జ్ఞానతత్వం - - బోగా పురుషోత్తం, తుంబూరు.

Gnana tatwam
రామగిరిలో రామయ్య అనే వడ్డీ వ్యాపారి వుండేవాడు. అతనికి డబ్బు అంటే అత్యాశ, ఆ మూలంగా అతను అధిక వడ్డీలకు అప్పు ఇచ్చి మనుషుల్ని జలగల్లా పీడించేవాడు.
అపదలో వున్న వారిపై కూడా కరుణ లేకుండా అధిక వడ్డీలకు డబ్బులు వసూలు చేసేవాడు.
ఓ సారి రంగయ్య అనే నిరుపేద తన వద్దకు వచ్చాడు. ‘‘ సామీ...సామీ..మా భార్య పురుటి నొప్పులతో అల్లాడుతోంది..ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించాలి.సమయానికి లక్ష రూపాయలు అప్పు ఇచ్చి ఆదుకోండి.. ’’ అని వేడుకున్నాడు.
రామయ్య మనసు కరగలేదు.. అతని భార్య దయా హృదయం కలిగి వుండేది. రంగయ్య బాధను గ్రహించింది. ‘ ఏమయ్యా .. మనకు కోట్ల ఆస్తి వుంది..మనకు పిల్లలు లేరు..ఏం చేయగలం? వారసులు లేన ఆస్తి..పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్లగలం? బతికున్నప్పుడే నల్గురికి సాయం చేస్తే పుణ్యం వస్తుంది. ’’ అని హితవు పలికింది.
భార్య మంచి మాటలు రామయ్యకు మింగుడు పడలేదు. ’’ ఎంతో కష్టపడి పైసాపైసా కూడబెట్టి.. రేపు పని చేయలేని కాలంలో మనల్ని ఎవరు చూస్తారు? పరులకు దానం చేస్తే ఎలా?’’ అని నిలదీశాడు.
ఈ మాటలు విన్న రంగయ్య నిరాశతో వెనుదిరిగాడు.
బయటకు వెళ్లి రంగయ్యను పిలిచి తను దాచుకున్న లక్ష రూపాయలను చేతిలో పెట్టి ‘‘ ఇదిగో.. నీ భార్యకు ఆపరేషన్‌ చేయించుకో..’’ అని దయాహృదయంతో ఇచ్చింది రామయ్య భార్య రమణమ్మ.
డబ్బు తీస్కెళ్లి భార్యకు ఆపరేషన్‌ చేయించాడు రంగయ్య. మగబిడ్డ పుట్టాడు. బాగా చదివి డాక్టరు అయ్యాడు. పక్క పట్నంలో మంచి హాస్పిటల్‌ ప్రారంభించి రోగులకు సేవచేయసాగాడు.
రామయ్య అధిక వడ్డీ వసలూ వీడలేదు. కొద్ది రోజులకు తన భార్యకు కడుపులో పెద్ద గడ్డ లేచి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగాడు. నయం కాలేదు. వున్న డబ్బు ఖర్చయి పోసాగింది. రామయ్య మనసులో దిగులు పట్టుకుంది. తనకు డబ్బు ఆశ తగ్గలేదు. తనకు ఇంకా డబ్బు బాగా రావాలని దేవుడిని ప్రార్థించసాగాడు. ఎందరో స్వామీజీల వద్దకు వెళ్లాడు. ఎన్నో వ్రతాలు, పూజలు చేశాడు. అయినా మనసులో శాంతి లభించలేదు. మరో వైపు భార్య అనారోగ్యం బాధించ సాగింది. తన ‘మనసుకు శాంతి లభించే మార్గం ఏమిటీ?’ అని అన్వేషించాడు.
అదే సమయానికి పట్నంలో ప్రవీణ్‌ వైద్యశాల వుందని అక్కడికి వెళితే జబ్బు నయమవుతుందని తెలుసుకుని తన భార్యను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ రంగయ్య కన్పించి రమణమ్మ జబ్బు గురించి తెలుసుకుని బాధపడ్డాడు. ప్రవీణ్‌ తన కొడకే అని చెప్పి ఉచితంగా మంచి వైద్యం అందించాడు. కొద్ది రోజుల్లోనే కోలుకుంది.
భార్య ఆరోగ్యం బాగుపడటంతో రామయ్యకు కొంత మనశ్శాంతి లభించింది. తన భార్య దయా హృదయం వల్ల సాయం అందిందని గ్రహించాడు. భగవంతుడిని కోరుకోవడం వల్ల శాంతి రాదని సేవ, దయ, మానవత్వ గుణాల వల్లే శాంతి, ఆనందం లభిస్తాయని గ్రహించాడు. అనాటి నుండి అధిక వడ్డీలు వసూలు చేయడం మానివేశాడు. పేదలకు సాయం చేస్తూ నలుగురిని ఆదుకుంటూ ఆనంద జీవనం గడిపాడు జ్ఞాన తత్వం బోధపడిన రామయ్య.

మరిన్ని కథలు

The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ