చివరి ప్రయాణం - మణి

Chivari prayanam

అది ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ . ఆ కాంప్లెక్స్ లో , ఒక వంద అపార్ట్మెంట్స్ వరకూ, వున్నాయి . ఎప్పుడూ, నిశ్శబ్దం గానే వుంటుంది . పిల్లలకి శెలవులు ఇచ్చినప్పుడు, పిల్లల ఆడుకుంటూంటే , కాస్త సందడి గా వుంటుంది తప్ప , లేక పోతే నిశ్శబ్దం గానే వుంటుంది. ఆ రోజు మాత్రం , కోలా హలం గా వుంది . బాల్కనీ లో కూర్చున్న , రామా రావు ఆ కోలహలం చూసి, కింద వున్న సెక్యూరిటీ ని , పైకి పిలిచి అడిగాడు " ఏమిటి , ఎప్పుడూ లేనిది కోలాహలం గా వుంది .." అంటూ.

" బి టవర్ లో, రెండు వందల రెండు లో , పెద్దాయన చనిపోయారండి . "

" అయ్యో ! ..."

" తెల్లవారు జామున బాగో లేదని తీసుకు వెళ్ళారండి . అప్పటికే , ప్రాణం పోయిందన్నారుట డాక్టర్స్ .. ... ఇంటికి తీసుకు వచ్చేసారు . కానీ ఇంట్లోకి తీసుకు రావడానికి, వీల్లేదని , ఇంటి ఓనర్, శ్రీ రామ మూర్తి గారు !.... అదీకాక అదే బ్లాక్ లో మూడువందల రెండులో , ఈనెల ఆఖరుకి, పెళ్ళి టండి . వాళ్ళు కూడా , "పెళ్ళీ , ఇంక కొన్ని రోజులుపెట్టుకుని, బిల్డింగ్ లోకి శవం ఎలా తీసుకు వస్తారని ", గొడవ చేస్తున్నారు . .. "

"పెళ్ళి ఇంకా పదిహెను రోజుల తర్వాత అంటున్నావు .. అయినా ఎందుకు వాళ్ళు గొడవ చేస్తున్నారు ?..."

" అదేనండీ !.. ప్రెసిడెంట్ రమణ మూర్తి గారి దగ్గర , అందరూ వున్నారు అదే , మాట్లాడుకుంటున్నారు .. ఇంక చనిపోయిన ఆయన్ని, చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా, అక్కడ పోగయ్యేరు . .." విషయం చెప్పి, సెక్యూరిటీ వెళ్ళిపోయాడు.

" మనిషి చనిపోయి , ఏడుస్తూంటే , వాళ్ళకి చేతనయిన , సాయం చెయ్యడానికి బదులు ఈ విధం గా ఎందుకు వేధిస్తారో ??

మరణం కూడా, మనషి బతుకులో , సహజమయినదే కదా . అదేదో అశుభం అయినట్లు, ఎందుకు పరిగణిస్తారు ?? అకాల మరణం అనుకున్నా , సానుభూతితో, ఇంకా సాయం చేయాలి. .. ఒక మనిషి చనిపోతే, ఆ బాధ తో , మనసు స్థబ్దమవుతుంది. తర్వాత చేయాల్సిన పనులు చేయడానికి, కుటుంబ సభ్యులకి, కాలు చేయి ఆడదు . కావాల్సిన వాళ్ళు అందరూ , తలో చెయి వేస్తే కానీ తర్వాత కార్యక్రమం చేయడం కష్టమవుతుంది . అటువంటి పరిస్థితి లో ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నట్లు, ఈ గొడవలు. .." నెమ్మదిగా నిట్టూర్చాడు .

ప్రెసిడెంట్ , ఇలాంటి గొడవలు వచ్చినపుడు కమిటీ సభ్యులని అందరినీ, కూడా పిలుస్తాడు . తనూ కమిటీ సభ్యుడు అవడం తో ప్రెసెడెంట్ పిలుపు కోసం ఎదురుచేస్తూ బట్టలు మార్చుకున్నాడు.

" ఏమిటంటున్నాడు సెక్యూరిటి ? " భార్య వనజ అడిగింది .

" బి టవర్ లో ఎవరో చనిపోయారుట. బిల్డింగ్ లోకి తీసుకు రావడానికి వీల్లేదని. ఓనర్ . అతనికి వత్తాసు పలుకుతూ మిగిలిన వాళ్ళు. "

ఈ లోపుల రానే వచ్చాడు సెక్యూరిటీ , " ప్రెసిడెంట్ గారు, మిమ్మల్ని ఆఫీసు దగ్గరకి రమ్మన్నారండి ! " అంటూ.

" వస్తున్నా పద ! " అంటూ రామారావు ఆఫీసు దగ్గరకి బయలు దేరాడు. దారిలో , ఇంకా ఒకళ్ళు ఇద్దరు కూడా కలవడంతో , అందరూ మాట్లాడుకుంటూ , ఆఫీసు దగ్గరకి చేరుకున్నారు

అక్కడ చాల మంది, గుమిగూడి వున్నారు . రామారావు తో పాటు , వచ్చిన అందరినీ , కమిటి సభ్యులని లోపలకి పిలిచాడు.

ఆఫీసు గది చాలా పెద్దదికావడం తో. ఇటువంటి అత్యవసర సమావేశాలకి ఉపయోగపడుతూ వుంటుంది. ఇటువంటి అవసరాలని దృష్టి లో పెట్టుకుని , కొన్ని కుర్చీలు కూడా , వేసి వుంటాయి .

ప్రెసిడెంట్ అందరినీ లోపలకి పిలిచాడు. అందరూ లోపల సద్దుకున్నాక , విషయం చెప్పాడు.

" బి టవర్ లో, రెండు వందల రెండులో , శంకరయ్య గారు. తెల్లవారు జామున చని పోయారు. వారి కుటుంబానికి మన సంతాపం వ్యక్తం చేస్తూ , అసలు విషయానికి వస్తాను . ఆయాన్ని , హాస్పిటల్ కి తీసుకు వెళ్ళేడప్పటికే , చనిపోవడం తో , హాస్పిటల్ లో చేర్చుకోలేదు. తిరిగి వచ్చిన వాళ్ళని, వారిభౌతిక కాయాన్ని , లోపలకి తీసుకు రావడానికి , ఆ ఫ్లాట్ ఓనర్ తో పాటు మిగిలిన వాళ్ళూ, ఒప్పుకోటం లేదు . " రమణ మూర్తి , ఇంకా పూర్తి చేయకుండానే ,...ఒకాయన అందుకున్నాడు

" ఎలా తీసుకువస్తారండీ ! . మా ఇంట్లో ఇంకో పది హేను రోజుల్లో పెళ్ళి . .. పెళ్ళిపనులు ఎలా చేసుకుంటాం ? .." ఆవేశపడుతూ అన్నాడు. అతని పేరు సుదర్శన్ .

" ఇంటికి తీసుకు వస్తే , దగ్గర వాళ్ళ కి , చివరసారి చూసుకోడానికి, కడుపులో దుఃఖం కొంచెమయినా పోయేలా ఏడ్వడానికి వుంటుంది .అదీకాక , తర్వాత ఏర్పాటులు చేసుకోడానికి వెసులుపాటుగా వుంటుందని, " చనిపోయిన శంకరయ్య గారి అబ్బాయి , ప్రాధేయపడుతున్నాడు . . ఇదిగో, ఇతనె. వారి అబ్బాయి రమేష్ ! " అంటూ రమేష్ ని పరిచయం చేస్తూ అన్నాడు ప్రెసిడెంట్ ,

రామారావుకి ఆ పరిస్థితి చాలా బాధాకరం గా అనిపించింది . " తండ్రి పోయి బాధలో వున్న , అతని కి , అందరూ తోచిన సాయం చేయకుండా , ప్రాధేయ పడే పరిస్థితి కి , తీసుకు రావడం ,ఎంత అమానుషం ?! . " అనుకుంటూంటే కోపం తన్నుకు వచ్చింది రామారావుకి ..

" చావు , పుట్టుకలు , మనషి అన్నాక సహజం . వాటిని గౌరవించాలే తప్ప. ఈ విధం గా , చనిపోయిన వారి కుటుంబాన్నీ మరింత బాధ పెడుతూ , దానికి సంబంధించిన కార్య క్రమానికి , ఈ విధం గా అడ్డుపడడం ఏం బాగుంది " కోపాన్ని కంట్రొల్ చేసుకుంటూ అన్నాడు రామా రావు.

ఆ మాటలకి అందరూ , అతని వైపు , అసహనం గా చూసారు . శంకరయ్య గారి కోడుకు, రమేష్ దుఃఖం నిండిన కళ్ళతో ఆశగా చూస్తున్నాడు.

" ఏమిటి గౌరవించేది ? చావుని ఎవరయినా ఆహ్వానిస్తారా ? అశుభాన్ని ఎవరయినా కోరుకుంటారా ? ఎప్పటినుంచో వస్తున్న ఆచారం , చావు ఇంట్లో , పెళ్లి చేయకూడదని .. "

" అవును ! అవును ! ..." అందరూ ఒకే మాట, కోరస్ తో , పలుకుతున్నారు .....ఒకళ్ళు ఇద్దరు తప్ప .

" అయినా , మాఇంట్లో , ఈ చావు కార్యక్రమం చేయడం మాకు చాలా తప్పుగా వుంటుంది... .మా సెంటిమెంట్స్ మావి . "

" బలే మాట్లాడుతున్నారు . ఎవరయినా చావుని , అశుభాన్ని , ఆహ్వానిస్తారా ? అయినా మీరు ఆహ్వానించలేదని , ఏవయినా ఆగుతాయా ?... . మరణం అందరికీ తప్పదు . ఆబాధ అందరమూ, ఏదో విధం గా అనుభవించిన వాళ్ళమే . అటువంటప్పుడు , సానుభూతికదా చూపించాలి ?! సాయం కదా చేయాలి?! ....ఈ విధం గా వాళ్ళని వేధిస్తే ఎలా ? .."

రామారావు మళ్ళీ అన్నాడు.

" ఏం వేధించామండీ ? ... "

"ఇది వేధింపు కాక ఏమిటి ? చనిపోయిన వారి కోసం, వాళ్ళని , ఏడ్వనయినా ఏడ్వనివ్వరు ...రమేష్ ని చూడండి ... గుండె నిండా , బాధ పెట్టుకుని ఇక్కడ వున్నాడు . అతను అడగకుండా నే , కావాల్సినవన్నీ , ఏర్పాటు చేసి , సహాయం చేయడం మానేసి , అతనిని , ఇక్కడ ఇలా నిల్చోపెట్టారంటే, వేధింపు కాక ఏమిటండీ " రామా రావు , ఆవేశపడుతూ అన్నాడు

" మేము , మన ఆచారాల గురించి మాట్లాడుతున్నాం .. "

" ఏమి ఆచారమండీ !... మానవత్వాన్ని గౌరవించడం, గొప్ప కానీ , ఈ విధం గా సాటివాళ్ళని బాధ పెట్టడం, ఎటువంటి ఆచారం అయినా గొప్ప ది కాలేదు . .. .." అన్నాడు , ప్రకాష్ . అతను ఈ మధ్యనే అక్కడకి అద్దెకి దిగాడు. అతను బయటకి , వేరే పని మీద వచ్చి , ఆఫీసు దగ్గర కోలాహలానికి , కుతూహలం తో వచ్చడు. రామారావు గారి మాటలకి. , అతనికీ, మాట్లాడే ధైర్యం వచ్చింది.

" అయినా చనిపోయిన వ్యక్తి ఆత్మ , ఇక్కడే తిరుగుతూ వుంటుందని , మీలాంటి ఆచార పరులే చెప్తారు . మరి అదే నిజమయితే , ఆ ఆత్మ మీరు చేసే , ఈ పని ని హర్షిస్తుందా ? అదేమయినా మంచిదా ! " అన్నాడు మళ్ళీ ప్రకాష్ .

ఒక్కసారి అందరి మొహాల్లో, భయం కాస్త కనిపించింది. కానీ అందరూ , ఏమాత్రమూ తగ్గం, అన్నట్లు కోపం గా చూసారు .

ఇంతలో కమీటీ లో ఇంకో సభ్యుడు, ప్రభాకర్ మాట్లాడడం మొదలు పెట్టాడు.

" ఏమి ఆచారాలో, ఈ అచారాలు, 'మనిషికి , మనిషే శత్రువు !..' అని చెప్పకనే ,చెప్తున్నట్లు వుంటాయి . కిందటి సంవత్సరం , మేము అద్దె ఇంట్లో , వుండే వాళ్ళం , అప్పుడు , మా అమ్మగారు కాలం చేసారు . ఆవిడ రాత్రి, నిద్రలో చనిపోయారు . అంచేత, భౌతిక కాయాన్ని , తీసుకు రావద్దనడానికి, ఆస్కారం లేకపోయింది. కానీ , ఏ కార్యక్రమం ఇంట్లో చేయడానికి , ఒప్పుకోలేదు . అదొక్కటే కాదు. మైలు అంటూ , పదిహేను రోజులు, ఏ పని మనిషి నీ, రానివ్వలేదు . వచ్చి పోయే చుట్టాల తో , మేము పడ్డ అవస్థ , అంతా ఇంతా కాదు. ..". ఉక్రోషం గా అన్నాడు ప్రభాకర్ .

" సార్ ! మీరు బాగా చెప్పారు ! ... ఇటువంటి ఆచారాలు హిందూ మతం లోనే. ఇటువంటి పరిస్థితిలో , అదే వేరే మతం వాళ్ళు , ఒకరికి ఒకరు , ఎంత సాయం చెసుకుంటారో .. .... ఈ విధమయిన సాటి మనుషులని బాధపెట్టే ఆచారాలు, అదేమిటొ ,... హిందూ మతం లోనే చూస్తాము . ఇవి చూస్తూంటే , ఎవరికయినా, హిందూ మతం మీద , ఏమి గౌరవం వుంటుంది? .. .." అక్కడ చేరిన , ఇంకొక యువకుడు అన్నాడు . అతను కుమార్ . అతనూ కమెటీ సభ్యుడే

" మనిషి మరణించాక, ఆ భౌతిక కాయాన్ని ఏ విధం గానూ గౌరవించము . ఆ కాయం , అంటరాని ది, అయిపోతుంది . ఆ కార్య క్రమం చూడకూడనిది, అయిపోతుంది . హిందూ మతం గురించి గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇటువంటి ఆచారాలని ఖండించరు . .. ..... చదువుకున్నవాళ్ళు , డబ్బులు వున్నవాళ్ళు , కూడా మతం మార్చుకుంటున్నారంటే , ఇటువంటివి చూసి విసిగి పోయే .. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని సాధ్యమయినంత బాధఎట్టడం , అవమానించడం హిందూ మతం లో నే చూస్తాం ...." రామారావు అన్నాడు,

" మీరు ఈ విధం గా హిందూ మతాన్ని అవమానించడం , ఎమీ బాగోలేదు .. ... " ఆవేశపడుతూ అన్నాడు హర్ష. అతను కమెటీలో ఇంకో సభ్యుడు.

" నేను అవమానించేది ఏముంది .? ఇప్పుడు ఇంతమంది ఇక్కడ చేరి చేస్తున్న పని ఏమిటి ? అతన్ని చూడండి. అతన్ని ఇక్కడ ఈ విధం గా నిల బెట్టేమంటే , అవమానించడం కాదా .. .. మన మతం గొప్ప అనుకుంటే, సరిపోతుందా . మనం ఏమి గొప్పగా , ప్రవర్తిసున్నాం అని అనుకోవద్దా ?... మానవత్వాన్ని మించిన , మతం గానీ, ఆచారం గానీ వుంటుందా .. ఏ మతం అయినా, ఎవరినీ బాధ పెట్టకు, అనే కదా చెప్పింది . " అన్నాడు రామారావు.

"ప్రాణ శక్తి, పరాశక్తి అవుతే , దేహం ఆలయం అంటారు . ఆలయం లాంటి దేహాన్ని , చివరగా మట్టిలో కలిపే వరకూ గౌరవించాలి కదా . కానీ ఎందుకో ప్రాణం పోగానే, ఆ దేహాన్ని , గౌరవించడానికి బదులు , . లేని పోని భయాలతో , అపోహలతో , ఈ విధం గానే దూరం పెడతారు. అదే, వేరే మతం లో , ఇటువంటి పరిస్థితే వుండడు . అందరూ వారి ఇంటికి వేళ్ళి , అన్ని రకాలుగా సాయం చేస్తారు.. నేను చూసాను . " అన్నాడు ప్రకాష్ .

అందరూ మాట్లాడుతున్నారే కానీ , ప్రెసిడెంట్ రమణ మూర్తి , మాత్రం మౌనం గానే వున్నాడు. వుండుండి , అటూ ఇటూ , చూస్తున్నాడు , ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు .

ఇంతలో , ఒక పది మంది యువకులు వచ్చారు .. వారిలో ఒకరు సుదర్శన్ గారిని భుజం మీద చేయి వేసి పక్కకి తీసుకు వెళ్ళాడు .

" ఏ ఆచారాలు అయినా మనం కల్పించుకున్నవే .. మీరు రమేష్ గారికి సహకరిస్తే అతని తండ్రి , అదే చనిపోయిన శంకరయ్య గారి , దీవెనలు , మీకుటుంబం పై వుంటాయి . ..నన్ను నమ్మండి ... అంతా శుభమే జరుతుంది . మీ ఇంట్లో , పెళ్ళి చక్కగా జరిపించే బాధ్యత మాది ... .."

" తెల్లబోయి చూస్తున్నాడు .. సుదర్శన్ .. సుదర్శన్ ఏమీ మాట్లాడకుండానే ,

". హలో ! అందరూ వినండి సుదర్శన్ గారు ఒప్పుకున్నారు .. ఇంక జరగాల్సిన కార్యక్రమం గురించి చూడండి, " అతని చేయి , సుదర్శన్ మీదనుంచి , తీయకుండానే అన్నాడు.

ఇంకొక అతను శ్రీ రామమూర్తి భుజాల మీద చేతులు వేసి , " సార్ ! మన మతం , 'ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు చేతనవుతే , సాయం చేయండి ' అనే కదా చెప్పేది . అంచేత , మీరు ఈవిధం గా అతనిని ఇబ్బం ది పెట్టకూడదు . . ఈ విధం గా ఇబ్బంది పెడితే నే , మీకు అశుభం ! . ..." ఆమాటలకి శ్రీ , రామమూర్తి కి, భయం వేసి అతనిని కళ్ళు అప్పగించి చూడసాగాడు.

" మీరు ఒప్పుకున్నారు !...ఒప్పుకున్నారు!!! ఒప్పుకున్నారు కదా ! !!..... అంటూనే శ్రీ రామమూర్తి గారు కూడా , ఇది గో, ఒప్పుకున్నారు !..... ." అన్నాడు

ఒక ఇద్దరు శ్రీరామమూర్తి ని, ఇంకో ఇద్దరు సుదర్శన్ ని , అక్కడనుంచి , బయటకి తీసుకు వెళ్ళారు.

ఇంకొక ఇద్దరు, రమేష్ ని కూడా తీసుకు పోయారు .. వారి వెనకే ఇంకో నలుగురు వెళ్ళారు.. వాళ్ళల్లో వాళ్ళే , అన్నీ పురమాయించుకుంటున్నారు, ....నువ్వు ఆ పని చేయి .నువ్వు ఈ పని చేయి అని...

అక్కడ , ఇంక మాట్లాడడానికి, ఏమీ లేక , అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు . కొంత మంది , రమేష్ కి సాయం చేయడానికి , ఆయుత్తమయ్యేరు.

ఎవరూ ఊహించని విధంగా, సాయంత్రం అయ్యేసరికి, కార్యక్రమం అంతా , దగ్గర వుండి చేయించడమే కాదు . ఆకుటుంబ సభ్యులకి, ఆహార సదుపాయాలు కూడా అమర్చడం జరిగిపోయింది..

ఊహించని ఈ పరిణామానికి , రమేష్ , అతని కుటుంబ సభ్యులు, తేలికగా ఊపిరి పీల్చుకున్నారు . వారికి సాయం చేయడానికి వచ్చిన , అందరికీ మనసులో నమస్కారం చేసారు.

అంతా సద్దుమణిగాక , సాయంత్రం , ఆఫీసు బయట నిల్చున్న రమణ మూర్తి ని , చూసి బయటకి వెళ్తున్న రామారావు , ఆగి అడిగాడు . " సాయం చేయడానికి వచ్చిన ఆ యువకులు ఎవరు ?" అని.

" వాళ్ళు మత మార్పిడికి , వ్యతిరేకం గా , ఉద్యమించే వాళ్ళు . హిందూ మత ప్రచార వేదిక వాళ్ళు . నేనే వాళ్ళ తో మాట్లాడి పిలిపించాను. .... ..." ఎవరయినా చనిపోతే , చనిపోయిన భౌతిక కాయాన్ని , ఇంట్లోకో , బిల్డింగ్ లోకో , తీసుకు రావడానికి వీల్లేదని , చావు ఇల్లు అంటూ , మైలు అంటూ , వాళ్ళని వేధించడం , అదే , హిందూ మత ఆచారం , అంటూంటే మన మతానికి ఏమి గౌరవం ? మీరు ఎందుకు ఖండించరు? ...

ఏ మతమయినా ,ఏ ఆచారమయినా , ఎవరికయినా , సాయపడేటట్లు వుండాలి . కష్టం వచ్చినప్పుడు. ఆదుకోవాలి, కానీ ఏదో ఒక పేరు చెప్పి , వాళ్ళని బాధ పెట్టడం , అవమానించడం , చేయకూడదు కదా.. .. ఇటువంటి ఆచారాలని ఖండించకపోతే , ఎప్పటికీ ఏ మార్పూ రాదు. ఒక వైపు, మత మార్పిడిలు వుండకూడదు , అనుకున్నప్పుడు , మరి దానికి అనుగుణం గా, సంస్కరించుకోవాల్సిన బాధ్యత , మనమీద వుంది కదా !.. " అంటూ, నేను చెప్పేది విన్నాక , వాళ్ళు పరిస్థితి ని , మేము చక్కపడతామని , ముందుకు వచ్చారు ..ఆ విధం గా కధ సుఖాంతమయింది. ఈ ఉదాహరణతో ఇంక ముందు కూడా , ఇటువంటి పరిస్తితులు రావు. ...."అన్నాడు రమణ మూర్తి నవ్వుతూ.

" మనిషి కి, మరణం చివరి మజిలి. శరీరం పూడ్చబడో , కాల్చబడో , మట్టిలో కలిసి పోవడం తో ఆ చివరి ప్రయాణం అంతమవుతుంది. .. ఆ ప్రయాణం, గౌరవం గా ,తేలికగా , జరగడానికి , అందరూ సాయపడాలి కానీ , అవమానాలతో వేధింపులతో , ఆప్రయాణాన్ని అల్లరిపెట్టకూడదు కదా . గొప్ప ప్రవచన కర్తలుకూడా , ఇటువంటి ఆచారాలని ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తూవుంటుంది. " అన్నాడు రామారావు.

" వాళ్ళే, ఒక విధం గా ఈ ఆచారాలని , ఇంకా బలిష్టం చేస్తున్నట్లు అనిపిస్తోంది ..." అన్నాడు , రమణమూర్తి .

అటు నుంచి వెళ్తున్న కుమార్ , వాళ్ళని చూసి ఆగాడు . వాళ్ళ వెనకే వుండి , వాళ్ళ మాటలు వింటున్న కుమార్ , "మానవత్వాన్ని మించిన మతం లేదు , అని మనిషి తెలుసుకునే రోజు , ఎప్పుడు వస్తుంది ? ఇటువంటి , అర్ధం లేని ఆచారాలు, ఎప్పుడు అంతమవుతాయి ?.... ఇంకా ఎన్నాళ్ళో ? ..." అన్నాడు

ఇద్దరూ, అతనికేసి ఒకసారి కుతూహలం గా, చూసి, " అవును !.." అన్నట్లు తల పంకించారు .

*****

మరిన్ని కథలు

Korukunna mogudu
కోరుకున్న మొగుడు
- కొడాలి సీతారామా రావు
Inquiry
ఇంక్వైరీ
- DR BOKKA SRINIVASA RAO
Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vruddhapyam varama? sapama?
వృద్ధాప్యం వరమా ? శాపమా?
- మద్దూరి నరసింహమూర్తి
Adigite cheptaa
అడిగితే చెప్తా
- కొడవంటి ఉషా కుమారి
Evaru takkuva kaadu
ఎవరూ తక్కువ కాదు!
- రాము కోలా దెందుకూరు
Sahajeevanam
సహజీవనం
- ప్రభావతి పూసపాటి