కనువిప్పు! - బోగా పురుషోత్తం

kanuvippu

చిన్నయసూరి పెద్ద కవి. తన కవితలు వినిపిస్తూ రాజు చిన్మయానంద వద్ద చిన్నచిన్న బహుమతులు పొందేవాడు.
ఆ బహుమతులతో చిన్నయసూరి ఆనందించి ఇంటికెళ్లేవాడు.
తనకు వస్తున్న బహుమతులతో ఇల్లు గడిచేది కాదు. ఇంట్లో పిల్లలు, వారి చదువులు, తినేందుకు తిండి ఖర్చులకు సరిపోయేది కాదు. దీంతో చిన్నయసూరి కడు పేదరికం అనుభవించేవాడు.
తన పేదరికం ఎలా వున్నా సమాజంలో కనిపిస్తున్న పేద, ధనిక వ్యత్యాసాన్ని చూసి బాధపడేవాడు. వారందరినీ పేదరికం నుంచి బయట పడేయాలని పరితపించేవాడు. రాజు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలనుకున్నాడు.
బంగారు సింహాసనంపై కూర్చున్న రాజు వద్దకు ఓ రోజు చిన్నయ సూరి వెళ్లాడు. మంచి కవితలు వినిపించాడు. రాజు అది విని విసుక్కున్నాడు. ‘‘ ఏమయ్యా కవి.. నా పాలనలో ఎంతో గొప్పగా వుందని, పేదరికం లేదని రోజూ పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఉప్పొంగిపోయేవాడిని.. ప్రజలు అంతా బాగున్నారని సంతోషించేవాడిని మరి ఒక్కరోజులోనే ఈ దారిద్య్రం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందయ్యా? అయినా కవితలు రాజును పొగిడేలా వుండాలి.. అప్పుడే నువ్వు వృద్ధిలోకి వస్తావు.. ’’ అని హెచ్చరించాడు రాజు.
చిన్నయసూరి పేదరికాన్ని తలుచుకుంటూ రాజు అసమర్థ పాలనను కవితలతో విమర్శించాడు.
అది గ్రహించలేని రాజు కాలిలో ముల్లు గుచ్చుకుని విలవిలలాడిపోయేలా తన మంచి పాలనకు అడ్డకుంలేమిటి? అసలు తను ఇచ్చే బహుమతులు చిన్నయసూరికి నచ్చనట్లుంది? అందుకే తన సుపరిపాలనకు తూట్లు పొడుస్తున్నాడు. ’ అనుకున్నాడు. అప్పటికే తీవ్ర ఆవేదనతో ఇంటికెళ్లిన చిన్నయసూరి వద్దకు స్వయంగా వెళ్లాడు రాజు చిన్మయానంద.
పూరి గుడిసెలో కూర్చున్న చిన్నయసూరిని బయటకు రమ్మని పిలిచాడు. అది విని చిన్నయసూరి పిల్లలు బయటకు వచ్చారు. చిరిగిన దుస్తులు వేసుకున్న వారి ముఖంలో అశాంతి, ఆవేదన కనిపిస్తోంది.
‘‘ ఏమయ్యా కవి.. మా బహుమతి స్వీకరించి మమ్ము ఆనందింపచేయి..’’ అని గద్దించాడు రాజు.
లోపలి నుంచి చింపిరి దుస్తులతో బయటకు వచ్చిన కవి భార్యను చూసి ఆశ్చర్యపోయాడు రాజు.
‘‘ ప్రభూ పేదరికంలో నేనే కాదు..ఈ రాజ్యం అంతా కడు పేదరికంలో వుంది. వారికి కడుపు నిండా తిండి తినే అవకాశం కల్పించండి..’’ సమాజంలో ప్రజల కష్టాలు పరిష్కరించడమే నా లక్ష్యం.. అందుకే కవిత్వం చెబుతున్నాను. ప్రజలు పస్తులు లేకుండా హాయిగా జీవించినప్పుడే నాకు మనశ్శాంతి లభిస్తుంది.. అప్పుడు మీరిచ్చే బహుమతికి సార్థకత చేకూరుతుంది. ’’ అని తిరస్కరించాడు.
అది చూసిన రాజు చిన్మయానందకు కోపం చిర్రెత్తుకొచ్చింది. చిన్నయసూరికి గర్వం ఎక్కువ.. రాజు అంటే కొంచెం కూడా భయం, భక్తి లేదు..’’ అని బంగారు కడియం కిందపెట్టి విసురుగా వెనుతిరిగాడు రాజు.
చిన్నయసూరి మనసు బాధపడింది. . రాజుకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు.
అదే సమయానికి తన ఇంటి ముందు నుంచి ఓ సాధువు రాజ భవనం వైపు వెళ్లడం చూశాడు రాజు. చిన్నయసూరి అతని వెనుకే వెళ్లాడు. సాధువును రాజ భటులు ప్రవేశం ద్వారం వద్ద నిలిపివేశారు. రాజు వద్దకు తనను పంపాలని గొడవ పడ్డాడు. అది విన్న రాజు అక్కడికి వచ్చాడు. ‘‘ రాజా.. మీది ఉత్తమ పాలన అని వచ్చాను..కానీ ఎక్కడా అది కనిపించడం లేదు.. కరువు తాండ విస్తోంది..ఈ స్థితిలో నాకు ఏదైనా సాయం చేయండి..’ అని అర్థించాడు.
రాజు అతడిని చూసి ‘‘నువ్వు సన్యాసివి..సర్వసంగ పరిత్యాగివి.. నీకు డబ్బులు ఎందుకు?’’ అని రాజు అక్కడి నుండి తరిమివేసే ప్రయత్నం చేశాడు.
పక్కనే వున్న చిన్నయసూరి రాజు తనకు ఇచ్చిన బంగారు కడియంను సాధువు అక్షయ పాత్రలో వేశాడు.
సాధువు ‘‘ నాయనా..ఏకాకిని.. సర్వసంగ పరిత్యాగిని..నాకు ఒక్కడికే ఇంత పెద్ద దానం ఇస్తే ఏమీ లేని పేదలు తన కుటుంబాలతో పస్తులతో పడుకున్నారు.. వారికి ఇంకేం సాయం ఇచ్చి ఆదుకుంటారు?’’ అని నిలదీశాడు. ‘‘రాజుకు సూక్ష్మ పరిశీలన అవసరం.. రాజ్యంలో ప్రజల కష్టాలు తెలుసుకుని వారిని ఆదుకోవడం రాజధర్మం.. ప్రజలు క్షేమంగా వుంటేనే రాజు ఆనందంగా వుండి రాజ్యం సుభిక్షంగా వుంటుంది..రాజు అది గ్రహించి పాలన సాగించాలి..ప్రజలు వర్షాలు లేక పంటలు పండక కడు దుర్భర స్థితిలో వున్నారు.. వారిని ఆదుకోండి..’’! అని హితవు పలికాడు సాధువు.
అది విన్న రాజు కళ్లు తెరిచాడు. తన విలాసవంతమైన బంగారు సింహాసనం వదిలి బయట రాజ్యాన్ని పరిశీలించాడు. వర్షాలు లేక కరువు తాండ విస్తోందని గ్రహించి తక్షణం తను విలాసాలకు ఖర్చు చేసే డబ్బును వెచ్చించి చెరువులు తవ్వించాడు. తక్షణ సాయంగా పక్క రాజ్యాధిపతి ధర్మయ్య వద్ద నుంచి పదివేల బస్తాలు బియ్యం కొని ప్రజలకు పంచాడు.
మరుసటి ఏడాది వర్షాలు బాగా కురవడంతో చెరువులు నిండి పంటలు బాగా పండాయి. ప్రజలు ప్రభుత్వానికి శిస్తులు చెల్లించారు. ప్రభుత్వ ఖజానా నిండి రాజు ఆనందించాడు. మళ్లీ ప్రజలకు కష్టాలు ఎదురైనప్పుడు ఆదుకున్నాడు. రాజ్యం సుభిక్షంగా మారింది.
అది చూసి రాజులో వచ్చిన మార్పునకు, వివేకంతో కళ్లు తెరిపించిన సాధువు వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు కవి చిన్నయసూరి.

మరిన్ని కథలు

Korukunna mogudu
కోరుకున్న మొగుడు
- కొడాలి సీతారామా రావు
Inquiry
ఇంక్వైరీ
- DR BOKKA SRINIVASA RAO
Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vruddhapyam varama? sapama?
వృద్ధాప్యం వరమా ? శాపమా?
- మద్దూరి నరసింహమూర్తి
Adigite cheptaa
అడిగితే చెప్తా
- కొడవంటి ఉషా కుమారి