
"అమ్మా! భయంగా వుందమ్మా ! అంతా చీకటి !...."
"ఊ ! నాన్నా, దగ్గరకి రా ! నాగుండెలకి హత్తుకుంటాను ! భయం వెయ్యదు. ! ... ఏదీ, నిన్ను నా చేతులతో, కప్పనీ ! "
........
" ఊ ! ...ఇప్పుడు వెచ్చగా వుంటుంది .. భయం వేయదు. నేను దగ్గరే వున్నానుగా ! "
" అమ్మా , రాత్రి ఎప్పుడు పోతుంది? ......ఈ రాత్రి ..ఎంతకీ ..పోవటం లేదేం ?! ......"
" ఇంక , ఎంత నాన్నా ! ...ఇంకో రెండు గంటలు ... తెల్ల వారుతుంది. . ..."
" ఎందుకమ్మా , దీపాలుండకూడదు ? ... భయం వేస్తుంది గదా !.."
" బయట యుద్ధం కదా ! ..."
" యుద్ధం ఎందుకు అమ్మా ? ..."
" కొంతమంది కి , అందరినీ బాధ పెట్టడం , అందరూ బాధపడితే, సంతోష పడడం , ఇష్టం నాన్నా ! వాళ్ళని ఆపినా యుద్ధమే ! ఆపకపోయినా యుద్ధమే ! "
" ఎందుకు , అమ్మా?? .. వాళ్ళు, బేడ్ బాయస్. ??? ....."
" ఊ !...."
" మరి, అందరూ కలిసి ,వాళ్ళని , పట్టుకుని ఆపుచేయొచ్చు కదా ?... ... అందరికీ కూడా భయమా?.."
" అందరూ కలవడానికి, మన బాధ , భయం , కొందరికి ఒక ఆట . ఇంకా కొందరికి , వ్యాపారం ... అందుకే , అందరూ కలవరు .."
" భయం , బాధ ......ఆటా , అమ్మా ? ! ....వ్యాపారమా , అమ్మా ...? !.."
" కాదు , బాబు !.... "
" మరీ.... ?"
" ఎవరిదయినా. భయం , బాధ, అందరికీ అర్ధం కావాలంటే , చాలా పెద్ద వాళ్ళు అవాలి .! ..."
" అందరూ, పెద్ద వాళ్ళే కదా అమ్మా ! ...."
"ఊ ! పెద్ద అయిన వాళ్ళందరూ, పెద్ద వాళ్ళుకారు నాన్నా ! ఇంకొకరి ,బాధ అర్ధం చేసుకునేవాళ్ళే ,పెద్ద వాళ్ళు. "
" నేను , పెద్ద అవుతే , అందరి బాధ అర్ధం చేసుకుంటాను . బాడ్ బాయ్స్ ని , పట్టుకుని కట్టేసి, కొట్టేస్తాను ! అప్పుడు ఎవ్వరికీ భయం వుండదు. ..."
" ఊ " ..."
" అప్పుడు, ఇంచక్కా , యుద్ధాలే వుండవు ... రాత్రులు , దీపాలు వేసుకోవచ్చు ..... చక్కా ! ."
" ఊ! ....."
"అమ్మా! చీకటి...... చాలా భయం గా వుంది !...నిద్ర రావటం లేదు !.. ఆ శబ్దాలు బాంబులా అమ్మా ?."
"ఊ ! ..."
" బాంబులు మనమీద పడితే ???...
" పడవు ! నేను దగ్గరే వున్నాగా ! "
" మనం చచ్చిపోతామా ?! ..."
" ఊహూ! ...మన కేమీ కాదు. ..... అమ్మని , చెప్తున్నాగా ! "
" ఊ !....."
"............"
" రాత్రి , ఎప్పుడు పోతుంది ? ! ......"
" సూర్యుడు వస్తాడు .....అప్పుడు చీకటి పోతుంది . రాత్రి వెళ్ళిపోతుంది. ...."
" సూర్యుడు వస్తాడా ??? ...
" ఊ !..."
"బాడ్ బాయ్స్ కి . భయ పడడా ?..."
" ఊహూ! ..."
" నిజమేనా ?..."
" ఊ! ..పడుక్కో , నాన్నా ! .."
" వెలుగు కోసం , చూస్తున్నా అమ్మా! ...చీకటి భయం గా వుంది..."
" నిద్ర పో , నాన్నా ! , లేచేసరికి, సూర్యుడు వస్తాడు. వెలుగులు వస్తాయి. ...జో, కొడతాను ఏం ! ..."
....
బాంబుల పేలుళ్ళ , మధ్య అమ్మ జో కొడుతూ వుంటే , తల్లి ని పెన వేసికున్న , ఆ చిన్న పిల్ల వాడి , ఆ చిన్ని కళ్ళు ,చీకటి లోకి, వెలుగు కోసం , ఆశగా చూస్తున్నాయి. ...
*****