
అడవి మార్గంలో నడుస్తున్న ఒక బాటసారి తన దగ్గరున్న మామిడి పండును తిని
టెంకను దారి పక్కన పడవేసాడు.
ఒక కాకి ఆ మామిడి టెంకను నోటితో పట్టుకుని నదీతీరానికి చేరి బండరాయిపై
కూర్చుని పైన గుంజును తిని టెంకను అక్కడ మట్టిలో వదిలి ఎగిరిపోయింది.
.
కొన్నాళ్లకు వర్షం పడి మామిడి టెంక తడిసి మొలక పైకి వచ్చి బంగారు రంగు
లేత ఆకులతో తళతళ మెరవసాగింది.
నదికి దగ్గరలోని ఆశ్రమంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటు నదికి స్నానానికి
వస్తుంటాడు. ఒక దినం ఋషి నదిలో స్నానం చేసి ఆశ్రమానికి వెళుతుండగా
సూర్య కాంతిలో ధగధగ మెరుస్తున్న ఆకులతో ఉన్న మామిడిమొక్క కంటపడింది.
ఋషి ఆ మామిడి మొక్కను చూసి ముచ్చట పడి బండరాళ్ల మద్య ఈ ఫలవృక్షం
నీరు లేక ఎండి శిధిలమైపోతుంది. దీన్ని నా ఆశ్రమంలో పెంచితే నీడతో పాటు ఎన్నో
జీవులకు ఆశ్రయం కలుగుతుందని తలిచి మట్టితో మెల్లగా ఆ మామిడి మొక్కను
ఆశ్రమానికి తీసుకు వచ్చి ఒక ప్రక్కన గొయ్యి తవ్వి సారవంతమైన ఎరువుతో నింపి
మామిడిమొక్కను నాటి నీరు పోసాడు.
ఋషి సంరక్షణలో కొద్ది రోజులకు మామిడి మొక్క ఏపుగా ఎదిగి మాను కట్టి
స్వర్ణ రంగు ఆకులతో కొమ్మలు విస్తరించి విశాలంగా పెరిగింది.
రకకరకాల పక్షులు, చిన్న జంతువులు, తేనెటీగలు మామిడి చెట్టును చేరి ఆశ్రయం
పొందుతున్నాయి.
పచ్చని ఆకులతో ఎన్నో ప్రాణులకు జీవనాధారమైన మామిడి చెట్టును చూసి
ఋషి ఎంతో సంతోషించాడు.
సాధారణంగా మామిడి వృక్షం వసంతంలో చెట్టు నిండా ఫలాలతో ఎన్నో జీవాలకు
కడుపు నింపుతుంది కాని ఈ వృక్షానికి లెక్కగా వసంతంలో రెండు లేక మూడు
కాయలు కాసి ఫలాలుగా ఉంటాయి. అలాగే కార్తీక మాసంలో రెండు లేక మూడు
కాయలు కాసి మామిడి ఫలాలుగా పండుతాయి.
ఋషుకి తను తెచ్చి ఆశ్రమంలో పాతిన మామిడి చెట్టుకు ఈ అద్భుత పరిణామం
ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
***
ఆ రాజ్యాన్ని పరిపాలించే మహరాజు సారంగధరుడికి సంతానం లేదనే చింత
పట్టుకుంది. మహరాజు ఎందరో జ్యోతిష్యులను, పండితులను, సాధువులను
సంప్రదించి యజ్ఞ యాగాదులు, దానధర్మాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఒకరోజు రాత్రి మహరాణి వసుంధరా దేవికి ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది.
తనకి ప్రసవం జరిగి ఆడ శిసువుకు జన్మనిచ్చినట్టు, ఆ బిడ్డను స్వర్ణ ఉయ్యాలలో
ఉంచి వేడుక జరిపినట్టుగా కనబడింది.
మహరాణి ఆ కల గురించి మహరాజుకు తెలియచెప్పింది. మహరాణికి వచ్చిన
స్వప్నం యదార్దమైతె బాగుండును అనుకున్నాడు సారంగధరుడు.
వెంటనే మహరాజు రాజ్యంలోని పండితులను, జ్యోతిష్యులను రాజధానికి
పిలిపించి మహరాణికి ఎందువల్ల అటువంటి స్వప్నం వచ్చింది పరిక్షించి
తెలియచేయమన్నాడు.
ఒక జ్యోతిష్యుడు మహరాణి నొసటి రేఖలను, కంటి రెప్పల కదలికలను
కుండలీలుగా విభజించి మహరాణికి బంగారు వర్ణం మామిడి ఫలం
కార్తీక పౌర్ణమి రోజున తినిపించినట్లైన ఆమెకు వచ్చిన స్వప్నం యదార్ధం
అవుతుందని చెప్పాడు.
ఋతువు కాని సమయంలో అదీగాక బంగారు వర్ణంలో మామిడి ఫల
దొరకడం దుర్లభమని పండితులు చెప్పారు.
మహరాజు సారంగధరుడు రాజ్యం నలుమూలల సైనికులను పంపి
ఎలాగైన పసిడి వర్ణం మామిడి ఫలాన్ని కార్తీక పౌర్ణమి సమయానికి
తెప్పించవల్సిందిగా మహమంత్రిని ఆదేశించాడు.
మహామంత్రి సైనికులను దళాలుగా విభజించి రాజ్యంలోని నలుదిశల
పంపి బంగారు వర్ణం మామిడి ఫలం తెచ్చిన వారికి బహుమతి ప్రకటించాడు.
అలా ఒక సైనిక దళం ఋషి ఆశ్రమానికి చేరి మహరాజు ఆజ్ఞను తెలియపరిచారు.
వెంటనే ఋషి తను తెచ్చి భూమిలో పాతిన మామిడి వృక్షం ఎంతో మహిమలు
కలదని తలిచి పక్షులు తినగా వృక్షం చిగురు కొమ్మన ఉన్న ఒకే ఒక్క పండిన
బంగారురంగు మామిడిపండును కోసి రాజ సైనికులకు అందచేసాడు.
సైనికులు ఆ ఫలాన్ని భద్రంగా తెచ్చి మహరాజుకు అందచేసారు. మహరాజు
సారంగధరుడు అభినందించి ఆ సైనికులకు విలువైన కానుకలు అందచేసాడు.
కార్తీక పౌర్ణమి రోజున రాజ పురోహితుల పూజలు , ఆశీర్వచనాలతో మహరాణి
ఆ బంగారు వర్ణం మామిడి ఫలాన్ని ఆప్యాయంగా తిన్నది.
జ్యోతిష్యులు, పండితులు చెప్పిన ప్రకారం పసిడి వర్ణం మామిడి పండు భుజించిన
కొంత కాలానికి మహరాణి గర్భం దాల్చి పండంటి బంగారు రంగుతో ఆడ శిసువును
ప్రసవించినది.
రాజ దంపతులు తమ కల ఫలించి ఆడబిడ్డ కలిగినందుకు సంతోషించి రాజ్యమంతా
పండగలు జరిపించారు.
స్వర్ణమయ వర్ణంతో తమకు పుట్టిన బిడ్డకు 'కాంచన ప్రభ' ' గా నామకరణం చేసి
కులదైవం భవానీ మాతకు వేడుకలు జరిపించారు.
సమాప్తం