బట్టర్ ఫ్లై. ఎఫెక్ట్ - మణి

Butterfly effewct

శ్యామల , శరత్ , పెళ్ళి కి వెళ్ళి , ఇంటికి వచ్చారు . ఇంటికి రాగానే , ఇద్దరికి , ఎక్కడలేని , అలసటా అనిపించింది . దానికి కారణం లేక పోలేదు . వాళ్ళిద్దరికీ, పెళ్ళయి చాలా సంవత్శరాలు అయింది . పిల్లలు లేక పోవడం తో, ఎక్కడకి వెళ్ళినా , అదే అందరూ అడుగుతారు . దానితో, ఇద్దరికీ ఇబ్బందిగా నే వుంటుంది.

బట్టలు మార్చుకుని, ఒకసారి అద్దం లో చూసుకుంది. " తొందరగా, పిల్లలని కనండి ! ఆలశ్యం అయే కొలదీ , కానుపు కూడా , కష్టం అవుతుంది ." శరత్ పిన్ని మాటలు, గుర్తుకు వచ్చాయి .

తన కి, ఇప్పుడు నలభై ఏళ్ళు, దగ్గర పడుతున్నాయి . ' నేను పిల్లలని కనడం ' అనేది నా వ్యక్తి గత విషయం . " అది ఎందుకు అందరికీ చర్చించే విషయం అవాలి? ", అనేది, తనకి , ఎంత ఆలోచించినా అర్ధం కాదు . పైగా, అందరూ తనకి , సలహాలు, సూచనలు ! అదంతా , తన మీద ప్రేమ కాదు అని, తనకీ తెలుసు. వాళ్ళకీ తెలుసు. తను ఏదో సుఖ పడి పోతుందేమొ, అనే భావన నుంచే , అటువంటి సలహాలు, సూచనలు! ..ఎవరి మాటలని , తను లెక్క పెట్టదు కానీ , ఆ మాటలు అన్నీ , శరత్ కూడా వింటాడు. అతను బాధ పడుతాడు అనే , తనకి బాధ. అతనికి, పిల్లలు అంటే ఇష్టం . ఇద్దరమూ ఉద్యోగాలతో, పిల్లలకి, ఎంత వరకూ న్యాయం చేయగలమో అనేది , తనకి ఎప్పుడూ అనుమానమే . ఒత్తిళ్ళు ఎక్కువ అవుతే, ఇద్దరి మధ్యా తగవులు రావడానికి , ఎక్కువ సేపు పట్టదు, ఏమయినా పిల్లలని కనడం, ప్రశాంతం గా జరిగిపోతున్న జీవితాన్ని , చేచేతులా డిస్టర్బ్ చేసుకోవడమే, అనిపిస్తుంది.

అదీకాక చుట్టూ ఎక్కడ చూసినా అన్యాయాలు ...మోసాలు .. సెన్సిబుల్ మనుషులకి , బతుకే , యుద్ధం లాగ తయారవుతోంది. అటువంటిది, ' ఇంకో ప్రాణిని ఎటువంటి ధైర్యం తో ఇటువంటి ప్రపంచం లోకి తీసుకువస్తాం ? '

శరత్ తో తన అభిప్రాయం పంచుకుంది ఒకసారి . " నువ్వేమి నిర్ణయం తీసుకున్నా , నాకు అభ్యంతరం లేదు శ్యామలా ! " అన్న, అతని మాటలు , ఆమెకి , స్వాంతనం కలిగించాయి, అతని మీద , గౌరవం కూడా ఎక్కువ చేసాయి. ' అతనికి పిల్లలు అంటే ఇష్టం వున్నా , నా నిర్ణయన్ని గౌరవించడం , అతని సంస్కారమే ' అని అనుకుంటూనే వుంటుంది. కానీ అలా అనుకోవడం కూడా , ఆమె నిర్ణయం లో, ఏమి మార్పు తీసుకు రాలేదు .

అప్పుడప్పుడు శరత్ తల్లి కూడా , అంటూ వుంటుంది. " పిల్లలు వుంటేనే, ఇంటికి అందం .. ఇన్నేళ్ళయినా , పిల్లలు కలగ లేదంటే , డాక్టర్ కి చూపించుకోవాలి .. ..పిల్లలు లేకపోతే వంశం అంతరించి పోదూ " ఆవిడకి ఏమి సమాధానం చెప్పినా , ఆ విషయం మీద ఇంకాస్త చర్చ కి దారితీస్తుందని , ఆమె మౌనం గా వుండిపోతుంది. అయినా నేను ఎవరికయినా ఎందుకు సంజయిషీ చెప్పాలి ?ఎందుకు ఒప్పించాలి? . ఇది నాకు , శరత్ కి సంబంధించిన విషయం ... .గట్టిగా మాట్లాడితే , శరత్ కి కూడా ఏమీ చెప్పే అధికారం లేదు.

అయినా , పెళ్ళిళ్ళు , పిల్లలు కనడానికే అన్న భావన, అందరిలోనూ పాతుకుపోయింది. బయట పడడం తేలికకాదు .... ప్రపంచం ఏమవుతుందో ,, అనే భయపడే రోజుల్లో కూడా , పిల్లలు కనక పోతే, వంశం ఏమయిపోతుందో , అన్న భయం ఎక్కువ మందిని బాధించడం , హాస్యాస్పదం గా వుంటుంది.

ఈ విషయం లో అమ్మ కూడా ఏమీ తీసి పోలేదు . ఆమె కూడా ఏదో విధం గా ఒత్తిడి తీసుకు రావడానికి ప్రయత్ని స్తూనే వుంటుంది.. అమ్మకి అవుతే చెప్పింది , " ఇంకో ప్రాణిని, ఈ ప్రపంచం లోకి తీసుకు రావడం నాకు ఇష్టం లేదమ్మా " అంటూ. " ఇదేం విడ్డూరం ?...పిల్లలు వద్దను కోవడం ఏమిటి " అంటూ, ఇంకా అమ్మ మాట్లాడపోతుంటే, " శ్యామల చిన్న పిల్ల కాదు . ఆమెకి ఏమి కావాలో , ఆమెకితెలియదా ? .." అంటూ, నాన్న అమ్మని , మాట్లాడనివ్వడు . ఆయన కూడా, ఈ విషయం గురించి , ఏమీ మాట్లాడడు.

అలోచనల లోంచి, శరత్ పిలుపు , శ్యామలని ఈలోకం లోకి పడేసాయి.

" శ్యామలా! ..."

" వస్తున్నా !....."

" నేను పొద్దున్నే వెళ్ళాలి. రాత్రికి , వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు , లేవక్కర్లేదులే . అలారం పెట్టుకున్నాను. "

" అవును ! గుర్తుంది ! .. నువ్వు, నిన్నే చెప్పావుగా . 'సుధీర్ కి , సాయం చేయాలని!' ...." మళ్ళీ అంది ,

నేనూ పొద్దున్నే లేవాలి . నా కాలేజ్ స్నేహితులని రేపు కలుస్తున్నాం ! సోషల్ మీడియా ధర్మమా అని మళ్ళీ కాంటక్ట్ లోకి రాగలిగాం . పెళ్ళి కి వెళ్ళడం...... ఆ హడావిడిలో ఈ విషయం మర్చిపోయాను .." అంది శ్యామల నవ్వుతూ.

" ఎన్నో ఏళ్ళ తర్వాత కలుస్తున్నాము , ముగ్గురమూ . " అంది సంతోషం గా .

" చెప్పావు ! కళ్యాణి , పరిమళ ! .."

" ఆ! ఆ ! మేము ముగ్గురమూ చాలా క్లోజ్ గా వుండే వాళ్ళం .

ఇప్పుడు, కళ్యాణి, లెక్చరర్ . పరిమళ , ప్రోఫెసర్ . ...రేపు ఆదివారం కదా!... అందరికీ శెలవు . అందుకే , రేపు కలుద్దామనుకున్నాం .. ముందు, హొటెల్ లో కలుద్దామనుకున్నాం . కానీ , ఇంట్లో అవుతే , ఎక్కువ సేపు గడపవచ్చు , అని నేనే ప్రొపోజ్ చేసా , మన ఇంట్లో కలుద్దామని . ..." అంది శ్యామల సంతోషం గా

" చిన్న నాటి స్నేహితులని కలిసే అవకాశం, తక్కువ గా వస్తుంది. సో ! హేవ్ ఫన్ ! ఎంజాయ్ .." అన్నాడు శరత్ పడుక్కుంటూ .

" ఊ! ..." అంది శ్యామల తల ఊపుతూ . అంతసేపు, ఆమె మనసులో నిండినా ఆలోచనలు , ఆమెకి తెలియకుండానే , పక్కకి వెళ్ళిపోయాయి . వాటి స్థానం లో చిన్ననాటి స్నేహితులని, కలుస్తున్నానన్న ఆలోచన.... వాళ్ళ గురించిన జ్ఞాపకాలు , ... భావో ద్రేకం తో , చాలా సేపు ఆమెకి నిద్ర పట్టలేదు .

*****

శ్యామల ముగ్గురికీ, టిఫిన్, లంచ్, అన్నీ ఏర్పాటులు చేసి , ఆమె కూడా రెడీ అయి. గడియారం కేసి చూస్తూ... కూర్చుంది. ఆమెని , ఎక్కువ వైట్ చేయనివ్వకుండానే , పరిమళ, కళ్యాణి , ఒకరి తర్వాత ఒకరు , వచ్చారు. ముగ్గురూ ఒకరిని ఒకరు కౌగలించుకుని , కాస్సేపు భావోద్రేకాని కి ,గురి అయ్యారు . కుదుట పడ్డాక , కాఫీలు , టిఫిను లు, ముగించుకుని , పరస్పరం 'నీ గురించి చెప్పు !' అంటే ' నీ గురించీ చెప్పు ! ' అనుకున్నారు ...

" ఎందుకు గొడవ ! ..నేను , నాగురించి ముందుగా చెప్తాను " అంటూ ఉపక్రమించింది. పరిమళ.

" నేను, ఎంఏ ఫైనల్ లో , వుండగా , హఠాత్తుగా నాన్న గుండె పోటు తో చనిపోయారు. నేను చదువు ముగించుకొని లెక్చరర్ గా చేరి, ప్రొఫెసర్ అయ్యాను .. నాన్న పోయేడప్పటికి , తమ్ముడు , చెల్లి , చిన్న వాళ్ళు. వాళ్ళ బాధ్యత, నేను తీసుకోవల్సి , వచ్చింది. ఇప్పుడు, ఇద్దరూ ఉద్యోగాలు , చేసుకుంటున్నారు . పెళ్ళిళ్ళు అయి, పిల్లలు కూడాను . " అంది నవ్బుతూ పరిమళ.

" మరి నువ్వు ?.." అడిగింది కళ్యాణి .

" చదువు, బాధ్యతలలో , పడి పోయి , పెళ్ళి గురించి మర్చిపోయాను. గుర్తుకు, వచ్చినప్పుడు కూడా ,పెళ్ళి అయిన కొలీగ్స్ ని చూస్తూంటే , నాకు , పెళ్ళి చేసు కోవడానికి, ధైర్యం వచ్చేది కాదు . భార్యల మీదే, కాకుండా వాళ్ళ ఆస్తులు , సంపాదనల మీద కూడా , భర్తలదే పెత్తనం . అవన్నీ చూస్తూ , నేను , ఎవరి మీదా , నా జీవితాన్ని , ' బెట్ ' చేయ లేక పోయాను . నేను ఒక్కర్తెనే కాదు కదా. నాతో , తమ్ముడు చెల్లి , వాళ్ళ ఫ్యూచర్?? నేను ఆలోచించే ధైర్యం కూడా చేయలేదు...... ఇప్పుడు కూడా, నాకు ఆ విషయం ఆలోచించాలి అని అనిపించదు. ...నాకు ఈ విషయం లో రిగ్రెట్స్ కూడా ఏమీ లేవు. " కాస్సేపు వుండి మళ్ళీ అంది ,

" అమ్మ , " ఒక్కర్తెవే అయిపోతావు . ఇప్పుడేమి వయసు మించి పోయింది . పెళ్ళి చేసుకో !" అంటూ, అంటుంది . రోజూ మనం వినే వార్తలకి. ఎవరికయినా వివాహబంధం మీద నమ్మకం ఎలా కలుగుతుంది ? . పెళ్ళి చేసుకుని సుఖం గా వుండగలమని ఎవరయినా అనుకోగలరా అసలు ?..." నవ్వుతూ, శ్యామలని , కళ్యాణి నీ , చూసింది పరిమళ.

“ అది నా సంగతి ఇంక ... " అంటూ.

" నువ్వు చెప్పు , శ్యామలా ! నేను , నీతర్వాత అందుకుంటానులే " అంది నవ్వుతూ కళ్యాణి.

శ్యామల , " ఊ ! ..." మొదలు పెట్టింది . " నేను ఇంగినీరింగ్ చేసి , సాఫ్ట్ వేర్ కంపెనీ లో , ఉద్యోగం లో చేరాను. శరత్ నా కొలీగ్ . అతను, నాకు ప్రొపోజ్ చేసాడు. అతను , ప్రొపోజ్ చేసినపుడు , కాస్త కన్ ఫ్యూజ్ అయ్యాను. కానీ ఆలోచిస్తే , ' నో ', చెప్పడానికి , సరి అయిన కారణం , కనపడలేదు. అందుకే , ఇంటికి వచ్చి అమ్మ నాన్న ల తో , మాట్లాడమన్నాను . నా పెద్ద వాళ్ళకి , అతని పెద్ద వాళ్ళకి కూడా , వద్దనే టంత కారణం దొరకకో ఏమో , అంతా అంగీరంచిడం తో , మా పెళ్ళి సాఫీగా , ' ఏదో రాసి పెట్టి వుంది ' , అంటారు చూసారా !... ఆవిధం గా జరిగి పోయింది.

ఊ ! .... అంతా బాగానే వుంది ఇప్పటి వరకూ .. .. ఒకరకం గా నాది హేపీ మేరేజ్ " అంటూ ఆపింది శ్యామల .

" పిల్లలు లేరూ ? .." అడిగింది పరిమళ

" ఊహూ ! తల ఆడించింది శ్యామల ," లేరు ! " అన్నట్లు . కా స్సేపు వుండి, అంది." నాకు పిల్లలని కనడం ఇష్టం లేదు."

పరిమళ , కళ్యాణి , శ్యామల వైపు ఆశ్చర్యం గా చూసారు .

" పిల్లలు, పెద్ద బాధ్యత. ఇప్పుడు మేమిద్దర మే, కాబట్టి , ఆఫీసులో , పనిఒత్తిడి ఎక్కువ గా వుంటే , ఇంట్లో పని తగ్గించుకుంటూ , ఏదో మేనేజ్. చేస్తున్నాం. పిల్లలు వుంటే అలా కుదరదు కదా ! ... పిల్లలు వున్న , లేడీ కొలీగ్స్ , అప్పుడప్పుడు, చెప్తూ వుంటారు , " భర్త లు, పనులు షేర్ చేసుకోరు . పైగా. పిల్లలు పుట్టాక , వాళ్ళ ప్రవర్తనలోకూడా , మార్పు, వస్తుంది . అంత వరకూ, ప్రేమ చూపించే వాళ్ళు , హఠాత్తుగా పెత్తనం చేయడం , సాధించడం మొదలుపెడతారు.. " .. అవన్నీ వింటూ వుంటే , పిల్లలు కనడం అనేది , ఆలోచించాల్సిన , విషయం లా , అనిపిస్తుంది ఇప్పటికే , ఎన్నో రకాల ఒత్తిళ్ళు ! ఇంక , కొత్తగా కల్పించుకొని , ప్రశాంతం గా వున్న జీవితాన్ని కష్టపెట్టుకునే. అవసరం ఏమొచ్చింది ?! " ...అని అనిపిస్తుంది.

" నీ భర్త , ఈవిషయం లో, నీమీద, ఏఒత్తిడి తీసుకురాడా ? .." కళ్యాణి అడిగింది ..

" అతనికి , పిల్లలు ఇష్టమే ! ..కానీ , నేను , నా అభిప్రాయం చెప్పాక , అతను, నన్ను , కనాలంటూ ఒత్తిడి చేయలేదు .."

" నీ అత్తగారు , మావగారు.........?? ...." అడిగింది పరిమళ .

" ఊ ! అడుగుతారు .. కానీ నేను ఏమీ మాట్లాడను. ఎవరికి అయినా సంజాయిషీ ఇచ్చి , వాళ్ళని కన్విన్స్ ,

చేయాల్సిన అవసరం, నాకు కనపడలేదు. అలా చేసి. పెద్ద పెద్ద చర్చలకి నాంది పలికే , కుతూహలమూ నాకు లేదు. "

" .కానీ , నువ్వు, నీ అభిప్రాయానికి తగ్గ నిర్ణయాలు , నీ భర్త సహకారం లేకుండా , తీసుకోలేవుగదా .. నీ భర్త కూడా, మంచివాడే , అయి వుంటాడు. .." అంది కళ్యాణి .

" ఊ !....."అంటూ, ఊ కొట్టింది. శ్యామల.

అందరూ కొన్ని క్షణాలు మౌనంగా వుండి పోయారు . "నువ్వు చెప్పు ..." , అన్నారు పరిమళ , శ్యామల కల్యాణి కేసి చూస్తూ .

కల్యాణి , వాళ్ళకేసి , ఒకసారి చూసి, చెప్పడం మొదలు పెట్టింది. " మధు, అదే నా భర్త. .. చెప్పుకోడానికి మాఇద్దరిది ప్రేమ వివాహమే కానీ, ఒక్క పని లో, సాయ పడదు . అన్నీ పనులు , ఒక్కర్తెనే చేసుకోవడం !!!.... ఎంత కష్టమో , చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఎన్ని చెప్పినా , మగవాళ్ళు , పనులలో , సాయం చేయడం వుండదు . ఉద్యొగం , ఇంటిపని , బాబు

సంరక్షణ కష్టం గానే వుంటుంది . మీ కోలీగ్స్ చెప్పింది, చాలామంది విషయం లో, నిజమే . ..." అంది కళ్యాణి .

" పని అంతా, ఒక్కరే చేసుకుపోవాలంటే , ఎంత సద్దుకు పోదామనుకున్నా , ఒకప్పుడు కాకపోతే , ఒకప్పుడయినా , కోపం రాకుండా , కూడా , వుండదు .. " అంది శ్యామల .

" ఊ ! .....వస్తుంది . కానీ గొడవలు ఏమి పెట్టుకుంటాం శ్యామలా ? ..." అంది కళ్యాణి.

ముగ్గురు కాస్సేపు మౌనం గా వుండిపోయారు .

"ఏమయినా , వైవాహిక జీవితం , చాలా కంప్లికేటెడ్ . నేను పెళ్ళి మానేసి, మంచి పని చేసాను, అనిపిస్తుంది. " అంది పరిమళ, నవ్వుతూ .

కళ్యాణి , శ్యామల కూడా నవ్వారు.

" కళ్యాణీ , ఎవరిని అయినా , సాయం చేయడానికి , పెట్టుకోకపోయావా ? .." అని నవ్వుతూ శ్యామల .

" అవును. కానీ, దానికీ , ఒప్పుకోడు. నా జీతం అంతా , అతని చేతిలో పెట్టాలి . అతను ఏమి చెపితే , అది చేయాలి .." వచ్చీ రాని , నవ్వు నవ్వుతూ అంది కళ్యాణి .

పరిమళ , శ్యామల ఆశ్చర్య పోయారు .

" అదేమిటి ? నీ కష్టం గురించి , కాస్త కూడా , ఆలోచించడా ? మళ్ళీ , ప్రేమించి పెళ్ళి చేసుకున్నాము , అంటున్నావు ? .." అంది పరిమళ.

" ఏం చెప్పమంటావ్ ? శ్యామల చెప్పిందిగా , వాళ్ళ కొలీగ్స్ అనుభవాలు. పెళ్ళికి ముందు చూపించే, ప్రేమ, పెళ్ళి అయ్యాక , వుండదు . పెళ్ళి అయ్యాక , అంతా మారిపోతుంది . ' నేను చెప్పాలి ! నువ్వు వినాలి ! ' , అన్నట్లే వుంటాడు. అతనే కాదు. మగవాళ్ళు చాలామంది , ఆవిధం గానే వుంటారు , అనుకుంటా . .." అంది కళ్యాణి

" ఎన్నో ఏళ్ళ, కండిషనింగ్ ఎక్కడ పోతుంది.?... ' నాలానే, నా భార్య , ఉద్యోగం చేస్తోంది. అలాంటప్పుడు నేను కూడా ఇంటి పనుల్లో, సాయ పడాలి కదా! ', అని , అనుకోవాలి కదా ?! ఎందుకు అనుకోరో ?? . అయినా , నీకంటూ, కాస్త డబ్బు పక్కన పెట్టుకోవాలి , జీతం అంతా, అతని చేతిలో పేడితే , ఎలాగా ? .." పరిమళ కాస్త కోపం గా అంది.

" చెప్పినంత, సులువుగా వుండదు , ఈ విషయం, పరిమళా ! ....పైగా, బాబు వున్నాడు. నేను ఏమన్నా, గొడవలు అవుతాయి . బాబు మధ్యలో నలిగి పోతాడు. "

" అదే లే !! .. అదే , నీ భర్త కి , నీ మీద , ఎక్కువ పెత్తనం చేయగలిగే , లెవరేజ్ కూడా .." అంది పరిమళ .

" కళ్యాణి చెప్పినట్లు , మగవాళ్ళు , వాళ్ళ అంతట , వాళ్ళు , బాధ్యత తీసుకుని ప్రవర్తించకపోతే , ఏమి మాట్లాడినా గొడవలే అవుతాయి , పరిమళా ! . " అంది , శ్యామల .

" కానీ , భార్య భర్త ఇద్దరూ , ఒకరిని ఒకరు గౌరవించుకుని , అర్ధం చేసుకుని , ఒకళ్ళకి ఒకళ్ళు సాయం గా వుంటేనే, కదా సంసారం సజావుగా జరుగేది . లేకపోతే , ఎవరో ఒకరు , బాధపడక తప్పదు. ఎక్కువ గా అది భార్యే అవుతుంది . " అంది పరిమళ

" అంత సజావుగా, ఎవరి సంసారాలు , వున్నాయి పరిమళా ?! ఒకవేళ , భార్యా భర్తలు ఇద్దరూ , అన్యోన్యం గా వున్నా ,

ఇంక చుట్టాలు , ఇరుగు పొరుగు , ....అందరూ , వాళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి , వాళ్ళు, ప్రేమగా వుండకుండా వుండడానికి , ఎవరి వంతు, వాళ్ళు వదలకుండా కృషి చేస్తూనే వుంటారు. ఇంక ,తల్లి తండ్రులు కూడా , తెలిసో తెలియకో , భార్యా భర్త ల మధ్య అపార్థాలకి , కారణం అవుతూనే , వుంటారు . అటువంటప్పుడు , ఏ సంసారం అయినా సజావుగా ఎలా వుంటుంది? .." అంది కళ్యాణి.

" ఊ !.... అదీ నిజమే " అంటూ , తల ఊపారు, పరిమళ , శ్యామల.

" ఊ ! ఈ గొడవలు అన్నీ వింటూంటే , పెళ్ళి చేసుకోకపోవడ మే , మంచిది. పెళ్ళి చేసుకున్నా, పిల్లలని కనడం కూడా శ్యామల చెప్పినట్లు , ఆలోచించాల్సిన విషయమే . అనిపిస్తుంది. " ..అంది పరిమళ .

" పిల్లలని, ఈ ప్రపంచం లోకి తీసుకు రావడం , ఒక విధం గా , వాళ్ళకి అన్యాయం చేయడం ఏమో అని , అనిపిస్తుంది. రోజూ మన చుట్టూ జరిగే , రక రకాల మోసాలు, అన్యాయాలు వింటూ , ఏధైర్యం తో , పిల్లలని, కంటారు చెప్పు ?? ... పైగా, ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరుగుతుందో తెలియదు. అన్ని దేశాల దగ్గర , న్యూక్లియార్ బాంబులు , రసాయనిక ఆయిధాలు .....'ఏవిధం గా , ఉపయోగిస్తారో ?! ', అనే భయం అందరికీ వుంది. అటువంటప్పుడు , కాస్త సెన్సిబిలిటీ వున్నా , పిల్లలని కని , ఈ ప్రపంచం లోకి తీసుకు వచ్చే, ధైర్యం చేయరు . ఆలోచిస్తారు ."... అంది శ్యామల .

" ఇవన్నీ చూసే , కొన్ని దేశాలలో , ఆడవాళ్ళు , పెళ్ళి చేసుకోడానికి , పిల్లల్ని కనడానికి, ఇష్ట పడటం లేదట .

అందుకే , ఆ దేశాల జనాభాల లో , చిన్న వయసు వాళ్ళు , తక్కువ అవుతున్నారని , వార్తల్లో వింటున్నా ! " , అంది పరిమళ.

" వేరే దేశాలు ఎందుకే ?! , మన దేశం లో నే చూడు ! . ఆడపిల్లల సంఖ్య, తక్కువ , అవుతోందంటున్నారు .

ఆడపిల్లలు పుట్టకూడదని , మొక్కుకోడాలు , పుడితే చంపెయ్యడాలు! ఆడపిల్లల తల్లి తండ్రులు , ఎప్పటికీ తలదించుకుని , బతకడాలు ... వాటన్నిటి, పరిణామమే కదా , ఇప్పుడు ఈ విధం గా , జనభాలో, ఆడ పిల్లల సంఖ్య తగ్గడం . ." ...అంది శ్యామల .

" ఎవరి కయినా, కర్మ ఫలితం అనుభవించక తప్పదు కదా! ... సమాజానికి, అయినా అంతే ! . ఇప్పటికే ఆడవాళ్ళ జనభా తగ్గింది అంటున్నారు. కొన్నాళ్ళకి , మొత్తం జనాభా లోనే మార్పు రావచ్చు . క్రమేణా , శ్యామల లాగ , పిల్లలని కనకూడదు , అనుకునేవాళ్ళూ , ఎక్కువ కావొచ్చు . నా లాగా , పెళ్ళే చేసుకోకూడదు, అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవచ్చు . అప్పుడు జనభా తగ్గక ఏమవుతుంది?! " అంది పరిమళ.

శ్యామల నవ్వుతూ అంది ,

" నేను ఛాట్ జీపీటీ ని , ఒకసారి సరదాగా అడిగాను " నేను పిల్లలని , కనకూడదు అనుకుంటున్నా , ఏమంటావు ? "

అని . అదేమందో తెలుసా ? .... " ప్రపంచం లో ఎక్కడ చూసినా అశాంతే ! అన్ని సంబంధాలు, వ్యాపార సంబంధాలు అయిపోయాయి . లాభ నష్టాల బేరీజులోనే , బతుకు గడిచిపోతుంది. ఇటువంటి ప్రపంచం లోకి, పిల్లలని కనడానికి , సెన్సిబుల్ వ్యక్తులు , ఎవరయినా, ఆలోచిస్తారు . నీ ప్రశ్న బట్టి , నువ్వు సెన్సిబుల్ వ్యక్తివి అని అర్ధమవుతోంది. పిల్లలని కనకూడదనే నీ నిర్ణయం మంచిదే ! నీకు పిల్ల ల మీద , కాస్త కోరిక ఎమయినా వుంటే !, బేబీ సాఫ్ట్ వేర్ లోడ్ చేసిన , ఏఐ బెబీ లు , మార్కెట్లో , దొరుకుతున్నాయి. దానితో నీ కోరిక తీర్చుకోవచ్చు . ." "

నవ్వుతూ అంది శ్యామల .

పరిమళ , కళ్యాణి కూడా నవ్వారు ". బాగా చెప్పింది " అంటూ.

" ఆ ! ఆ! .... ' బేబీ ఏఐ ' .గురించి , మార్కెటింగ్ కూడా ....బహుశః , ముందు ముందు , ఏఐ లు , ఉద్యోగాలే కాదు, అన్ని రెలేషన్స్ ని కూడా, రిప్లేస్ చేస్తాయి ఏమో ! " అంటూ నవ్వింది శ్యామల .

" ఇది, ఒక విధం గా , " బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ " లాంటిదేమో . కుటుంబాల్లో , లాభ నష్టాల బేరీజులు , అధికార పోరాటాలు , వేధింపులు , జరుగుతూంటే , కుటుంబ వ్యవస్థ, పడిపోడానికి , ఎన్నాళ్ళో పట్టదు. కళ్యాణి లాంటి ఆడవాళ్ళు, భూదేవంత ఓర్పుతో , కుటుంబ వ్యవస్థ ని బతికిస్తూ వచ్చారు , ఇన్నాళ్ళు . కానీ, వాళ్ళని చూస్తూ, కొందరు పెళ్ళి మాను కోవచ్చు . కొందరు పిల్లలని కనడం మానేయొచ్చు . . క్రమేణా , ఏదో ఒకరోజు , మనుషుల మనుగడకే , ముప్పు రాక తప్పదు . అప్పుడు , ' ఛాట్ జీ పీ టీ ', చెప్పినట్లు , ' బేబీ ఏఐ ' లే కాదు అంతా ' ఏఐ లే ' వుంటాయి . ప్రపంచం అంతా యంత్రాలే అదే 'ఏ ఐ లే ' వుంటాయేమో ! ..." అంది పరిమళ , కాస్త గంభీరం గా , కాస్త నవ్వుతూ.

" అవుతే మనుషులు అంతరించి పోతారంటావా ? ...కళ్యాణి నవ్వుతూ అడిగింది ఆశక్తిగా .

" అఫ్కోర్స్ ! నీలాంటి వాళ్ళ బాధ ని చూసి, నాలాంటివాళ్ళు , పరిమళ లాంటివాళ్ళు , ఎక్కువ అవుతే , అంతే మరి ! ..బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ .! ...." అంది శ్యామల నవ్వుతూ.

"కబుర్లుల లో సమయమే తెలియలేదు." , అంటూ సాయంకాలం అవగానే కళ్యాణి, పరిమళ , " ఇంక వెళ్తాము " అంటూ , లేచారు .

వాళ్ళు వెళ్ళాక , వాళ్ళ కబుర్లు మననం చేసుకుంటూ , ఇల్లంతా , ఒకసారి , సద్దుకుని శ్యామల , రాత్రి వంట పూర్తిచేసింది . శరత్ కోసం నిరీక్షిస్తూ , కళ్యాణి గురించి , పరిమళ చెప్పిన ' బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ ' గురించి ఆలోచిస్తూ , ' కాజ్ అండ్ ఎఫెక్ట్ ' అన్నిటికీ , వుండకుండా వుండదు కదా ! ' వ్యక్తులకి , సమాజానికి. , దేశానికి , ఆపైన ప్రపంచానికి , అన్నిటికీ,.... ....అది , వర్తిస్తూనే వుంటుంది ... ..అది , అందరూ , ఎప్పటికప్పుడు , గుర్తు చేసుకుంటూ, దానికి, తగ్గట్లు ప్రవర్తించకపోతే , మనిషి మనుగడ కష్టమే అవుతుందేమో ... అనుకుంది శ్యామల .

******

మరిన్ని కథలు

kanuvippu
కనువిప్పు!
- బోగా పురుషోత్తం
Korukunna mogudu
కోరుకున్న మొగుడు
- కొడాలి సీతారామా రావు
Inquiry
ఇంక్వైరీ
- DR BOKKA SRINIVASA RAO
Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vruddhapyam varama? sapama?
వృద్ధాప్యం వరమా ? శాపమా?
- మద్దూరి నరసింహమూర్తి