్నా.. బిడ్డ రజని మాత్రం తండ్రిని చూడాలనే కోరిక చంపుకోలేక పోయింది. రజని నాన్నను చూస్తానని మారాం చేసేది. రమణ వారించే వాడు. ఆశ్రమ నిర్వాహకుడు మురహరితో మొరపెట్టుకునేది. అతనికి వీలు పడేదికాదు. పైగా ములుగు నుండి వరంగల్ వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అయినా జాలిపడి అప్పుడప్పుడు పిల్లలను జైలుకు తీసుకువెళ్లి నాగయ్యతో మాట్లాడించే వాడు. రజని ఆప్యాయంగా పలుకరించినా రమణ మాత్రం మౌనంగా ఉండే వాడు.
***
“నాగయ్యా.. ఇలా రా” అన్న జైలర్ కార్యాలయం ముందున్న పోలీసు పిలుపుతో.. ఆలోచనల నుండి తేరుకున్నాడు నాగయ్య. బుర్ర గోక్కుంటూ అటూ, ఇటూ చూడసాగాడు.
“నాగయ్యా నీకోసమే సారు సూత్తాండు” అంటూ లోనికి వెళ్ళమన్నాడు జైలు పోలీసు.
నాగయ్య కాళ్ళు వణకుతున్నాయి.. గుండె చిక్కబట్టుకుని జైలర్ కు రెండు చేతులు జోడించి నమస్కరించాడు. జైలర్ చిరునవ్వు నవ్వుతూ.. “నాగయ్యా.. నీ అదృష్టం పండిందయ్యా.. నీ పిల్లల
మొర దేవుడు విన్నట్టున్నాడు” అంటూంటే నాగయ్య బిత్తిరి చూపులు చూడసాగాడు.
“అలా చూస్తావేం నాగయ్యా.. నీ సత్ప్రవర్తన మూలాన విడుదల చేయమంటూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయి. పదునాల్గు సంవత్సరాల జైలుజీవితం గడిపిన వారికే ఈవెసులుబాటు ఉంటుంది” అనగానే నాగయ్య లిప్తకాలం నిశ్చేష్టుడయ్యాడు.. కలా..! నిజమా..!! అన్నట్టు. కడుపులో నుండి తన్నుకు వస్తున్న సంతోషాన్ని అదుపు చేసుకోలేక పోతున్నాడు. జైలర్ గది కాకుంటే ఎగిరి గంతులు వేసే వాడు. ఆతియ్యని మాట వినగానే చటుక్కున వంగి జైలర్ పాదాలకు మొక్కాడు.
“నాగయ్యా.. నీ రెక్కలకష్టం జైలు ఉంచుకోదు. ఇన్నాళ్ళు చేసిన నీ పనికి లెక్కలు కట్టి అణా పైసలతో సహా చెల్లిస్తుంది. రేపు ఉదయమే నీవిడుదల.. డబ్బు తీసుకొని వెళ్ళు” అంటూ లేచి నాగయ్య భుజం తట్టాడు జైలర్. నాగయ్య మరో మారు రెండు చేతులు జోడించి మొక్కి గాలిలో తేలియాడుతూ తన గదికి చేరుకున్నాడు.
***
మరునాడు ఉదయమే జైలు కార్యాలయంలో డబ్బులు తీసుకొని ములుగుకు బయలుదేరాడు.
అనాథాశ్రమానికి వెళ్లేసరికి మిట్టమధ్యాహ్నమయ్యింది. మురహరి ఆఫీసు గదిలోనే ఉన్నాడు. నాగయ్యను చూడగానే ఆశ్చర్యపోయాడు. విషయం తెలుసుకొని చాలా సంతోషించాడు.
“పిల్లలందరితో బాటు కూర్చొని భోంచేద్దాం.. ఆతరువాత మీపిల్లలను తీసుకు వెళ్దురు గాని..” అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు మురహరి. అది భోజనసమయమే.. కాదనలేక పోయాడు నాగయ్య.
పిల్లలు విస్తుపోవాలని.. ఇరువురు కలిసి భోజనశాలకు దారి తీసారు. నాగయ్యను చూడగానే రమణ నిశ్చేష్టుడయ్యాడు. రజని “నాన్నా..!” అని పరుగెత్తుకుంటూ వచ్చి నాగయ్యను నడుం చుట్టేసుకుంది. ఇద్దరి కళ్ళూ చెమర్చాయి. మురహరి రజని భుజాలు తట్టుతూ.. “మీ నాన్న సత్ప్రవర్తన మూలాన జైలు నుండి విడుదల చేసారు. ఇక మీ కష్టాలన్నీ గట్టెక్కాయి. భోజనం చేసాక మీ ఇంటికి వెళ్లండి” అంటూ రమణను గూడా దగ్గరికి రమ్మన్నట్టు చేత్తో సైగ జేశాడు. రమణ మోములో వెలుగు కనబడపోయే సరికి ఇంకా తన నాన్న మీద కోపం పోలేదని మనసులో అనుకుంటూ రమణ వద్దకు వెళ్లి మరో మారు సర్ది చెప్పసాగాడు..“మీ నాన్న పూర్తిగా మారిపోయాడు రమణా.. మంచి ప్రవర్తనతోనే కదా! విడుదల అయ్యింది.. మనుషులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండరు. కొన్ని, కొన్ని అనుభవాలతో మార్పు వస్తుంది”.. ‘మీ నాన్నను క్షమించు’ అన్నట్టు కళ్ళతో చెప్పి నాగయ్య దగ్గరకు తీసుకు వచ్చాడు. నాగయ్య ఏడ్చుకుంటూ రమణను హత్తుకున్నాడు. వాతావరణమంతా దయనీయంగా మారింది.
***
ఇంట్లోకి అడుగుపెట్టిన నాగయ్య ఆశ్చర్యపోయాడు. శిథిలావస్థలో ఉండే ఇంటిని సర్దుకోడానికి తన వద్ద ఉన్న డబ్బులు సరిపోతాయో! లేదో! అని వ్యాకుల పడుకుంటూ వస్తే.. ఇదేమి
చోద్యం? ఇల్లు ఇంత శుభ్రంగా ఉంది..! అని వాపోయాడు.. గమనించిన రజని చిరునవ్వు నవ్వుతూ..
“నాన్నా!.. ఈమధ్య అన్నయ్య , నేను ప్రతీ ఆదివారం వచ్చి ఇల్లు సర్ది పోతున్నాం.. ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదా!”
‘అదేంటి?’ అన్నట్టుగా ప్రశ్నార్ధకంగా చూసాడు నాగయ్య. విషయం సాంతం చెప్పుమన్నట్టు రమణ తల ఊపాడు. రజని కుర్చీలు గుడ్డతో తుడిచి నాగయ్యను కూర్చోమంది. రమణ, తనూ నాగయ్య ప్రక్కనే కూర్చున్నారు.
“మురహరి మేనేజరు మమ్మల్ని ఆశ్రమం నుండి వెళ్ళిపోవాలని అంటున్నాడు భోజనం అంటే ఎలాగో సర్డుతాం గానీ .. చదువుల కోసం ఆశ్రమంలో నిధులు లేవు. ఎవరైనా దాతలు మీచదువుల బాధ్యత తీసుకుంటే అప్పుడు చూద్దాం. అంత వరకు అన్నయ్యను ఏదైనా పని చూసుకుని మీఇంట్లో ఉండండి.. అంటూ కొంత సమయమిచ్చాడు. అన్నయ్య అదే పనిలో ఉన్నాడు. కనీసం డిగ్రీ అయితే ఏదైనా ఉద్యోగం వస్తుంది. కాని ఎవరు చదివిస్తారు?. నేనంటే ఇంటర్ తో ఆపేస్తాను. అన్నయ్యకు వంట చేసి పెడ్తానని నిర్ణయం చేసుకున్నాను. వచ్చే నెలలో ఆశ్రమం నుండి బయటకు రావాలని అనుకుంటున్నాము. ఇంతలో నీరాక మాకు కొండంత బలాన్నిచ్చింది. ఇక మాకేమీ భయంలేదు. నాన్నా..” అంటూ కన్నీళ్ళతో తండ్రి భుజాన్ని తడిపింది.
“నేను ఏపనైనా చేస్తూ.. మిమ్మల్ని చదివిస్తాను. మీరు చదువుకోవడమే నాకు కావాల్సింది” అంటూ రజని తల నిమురుతూ.. రమణ వంక చూసాడు, భరోసా ఇస్తున్నట్టుగా. రమణ తల దించుకునే ఉన్నాడు.
“ఇంట్లోకి బియ్యం, సరుకులు, కూరగాయలు తెస్తాను” అని నాగయ్య లేచి నిలడే సరికి..
“నేనూ వస్తాను నాన్నా..” అన్నాడు రమణ. నాగయ్య మది కాస్త నెమ్మదించింది.
***
ఆసాయంత్రం..స్నేహితులను పలుకరించి వస్తాయని నాగయ్య బయటకు వెళ్ళాడు.
ఇంట్లో పండుగవాతావరణం ఏర్పడే సరికి రజని ఉత్సాహంగా ఆరాత్రి వంట కార్యక్రమంలో నిమగ్నమయ్యింది. రమణ మనసు అసంతృప్తితో ఆవేదన పడుతోంది. ‘అమ్మ దీవెన ఆకాశమంత.. దేవుని దీవెన దీపమంత” అని తాను చదువుకున్న పాఠ్యాంశం పదే, పదే గుర్తుకు వస్తోంది. అమ్మజ్ఞాపకాలలో మునిగిపోయాడు.
“అన్నయ్యా.. వంటలు పూర్తయ్యాయి.. నాన్న రాగానే అందరం కలిసి భోజనంచేద్దాం..” అంటూ హోని చివర చెయ్యి తుడ్చుకుంటూ వచ్చిన రజని పిలుపుతో ఆలోచలనుండి తేరుకున్నాడు రమణ.
ఇంతలో ‘మైకంలో ఉన్నాను మన్నించాలి.. నా మాటలు, చేతలు మన్నించాలి’ అన్నట్టు తూలుతూ వచ్చాడు నాగయ్య.
రమణ, రజని నిర్ఘాంత పోయారు. రమణకు ఆనాటి సంఘటన కళ్ళల్లో మెదిలింది. అది జన్మలో మర్చిపోలేని దుర్ఘటన..
“పాతదోస్తులు కలిసిన సంతోసంలో వాళ్ళను తుర్తి సేయాలని బలవంత పెడితే నాలుగు సుక్కలేసుకున్న” అంటూ పక్కనే ఉన్న కుర్చీలో ఒరిగిపోయాడు.
హతాశురాలయ్యింది రజని. తమ ఇంట్లో నాన్నతో కలిసి అన్నయ్య తను భోంచేద్దా మనుకుంది. కాని నాగయ్య పరిస్థితి చూసి కలవరపడిది. తనే నాలుగు ముద్దలు తినిపిస్తానని కంచంలో అన్నం సాంబారు కలుపుకు వచ్చింది. రమణ ఈసడింపుగా తండ్రి వంక చూడసాగాడు.
రజని చేతిలోని కంచం చూడగానే.. “నేను తినే వచ్చిన బిడ్డా.. మీరు తినుండ్లి” అని లేచి రమణ వంక చూస్తూ.. తన పడక గదిలోకి తప్పటడుగులతో గోడను ఆసరాగా చేసుకొని వెళ్లి పోయాడు.
“నాకూ ఆకలిగాలేదు. నువ్వు తిను రజనీ..” అంటూ రమణ పడుకుంటానన్నట్లు నిష్క్రమించాడు. రజని కంచంలో చెయ్యి కడిగింది. మొదటిరోజు అంతా కలిసి భోజనం చెయ్యలేక పోయామే.. అనే ఆవేదన ఆ రాత్రి కంటినిండా నిద్ర లేకుండా చేసింది.
మరునాడు ఉదయమే నాగయ్యను “జైల్లో గూడా ఇలాగే తాగే వాడివా!..” అంటూ దెప్పి పొడిచాడు రమణ. నాగయ్య మౌనంగా తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకొని బయటికి దారితీసాడు.
“నాన్నా టీ తెచ్చాను” అని రజని అంటున్నా వినిపించుకోలేదు.
“అన్నయ్యా.. నాన్నను ఏమైనా అన్నావా..” అంటూ ఒక కప్పును రమణకు అందించింది.
రమణ మౌనంగా టీ కప్పును తీసుకుని సేవిస్తూ.. “మళ్ళీ మందు కొట్టి వస్తాడేమో!” వ్యంగ్యంగా అన్నాడు రమణ. తమ తల్లి చనిపోయిన రోజు సంఘటన మరోమారు గుర్తు చేసాడు. రజని కన్నీళ్ళ పర్యంతమయ్యింది. గుండె నిబ్బరం చేసుకొని.. వంటగదిలోకి దారి తీసింది.
నాగయ్య ఆరోజు రాలేదు. రజని కంగారు పడుతుంటే సర్ది చెప్బుతూ.. సముదాయించాడు రమణ. నాలుగురోజులైనా నాగయ్య రాకపోయేసరికి రజని, రమణ కలిసి వాడ, వాడలా తిరుగుతూ.. నాగయ్య స్నేహితులతో ఆరాతీసారు. రజని అనాథాశ్రమానికి వెళ్ళారు. మురహరితో మొరపెట్టుకుంది రజని.
“నాన్న వచ్చాడన్న ఆనంద భాష్పాలు ఆరకముందే నాన్న కనబడక పోవడం..” అంటూ కన్నీరు పెట్టుకుంది.
“పోలీసు స్టేషన్లో రిపోర్టు ఇద్దామా!” అడిగాడు మురహరి.
“వద్దు అంకుల్.. నాన్న జైలు నుండి విడుదలై వచ్చాడు కదా! మళ్ళీ ఏమైనా సమస్యలు చుట్టుకుంటాయేమో!” అని సందేహం వ్యక్తపరుస్తూ రమణ వంక చూసింది.. నీఅభిప్రాయమేమిటన్నట్టు. రమణ మౌనమే సమాధానమయ్యింది.
“మరో రెండురోజులు చూద్దాం” తరువాత నిర్ణయం తీసుకుందామన్నట్టు సలహా ఇచ్చాడు మురహరి.
ఆమరునాడు నాగయ్య నుండి ఉత్తరం వచ్చింది. అది చదవగానే రజని బిగ్గరగా ఎదువసాగింది. ఆమెను ఓదార్చడం రమణ వల్ల కావడంలేదు. పక్కింటి వాళ్ళు వచ్చి విషయం తెలుసుకొని సానుభూతి తెలుపుతుంటే.. రజని ఏడుపు తారాస్థాయికి చేరుకుంది. రమణకు వ్యవస్థ మీద ఎనలేని కోపం వచ్చింది.. అయినా ముందు చెల్లాయిని శాంత పర్చాలని.. “రజనీ.. నేను అమ్మా, నాన్న ఇద్దరి బాధ్యతలూ తీసుకుంటాను. నిశ్చింతగా ఉండమ్మా.. రేపటి నుండి నేను ఏదో ఒకపనిలో చేరుతాను” అంటూ భరోసా ఇచ్చాడు.
***
ఆరోజు ఉదయం ఎనిమిది కావస్తోంది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జయసూర్య కాలకృత్యాలు తీర్చుకోగానే దినపత్రిక చదవడం అలవాటు. యథావిధిగా చదవడం పూర్తి కాగానే.. మడతబెట్టి టీపాయ్ మీద పక్కకు పెడుతుంటే ఒక కవరు కనబడింది. బహుశః తన శ్రీమతి పెట్టి వెళ్లి ఉంటుంది.. గమనించనే లేదని మనసులోకి రాగానే పెదవులు విచ్చుకున్నాయి. తనకిలా న్యాయబాధితుల నుండి ఉత్తరాలు రావడం సహజమే. తిరిగి కుర్చీలో కూర్చుంటూ కవరు చించాడు. అందులో రెండు ఉత్తరాలు ఉన్నాయి. ఒక ఉత్తరం మడత మీద “నాన్న నాకు రాసిన ఉత్తరం”.. మరొక ఉత్తరం మడత మీద ‘నేను మీకు చేసుకునే విన్నపం’ అని రాసి ఉంది. ముందుగా అతని నాన్న ఏం రాసాడో చదువుదామని ఉత్తరం మడతలు విప్పాడు.
చిరంజీవి రమణకు ఆశీస్సులు.
నాగ్రహచారం బాగులేదు. మీఅమ్మ నన్ను సంతోషంగా బతుకనివ్వలేదు. తల్లిలేని పిల్లలు కదా! అని ఇన్నాళ్ళకు అనాథాశ్రమం నుండి మిమ్మల్ని తీసుకు వచ్చాను. నాసంతోషానికి మళ్ళీ అడ్డుపడుతున్నారు. నాకు అలాంటి జీవితం వద్దు. నాఇష్టానుసారం బతుకుతాను . మీ బతుకేమో! మీరు బతకండి. ఎలాగూ ఆశ్రమవాళ్ళు తరిమేసే వారేనని మీరే అన్నారు.
రమణా.. కూలి పని చేసినా సరే.. సంపాదించి చెల్లెల్ని ఒక ఇంటిదాన్నిచేయి. నువ్వు కాస్త చెయ్యి తిప్పుకునే దాకా ఆదుకుంటుందాని కొంత డబ్బు బీరువాలో దాచాను. తీసుకొని జాగ్రత్తగా వాడుకో..
నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను. నామనసెరిగిన మనిషి.. నాకు బస్సులో పరిచయమయ్యింది. నా సుఖాలకు అడ్డురాదు. ఉంటాను.
ఇట్లు,
మీనాన్న నాగయ్య.
ఉత్తరం చదివి ఆలోచనలో పడ్డాడు జయసూర్య. ఇందులో న్యాయ, అన్యాయ అంశాల గురించి ఆలోచిస్తూ.. మరో ఉత్తరం తెరిచాడు.
పూజ్యులగు ప్రధాన న్యాయమూర్తి గారికి,
పాదాభివందనాలు.
ఇలా మీకు ఉత్తరం వ్రాయవచ్చునో ! లేదో ! న్యాయవ్యవస్థ తెలియని వాణ్ణి. ఒక నిర్భాగ్యుని విన్నపం ఆలకించాలని ఈఉత్తరం వ్రాస్తున్నాను.
మానాన్న నాకు వ్రాసిన ఉత్తరం చదివారనుకుంటాను. నాన్నకు వ్రాయడం రాదు. తనకు కాబోయే భార్యతో వ్రాయించి ఉంటాడనుకుంటాను. అందులో అసలు విషయంలేదు.
మానాన్న తాగుడుకు బానిస. నాబాల్యంలో నాన్నను తాగవద్దని సంఘంలో మర్యాదలు కాపాడుకోవాలని హితబోధ చేసే అమ్మ మరణానికి కారణమయ్యాడు. యావజ్జీవ కారాగారశిక్ష పడింది.
పదునాల్గు సంవత్సరాల తరువాత ‘సత్ప్రవర్తన’ పేరుతో నాన్నను విడుదల చేసారు. సత్ప్రవర్తన అని ఎలా నిర్ణయం చేసారో! నాకు తెలియడం లేదు. నాలుగు జైలు గోడల మధ్య నలుగురు ఖైదీల మధ్య ప్రవర్తన సరిగ్గా ఉంటే సరిపోతుందా..! నాకు అర్థం కావడం లేదు.
ఇంటికి తిరిగి వచ్చాక గూడా తన ప్రవర్తన మార్చుకోలేదు. వచ్చిన రోజే.. మద్యం సేవించి తూలుతూ ఇంటికి వస్తే చెల్లాయి, నేను బాధపడ్డాం. మరునాడు నేను అడిగితే.. ఇంట్లో నుండి వెళ్లిపోయి మరో వారానికి.. ఇలా ఉత్తరం వ్రాసారు.
ఇది సత్ప్రవర్తన కిందకే వస్తుందా గౌరవనీయ న్యాయమూర్తి గారూ..! మీకు సలహా ఇచ్చే అంతటి వాడిని కాను. కాని నామనసులో ఉన్న మాట చెబుతున్నాను.
ఒక ఖైదీని సత్ప్రవర్త పేరుతో విడుదల చేయాలంటే.. ముందుగా అతన్ని సమాజంలోకి పంపి కొద్ది కాలం గోప్యంగా పరీక్షించాలి. ఆతరువాత శిక్ష విషయంలో న్యాయం చేస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.
మీ మనసు కష్టపెడితే క్షమించండి.. నమస్సులతో..
ఒక నిర్భాగ్యుడు,
రమణ,
కింద చిరునామా ఉంది.
ఉత్తరం చదివి కొయ్యబారిపోయాడు జయసూర్య. తన ముప్పది సంవత్సరాల సర్వీసులో ఇలాంటి ఉత్తరాలు రాలేదు.
నిజమే.. ఖైదీలకు నిర్ణయించే సత్ప్రవర్తన అంశం మళ్ళీ న్యాయస్థానంలో చర్చకు రావాలి.. మార్పులు రావాలి. అది రాజకీయ నాయకుల చేతిల్లోకి పోవడం శోచనీయం.
అన్యాయమైన పిల్లలకు నాచేతనైన సాయం అందిస్తానని మనసులో ధృఢసంకల్పం చేసుకుని.. ఆ దిశగా అడుగులు కదిపాడు జయసూర్య. *