భూలోకవాసుల స్వర్గలోక ఆవాసము - మద్దూరి నరసింహమూర్తి

Bhooloka vasula swargaloka aavasamu

“ప్రభూ ఇతడు అనుమతి లేకుండా మన లోకానికి రావడమే కాక, ఏవో పరికరాలు కూడా పట్టుకొని అటూ ఇటూ చూస్తూ తిరుగుతూంటే గమనించి పట్టుకొని వచ్చేము” అని ఒక వ్యక్తిని చెరో వైపు పట్టుకొని సభలో ప్రవేశపెట్టిన భటులను చూసి – “మంచి పని చేసేరు, మీరు ఇక వెళ్లవచ్చు”

“ఓయీ ఎవరవీవు? మా లోకమునకు ఏల వచ్చితివి?”

“మహేంద్రులవారికి శుభాభివందనములు. ఒక సత్వర కార్య నిర్వహణలో మీకొక విన్నపము చేయవలెనని మా గురువులు పనుపున వచ్చిన నేనొక మానవుడను. భూలోకములోని భారతదేశవాసిని. ఆ కార్య నిర్వహణలో భాగముగా మీ సముఖమునకు ఎటుల పోవలెనని నలుదిక్కులా పర్యవేక్షిస్తూ తిరగుతున్న నన్ను పట్టుకొని, నా మాటలు వినిపించుకోకుండా, మీ భటులు నేనేదో నేరం చేసినట్టు ప్రవేశపెట్టడంతో మీ దర్శన భాగ్యం సునాయాసంగా కలిగింది. సంతోషం”

“నీవు ఇచ్చటకు వచ్చి మాకు చేయదలచిన విన్నపమేమి”

“అతిథిని ఇలా నిలబెట్టి మాట్లాడించడం సహస్రాక్షులైన మీకు శోభస్కరంగా లేదు”

“మమ్ము మహేంద్రులుగా గుర్తించిన చాలును, సహస్రాక్షునిగా సంబోధించ పని లేదు. ఇగో ఈ ఆసనం గ్రహించి అన్ని వివరములు ప్రశాంతముగా విశదీకరించుము”

“మండుటెండలో తిరుగుటచే గొంతుక ఎండి పోయినది ప్రభూ. మీకు అభ్యంతరం లేకపోతే, కొబ్బరి బొండం ఒకటి కొట్టించి ఆ తాజా నీరు ఇప్పించండి”

“అనగా సలిల నారికేళ పానీయమనియే కదా నీ భావము”

“అవును”

“అవశ్యం ఇప్పించెదము”

సలిల నారికేళ పానీయము మానవుడు గ్రహించిన పిదప –

“మా భూలోకవాసులు మీ లోకములో నివసించుటకై తగిన వసతి సదుపాయముల వివరములు తెలుసుకొని రమ్మని మా గురువులు నిర్దేశించగా నేను ఇక్కడికి వచ్చితిని. మీరు అనుమతించిన, మీ లోకమున పరిభ్రమించి ఆ సమాచారము గ్రహించి నేను తిరుగు ప్రయాణమవగలను”

“ఎంతో పుణ్యం చేసుకున్న మానవులు మాత్రమే మరణించిన తదుపరి మా లోకమునకు రాగలరు. అందుకు విరుద్ధముగా నీవు బొందితోనే స్వర్గలోకప్రవేశము చేయుట మాకు కడు వింతగానూ ఆశ్చర్యముగనూ ఉన్నది. నీవు ఇక్కడికి ఎటుల రాగలిగినాడవు”

“మేము ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళేందుకు అతి శీఘ్రముగా నడిచే ‘రాకెట్’ అన్న వాహనములో ప్రయాణం చేస్తూ ఉంటాము. ఆ సాధనముతోనే నేను ఇక్కడికి రాగలిగితిని”

“బాగు బాగు, మీ మానవులు కడు సమర్ధులైతిరని తెలిసి చాలా సంతసించితిమి. మీ మానవులకు ఇక్కడ నివాస ఆవశ్యకమెందులకు”

“మీ బహుముఖ పాలనా ఆధ్వర్యాన మీ లోకవాసులు పాటించే కుటుంబ నియంత్రణ రహస్యం ఏమో కానీ, కొన్ని యుగాలుగా మీ జనసంఖ్య 33 కోట్లతో ఆగిపోయింది. అందుకు భిన్నముగా, మా దేశ జనసంఖ్య పెరిగి పెరిగి ఇప్పుడు 140 కోట్లకు చేరుకుంది, ఇంకా పెరుగుతుంది కూడా. అందువలన మా జనానికి ఆవాసం ఒక క్లిష్ట సమస్యగా పరిణమించింది. ఆ సమస్య నివారణకై మాలో కొందరు చంద్రగ్రహానికి మరి కొందరు కుజగ్రహానికి వెళ్ళి అక్కడ జనావాసానికి ఉన్న సదుపాయాలు సంగ్రహిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే నన్ను ఇక్కడికి పంపినారు”

“మీ జనావాసానికి మా లోకంలో స్థలం ఇచ్చిన మాకు ఏమి లాభము”

“మాకు అవసర సమయంలో సహాయం చేసేరన్న కీర్తి మీ దివ్య చరితలో కలికితురాయిలా నిలిచిపోతుంది. కాబట్టి మీరు మా వినతిని ఆమోదించి మాకు కొంత స్థలం ఇచ్చినచో మేము ఆవాస సదుపాయాలు ఏర్పరచుకుంటాము”

“స్వర్గం అంటే అప్సరసల నాట్యానికి పెట్టింది పేరు అని నేను వేరుగా చెప్పనక్కరలేదు. మీ మానవులు ఇక్కడ ఆవాసాలు ఏర్పరచుకుంటే, మా అప్సరసల నాట్యం చూసేందుకు ఎగబడి నానా రభసా చేస్తారేమో”

“మీ అప్సరసలు అంటే రంభ, ఊర్వశి, మేనక మరియు తిలోత్తమలే కదా”

“అవును, వారు నలుగురూ ఎంత అందగత్తెలో అంతకు మించిన నాట్యశిరోమణులు”

“తమరు కరుణావేశమున వారినొకసారి నేను చూడవచ్చా”

“చూడడమేమిటి, నీవు మా అతిథివి కనుక వారి నాట్యవిలాసాలే తిలకిద్దువుగాని” అని –

ఆ నలుగురు అప్సరసల నాట్యం మానవుడు వీక్షించే ఏర్పాటు చేసేరు మహేంద్రులవారు.

రంభ, ఊర్వశి, మేనక మరియు తిలోత్తమ నలుగురూ నృత్యం చేసి నిష్క్రమించేరు.

“ఏమి మానవా, మా అప్సరసాంగణుల అందము వారి నాట్య విలాసములు ఎటులున్నవి”

“క్షమించాలి, వారి అందం అంతంత మాత్రమే. పైగా, వారి నాట్యము నాకు ఎంత మాత్రమూ ఉత్సాహం కలిగించలేదు. ఇన్ని ఏళ్ళుగా మీరు వారి నాట్యం ఎలా భరిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు”

“మునులు సైతం మోహించి కామించే మా అప్సరసల అందం వారి నాట్యవిన్యాసములు నీకు నచ్చలేదా. ఆశ్చర్యముగా ఉన్నది. నీ మాటలు మమ్ము కించపరచుచున్నవి”

“మిమ్మల్ని కించపరిచే ఉద్దేశము నాకు ఎంతమాత్రమూ లేదు ప్రభూ. నిజము నిష్టూరముగానే ఉండునన్నది మీరెరుగని ఆర్యోక్తి కాదు”

“ఏమా నిజము”

“మా భూలోకమందలి నాట్యమణుల విన్యాసములు వారి అందచందాలు చూసినచో మీరు నా అభిప్రాయంతో తప్పక ఏకీభవించెదరని నా విశ్వాసము”

“అంతటి గొప్ప అందగత్తెలు నాట్యమయూరులా మీ భూలోకవాసులు”

“మీ దగ్గర ఉన్నది ఈ నలుగురు అప్సరసలే. మా దగ్గరైతే లెక్కలేనంతమంది నాట్యకత్తెలున్నారు. ఉదాహరణకు – జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం, ఎల్.విజయలక్ష్మి, హెలెన్, బిందు, పద్మాఖన్నా. ఇంకనూ ప్రత్యేక నృత్యం పేరిట రసికశిఖామణుల వలె నాట్య విన్యాసాలు చేసే చిత్రసీమ కథానాయికలు”

“మీ భూలోకంలో ఇంతమంది నాట్యమణులుండుట అతి శ్లాఘనీయం. వారి నృత్యం అందం మా అప్సరసల నృత్యం అందం కంటే గొప్పగా ఉండునని మేము నమ్మేదెలా”

“ఇప్పుడే మీకు మచ్చుకు ఒకరి నాట్యం చూపించమందురా”

“అనగా, ఆమెను ఇచ్చటకు పిలిపించెదవా ఏమి”

“అవసరం లేదు”

“మరి ఎటుల”

వెంటనే, ఆ మానవుడు తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ లో యు ట్యూబు చానెల్ తెరిచి ‘లే లే నా రాజా’ అన్న పాట చూపించేడు.

“నీవు వచించినటులే ఆ నర్తకి అందము ఆమె సలిపిన నృత్యం మా అప్సరసల అందమే కాక నృత్యం కంటే కూడా బహు గొప్పగా ఉన్నది. మాచే ఇంతటి మంచి నృత్యం వీక్షింపచేసిన నీకు ధన్యవాదములు. నిన్ను మా ఘనిష్ట మితృనిగా గ్రహించినారము”

“నేనెంతో అదృష్టవంతుడిని ప్రభూ”

“మా సమక్షమున లేని నర్తకీమణి చేస్తున్న నాట్యం మేము వీక్షించుటయా! అహో, మీ మానవులు ఎంతగా పురోగమించితిరి! ఆమె నాట్యము బహు మనోహరముగానూ ఉండి మాకు నయనానందము కావించినది. సత్యము వచింపవలెనన్న, ఆ పాటతో ఆ నాట్య విన్యాసముతో ఆమె మమ్మల్నే తట్టి లేపుతున్న అనుభూతి కలిగినది”

“ఆమె అందమెటులున్నది ప్రభూ”

“ఏమని వర్ణింతును ఆమె అందచందాలు. అహో ఏమి ఆమె శరీర సౌష్టము, జఘన సౌందర్యము, మహోన్నత వక్ష సంపద, మేని విరుపులు, శృంగార విన్యాసములు. ఎటువంటి వానిలోనైననూ నిదురపోవు కామ నాడులను కోర్కెలను తక్షణమే మేల్కొలిపి, మనసంతా రసికత నింపుతూ, తక్షణ ప్రియ సమాగము కాంక్షింప చేసే ఆమె అందచందాలు ఆమె నాట్య విన్యాసములు ప్రత్యక్షముగా కనులవిందుగా కానని ఈ ఇంద్ర పదవి వ్యర్ధము”

“మీరు ఆనతిచ్చిన మా నర్తకీ సముదాయమును మీ ముందర నిలబెట్టుటకు నేను సిద్ధము ప్రభూ. కానీ, ఒక సత్యము మీతో చెప్పక తప్పదు”

“ఏమా సత్యము”

“మేము జరా బాధలు తప్పని మానవులము కదా. మీ దివ్య ఆశీస్సులతో మా నాట్యరాణులకు పూర్వ యవ్వనము ప్రసాదించిన, మీరు వారి నాట్యమును చక్కగా తిలకించి మిక్కిలి సంతోషించగలరు”

“అదొక సమస్యయే కాదు, మా ఆనందమునకై వారికి ఆ అనుగ్రహము తక్షణమే ప్రసాదించితిమి. నీవు సత్వరమే మీ లోకమునకు పోయి వారిని మా అతిథులుగా సకల మర్యాదలతో కొని రమ్ము”

“మా నాట్యకత్తెల తరఫున నేను మీకు ధన్యవాదములు సమర్పించుకొనుచున్నాను. వారిని త్వరలో మీముందర ప్రవేశపెట్టే ప్రయత్నం చేసేదను. పనిలో పని, నేను కోరినట్టు మా మానవులు ఆవాసము ఏర్పరచుకొనుటకు మీ లోకంలో స్థలం ఇచ్చునటుల మీ అంగీకార పత్రము ప్రసాదించమని నా విన్నపం”

ఎంతటి వారలైనా కాంత దాసులే కనుక – అప్పటికే చలించిన మనము కలవారైన మహేంద్రులు ---

“మా అంగీకార ముద్ర నిర్దేశించిన శూన్య పత్రము ఒకటి నీకు ప్రదానము చేసేదను. నీవు మా లోకమున విహరించి, మీకు అవసరమైనంత స్థలము గుర్తించి, మీకు కావలసిన విధముగా ఆ శూన్య పత్రమున మా ప్రమాణములను లిఖియించి, నీతో కొనిపొమ్ము. అతి శీఘ్రముగా మీ భూలోకవాసుల నర్తకీమణులను మా సమక్షమున ప్రవేశపెట్టుట మాత్రము మరువక మసులుకొమ్ము. నీవు చూపిన నృత్య విలాసము వీక్షించిన మాకు, సత్వరమే మా దేవేరితో సరసములాడవలెనన్న బలీయమైన కోరికతో ఆమె సముఖమునకు ఇదే పోవుచున్నాము. నీవు పోయి శీఘ్రముగా రమ్ము. ఇష్ట కామ్యార్ధ సిద్ధిరస్తు, కళ్యాణమస్తు”

తన మీద చిలకరింపబడ్డ నీళ్ళతో తెలివొచ్చి –

“ఏంటమ్మా, కలలో దేవేంద్రుడితో ముఖ్య విషయాలు చర్చిస్తూంటే, కొంపలు మునిగిపోయేటట్టు మధ్యలో లేపేసేవు” అని చిరాకు పడుతున్న కుమార్ తో –

“త్వరగా లేద్దాం ఏదో ఉద్యోగం చూసుకుందాం అని లేదు. ఎంతసేపూ తిని మంచానికి అడ్డంగా తొంగుంటే, కలలు రాక ఇంకేమొస్తాయి నా శ్రాద్ధం పిండాకూడు కాకపోతే” –

అంటూ కురిపిస్తున్న అమ్మ తిట్ల వర్షం తప్పించుకుందుకి లేచిన కుమార్ స్నానాల గదిలోకి పరిగెత్తేడు.

** శ్రీరామ**

మరిన్ని కథలు

Deshabhakthi
దేశభక్తి
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Aapanna hastam
ఆపన్న హస్తం
- కందర్ప మూర్తి
Vekuva velugu
వేకువ వెలుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Nischitardham
నిశ్చితార్థం
- కొడవంటి ఉషా కుమారి
Taatayya
తాతయ్య
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Malle malle raakoodani roju
మళ్ళీ మళ్ళీ రాకూడని రోజు
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Viramam
విరామం.
- Harish Babu