అది 'మే'మాసం.ఎండలకు బండలు బద్దలౌతున్నై. మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో ప్రహరీ గోడకు లోపల వున్న ఇరవై పూల కుండీలకు నీళ్ళు పడు తున్నాడు ఇంటి యమాని నీలకంఠం చెమటలు పట్టిన ముఖంతో.
"ఏమండీ!భోంచెద్దురు గాని రండి!"కేకేసింది భార్య భాగ్యమ్మ.ఆ కేక నీలకంఠం చెవుల్లో గుయ్మింది.
"ఇదిగో! నేనిక్కడ వూరికే లేను. కుండీల్లోని పూల మొక్కలు ఎండిపోతూ ఏడు స్తుంటే వాటికి నీళ్ళు పడుతున్నాను" నీళ్ళ హోసును తన వేపుకు తిప్పుకొని జవాబిచ్చాడు నీలకంఠం. ఫలితంగా తనూ తడిసిపోయాడు .
"అబ్బా! త్వరగా రండి. లేకపోతే నేనొచ్చి మిమ్మల్ని బండరాయిని దొర్లించుకొచ్చి నట్టు నెట్టుకు రావాలి. అది బాగోదు. ఆఁ ".
తనలో తానే 'ఆహాఁ! అంటే నేను ఊబకాయుణ్ణని పరోక్షంగా దెప్పేస్తోందన్నమాట, అక్కడికి తనేదో నాజూకైన నగిషీ బొమ్మైనట్టు. నా దృష్ఠిలో తను కూడా నాలాగే ఊబకాయంతో పట్టు మని పది అడుగులు కూడా నడవలేని గుణ్ణేనుగు' అనుకొని.
" సరే ఆగు...!నేనే వస్తున్నా" అంటూ లోనికెళ్ళాడు నీలకంఠం పాత సినిమాల్లోని హాస్య నటుడు రేలంగిలా. మొత్తంలో భార్యభర్త లిద్దరూ... దొందూ దొందే!.
కంచం ముందు కూర్చొన్న భర్తకు భోజనం వడ్డించింది భాగ్యమ్మ. కలుపుకొని తింటూ అక్కడే కప్పులో వున్న గడ్డ పెరుగు మొత్తం కంచంలో వేసుకోని ఆవ కాయను పెట్టమని సైగ చేశాడు.
"మరీ...మీరు అన్యాయమండీ!చాదస్తం కాకపోతే ఈ వేళప్పుడా పూల మొక్కలకు నీళ్ళు పట్టేది?" ఓ చిటికెడు ఆవకాయను కంచంలో పెడుతూ అంది భాగ్యమ్మ. "మరేం చేయమంటావే ?మనకు అకలైతే కంచాలు కంచాలు లేపేస్తున్నాంగా! వాటికి నీళ్ళు అవసరమైతే మనమే తెలుసుకొని పట్టాలి.లేకుంటే ఎండిపోతాయి. ఇదిగో...రేపు నీ వంతు సుమా!" భార్యకు గుర్తు చేశాడు నీలకంఠం. "కుదరదండీ!నన్నునేను మోసుకొంటూ నడవటానికే అష్టకష్టాలు పడుతున్నాను. నా వల్ల కాదు.ఈ వేసవి కాలం ముగిసేవరకూ ఎవరికైనా పావలా డబ్బులిచ్చి పని చేయించుకొండి" తెగేసి చెప్పింది.భాగ్యమ్మ
నీలకంఠం నోటిలోని ముద్దను అటూ ఇటూ గ్రైండరులో పిండిని రుబ్బుతున్నట్టు నములుతూ షడ్డన్గా ఏదో గుర్తుకొచ్చినట్టు"అవునూ!మన మేడమీదున్న గుడిసె ను అద్దెకిస్తున్నట్టు బోర్డు పెట్టామే... ఎవరైనా వచ్చారా?" అడిగాడు.
"రాలేదండి.అయినా మనం అద్దెకిచ్చే ఆ గుడిసెకు ఈ పూల మొక్కలకు నీళ్ళు పట్టటానికి సంబంధం ఏమిటండీ!?" సాగదీసి అడిగింది.
"ఉంది.ఎటూ ఇద్దరం స్థూలకాయాలతో పూలకుండీలకు నీళ్ళు పట్టే పని చేసుకో లేక కష్టపడుతున్నాం కదా!అందుకని ఇల్లు కావాలని ఎవడైనావస్తే వాడికి ఆ గుడిసెను అద్దెకిచ్చి రాబోయే సేప్టంబరు మాసం వరకు వాడ్నే పూల కుండీలకు నీళ్ళు పట్టేటట్టు ఎగ్రిమెంటు వేద్దాం. వాడే గాడిదలా చేసుకు పోతాడు. ఎటూ స్టు,సెప్టంబరుల వర్షాలుంటాయి కనుక వాడున్నా లేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినా బాధ లేదు. ఏమంటావ్?"అన్నాడు కళ్ళెగరేస్తూ నీలకంఠం.
"అబ్బో!భలే బుర్రండీ మీది. కాకపోతే ఎక్కడైనా గోళ్ళకు మేకులు కొట్టొద్దు. పిచ్చి గీతలు గీయొద్దు, బంధువులు రావద్దని, ఇంకా రాత్రి తొమ్మిదికల్లా ఇంట్లోకి చేరు కోవాలని, అద్దెను ఒకటవ తారీఖే ఇవ్వాలన్న షరతులు పెట్టటం విన్నాను కాని ఇలా పూల కుండీలకు నీళ్ళు పట్టాలన్న షరతును మీవద్దే వింటున్నాను" అంటూ నవ్వింది భాగ్యమ్మ.
అంతలో బయట కాలింగ్ బెల్లు మోగింది. భోంచేస్తున్న వాడల్లా పైకి లేవబోయాడు నీలకంఠం.
"మీరాగండి.నేను వెళ్ళి చూస్తాను" అంటూ అతి కష్టంగా అంత పెద్ద కాయాన్ని మోసుకొంటూ వెళ్ళి తలుపు తీసి చూసింది భాగ్యమ్మ.ఎదరే పిట్టల దొరలా తలకు టోపి పెట్టుకొని పళ్ళికిలిస్తూ నిలబడి వున్నాడు ఒకడు. "ఎవరూ?అబ్బాయ్...నువ్వు ఆటో డ్రయివర్వు కదూ?ఎం కావాలి?" అడిగింది. "అద్దెకు ఇల్లు కావాలి !" గేటుకున్న 'టూ లెట్' బోర్డును చూపిస్తూ అన్నాడు.
"ఇల్లా...బోర్డు అలా రాయించి పెట్టాము కానీ...మేము అద్దెకివ్వనుంది మా ఇంటి టెరాస్ మీదున్న గుడిసెను!"
"తెలుసు. నా లెవెల్‌కు అది చాలు"అని పెద్దగా నవ్వాడు ఆటోవాడు.
కోపం వచ్చింది భాగ్యమ్మకు.అయినా భర్త పెట్టబోయే కండిషన్లకు ఈ పిట్టల దొరగాడే కరెక్టు అనుకొని కోపాన్ని మనసులోనే కుక్కేసుకొని "సరే!నీకు పెళ్ళ య్యిందా?"ప్రశ్నించింది.
" పిల్ల కుదిరింది. మూడు నెలల్లో పెళ్ళి చేసుకొంటాను" సిగ్గు పడుతూ అన్నాడు.
ముఫ్పై సెకండ్లు ఆలోచించింది భాగ్యమ్మ. ' ఆడ పిల్లలు లేని కొంప. మేమో వయ స్సు మళ్ళిన ముసలాళ్ళం కనుక వీడి వల్ల ఎలాంటి ఇబ్బంది వుండదు. మాకు కావలసిందల్లా అద్దె. పూల మొక్కలు ఎండి పోకుండా వాటికి నీళ్ళు పట్టడం. అందుకు ఈ బకరాగాడే కరక్టు.కనుక వీడికి గుడిసెను అద్దెకు ఇచ్చేద్దాం'అనుకొని "అయినా కొన్నిటెర్మస్ అండు కండిషన్సు వున్నై!వాటిక నువ్వు ఒప్పుకోవాలి!" అంది సానుకూల దోరణితో.
"మీ కండీషన్లన్నిటికి సిద్దపడే వచ్చాను. హి... హాఁ హాఁ...హాఁ"అని మళ్ళీ పెద్దగా నవ్వాడు. ఆటోవాడి నవ్వుకు లోపల పెరుగన్నం తింటున్న నీలకంఠం లేచి చేతిని నాక్కొంటూ బయటికి వచ్చాడు.ఆయన్ను చూసిన ఆటోవాడు"నమస్తే సార్ !"అం టూ మిలటరీ సెల్యూట్ చేశాడు .
"ఆఁ...ఆఁ...నీకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. షరతులను చెపుతాను విను .అద్దె అయిదు వేలు. ఆరు నెల్ల అడ్వాన్సు అంటే ముప్పై వేలివ్వాలి. గోడల కు మేకులు కొట్టడాలు, పెన్సిల్లతో రాయడాలు. గీయడాలు, పొద్దుపోయి ఇంటికి రావటాలు కుదరదు."
"ఓకే....ఓకే సార్ " అంటూ ప్యాంటు జేబులో తయారుగా వుంచుకున్న డబ్బులు తీసి టకటక లెక్కపెట్టి ఇవ్వబోయాడు అటోవాడు.
"ఆగు! షరతులు ఇంకా వున్నై. నువ్వు ఇంటిని ఖాళీ చెయ్యాలంటే మూడు నెల్లకు ముందు చెప్పాలి. మేము నిన్ను కాదనుకుంటే రోజుల గడువుతో వెళ్ళి పోవాలి. ఆటోని ప్రహరీ గోడకు కాస్త దూరంలో పెట్టుకోవాలి" అన్నాడు నీలకంఠం.
"అంతేగా! పట్టండి సార్ అడ్వాన్సు"అంటూ మళ్ళీ డబ్బు చెతికివ్వబోయాడు.
"ఆగు! మరీ స్వీడుమీదున్నావే! అసలు ముఖ్యమైన కండిషను ఇంకొకటుంది. అందుకు నువ్వు ఓకే అంటే.,.." దీర్ఘం తీశాడు నీలకంఠం.
"ఏమిటి సార్ అది?" కాస్త ఇబ్బంది ఫీలవుతూ అడిగాడు ఆటోవాడు.
"అవిగో! అక్కడున్న ఆ పూలకుండీలకు వారంలో నాలుగు రోజులు నీళ్ళు పట్టాలి. ఆ పని సేప్టంబరు వరకు కొనసాగాలి. ఆపై వర్షాలు వస్తాయి కనుక నీళ్ళు పట్టే అవసరముండదు. ఓకే అనుకుంటే అడ్వాన్సు ఇవ్వు. లేకపోతే...".
"నీళ్ళు పట్టడమేగా! అదేమాత్రం.... చక్కగా చేసి పెడతాను. పట్టండి అడ్వాన్సు" అంటూ అందాకా నీలకంఠం శుభ్రంగా నాకేసి శుధ్ధం చేసుకున్న చేతిలో డబ్బుల్ను వుంచాడు ఆటోవాడు 'రేపే ఇంట్లోకి దిగిపోతాను సార్ !' అంటూ.
'దొరికాడురా బ్రహ్మాండమైన బకరాగాడు'అనుకొంటూ "అలాగే!" అంటూ ముసి ముసి నవ్వు లతో ఇంట్లోకి నడిచారు భార్య భర్తలిద్దరూ.
ఆటోవాడు గుడిశెలోకి దిగి నెల రోజులు. ప్రతిరోజు ఉదయం లేచి పనులన్నీ ముగించుకొని ముఖ్యంగా పూలకుండీలకు నిర్ణీత రోజుల్లో నీళ్ళు పట్టి ఏడున్నర కల్లా ఆటోతో స్టాండుకు వెళ్ళి పోతాడు.ఎనిమిది గంటలకు నిద్ర లేచే నీలకంఠం దంపతులు హాయిగా వరాండాలోకొచ్చి పచ్చ గా కలకలలాడే పూల కుండీలను చూసి మురిసిపోతూ ఆనందిస్తారు. అంత వరకూ బాగానే వుంది ఆ దంపతులకు. ఆ తరువాత....
రెండవ నెల పుట్టి పది రోజులు గడిచాయి. ఇప్పుడు మునుపటిలా పూల కుండీల్లోని మొక్కలు పచ్చగా కలకల లాడుతూ కనబడ్డం లేదు. పేలవంగా పాలిపోతున్న రంగుతో ఎండిపోతూ కనబడుతున్నై. అసలు ఆటోవాడు పూల కుండీలకు నీళ్ళు పడుతున్నాడా లేదా అన్న సందేహం వచ్చింది నీలకంఠానికి. అందుకే మరుసటి రోజు ఉదయం ఆరున్నర కల్లా లేచి కిటికీలో నుంచి తొంగి చూస్తూ వున్నాడు .
డ్యూటీకి తయారై బయటి కొచ్చిన ఆటోవాడు ఓ చెంబుడు నీళ్ళు తీసుకొని కుండీలలో వున్న పూల మొక్కలమీద చిలకరించి వెళ్ళిపోతోంది గమనించాడు. ఆటోవాడిపై మితిమీరిన కోపం వచ్చింది నీలకంఠానికి.కాని చేసేదిలేక కోపాన్ని దిగమింగుకొని భార్య భాగ్యం వద్దకు నడిచాడు.
"భాగ్యం ఆటోవాడు మనల్ని మోసం చేస్తున్నాడే!వాడు పూల కుండీలకు నీళ్ళు పట్టటం లేదు చెంబెడు నీళ్ళు చిలకరించి వెళ్ళటం చూశాను" అన్నాడు.
"అవునా...అంతే కాదండోయ్ !మొన్నీమధ్య టెరాస్ శుభ్రం చేయటానికీ పైకెళితే ఓ మూల బ్రాందీ బాటిల్లు వున్నై.అలాగే పది రోజుల క్రితం ఉదయాన అయిదున్నర గంటలకు ఓ ఆడది వాడి గుడిసెలో నుంచి క్రిందకు దిగి వెళ్ళిపోతుంటే ఇంటి ముందు కల్లేపు చల్లుకొంటున్న వెంకాయమ్మ చూసిందట. నాతో చెప్పిందావిడ. ఆఁ " అంది భాగ్యమ్మ.
"ఇక చెప్పకు.నాకఅంతా అర్ధమైపోయింది.వాడ్ని వెంటనే ఇల్లు ఖాళీ చేయించటమే మన తక్షణకర్తవ్యం."అంటూ పేపరులోకి తలదూర్చాడు నీలకంఠం.
మరుసటి రోజు ఉదయం ఆరున్నరకల్లా పైపుతో కుండీలకు నీళ్ళను పట్టను ప్రారంభించాడు .నీలకంఠం. ఆటోవాడు నీలకంఠాన్ని చూస్తూ ఆటోతో వెళ్ళిపోయాడు.సాయంత్రం ఆటోవాడ్ని కాపేసి పట్టుకున్నాడు నీలకంఠం.
"నువ్వు మా ఇంట్లో ఏవో తప్పుడు పనులు చేస్తున్నట్టు విన్నాను"అన్నాడు నీలకంఠం.
"అబ్బే...అదేం లేదే!అయినా అది నా స్వంత విషయం కదా!" తడబడూతూ అన్నాడు ఆటోవాడు.
"వుండొచ్చు. కానీ నా ఇంట్లో అలాంటి పనులు జరగటానికి వీళ్లేదు. పూల ,కుండీలకు నీళ్ళు పట్టమంటే చెంబెడు నీళ్ళు చిలకరించి వెళ్ళటం కాదు. అది మమ్మల్ని మోసం చేయటమే అవుతుంది. అందుకే గోల చేసుకొని పోలీసు వరకూ వెళ్ళ కూడదన్నది నా మాట. సైలంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో!ఇవిగో నీ అడ్వా న్సు డబ్బులు"అంటూ డబ్బున్న కవరును ఆటోవాడి చేతిలో పెట్టాడు నీలకంఠం. చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇరకాటంలో పడ్డ ఆటోవాడు మౌనంగా పైకెళ్ళిపో యా డు.
మరుసటి రోజు నిద్ర లేచిన నీలకంఠం ప్రహరీ గోడ వేపు చూశాడు. ఆటో కనబడ లేదు.
అంతలో"అయ్యగోరూ!ఇవిగో తాళాలు.ఆటోవాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు" అంటూ పనిమనిషి తాళాలను నీలకంఠం చేతికిచ్చింది.
'నీచమైన దరిద్రుణ్ణి వొదిలించుకున్నాను. అందుకే అన్నారు కొందరు 'ఇళ్ళను అద్దెకిచ్చే టప్పుడు వాళ్ళను గూర్చి పూర్తి వివరాలను తెలుసుకొని, వీలైతే ఓ మధ్యవర్తి ( బ్రోకరు) ద్వారా అగ్రిమెంటు వేయించుకొని ఇవ్వాలని'.ఎలాగో గోల పెట్టకుండా,గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు. లేకుంటే నేనూ పోలీసు స్టేషను మెట్లు ఎక్కాల్సి వచ్చేదేమో!'అనుకొంటూ లోనికెళ్ళిపోయాడు నీలకంఠం. ©ప©©©© అయ్యా! ఈకథ నాస్వంతరచన.దేనికీ అనువాదం,అనుసరణ కాదని,మరే పత్రిక పరిశీలనలో లేదని తెలుపుకొంటున్నాను.

