దేనికైనా లాభనష్టాల లెక్కలు వేసుకొనే మన్మధరావు, తన గుండెకు సంబంధించి జరగవలసిన శస్త్రచికిత్సకు ఖర్చు ఎంత అని తెలుసుకొనే ప్రయత్నంలో ఆ మొత్తం విని, గుండె బరువెక్కి అవసరానికి మించి జోరుగా కొట్టుకోసాగింది.
పుత్రరత్నాన్ని దగ్గరకు పిలిచి “ఇప్పుడు నా జీవితం నీ చేతిలో ఉందిరా నాయనా” అని కంట నీరు పెట్టుకోనారంభించేడు.
“నన్ను ముందు వైద్యుడితో మాటలాడనివ్వు” అని సుమారు ఇరవై నిమిషాల తరువాత తండ్రి దగ్గరకు వచ్చిన కుబేరుడు –
“వైద్యుడితో మాటలాడేను నాన్నా. నీకు త్వరలో తప్పనిసరిగా చేయవలసిన శస్త్రచికిత్సకు తక్కువలో పది లక్షలు ఖర్చు అని ఇందాకనే చెప్పేరు కదా. శస్త్రచికిత్స చేసినప్పుడు ఏమైనా సమస్యలు వస్తే, మరింత ఖర్చు పెరగవచ్చు అని ఇప్పుడు చెపుతున్నారు. దేనికైనా లాభనష్టాల లెక్కలు వేసుకొనే నీ అలవాటుతో, జీవితభీమా మాట దేముడి కెరుక కనీసం ఆరోగ్యభీమా కూడా మనలో ఎవ్వరికీ లేదు. కాబట్టి, ముందుగా పది లక్షలు జమచేసిన తరువాతనే శస్త్రచికిత్స చేస్తామని నిర్మొహమాటంగా చెప్పేరు”
“శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తానంటారు వైద్యుడు”
“ఉండు, తక్కిన వివరాలు కూడా విను”
“ఇంకా ఏమిటి వినాలిరా”
“నీ గుండెకు శస్త్రచికిత్స చేసుకొనే ముందర బోలెడన్ని విషయాలు ఆలోచించాలి. కావలసిన లెక్కలు వేసి అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాలి”
“త్వరగా శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణానికి ప్రమాదం అని వైద్యుడు అంటూ ఉంటే, ఇప్పుడు లెక్కలు వెయ్యాలంటావు ఏమిటిరా”
“నీవు నేర్పిన విద్యయే నాన్నా. నీవు నాతో ఎలా వ్యవహరించేవాడివో ఒక్కసారి గుర్తు తెచ్చుకో”
మన్మధరావు కొడుకుతో ఎలా వ్యవహరించేవాడో గుర్తు చేసుకొసాగేడు.
మన్మధరావు ఎప్పుడూ --
‘వాస్తవంగా ఆలోచించాలి, నేల విడిచి సాము చేయకూడదు, గాలిలో మేడలు కట్టకూడదు, పైసా ఖర్చు పెడితే కనీసం పావలా లాభం పొందాలి’ -- అని సలహాలు ఇస్తూ ఉంటాడు.
కళాశాలలో అడుగుపెట్టడానికి సిద్ధమైన పిల్లాడిని దగ్గర కూర్చుండపెట్టుకున్న మన్మధరావు –
“చూడు బాబూ, నేను నీకు ‘కుబేరుడు’ అని పేరెందుకు పెట్టేనో తెలుసా”
“తెలియదు నాన్నా”
“నీ ద్వారా కుబేరుడు దగ్గర ఉండేటంత డబ్బు మన దగ్గర సమకూరాలని నీకు ఆ పేరు పెట్టేను. నీవు చేయవలసినదల్లా, ఖర్చు తగ్గించుకొని ఆదాయవనరులు పెరిగే మార్గంలో నడవడమే. నువ్వు ఏమి చదవాలనుకున్నా – ఆ చదువుకు ఎంత ఖర్చు అవుతుందో అంతకు పదింతలు ఆదాయం చేకూర్చుకోగలవో లేదో ఆలోచించి, నిర్ణయానికి రా”
“నేను అన్నీ ఈసరికే ఆలోచించేను నాన్నా. ఇక్కడ వైద్య విద్య చదువుతాను, విదేశంలో ఏదైనా ప్రత్యేక తరహా వైద్య విద్య కూడా చదువుకొని, అక్కడే వైద్యవృత్తి చేసి, బోలెడంత డబ్బు సంపాదించేయడమే. అదే నా కల”
“నీ కల వినడానికి చాలా బాగుంది. అదే కల నెరవేరడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చుచేసినంతకు పదింతలు ఆదాయం వస్తుందా అని ఆలోచించేవా”
“అవన్నీ ఇప్పుడే ఆలోచిస్తూ కూర్చుంటే వైద్య ప్రవేశపరీక్షకు కూడా చదవలేను నాన్నా”
“ప్రవేశపరీక్షలో మంచి శ్రేణిలో నీవు ఉత్తీర్ణుడవు కాకపోతే, ప్రభుత్వ వైద్యకళాశాలలో ప్రవేశం రాదు కదా”
“నువ్వు ఈనాము (డొనేషన్) ఇస్తే బేసర్కారు (ప్రైవేట్) వైద్యకళాశాలలో తప్పకుండా వస్తుంది”
“పోనీ అలాగే చదివేవు అనుకున్నా -- ఇక్కడ చదవడానికి, నిన్ను విదేశానికి పంపడానికి, విదేశంలో చదువుకుందికి, అక్కడ నువ్వు ఉండడానికి తినడానికి తిరగడానికి అన్నిటికి కలిపి బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది తెలుసా”
“అది నాకు కాదు నీకు తెలియాలి నాన్నా”
“పోనీ అంత డబ్బు ఎక్కడనుంచి వస్తుంది అన్నదేనా కనీసం తెలుసా”
“తెలుసు నాన్నా. బాంకులో అప్పు తీసుకుంటే సరి”
“ఆ అప్పు తీర్చడం ఎలాగా అన్నది కూడా ఆలోచించాలి కదా”
“అందుకే నేను విదేశంలోనే ఉద్యోగం చేసి నీకు డబ్బు పంపిస్తాను, నువ్వు బాంకులో కట్టేద్దువుగాని”
“కీడెంచి మేలెంచమన్నారు కాబట్టి, ఏదైనా కారణం వలన నువ్వు డబ్బు పంపించకపోతేనో”
“అన్నీ ఇప్పుడే ఆలోచిస్తూ కూర్చుంటే, భవిష్యత్తులో ఆలోచించడానికి ఏమీ మిగలవు నాన్నా”
“కానీ నేను ఇప్పుడే ఆలోచించేను. ఏదైనా కారణం వలన నువ్వు డబ్బు పంపించకపోతే, బాంకు వారు అప్పు తీర్చమని నన్ను పట్టుకుంటారు తెలుసా. అందుకే తక్కువ ఖర్చుతో తేలిపోయే చదువుతో సరిపెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగంలో చేరు. వీలు కాకుంటే, బాంకులో ఉద్యోగం సంపాదించి బాగుపడు”
“నాకు వైద్యవిద్య చదవాలని ఉందంటే సరిపెట్టుకోవాలంటూ ఈ పిసినారి పితలాటకం ఏమిటి నాన్నా”
“నాకూ మన దేశ ప్రధాని అవాలనే ఉంది, నేను సరిపెట్టుకోలేదూ”
“నీకు కన్నకొడుకు జీవితం మీద కూడా ఖర్చు ఆదాయం లెక్కలే కనిపిస్తున్నాయా”
“నీలా నేను కలలు కనను, నేల విడిచి సాము చేయను. వాస్తవంగా ఆలోచిస్తాను కనుక కన్నకొడుకువైన నీ జీవితం మీద కూడా లెక్కలు వేసుకోవలసి వస్తోంది”
“నువ్వు నీ లెక్కలు అలా ఉన్నీ. ముందు ఇది చెప్పు - ఉద్యోగం దగ్గరకు వచ్చేసరికి, ‘వీలైతే ప్రభుత్వ ఉద్యోగంలో చేరు. వీలు కాకుంటే, బాంకులో ఉద్యోగం సంపాదించి బాగుపడు’ అంటావేమిటి?”
“ప్రభుత్వంలో ఉద్యోగం దొరికితే రెండు చేతులా సంపాదించగలవు. ఆ ఉద్యోగం సంపాదించుకొనేందుకు బోలెడంత ఖర్చు పెట్టినా, అంతకు పదింతలు సులువుగా సంపాదించుకొనే అవకాశం ఉంటుంది. ఖర్చుపెట్టినా ప్రభుత్వ ఉద్యోగం దొరికే అవకాశం లేనప్పుడు, బాంకు ఉద్యోగం సంపాదించి కడుపులో చల్ల కదలకుండా జీవితంలో సుఖపడు”
అలా బలవంతపు చదువుతో వాణిజ్యంలో పట్టా పొందిన కుబేరుడు, రెండు చేతులా ఆదాయం దొరికే అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడిపోయేడు.
అలా స్థిరపడడానికి, అవసరమైన మదుపు (లంచం) కొడుకుకి అప్పుగా ఇస్తూ –
ఆ అప్పు వడ్డీతో సహా తీర్చేవరకూ – కొడుకు ఎడమచేతి మీద హక్కు తనదే అని కొడుకు చేత కన్నతల్లి మీద ఒట్టు పెట్టించుకున్నాడు మన్మధరావు.
లెక్కలతో బరువెక్కిన గుండెకాయ ఇప్పుడు మన్మధరావును ఆసుపత్రి మెట్లు ఎక్కించింది.
“గుండె సమస్యతో ఆసుపత్రికి వెళ్లవలసిన నన్ను ఏ కారులోనో లేక ఆసుపత్రివారి అత్యవసర వాహనం లోనో తీసుకొని వెళ్ళక ఆటోలో తీసుకొని వెళ్తున్నావేమిటిరా” అన్న తండ్రితో –
“నిన్నే ఆదర్శంగా నమ్ముకున్న నేను బ్రతుకుతావో లేదో అన్నట్టున్న నీమీద ఎక్కువగా ఖర్చు పెట్ట తలచుకోలేదు. అందుకే ఈ ఆటో ప్రయాణం” –
అంటున్న కొడుకు వైపు చూస్తూ ---
ఏడుపు ఆపుకోలేకపోయేడు మన్మధరావు.
కుబేరుడు కొనసాగిస్తూ –
“ఇప్పుడు శస్త్రచికిత్స చేసినా, రెండు మూడేళ్లు కంటే ఎక్కువ నువ్వు బ్రతుకుతావని హామీ ఇవ్వడం కష్టమని వైద్యులవారు ఉవాచ. పోనీ నువ్వు మూడేళ్లు పూరా బ్రతుకుతావు అనుకున్నా ---
బ్రతికిన్నన్నాళ్లూ ప్రతీ నెలా ఆసుపత్రికి వచ్చి చూపించుకుంటూ ఉండాలట. అందుకు నెలనెలా అయే ఖర్చు లెక్కపెడితే, మూడేళ్లలో వైద్యులవారి దర్శనానికే సుమారు 50వేలు ఆసుపత్రికి జమచేయాలి. పైగా, మధ్యమధ్యలో చేయించుకోవలసివచ్చే వైద్య పరీక్షలకు తక్కువలో మరో 50వేలు ఖర్చవుతుందట. ఇవన్నీకాక నెలనెలా మందులకు అయే ఖర్చు మూడేళ్ళకి కలిపి తక్కువలో రెండు లక్షలు అవుతుందట. ఆసుపత్రికి వచ్చి వెళ్ళేందుకు అయే ఆటో ఖర్చు మూడేళ్లకు కలిపి మరో 30వేలు వరకూ ఉంటుంది. అంటే, శస్త్రచికిత్సతో కలిపి మొత్తంగా సుమారు 14 లక్షల వరకూ ఖర్చు తేలింది. పైగా, నీకు శస్త్రచికిత్స చేసినప్పుడు ఇంకా ఏమైనా సమస్యలు వస్తే, అదో ఎక్కువ ఖర్చు అని ముందే చెప్తున్నారు. కాబట్టి, ఎప్పుడూ నువ్వు వేసే లాభనష్టాల లెక్కల ప్రకారం, మూడేళ్ళ కంటే ఎక్కువ బ్రతకని నీకు అంత ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్స చేయించడం పూర్తిగా అనవసరం అని తేల్చవలసి వస్తోంది”
“ఈ ఆపత్కాల సమయంలో లెక్కలు వేసుకుంటూ నాకు శస్త్రచికిత్స చేయించకపోవడం ఏమైనా న్యాయంగా ఉందా” అని కళ్ల నిండా నీళ్ళతో అడుగుతున్న తండ్రితో –
“చిన్నప్పటినుంచి లాభనష్టాల లెక్కలు వేసుకుంటూ బ్రతికిన నువ్వు, నాకు కూడా అలా లెక్కలు వేసుకుంటూ బ్రతుకమని చెప్పే, ఇప్పుడు ఇలా బేలగా మాటలాడడం ఏమీ బాగులేదు నాన్నా”
“నిన్ను పట్టభద్రుడిని చేసి, నీ ఉద్యోగం రావడానికి మదుపు పెట్టినది ఈ నాన్నే అన్నది గుర్తు తెచ్చుకోరా”
“నేను మరచిపోతే కదా”
“మరి ఆలాటప్పుడు కృతజ్ఞతతోనో పుత్రధర్మంగానో, ఆ లెక్కలన్నీ పక్కన పెట్టి, నాకు శస్త్రచికిత్స చేయించవచ్చు కదరా”
“నన్ను పెంచడం నాకు చదువు చెప్పించడం నీ పితృధర్మంగా చేసేవు. నాకు ఉద్యోగం రావడానికి నువ్వు పెట్టిన మదుపు వడ్డీతో సహా నా దగ్గర వసూలు చేసింది మరచిపోయావా నాన్నా. నువ్వు మరచిపోయినట్టు నటించినా నేను మరచిపోలేదు, మరచిపోయినట్టు నటించను కూడా”
“మీ అమ్మ మొహం చూసైనా నాకు శస్త్రచికిత్స చేయించరా, నేను చస్తే మీ అమ్మ విధవ అయిపోతుంది కదరా. ఏమే, నువ్వేమీ మాట్లాడవేమి” అని భార్య రమ సహాయం అర్ధిస్తూ ఆమె వంక దీనంగా చూడసాగేడు మన్మధరావు.
“ఎప్పటికప్పుడు మీరు వేసిన లెక్కలతో నన్ను ఎప్పుడైనా మీ భార్యగా చూసేరా? లేదే. –
కొత్త చీర కొనండి అంటే – ‘నాలుగు గోడల మధ్యనే ఉండే నీకు కొత్త చీర ఎందుకు, అనవసరమైన ఖర్చు’ -అనేవారు. కొత్తగా నగలు చేయించకపోయినా, పెళ్ళిలో నా పుట్టింటివారు మీ అమ్మగారు పెట్టిన నగలైనా పండగకో పేరంటానికో పెట్టుకుంటాను అంటే – ‘నగలు అరిగిపోయి వాటి విలువ తగ్గిపోతుంది, పైగా దొంగల భయమొకటి’ – అంటూ నగలు ఎప్పుడూ బాంకులోనే దాచేరు.
ప్రతీ పైసాకి మిమ్మల్ని ఎంతగా అడగను, నెల నెలా నాకు కొంత సొమ్ము ఇవ్వండి అంటే – ‘నన్ను పైసలు అడగడానికి నీకు చిన్నతనమా ఏమిటి, నీకు కావలసినపుడల్లా నేను ఇస్తాను కదా. పైగా, డబ్బులు బాంకులో ఎన్ని ఉంటే అంత ఎక్కువ వడ్డీ వస్తుంది అని నీకు మాత్రమూ తెలియదూ’ – అంటూ నాకు ఎప్పుడూ ఒక పైసా ఇచ్చిన పాపాన పోలేదు మీరు.
పావలా పెట్టి పువ్వులు కొనుక్కోవాలన్నా మిమ్మల్ని అడగవలసిందే. పోనీ అని సిగ్గువిడిచి అడిగితే - ఆ పావలాకి సవాలక్ష ప్రశ్నలూ లెక్కలూనూ.
మీ జీవితానికి కనీసం భీమా చేయించండి అంటే – ‘నేను పోతే ఆ భీమా డబ్బులతో కులకాలనుకుంటున్నావా’ - అంటూ అంతెత్తున నా మీద ఎగిరేరు.
జీవితభీమా కాకపోతే కనీసం ఆరోగ్యభీమా అయినా చేయించుకోండని సలహా ఇస్తే - ‘దుక్కలా ఉన్న నేను ఆరోగ్యభీమా అంటూ అనవసరంగా ఖర్చు పెట్టేంత మూర్ఖుడిని కాను’ –
--అని నా నోరు మూయించేరు.
‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్న సామెత లాగా మిమ్మల్ని చూసి ఎలా నడవాలో ఇతరులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్న మీ పుత్రరత్నానికి మీ బుద్ధులు రాకపోతే ఆశ్చర్యపోవాలి కానీ, వస్తే సంతోషించక అలా ఏడుస్తారెండుకు?
విధాత మీకిచ్చిన ఆయుష్హు ఉన్నంతకాలం ఢోకా లేకుండా బ్రతికేస్తారు. తరువాత మీరు ఉండాలనుకున్నా యమధర్మరాజు ఉండనివ్వడు. అలాగే, నా మాంగల్యంలో బలం ఉన్నంత కాలం మీరు బ్రతకక తప్పదాయే. నాకు వైధవ్యం ప్రాప్తించవలసిన రోజున నేను ‘వద్దు పోకండీ’ అని బ్రతిమాలి ఏడ్చినా, మీరు పోక తప్పదాయే. పుట్టిన ప్రతీ జీవి గిట్టక తప్పదు. మనిద్దరిలో ఒకరు ముందు మరొకరు వెనక, అంతే”
“నీలో ఇంత వేదాంతం ఎప్పుడు ఏర్పడిందే”
“మీకు భార్యగా గడిపిన నాకు వేదాంతం అబ్బడానికి ఎంతో సమయం అక్కరలేదు మహానుభావా”
“ఇంత నిష్టూరంగా ఎలా మాట్లాడగలుస్తున్నావే నువ్వు”
“నిజం ఎప్పుడైనా నిష్టూరంగానే ఉంటుంది”
“వాడైతే పిల్లాడు. నువ్వన్నట్టు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు అన్న సామెత ప్రకారం వాడి ప్రవర్తన అలా ఉందని సరిపెట్టుకున్నా, నువ్వు మరీ నిర్దాక్షిణ్యంగా ఉన్నావే నా పట్ల”
“48 ఏళ్ల సహచర్యం దోషం మహానుభావా. ఒక్కటి గుర్తుంచుకోండి -- అలుబిడ్డల పట్ల అనుబంధంతో మెలగకుండా పైసలే పరమార్ధం అని వ్యవహరించే వాడు ఏదో ఒకరోజు ఇలా ఏడవవలసిందే.
**శ్రీరామ*

