'మరో భారతానికి పునాది' - మద్దూరి నరసింహమూర్తి,

Maro bharataniki punadi

"రంగీ, నేనోపాలి బాబాయ్య కాడికి పోయి వస్తాను. కబురెట్టేడు రమ్మని"

“సరే, బేగొచ్చీ"

అరగంట తరువాత వచ్చిన రంగడితో -- "ఎందుకు కబురెట్టేడు బాబాయి"

"రేపు సందేళ గుడికి ఆయనతో సాయంగా రమ్మని సెప్పేడు. గుడిలో పంతులుగారు భారతం మీద నాలుగు మాటలు సెప్తారట, బాబాయి ఇనడానికి ఎల్తాడు"

"రేపు సందేళ మాట ఇప్పుడే సెప్పాలా"

"నేనేదేనా పని ఎత్తుకుంటానేమో, ముందుగా సెప్తే మంచిదని ఇప్పుడే సెప్పేడు బాబాయి"

"సరిలే, నేను నీళ్ళాడి ఒస్తాను బువ్వ తినేద్దాం"

"నీ పక్కన నేను లేకుండా నువ్వు నీళ్ళాడతావేలాగే"

"ఆ నీళ్ళాడ్డం కాదు బావా, స్నానం సేసి ఒస్తాను"

"పద, నేనూ ఒస్తాను, ఇద్దరం ఒకే తూరి స్నానం సేసేస్తే పోలే"

"నువ్వక్కడ బుద్ధిగా ఉండవు, అందుకే నేను నువ్వు ఏరు ఏరుగానే సెయ్యాలి స్నానం" అని నవ్వుతూ ఎల్తున్నరంగిని సూస్తూ –

"నీపని రేత్రికి సెప్తానుండు, వడ్డీతో కలిపి ఒసూలు సేయకపోతే నేను నీ బావనే కాను" అన్న రంగడికి ఓ నమస్కారం సేసి రంగి నవ్వుకుంటూ స్నానం సేసేందుకు ఎల్లింది.

ఇద్దరూ బువ్వ తినేసి టీవీ ముందు కూర్చున్నారు.

రంగడు తాను తెచ్చిన కొత్త పట్టీలు తీసి –

"టీవీ సూడ్డానికి ఇంకా సానా టైముండాది. నీ కాల్లు సాపు ఈ కొత్తపట్టీలు తగిలిస్తాను"

"నువ్వు కొత్తపట్టీలు తగిలిస్తానంటే కాల్లు సాపకుండా ఉంటానా" అంటూ తన పాదాలు బావకు ఇచ్చింది రంగి.

కొంతసేపటి తరువాత --

"ఏయ్ రంగీ, కదలక తిన్నగా కూకోలేవా"

"నేనేటి సేసేది బావా, నీ సెయ్యి తగిలితే నాకేటో అయిపోతాంటే, నేనెట్లా కుదురుగా కూకొనేది"

"మరైతే, నీ కాలికి పట్టీలు ఎట్టా తొడిగేది"

"సర్లే, నువ్వు నా కాలు ముట్టీ ముట్టనట్టు పట్టుకో"

"అలాగే, ముందు కదలక కూకో"

కాలికున్న కొత్త ఎండిపట్టీలు సూసి మురిసిపోయిన రంగి ఒక్క ఊపున కిందకు దూకి, బావని వాటేసుకొని "ఈ ఎండిపట్టీలు నీలాగే దగాదగా మెరిసిపోతున్నాయి బావా" అని రంగడి పెదాలమీద ముద్దెట్టింది.

"ఇదేటే రంగీ, నీ కాళ్ళకి రెండు పట్టీలెడితే, నాకు రెండు ముద్దులెట్టకుండా ఒక్కటే ఎట్టేవు"

"ఒకటి బాకీ రాసుకో, ముందు టీవీ సూద్దాం కాసేపు, చిన్న ఎన్టీఓడి సినెమా ఒస్తాదట"

"ఇయ్యేల అందగత్తెల పోటీ రేత్రి 9 గంటలకి సురూ సేసి రెండు గంటలు పైనే సూపిస్తారట. అది సూద్దాం”

"ఆ ఆడాల్ల అందాలు సూసిన నీకంటికి నేను ఆంతనా బావా"

"ఆల్లంతా పెద్దోళ్ళు బాగా డబ్బుతో బలిసినోల్లు. బోలెడంత డబ్బు కర్సెట్టి అందంగా తయ్యారవుతారట. ఆ నకిలీ అందగత్తెలతో నీకు పోలికేందుకే. నీది పెకుర్తి అందమే. దేవలోకంలో ఉండే రంబకైనా నీతో పోలికుందేటి. ఇందురోడు పిలిసి ఎవడి దగ్గరకెళ్ళి తొంగో అంటే ఎల్లాలసిందేనట. మరి నువ్వో పతిరొతవి. నాకు నీ తొరాతే ఏ అందగత్తేనా రంబేనా"

"అవునూ బావా, అందగత్తెల పోటీ అంటే ఒకల్లతో ఒకల్లు కుస్తీ పడతారా ఏటి"

"కుస్తీ పోటీ కాదే. ఆల్లందరిలోకీ ఓరు అందంగా ఉంటారో అన్న పోటీ అట" – అంటూ కాళ్లు రెండూ బారసాపి రంగిని మధ్యలో కూర్చోపెట్టుకొని, వెనకనుంచి వాటేసుకొన్న రంగడు రంగితో కలిసి -- టీవీ చూడసాగేడు.

ఒక్కొక్క అమ్మాయి హొయలుగా నడచుకుంటూ వచ్చి మూడు నాలుగు విధాలుగా అంగాంగ ప్రదర్శనతో కూడిన తన అందాన్ని సూపిస్తూంటే వీక్షకులు చప్పట్లతో ప్రోత్సాహిస్తున్నారు.

ఆ అమ్మాయి వెళ్లిన తరువాత న్యాయనిర్ణేతలు వారి నిర్ణయం కాగితం మీద వ్రాయడం అయిన తరువాత మరొక అమ్మాయి వచ్చి అలాగే తన అందాన్ని ప్రదర్శిస్తూంది.

"బావా, ఈల్లలో ఒక్క ఆడకూతురు కూడా ఒంటినిండా సీరే జాకెట్టు కట్టుకోకుండా ఉంటాదేటి"

"పెద్ద పెద్ద ఊళ్లలో గొప్ప గొప్పోళ్ళు డబ్బున్నోళ్ళు అలాగే ఉంటారేమోనే"

"అంతేకాదు, అలా నడుస్తున్న ఆడోళ్లలో –

ఒకర్తి - కట్టుకున్న గుడ్డని మొలనించి సింపేసి, ఆ రెండు గుడ్డ ముక్కలతో ఏమాత్రమూ సిగ్గన్నదే

లేకుండా నడుస్తాది.

ఇంకోర్తి - పదిగజాల గుడ్డ ఒంటి చుట్టూ ఉన్నా, సిగ్గన్నదే లేకుండా ఒల్లంతా సూపిస్తూ ఎనక్కి

ముందుకు ఆగుడ్డతో ఇల్లు ఊడిసినట్టు నడుస్తాది.

మరొకర్తేమో - మొలకి సిన్న గుడ్డముక్క సుట్టుకొని, సగంపైన గుండెలు కనిపిస్తున్న సిన్న

గుడ్డముక్క ఛాతీమీద సుట్టుకొని నడుస్తాది.

కట్టుకుందికి గుడ్డముక్కలు లేనట్టు నలుగురిలో అలా నడవడానికి ఈల్లకు సిగ్గు లజ్జ ఉండవా. సుట్టూ

కూసోని సూసే ఓళ్ళు సిగ్గులేకుండా సప్పట్లు కొడతా ఉన్నారు కూడా”

"ఆల్లెలా ఉంటే మనకేటే రంగీ"

“ఆడది దాని ఒంటి అందం కట్టుకున్నోడికి బట్ట ఇప్పి సూపినా తప్పు లేదు కానీ, ఇలా అందరికీ సూపిస్తారేటి ఈల్లు. ఛీ ఈల్లు మల్లా అందగత్తెలూ, ఆళ్ళకి పోటీ ఒకటి, ఛీ" –

--అంటూ వెళ్లి టీవీ కట్టేసిన రంగి –

“టీవిలో మల్లా ఇలాటివి సూస్తానంటే టీవీ ఇరగ్గొడతాను జాగర్త"

"అలాగేలే మరెప్పుడూ సూడొద్దు. దా తొంగుందాం"

"టీవిలో ఆడంగుల సిగ్గులేని నడకలు సూసి సూసి, నాకు ఈరోజు మనసైతాలేదు, నువ్వలా తొంగో, నేనిలా ఏరుగా తొంగుంటాను"

"వాళ్ళేదో సేస్తే, మనకెందుకు సిచ్చ"

"సెప్పేనుకదా, నాకు మనసైతాలేదని. సల్లగా తొంగో"

మరి చేసేదేమీ లేక రంగడు కాళ్లు రెండూ ముడుసుకొని పడుకుంటే, రంగి వేరుగా అటు తిరిగి పడుకుంది.

మరునాడు రాత్రి --

"ఏటి బావా నీ పక్కలోకి నేనొచ్చి సానా సేపైనా సిన్న సరసం లేదూ. అయినా, నిన్నటి నా యవ్వారం మీద కోపం ఇంకా పోలేదా ఏటి. 'నిన్నరేత్రి నా సేత తప్పైపోనాది, సెమించు' అని పొద్దున్నే నీతో సెప్పేను కదా"

"నీ మీద నాకు కోపమెందుకే. నేను ఏరే ఆలోసిస్తున్నా. నే సెప్పేది మనసెట్టి ఇనుకో"

"సెప్పు మరి" అంటూ రంగడి మీద సేయి ఏసి ఇటు తిప్పుకుంది రంగి"

"ఈరోజు పక్కింటి బాబాయితో గుడికి ఎల్లేను కదా. గుడిలో పంతులుగారు మైకులో సెప్తూంటే, బాబాయి పక్కనే నేను కూడా కూసోని ఇన్నాను"

"ఆ పంతులుగారు ఏటి సెప్పేరు"

"పెక్కుతిలో కలిసిపోయి సరసమాడుకుంటే బాగా తెలివున్న పిల్లలు పుడతారట" అంటూ రంగడు రంగిని తన గుండెకి అదుముకున్నాడు.

"సరసం తరాత, ముంది పెక్కుతిలో కలిసిపోడమంటే ఏటో సెప్పు. ఇనడానికి గమ్మత్తుగా ఉంది"

"ఇనడానికే కాదే నా బంగారం, అనుబయించడానికి కూడా మా సెడ్డ గమ్మత్తుగానే ఉంటాది అనిపిస్తోంది"

"అసలు పంతులుగారు ఏటి సెప్పేరో ఇవరంగా సెప్పు"

"అప్పుడెప్పుడో ఓ ముని మజ్జేనం ఏల ఏరు దాటడానికి ఓ నావ ఎక్కేరట. ఆ నావ నీలాటి అమ్మి నడుపుతోందట. ఆ అమ్మి మీద ఆ మునికి మనసై ‘నీతో సరసమాడతాను’ అన్నాడట. అప్పుడు ఆ అమ్మి అందట --’ నా అబ్బ సేపలు అమ్మే రాజు, నా ఒంటినించి సేపల ఓసన ఒస్తోంది, అంతేకాక, ఈ మజ్జేనం ఏల సరసమేంటి ఎవరేనా సూస్తారు కదా’ -- అన్నాదట"

"మరి ఆ మునేటి అన్నాడట"

"నీ ఒంటినించి సేపల ఓసన పోయి ఎప్పుడూ చందనం ఓసన ఒచ్చేటట్టు సేసేస్తాను, మనం ఓరికీ కనపడకుండా మబ్బులడ్డు ఒచ్చేటట్టు సేసేస్తాను. ఈ నావ కిందన ఏరు, పైన ఎలుతురూ, గాలి, ఆకాశం, ఈ పక్క ఆ పక్క పెద్ద పెద్ద సెట్లతో నిండిన భూమి ఉన్నాయి. ఇలాటి పెకుర్తిలో కలిసిపోయి మనం సరసమాడితే నీకు బాగా తెలివున్న పిల్లాడు పుడతాడు అన్న ముని ఆ అమ్మిని మరేమీ మాటాడనివ్వక – ఆ అమ్మితో సరసమాడేడట"

"మీ మగాళ్లంతా ఇంతే బావా నాజూకైన ఆడది కనిపిస్తే సాలు మాయమాటలు సెప్పి బురిడీ కొట్టి ఎలాగేనా సరసమాడేస్తారు"

"నీ గోల ఆపి ముందు కత ఇనుకో”

"సెప్పు"

“ఆ ముని అలా సరసమాడితే ఆ అమ్మికి పుట్టినోరే యాసులోరట"

"ఈ పేరేడనో ఇన్నట్టుంది బావా"

"ఆరేనే భారతం రాసినోరు"

"ఆ గురుతొచ్చింది బావా"

"సూసేవా ఆ అమ్మి ముని పెకుర్తిలో కలిసిపోయి సరసమాడితే ఎలాటోరు పుట్టేరో. రంగీ మనం కూడా అలా సరసమాడుకుందామే ఏటంటావు"

"నువ్వు సెపుతూంటే నాకు కూడా కోరికగా ఉంది బావా. కానీ, ఈ పల్లెటూరిలో మనకలాటి సులువేదీ"

"నేను అదే ఆలోసిస్తున్నాను”

"బావా మనం మన పొలంలో మంచె ఎక్కేస్తే, మనం కూడా పెక్కుతిలో కలిసిపోయి సరసమాడుకొచ్చు కదా"

"భలే గుర్తు సేసేవే బంగారం"

"కానీ బావా మనం ఆ మునిలాగా మబ్బులడ్డంగా ఎట్టలేము, అక్కడ సుట్టూ ఉన్నోళ్లు మనల్నేసూస్తారు”

"ఓ పని సేద్దాం రంగీ. ఇప్పుడు పొలాల్లో పంటలేవీ లేవు, కాపలాకి పండుకొనే జనం ఎవరూ ఉండరు. మనల్ని ఎవరేనా సూస్తారన్న భయం ఏమీ లేదు. రెండు రోజులు పొతే పున్నమి కదా. రేత్రి అంతా సెంద్రుడు

ఎలుతురు నిండి ఉంటాది. మంచె కింద భూమి ఉండాది. గాలి ఎలాగా ఉంటాది. సెంద్రుడు ఉండేదే ఆకాశంలో. మనం ఎంచక్కా మన పొలంలో మంచె ఎక్కేద్దాం"

"మరి అక్కడ ఏరు లేదే"

"పిచ్చి రంగీ, మన పొలం కాలువ పక్కనే ఉంది కదే. ఆ కాలవ నిండా నీరుంది కదా"

"అంటే, మనం కూడా పెకుర్తిలో కలిసిపోయి సరసమాడుకోచ్చన్నమాట"

"అంతే మరి"

"మనకి కూడా యాసులోరులాంటి బుడ్డడు పుడతాడంటావా"

"ఎందుకు పుట్టడు? పుట్టి భారతం కూడా రాస్తాడు సూస్తూండు"

రెండు రోజుల తరువాత --

రంగీ రంగడు మనసు పడ్డ పున్నిమ రేత్రి, త్వరగా బువ్వ తినేసి, తుండుగుడ్డలు మరో జత బట్టలు దుప్పటీ పట్టుకొని ఎవ్వరి కంటా పడకుండా పొలం చేరుకున్నారు.

ముందుగా ఇద్దరూ కాలవలోకి దిగి సరిగంగ స్నానాలు సేసి, మనసుని తనువుని నెగడుతో నింపేరు.

సానాసేపు అలా ఆడుకొని గట్టు మీద చేరిన జంట తుండుగుడ్డలతో ఒకరి మేను మరొకరు తుడుస్తూ అప్పటికే నింపిన నెగడు ఆరకుండా ఎగదోసేరు.

కాలవలోకి దిగినప్పుడు విడిచిన బట్టలు పిండి ఆరేసి, తెచ్చుకున్న మరో జత బట్టలు మార్సుకొని, రంగడు ముందుగా మంచె ఎక్కి రంగికి చేయి అందించి మంచెమీదకు లాగేడు.

పున్నమి చంద్రుడు నింగి నేల అంతా వెన్నెల తివాసీ పరిచి పడుచు జంటల గుండెల్లో వేడి నింపుతున్నాడు.

మంచె కింద పొలం, మంచె మీదన ఆకాశం, ఆకాశంలో పుచ్చపువ్వు లాంటి వెలుతురుతో మత్తుగా వెన్నెల కురిపిస్తూ నెలరేడు, మంచె పక్కనే ఉన్న కాలువలో నిండిన నీటి మీంచి వస్తున్న చల్లని గాలి –

ఇలా ప్రకృతి నడుమ మంచె మీద పడచు జంట -- రంగడు, రంగి –

ఈ విశాల విశ్వమంతా వారిద్దరే ఉన్నట్టు, వారికి కూడా వ్యాసులవారిలాంటి అబ్బాయి పుడతాడన్న నమ్మకంతో –

ప్రకృతి నడుమ హుషారుగా సాగుతున్న వారి సరససల్లాపాల మధ్యన కురిసే వెన్నెల, వీచే గాలి, క్షణంలో ఆవిరైపోతున్నాయి.

మరిన్ని కథలు

Juvvi
జువ్వి!
- అంతర్వాహిని
Kanchana prabha
కాంచన ప్రభ
- కందర్ప మూర్తి
Bhooloka vasula swargaloka aavasamu
భూలోకవాసుల స్వర్గలోక ఆవాసము
- మద్దూరి నరసింహమూర్తి
Deshabhakthi
దేశభక్తి
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Aapanna hastam
ఆపన్న హస్తం
- కందర్ప మూర్తి