జువ్వి! - అంతర్వాహిని

Juvvi

"ఏంటే పొద్దున్నే రెడీ అవుతున్నావు? ఈ రోజు నీకు డ్యూటి లేదు కదా? ఓవర్ టైమా?," రూం-మేట్ సరూ అడిగింది జువ్విని.

జుట్టు మళ్ళీ ఒకసారి దువ్వుకుంటూ, "అవును సరూ. డబ్బులు అవసరం ఉంది, వచ్చే నెల చిన్ను కి హాస్టల్ ఫీజ్ కట్టాలి."
సరూ బెడ్ మీద వాలిపోతూ, "ఎంత డబ్బు అవసరం అయితే మాత్రం. ఇంత ఓవర్ టైమా! నైట్ షిఫ్ట్ చేసి పొద్దున్నే వచ్చావు. అయినా గత ఆరు నెలలుగా డ్యూటీ బ్రేక్ తీసుకోలేదు నువ్వు."
హాండ్-బాగ్ లో అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటూ, "తప్పుదుగా! చిన్ను చదువు నాలుగు నెలల్లో పూర్తి అయిపోతుంది. వాడు ఒక దారిలో పడితే చాలు!" అంది జువ్వి, ఎదురుగా ఉన్న దేవుడి పటానికి దణ్ణం పెట్టుకుంటూ.
సరూ, "అవసరాలుంటే మాత్రం ఆరోగ్యం కూడా చూసుకోవాలిగా నువ్వు.," కొద్దిగా మందలిపు స్వరంతో.
సానిటరీ పాడ్స్ లోపల పెట్టుకుంటూ హాండ్-బాగ్ లో పెట్టుకుంటూ జువ్వి నవ్వింది.
సరూ ముఖంలో కోపం తెచ్చుకుంటూ, "నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్టుంటే, నవ్వులాటగా ఉంది. నా మాట విని ఈ ఒక్కరోజుకి ఆఫ్ తీసుకో. నాకు కూడా డ్యూటీ ఆఫ్, ఏదైనా సినిమాకి వెళ్ళి, బయటే తిని వద్దాము."
ఫ్లాస్క్ లో నుండి టీ రెండు కప్పులో పోసి, ఒకటి సరూ కి ఇచ్చి, ఒకటి తను తీసుకుంటూ, "అవును సరూ! నాకు కూడా ఈ టైం లో డ్యూటీ అంటే ప్రాణం విసుగొస్తుంది."
సరూ కళ్ళెగరేసి, "మరీ?"
నోరు కాలుతున్నా, ఊదుకుంటూ గబగబా తాగుతూ చెప్పింది జువ్వి, " లేదు సరూ, ఈరోజు స్పెషల్ క్లైంట్ స్లాట్ వచ్చింది, అందుకే ఓ.టి కి రెడీ అయిపోయాను. ఒక రెండు మూడు గంటలు కష్టపడితే డబుల్ పేమెంట్."
సరూ ఏమీ సమాధానం చెప్పలేనట్టు మౌనంగా ఉండిపోయింది.
జువ్వి తాగిన టి కప్పు పక్కన పెట్టి, ఓపిక లేనట్టు కళ్ళు మూసుకుని కూర్చుండిపోయింది .
అలా కూర్చుండి పోయిన జువ్వి దగ్గిరకి వచ్చి, నుదుటి మీద చెయ్యి పెట్టి అడిగింది సరూ, "పోనిలే, నువ్వు రెస్ట్ తీసుకో. ఈరోజుకి నేను చేస్తానులే నీ డ్యూటీ."
జువ్వి కళ్ళు తెరవకుండానే, తన నుదుటి మీది సరూ చెయ్యిని అలాగే పట్టి ఉంచుతూ, "నా మూడేళ్ళ కాంట్రాక్ట్ ఈ కంపెనీలో, ఇంకా మూడు నెల్లలో అయిపోతుంది. సూపర్వైజర్ మేడం తో మాట్లాడితే, ఇంక ఎక్సెటెండ్ చెయ్యరేమో?"
సరూకి అర్ధం అయ్యింది. జువ్వికి కనీసం ఇంకో మూడు నెలలు కావాలి, కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత, చిన్ను చదువు పూర్తి అయ్యి, వాడు కుదురుకోవడానికి.
పక్కనే కూర్చుంటూ సరూ అంది, "చిన్ను చదువు ఎలాగూ మూడు నెలల్లో అయిపోతుంది. ఆ పైన మూడు నెలలేగా. ఎలాగో సర్దుకోవచ్చులే. కిందటి సారి ఫోన్ చేసినప్పుడు, కేంపస్ ప్లేస్-మెంట్ వస్తుంది పెద్దమ్మా." అన్నాడు నాతో."
ఇంకా ఏదో చెప్పబోతున్న సరూతో చటుక్కున కళ్ళు తెరిచి అంది జువ్వి, " "వాడికి ఆ జాబ్ వచ్చేస్తే , ఆ తర్వాత ఈ ఓటిలే కాదు, డ్యుటిలూ కూడా మానేస్తాను."
జువ్వి, "సరూ! నువ్వు వాడిని చూసి ఎన్నేళ్ళయింది?"
సరూ సాలోచనగా కళ్ళు తిప్పుతూ, "ఒక సంవత్సరంపైనే అయ్యింది వాడిని చూసి. క్లైంట్ సైట్ కి బిజినెస్ టూర్ వెళ్ళినప్పుడు చూసాను వాడిని, పెద్దవాడైపోయాడు. మీసాలు, గెడ్డాలు. పసితనం వదిలిపోయింది కానీ, మగపిల్లాడు అనేట్టుగానే ఉన్నాడు. "
చిన్ను గురించి చెప్తూ ఉంటే జువ్వి సంతోషం గా కొడుకు ఎలా ఉండి ఉంటాడో అని అంచానా వేసుకోసాగింది. అప్రయత్నంగా కళ్ళనీళ్ళూ వచేసాయి జువ్వి కి.
సరూ జువ్విని ఓదారుస్తూ, "హ్మ్మ్..ఎంటో నువ్వు? వాడికి పదేళ్ళు ఉన్నప్పుడు హాస్టల్లో పడేసావు. ఆ పైన పదేళ్ళయ్యింది. ఇంతవరకూ వాడిని చూడటానికి వెళ్ళలేదు నువ్వు. కాని సమస్తం అమిర్చి పెడుతున్నావు. కనీసం వాడితో ఫోన్లో కూడా మాట్లాడవు. వాడు నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం నా పక్కనే ఉండి వాడి గొంతు వినవు. కనీసం వాడి ఫోటో కూడా చూడవు, నీ ఫోటొ వాడికి ఇవ్వొద్దని ఒట్టు పెట్టించుకున్నావు. ఏంటో ఈ ఖర్మ?"
జువ్వి తల అడ్డంగా తిప్పుతూ, "వద్దు, వద్దు!" అరిచేసింది.
సరూ, "అయితే వాడితో అసలు మాట్లాడవా?"
జువ్వి, "ఏమో తెలియదు. కానీ, ఒక సారి మాట్లాడితే వాడి భవిష్యత్తుని గురించి గల నా స్వార్ధాన్ని, నా తల్లిప్రేమ మింగేస్తుందనే, ఇన్నేళ్ళూ దూరం పెట్టాను. ఇక ముందు తెలియదు" అంటూ ఆ సంభాషణని ముగించి, గబ గబా లేచి వెళ్ళిపోయింది.
సరూ జువ్వి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. జువ్వి తనకి గత రెండే ళ్ళుగా పరిచయం. బాగా చదువుకున్నది అని తెలుస్తోంది. కొడుకుని దూరం గా పెట్టి చదివిస్తోంది. మిగిలిన ఫామిలీ విషయాలు ఏమీ తెలియవు. పరిచయం అయిన కొత్తలో ఓవర్ టైం-లు, ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తుంటే బాగా డబ్బు యావ ఏమో అనుకుంది, కానీ మెల్లగ ఇదంతా చిన్నుగాడి చదువుకోసం అని తెలిసి, ఒక్కొక్కరిదీ ఒక్కో కథ అనుకుని నిట్టూర్చి ఊరుకుంది. తన అలోచనలలో మునిగిపోయి నిద్రలోకి జారుకుంది.
మరి మూడు నెలలు గడిచిపోయాయి. చిన్ను సరూ కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు నెలకొకసారి. పరీక్షలు బాగా రాసాను, కేంపస్ ప్లేస్-మెంట్ వచ్చింది, ఇంక అమ్మ పని చెయ్యొక్కరలేదు. ఇంకో రెండు నెలల్లో అమ్మని తీసుకెళ్ళిపోతాను చెప్పాడు.
సరూ జువ్వి తో సంతోషంగా ఈ విషయం చెప్పింది, "నువ్వు రెడీగా ఉండు. నీ కొడుకుతో మాట్లాడటానికే కాదు, వాడితో వెళ్ళి హాయిగా ఉండటానికి."
జువ్వి కాంట్రాక్ట్ ఎక్స్తెండ్ చెయ్యడానికి ఆ హెడ్ ఒప్పుకోలేదు. కానీ, ఈ రిఫరెన్స్ వాడుకుని, జువ్వి తన ఎసైన్మెంట్స్ సొంతంగా చేసుకోవచ్చు.
దాదాపుగా పన్నెండేళ్ళపైనా రక రకాల క్లైంట్స్ కి సర్వీసెస్ ఇచ్చిన జువ్వి మసకబారిపోయింది. చేతిలో కంపెనీ కాంట్రాక్ట్ లేక పోవడంతో, తనే సొంతంగా పని వెతుక్కోవడం కష్టంగా అనిపించింది జువ్వికి. తనకు తెలిసిన, అప్పట్లో తనని మెచ్చుకున్న పాత క్లైంట్స్ ని కదిపి చూస్తే, కొంత మంది విదిలించారు, కొంత మంది అదిలించారు, పదీ పరకా ధర్మం చేసారు, కానీ పని ఇచ్చ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఎటువంటి మార్కెట్లో అయినా కొత్తొక వింత పాతొక రోత.
చిన్ను చదువు అయిపోయి, పైన రెండు నెలలు ఇంకా భారంగా గడిచాయి. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, మొదటి జీతం అందుకుని అమ్మని కలవాడానికి వస్తాను అని ఫోన్ చేసి చెప్పాడు సరూ కి. ఈ శుభవార్త విని జువ్వి నవ్వి ఊరుకుంది.
నాలుగు వారాలు గడిచిపోయాయి. చిన్ను ఫోన్ చేసాడు సరూ కి. ఫోన్ స్పీకర్ లో పెట్టమని సైగ చేసింది జువ్వి.
చిన్ను, "అమ్మని ఇప్పుడైనా నాతో మాట్లాడమని చెప్పు పెద్దమ్మా! అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను ? అసలు నాతో మాట్లడటమే మానేసింది ? అమ్మని చూసి పదేళ్ళపైన అయ్యింది. అమ్మని, నిన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టను. మీరు ఏ ఊరిలో ఉన్నారో తెలుసు నాకు, ఎక్కడ ఉంటారో ఒక్కసారి ఏడ్రెస్ చెప్పు పెద్దమ్మా, నేనే వచ్చి కలుస్తాను. అమ్మ ఎందుకు ఎలా చేస్తోంది? నేనంటే అసలు ప్రేమ లేదా? " వెక్కిళ్ళతో ఫోన్ కట్ అయిపోయింది.
జువ్వి ఎటువంటి కదలిక లేకుండా ఉండిపోయింది. తనేమి చెయ్యాలో నిర్ణయించుకుంది.
సరూ ఏడుస్తూ జువ్వి చెంపలు వాయించింది, "నీ లాంటి నాశనం దాన్ని నేనెప్పుడూ చూడలేదు. తల్లి ప్రేమకోసం తల్లడిల్లుతున్న ఆ చిన్ను గాడి మాటలు విన్న తర్వాత కూడా నువ్వు తల్లివేనా అనిపిస్తోంది? నిజం చెప్పు, నువ్వు వాడిని కన్నావా? లేక ఎత్తుకొచ్చావా? నీకు జీవితం లో నాశనమే రాసిపెట్టి ఉంది." జువ్వి ముక్కు, నోరు లోంచి రక్తం వస్తున్నా సరూ కొట్టడం ఆపలేదు.
కొట్టడం ఆపేసి జువ్విని పట్టుకుని ఏడుస్తూ ఉన్న సరూ ని తప్పించి, మూలగా పెట్టి ఉన్న తన పాత సూట్-కేస్ తీసుకు వచింది జువ్వి.
వెక్కి వెక్కి ఏడ్చి అలసిపోయిన సరూ మంచినీళ్ళు తాగుతూ జువ్విని చూస్తునే ఉంది.
జువ్వి తన సూట్-కేస్ లో నుండి, సెర్టిఫికేట్స్ పెట్టుకునే ఫైల్ తీసింది. అలా బయటకు తీసిన సెర్టిఫికేట్, దాని మీద ఉన్న జువ్వి అసలు పేరు చూసి అశ్చర్య పోయింది సరూ.
జువ్వి ని అపురూపంగా చూస్తూ, " నువ్వు అంత పెద్ద చదువు చదివావా? మరి ఈ నీచమైన పనిలోకి ఎందుకు దిగావు? వేరే ఉద్యోగం ఎందుకు చూసుకోలేదు? డబ్బు తక్కువ వచ్చినా, శరీరం పాడేయ్యేది కాదుగా? "
జువ్వి, "వేరే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే సమయంలో నా అవసరమో, నిస్సహాయతో తమకు అనుకూలంగా మార్చుకుందమనుకునే వారి భుజం తడుముళ్ళు, నడుము గిళ్ళుళ్ళు, బేరసారాలు, అన్ని అయిపోయిన తర్వాత దీంట్లో కొచ్చి పడ్డాను. గతం అంతా తవ్వి పోయలేను ఇప్పుడు. కాని, వేరే దారి లేకుండా పోయింది నాకు. అందుకే దీనిలోనే కంటిన్యూ అయిపోయాను. అది గతం, వర్తమానం నీకు తెలుసు, భవిష్యత్తు ఎవరికీ తెలియదు.,," అని ఆగిపోయింది.
సరూ జువ్విని విస్మయంగా చూస్తూనే ఉంది, "నీ సెర్టిఫికేట్ లో చూసాను, అంత మంచి పేరు ఉంది నీకు. "జువ్వి" అనే పేరు ఎలా వచ్చింది?"..
తన సెర్టిఫికేట్లన్నీ చింపి పోగులు పెడుతూ చెప్పింది, "ప్రతి తారాజువ్వా, ఆకాశాన్ని అందుకోవాలనే ఎగురుతుంది. అలాగే ఈ వృత్తిలో నేను ఎక్కువకాలం ఉండలేనని నాకు క్షణం క్షణం గుర్తు ఉండటానికి నేనే నాకు "జువ్వి" అని పేరు పెట్టుకున్న. ఈ జువ్వ రాలిపోయేలోగా చిన్ను సెటిల్ అవ్వాలనే ఇంతకాలం ఓపిక పట్టాను. నానా చంఢాలమైన పన్లు చేసాను."
సరూ కి అంతా అర్ధం అయ్యింది, "పోనిలే నీ కష్టాలు తీరాయి. ఇంక వాడి దగ్గిరకి వెళ్ళిపోతావా?" బేలగా అడిగింది.
జువ్వి తను చింపిన సెర్టిఫికేట్ ముక్కలన్నీ అగ్ని కి ఆహుతి చేస్తూ, "వాడిప్పుడు రెక్కలొచ్చిన పక్షి. వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయే టైం వచ్చింది. అందుకే, వాడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినా, నా ఆచూకి కోసం ప్రయత్నిచినా దొరకకుండా, నా ఆనవాళ్ళన్నీ బూడిద చేస్తున్నా!"...
హాండ్-బాగ్ లో నుండి తన ఫోన్ తీసి, సిం -కార్డ్ ముక్కలు చేసి పడేసింది.
సరూ పిచ్చిపట్టినట్లు అరిచింది. జువ్వి తొణకలేదు. ఇప్పుడు తను చెప్పబోయేది చిన్ను కి వినిపించమని సరూ కి చెప్పింది.
సరూ ఫోన్ తీసుకుని, వాయిస్ రికార్డ్ చెయ్యడం మొదలు పెట్టింది. "చిన్ను! నా గతం నీ భవిష్యత్తుని జీవితాంతం గుచ్చుతూ ఉండకూడదనే నేను లేని జీవితాన్ని నీకు అలవాటు చేసాను. తల్లి తప్పిపోయిన వాడికంటే, తల్లి చచ్చిపోయిన వాడికే ఈ సమాజంలో గౌరవం ఎక్కువ. కలువని పూయించిందని బురదని ఎవరూ పూజకి పట్టుకెళ్ళరు. మండు వేసవి మిట్ట మధ్యాహ్నం ఆరు బయట ఎండలో ఆడుతున్న పిల్లాడిని, నీడ పట్టున చేర్చాలని వీపు మీద చరిచే ప్రతి అమ్మ చేతి ప్రేమలో నేనుంటాను. నా పాత్ర ఇక నీ జీవితంలో ఒక జ్ణాపకం మాత్రమే!"
(సమాప్తం)

మరిన్ని కథలు

Kanchana prabha
కాంచన ప్రభ
- కందర్ప మూర్తి
Bhooloka vasula swargaloka aavasamu
భూలోకవాసుల స్వర్గలోక ఆవాసము
- మద్దూరి నరసింహమూర్తి
Deshabhakthi
దేశభక్తి
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Aapanna hastam
ఆపన్న హస్తం
- కందర్ప మూర్తి
Vekuva velugu
వేకువ వెలుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Nischitardham
నిశ్చితార్థం
- కొడవంటి ఉషా కుమారి