ఆఖరి ఉత్తరం ! - బొల్లిముంత వెంకట రమణా రావు

Aakhari vuttaram

మాధవి రాఘవ్‌ను ప్రేమించింది. ఆమె ప్రేమ గురించి అతనికి ఎప్పుడూ సందేహం కలగలేదు. కానీ అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన రోజు నుంచి, ఆమే ప్రేమే రాఘవ్ జీవితంలో అతిపెద్ద తుఫాను సృస్తించింది. ప్రేమించే మనిషిని వదిలేయడం వెనుక ఎంత పెద్ద కారణం ఉండగలదో అతను సంవత్సరాల తరబడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మొదట ఆమె మనసు మారిపోయిందనుకున్నాడు. తర్వాత తనలో లోపాల కోసం వెతికాడు.

చివరికి, తనకు కనిపించని ఏదో ఒక నిజం ఆమె కళ్ళకు కనిపించి ఉంటుందని అనుకున్నాడు.

వాళ్లు ప్రేమించిన ఐదేళ్లలో మాధవి అతని జీతం గురించి ఎప్పుడూ అడగలేదు. ఇల్లు కడతావని అడగలేదు. ఏ కారు కొంటావని కూడా అడగలేదు. కానీ ప్రతిసారీ ఒకే ప్రశ్న అడిగేది. "ఈ మధ్య కొత్తగా ఏం నేర్చుకున్నావు?" రాఘవ్ ఆ ప్రశ్నను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఉద్యోగం చేస్తున్న మనిషి ఇంకేం నేర్చుకోవాలి అనుకునేవాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆమె ప్రేమలో దాగి ఉన్న అసలు ప్రశ్నకు సంధానం తెలిసింది.

ఆమె అతన్ని చివరిసారి కలిసిన రోజూ కారణాలు చెప్పలేదు. కేవలం ఒక మాట మాత్రమే చెప్పింది. "ఐదేళ్ల క్రితం కలిసిన నువ్వు... ఈరోజు కనిపిస్తున్న నువ్వు... ఇద్దరి మధ్య నాకు తేడా కనిపించడం లేదు." ఆమే

మాటలో అవమానం లేదు. కానీ ఆ మాటలు ఎందుకో కలవరపరిచాయి. నొప్పి తెలవకుండానే మనసును మాటలతో మెలిపెట్టింది అనుకున్నాడు. ఎదురు ఏమి సంధానం చెప్పలేదు.

ఒకప్పుడు ఆమెతో జీవితం ఇంద్రధనసు అనుకున్నాడు. ఆమె సహచర్యంలో కాలం అందంగా గడుస్తోందనుకున్నాడు. ఆ తర్వాత మొదటిసారి అర్ధమైంది తన ఆలోచన తప్పని. “ ప్రతి ఆడపిల్ల మనిషి గుణంకంటే, అతని జీతంకి విల్లువిస్తుందని” తెలుసుకున్నాడు.

మనిషి జీవితంలో కొన్ని ఓటములు బయట కనిపించవు. భయం కలిగిస్తాయి. మానసికంగా వేదిస్తాయి. అవి నిశ్శబ్దంగా లోపలే మొదలవుతాయి. రాఘవ్‌కు కూడా అలాగే జరిగింది. ఉద్యోగం ఉన్న. స్నేహితులు ఉన్న. జీవితం అసంతృప్తిగానే ఉంది.. జీవితం తెలుపు నలుపు చిత్రంలా ఉంది. ప్రతి రాత్రి పడుకునే ముందు తనని తాను అడిగే ఒక ప్రశ్న—"ఈరోజు నేను నిన్నటికంటే ఏమి ఎక్కువ తెలుసుకున్నాను?" చాలా రోజుల వరకు ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఆ సమాధానం వెతుకుతూనే అతని జీవితం మారడం మొదలైంది.

పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. తన వృత్తికి సంబంధించిన కొత్త కోర్సులు చేశాడు. కొత్త మనుషులను కలిశాడు. కొత్త భాష నేర్చుకున్నాడు. ప్రమోషన్లు వచ్చాయి. జీతం పెరిగింది. కానీ అవేవీ అతనికి పెద్ద విజయాలుగా అనిపించలేదు. కనిపించలేదు. నిజమైన మార్పు వేరే చోట జరిగింది. ప్రతి కొత్త విషయం నేర్చుకున్నప్పుడూ, రాఘవ్ దృష్టి కోణం మారడం మొదలైంది.

నాలుగేళ్ల తర్వాత ఒక సమావేశంలో మాధవి తండ్రి అతన్ని కలిశాడు. అతని ప్రసంగం విన్న తర్వాత చాలాసేపు మౌనంగా నిలబడి, చివరకు ఒక పాత కవర్ అతని చేతిలో పెట్టాడు. "ఇది మాధవి నీకోసం ఇచ్చింది," అన్నాడు. "ఎప్పుడో ఒకరోజు నువ్వు వస్తావని ఆమె నమ్మింది."

రాఘవ్ ఆ ఇంటికి వెళ్లి అతను కవర్ తెరిచాడు. ఒక పెళ్లి ఫోటో అతని కళ్లలో పడింది. మాధవి నవ్వుతోంది. ఆమె పక్కన ఇంకొక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ ఫోటో చూసిన క్షణంలో తన ఆలస్యానికి కారణం గ్రహించాడు.

అతను కవర్ తెరిచాడు.

లోపల ఒక లేఖ ఉంది.

రాఘవ్,

ఈ లేఖ నీ చేతికి వచ్చే సమయానికి నా జీవితం ఇంకో దారిలో నడుస్తూ ఉంటుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా నేను నిన్ను తప్పుపట్టను. ఎందుకంటే నేను చెప్పకుండా వెళ్లిపోయిన నిజం ఇది.

నేను నిన్ను ఎప్పుడూ తిరస్కరించలేదు.

నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమే.

కానీ ఆ రోజు నీ కళ్లలో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపించింది. అది సంతోషంగా ఉన్న మనిషి ప్రశాంతత కాదు. ఇక తనలో మారాల్సింది ఏమీ లేదని నమ్మిన మనిషి ప్రశాంతత.

నాకు పేదరికం భయం కాదు. అపజయం కూడా కాదు. నేర్చుకోవడం ఆపేసిన మనిషే భయం. ఎందుకంటే అతను తన జీవితాన్ని మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాలనూ నెమ్మదిగా నిలిపేస్తాడు.

నువ్వు ఒకరోజు తప్పకుండా మారుతావని నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నది, నన్ను కోల్పోయాక మారిన రాఘవ్ కాదు. నన్ను కోల్పోకముందే తనను తాను వెతకడం మొదలుపెట్టిన రాఘవ్.

అందుకే నేను నీ జీవితంలో భార్యగా కాకుండా... ఒక ప్రశ్నగా మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాను.

— మాధవి

ఆమె మాటలకు నవ్వుకున్నాడు. సమర్ధించుకుంటుంది అనుకున్నాడు.

రాఘవ్ లేఖను మడవబోతుండగా అందులో నుంచి మరో చిన్న కాగితం జారిపోయింది.

అది నాలుగేళ్ల క్రితం అతను ఆమెకు ఇచ్చిన ప్రేమ లేఖ.

దాని వెనుక మాధవి చేతిరాతలో ఒక్క వాక్యం మాత్రమే ఉంది.

ఈ మనిషిని నేను ప్రేమిస్తున్నాను. కానీ అతనితో జీవితాన్ని పంచుకునే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నా కలలు విరిగిన రేక్కలులా, రాలిన పూరేకులుగా మిగిలిపోకూడదని కోరుకుంటున్నాను."రాఘవ్ చాలాసేపు ఆ వాక్యాన్నే చూస్తూ కూర్చున్నాడు.

ఆ రోజు అతనికి అర్థమైంది.

మాధవి అతని జీవితంలో కోల్పోయిన ప్రేమ కాదు. ఆమె దూరమైన క్షణమే... అతని నిజమైన జీవితం మొదలైంది. అప్పటి నుంచి అతను తన ప్రపంచాన్ని అందమైన రంగులతో నింపుకుంటూ, రెక్కలు విప్పి ఎగురుతున్నాడు.

ఒకవేళ పెళ్లయివుంటే రాజీపడేది కాకపోవచ్చు. ఏదో ఒకరోజు వదిలివెళ్లిపోవచ్చు. ఒకవిధంగా ఆదిలోనే హంసపాదులా విడిపోవడం. తనకూ దూరం కావడం మంచిదైనది అనుకున్నాడు. గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు.

నిన్నటి బాధంతా నేటితో తీరిపోయింది. ఇక ఏ సమస్యలు నన్ను వేధించవు. నాలో ఎలాంటి భ్రమలు లేవు అనుకోన్నాడు.

నన్నుఇష్టపడిన అమ్మాయి తన తలుపు తడుతుందని ఒక అందమైన కల కోసం

నిద్రకు ఉపక్రమించాడు.

.................బొల్లిముంత వెంకట రమణా రావు

మరిన్ని కథలు

59 rujulu
59 రోజులు
- డా:సి.హెచ్.ప్రతాప్
Kulavrutti
కులవృత్తి
- ARADHYULA Pranav
Santrupthi
సంతృప్తి
- మండా సూర్యనారాయణ
Sanmanam
సన్మానం!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Apramatthata
అప్రమత్తత
- డా:సి.హెచ్.ప్రతాప్
Samskaram
సంస్కారం
- మద్దూరి నరసింహమూర్తి
Chivari vuttaram
చివరి ఉత్తరం
- డా:సి.హెచ్.ప్రతాప్