
హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లో తాన్య అనే చిన్నారి తన తల్లిదండ్రులతో, తాతయ్యతో కలిసి ఉండేది. తాన్య 6వ తరగతిలో చదువుతోంది. చాలా చురుకైన అమ్మాయి. కానీ ఒక అలవాటు ఉంది. తాన్య ఎవరైనా భిన్నంగా కనిపిస్తే వారిని సరదాగా ఆటపట్టించడం ఇష్టం.అంతేకాక తెలిసో తెలియకో తాన్య వేసే జోకులు ఇతరుల మనసుకు కష్టం కలిగించేవిగా వుండేది. ఒక్కర్తే కూతురు కావడం వలన తాన్యను అపరిమితంగా గారాబం చేసిన ప్రవర్తనను ఆమె తల్లిదండ్రులు మానిపించేందుకు ప్రయత్నించలేదు. పైగా అదొక సరదా అని సరిపెట్టుకున్నారు.
ఆమె క్లాసొ లో ఆకాశ్ అనే కొత్త అబ్బాయి చేరాడు.వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే వుండడంతో పాటు తాన్యతో పాటే స్కూలు బస్సులో వచ్చేవాడు. ఆకాశ్ ఒక ప్రమాదంలో కాలు గాయపడడంతో వాకింగ్ స్టిక్ సాయంతో నడిచేవాడు. పిల్లలు మొదట అతనితో స్నేహం చేయడానికి మొహమాటపడ్డారు. కానీ తాన్య మాత్రం అతని నడకను చూసి సరదాగా జోకులు వేసేది. “వాకింగ్ స్టిక్ హీరో, లంగడా బందా (కుంటి కుర్రాడు) ” అంటూ పిలుస్తే, పిల్లలంతా నవ్వేవారు. ఆకాశ్ మాత్రం మౌనంగా తలదించుకుని కూర్చోేవాడు.తనకు ఇటువంటి ప్రవర్తన కొత్తేమీ కాదు
ఇలా తరచూ ఆకాశ్‌ని ఆటపట్టిస్తున్న తాన్య ప్రవర్తనను ఒకసారి ఆమె తాతయ్య గమనించాడు.ఇది మంచి పద్ధతి కాదని ఎలాగైనా తాన్య ప్రవర్తనను సరిదిద్దాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక రోజు రాత్రి భోజనానికి ముందు ఆమెను తన దగ్గర కూర్చోబెట్టుకుని మెల్లగా అన్నాడు:
“తాన్యా, రేపు ఇంటర్నేషనల్ కంపాషన్ డే. దాని అర్థం నీకు తెలుసా? కంపాషన్ అంటే దయ. మనసులో కరుణ ఉంటే మనం ఇతరుల బాధను అర్థం చేసుకోగలం. మనం సరదాగా వేసే మాటలు కొన్నిసార్లు వారికి గాయపరచవచ్చు. కానీ మనం వారిపై ప్రేమ, జాలి చూపిస్తే, వారి మనసులో వెలుగు పుడుతుంది.మన ప్రవర్తన సరదాగా వుండవచ్చు. కాని అది హద్దులు దాటితే మాత్రం మంచిదికాదు. అది ఇతరుల మనస్సును గాయపరచేదిగా వుండకూదదు.”
తాతయ్య మాటలు తాన్య మనసులో ముద్ర వేశాయి. ఆమె ఆకాశ్‌ను గుర్తు చేసుకుంది. తన జోకులతో అతన్ని ఎంత బాధపెట్టిందో అర్థమైంది.
మరుసటి రోజు స్కూల్ బస్‌లో ఆకాశ్ సీటులో ఇటు ఇటూ గాభరాగా చూస్తున్నాడు.. అతని వాకింగ్ స్టిక్ జారి కింద పడిపోయింది.అది దూరంగా పడిపోవడం వలన సీటునుండి లేచి అందుకునేందుకు అవస్థలు పడుతున్నాడు. ఆకాశ్ అవస్థను చూస్తున్న ఇతర పిల్లలు సరదాగా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ హేళన చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే తాన్య నవ్వేసేది. కానీ ఆ రోజు ఆమె వేరేలా ప్రవర్తించింది. వెంటనే వాకింగ్ స్టిక్ తీసి ఆకాశ్‌కి ఇచ్చి, “నువ్వు నా పక్కనే కూర్చో” అంది.
ఆ చిన్న ప్రేమతో కూడిన జాలితో ఆకాశ్ ముఖంలో చిరునవ్వు మెరిసింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ స్నేహితులయ్యారు. ఆ రోజు తాన్య ఇతర పిల్లలకు చెప్పింది:
“ఆకాశ్ బలహీనుడు కాదు. అతను ధైర్యవంతుడు. మనం ఆటపట్టించకుండా సాయం చేస్తే అతనికి ఆనందం కలుగుతుంది.”
తర్వాత ఆకాశ్ తనకు ఉన్న ప్రత్యేక ప్రతిభను చూపించాడు. అతను ఫ్లూట్ బాగా వాయించేవాడు. క్లాస్‌లో అందరిముందు కొన్ని మధురమైన స్వరాలు వాయించాడు. ఆ స్వరాలు విన్న పిల్లలందరూ మంత్ర ముగ్ధులయ్యారు. ఆకాశ్ నవ్వుతూ అన్నాడు:
“మీకు కూడా నేర్పుతాను. మనం అందరం కలిసి ఒకరోజు ఫ్లూట్ కచేరీ పెట్టేద్దాం!”
పిల్లలందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. తాన్య అతని పక్కన నిలబడి గర్వంగా అనిపించింది.
సాయంత్రం తాతయ్య దగ్గరకు వెళ్లి తాన్య ఆనందంగా చెప్పింది:
“తాతయ్యా, నిజమైన బలం చేతుల్లో కాదు, హృదయంలో ఉంటుంది. దయతో మనసు నిండినప్పుడే మనం గొప్పవాళ్లం అవుతామని ఈ రోజే తెలుసుకున్నాను. ఇకపై ఎవరినీ గేలి చెయ్యను. వీలైతే మన కంటే బలహీనులపట్ల ప్రేమ, దయ చూపించి వారికి నాకు చేతనైనంతగా సహాయం చెస్తాను ”
తాతయ్య ఆమెను హత్తుకుని ఆనందపడ్డాడు.
దయ చిన్నదైనా, దాని శక్తి అపారం. ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక చిరునవ్వు—వీటితో మనం ఎవరి జీవితాన్నైనా వెలుగులా మార్చగలం