పడమటి భానుడు - పి.కె. జయలక్ష్మి

padamati bhanudu

జీవితం చాలా అందమైనది, అపురూపమైనది. ప్రతి క్షణాన్ని అద్భుతంగా ఆస్వాదించే అవకాశం కేవలం మనిషికే ఇచ్చాడు ఆ భగవంతుడు. కానీ చాలామంది అనేకానేక వ్యామోహాల్లో పడి జీవితాన్ని అర్ధరహితంగా, తేజోహీనం గా చేసుకుంటున్నారు. ఇంద్రధనస్సు లాంటి సుందరమైన జీవితాన్ని చేతులారా అంధకార బంధురం చేసుకొని సంధ్యాసమయం లో పశ్చాత్తాపపడే నా బోటి వాడికి నిష్కృతి ఏది? ఎంతసేపూ కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూ మెటీరియలిస్టు గానే బతికా గాని ప్రేమ, ఆత్మీయత, ఓరిమి, సంతృప్తి అనేవాటికి అర్ధం తెలుసుకునే ప్రయత్నం ఏనాడు చేశాను గనుక? ఇదీ ఒంటరితనం తో క్రుంగిపోతూ చరమాంకం లో నైరాశ్యం తో కొట్టుమిట్టాడుతున్న డా. భానుప్రసాద్ మనోగతం.

బ్రస్సెల్స్ లో విశాలమైన నా ఫ్లాట్ అద్దాల కిటికీ ల్లోంచి సమీపంలోని పార్క్ కన్నుల విందుగా పిల్లలతో, పావురాలతో సందడిగా ఉంది. సాయంత్రం అవుతూనే ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళంతా బిలబిల్లాడుతూ అక్కడికి చేరతారు. ఆడ మగ అన్ని వయసుల వాళ్ళూ సేద తీరతారు. పసిపిల్లల్ని ప్రామ్స్ లో తీసుకొని వస్తారు కొందరు. ముసలివాళ్లు పిల్లల అల్లర్లని ఆనందం గా వీక్షిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇన్నేళ్లల్లో నేనెప్పుడూ అక్కడికి వెళ్లింది లేదు, ఎవరితో మాట్లాడిందీ లేదు. మనుషుల కంటే మెషీన్ల తో ఎక్కువగా గడపడం వల్లనేమో మెకానికల్ గా తయారయ్యాననిపిస్తుంది ఒక్కోసారి. ఫ్లాట్ తాళం వేసి కార్ లో నేనెప్పుడూ వెళ్ళే “ద పారిస్” రెస్టారెంట్ కి వెళ్ళి నాకిష్టమైన బీర్ ఆర్డర్ చేసి ఆలోచనల్లోకి జారాను.

అమ్మానాన్నలకి నేను, చెల్లి ఇద్దరే సంతానం. వంశోద్ధారకుడినని ఎంతో ముద్దుగా ఆడింది ఆట గా పాడింది పాట గా పెంచారు. నాన్న చిరుద్యోగి అయినా చదువులో తన ప్రతిభ గమనించి స్థాయికి మించిన ఖర్చుతో ఇంజనీరింగ్ చదివించారు. తర్వాత ఉద్యోగం చేస్తానని వాళ్ళకి ఆసరా అవుతానని కలలు కూడా కనే ఉంటారు. కానీ తనేం చేశాడు? ఎమ్మెస్ కి ఎయిడ్ రావడంతో అమెరికా వెళ్తానని పట్టుపట్టాడు. తలకి మించిన భారమే అయినా తల్లి తనకున్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మేసి టికెట్లకి డబ్బు సమకూర్చిపెట్టింది. చదువు అవుతూనే అక్కడే తనకి ఇష్టమైన సైంటిస్ట్ ఉద్యోగం రావడం తో అమెరికాలోనే శాశ్వతంగా స్థిరపడాలని నిర్ణయించేసుకున్నాడు. అందుకు తోటి ఉద్యోగిని అమెరికా పౌరురాలు అయిన హెలీనా ని పరిణయమాడాడు. తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం అటుంచి, కనీసం పెళ్లిచేసుకుంటున్నట్టు కూడా తెలియపరచలేదు ఆర్నెల్ల దాకా. పాపం వాళ్ళు కొడుకు ఉద్యోగస్తుడయ్యాడు, ఇంకా ఇంటివాడవ్వడమే మిగిలింది అనుకుంటూ సంబంధాలు వెతికేస్తోంటే చల్లగా చెవిన వేశాడు.

అది కూడా వారి పట్ల గౌరవం తో కాదు, భార్య కడుపుతో ఉండడం, చేసిపెట్టేవాళ్ళెవరూ లేకపోవడం, మనవడు పుట్టాక చెప్తే నలుగురూ ఛీ అంటారేమో నన్న ఏ మూలో భయం వగైరా కారణాలతో అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఏవో సంజాయిషీలతో క్షమించమంటూ, కొసమెరుపు గా తల్లిని కొంతకాలం తమ వద్దకు పంపమని పెద్ద ఉత్తరం వ్రాసి పడేశాడు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది... ఏమనగలరు అంతా అయిపోయాక? కొడుకుని కాదనుకోలేరు కదా? తల్లి పెద్ద మనసుతో వచ్చి నిలబడింది హెలీనా కాన్పు సమయంలో కవలలు పుట్టారు. కొడుక్కి మురళి, కూతురికి రోసీ అని పేర్లు పెట్టాడు. పిల్లల సేవ కోసం తల్లి ఇక్కడ ఉండిపోవడం తో అక్కడ తండ్రికి ఇబ్బంది! పోనీ పంపిచేద్దామా అంటే ఇక్కడ ఇద్దరు పిల్లలతో హెలినా కి అవస్థ... ఏం చేయాలో తెలియని పరిస్థితి. వేరే గత్యంతరం లేక తల్లి తో మురళి ని కొంతకాలం పంపించేయాలని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. తల్లి కూడా పరమానందభరిత అయింది. అసలు కంటే వడ్డీ ఎప్పుడూ ముద్దే కదా? మురళి ని ఏ లోటూ లేకుండా జాగ్రత్తగా చూసుకొనేవారు అమ్మానాన్న. తను, భార్య... రోసీ పెంపకం లో, ఉద్యోగ ఒత్తిళ్ళలో తలమునకులుగా ఉంటూ వారానికో, నెలకో పలకరిస్తూ ఉండేవారు. మంచి స్కూల్ లో జేర్పించమని, వాడి అవసరాలకని డబ్బు మాత్రం పంపించేవాడు. మనవడి ధర్మమా అని కొడుకు తో మాట్లాడగల్గుతున్నాం అని సంతోషించేవారు వాళ్ళు. కొన్నాళ్లు పోయాక చెల్లి పెళ్లి కి వెళ్లినప్పుడు మురళి ని తమతో అమెరికా తీసుకు వచ్చేసారు.

చెల్లెలు పెళ్లి గురించి తన వంతుగా ఏమీ కల్పించుకోలేదు. అది తన బాధ్యతగా కూడా భావించలేదు. దీప బ్యాంక్ క్లర్క్ గా సెలెక్ట్ అయ్యి అదే బ్యాంక్ లో పీ.వో గా పనిచేస్తున్న దినకర్ ని పెళ్లి చేసుకుని తల్లి దండ్రుల కి దగ్గరలో క్వార్టర్స్ లో భర్త, అత్తమామలతో కాపురం ఉంటూ వారానికోసారి పుట్టింటి వాళ్ళని కలుస్తూ కష్టం సుఖం కనుక్కుంటూ చేదోడుగా ఉండేది. మురళిని తెచ్చేశాక తల్లిదండ్రులకి ఫోన్ చేయడం మరీ తగ్గించేశాడు... డబ్బు పంపితే తన బాధ్యత తీరిపోతుందని అనుకునేవాడే తప్ప, జీవితం లో డబ్బు కంటే విలువైన బంధాలు, అనుబంధాలు ఉంటాయని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఏనాడూ అనుకోకపోవడం నిజంగా దురదృష్టం. తను ఫోన్ చేస్తే వాళ్లెంత పొంగిపోయేవారో? కన్నవాళ్ల బాగోగులు తాను పట్టించుకోకపోయినా కన్న మమకారం తో, బదులు ఆశించని ప్రేమతో అమ్మ ఎన్నో జాగ్రత్తలు చెప్పేది...”భానూ కన్నా! వేళ కి భోజనం చేస్తున్నావా? ఎక్కువసేపు మేలుకొని ఉండకు. కార్ నడిపేడపుడు జాగ్రత్త. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకు నాన్నా” అంటూ. తనకేమో చిరాగ్గా ఉండేది. ఇంత పెద్దవాణ్ణయినా ఏంటీ చాదస్తం అమ్మకి? అని. మనసు గ్రహించినట్లు “భానూ! నువ్వు ఎంత పెద్దవాడివైనా మాకు ఎప్పుడూ చిన్నవాడివేరా! ఇలా చెప్తూనే ఉంటా నువ్వేమనుకున్నా సరే.” అనేది నవ్వుతూ. అమ్మప్రేమని అర్ధం చేసుకోలేని మూర్ఖుడు తను. డబ్బే లోకం గా బతికాడు తప్ప లోకంలో డబ్బుకి మించి అమూల్యమైన రక్త సంబంధాలని దూరం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాడు.

వాతావరణ ప్రభావం. మనిషి వ్యక్తిత్వాన్ని శాసిస్తుంది అనడానికి మురళి, రోసీ లే నిదర్శనం. నాన్నమ్మ, తాతయ్యల సంరక్షణ లో కొద్దికాలమే ఉన్నా భారతీయ సంస్కృతి విలువల్ని బాగా వంటపట్టించుకున్నాడు మురళి. ఇంకో పక్క కవల సోదరే అయినా రోసి నడవడి, తీరు తెన్నూ పూర్తిగా భిన్నం. చాలా స్వతంత్ర భావాలు, మాట లక్ష్య పెట్టకపోవడం, మొండితనం ...తల్లి దేశం నించి, తల్లి నించి అబ్బిన సుగుణాలు రోసీ కి. తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో హెలినాకి కుటుంబ వ్యవస్థ మీద అంత వ్యామోహం లేదు. నాకు మొదటినించి స్వార్ధం, అందరికంటే పై మెట్టు లో ఉండాలన్న తపనే ఎక్కువ. అవసరానికి అంటించుకుంటాను, అవసరం తీరాక వదిలించుకుంటాను. ఈ హై సొసైటీ లో ఇలాగే ఉండాలన్నదినా విశ్వాసం. ఎవరి ప్రైవసీ వాళ్ళది. ఎవరం ఎవర్నీ ప్రశ్నించం. ప్రేమాప్యాయతల నందనం లో పెరిగి ఇలాటి వాతావరణం లోకి అడుగుపెట్టిన మురళి చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోయే ఉంటాడని నాకిప్పుడు తెలుస్తోంది. నాన్నమ్మ అందించిన మాతృప్రేమ, లాలన ఇక్కడ కన్నతల్లి నించి పొందలేకపోయాడు. రోసీ సరేసరి. “హాయ్ బ్రో”, “బాయ్ న్నా” తప్ప మరో ముక్క లేదు. నేను గాంభీర్యం ముసుగులో తండ్రిగా వాడి కెరీర్ ని నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసేశాను. ఫలితం..? మెడిసిన్ చదవాలని ఉన్నా నేను చెప్పినట్టు కిమ్మనకుండా మళ్ళీ మాకు దూరంగా ఫ్లోరిడా లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు.

డబ్బు వ్యామోహం చాలా చెడ్డది. మనుషుల మధ్య అనుబంధాలని తుంచేస్తుంది. మానవ సంబంధాల్లో కాలిక్యులేషన్ కే తను పెద్ద పీట వేశాడు. తానేంటో, ఏం చేస్తున్నాడో , ఏం కోల్పోతున్నాడో ఆలోచించుకోవడానికి కూడా సమయం కేటాయించుకోలేనంత బిజీ అయిపోయాడు ఒక్కసారిగా. మిలియనీర్ కావాలన్నదే తన లక్ష్యమైంది... ఇదిలా ఉండగా రోసీ తన క్లాస్ మేట్ తో రిలేషన్ షిప్ కి వెళ్ళడం పెద్ద షాక్. ఇది మన సంస్కృతి కాదని చెప్పబోయా. తల్లీ కూతుళ్ళిద్దరూ వింతజంతువుని చూసినట్టు చూశారు. హెలీనా ఈ దేశస్థురాలు. కూతుర్నే సమర్ధించింది తప్పేంటని?

రోసీ కి నేను తండ్రినేగాని తను ఈ దేశపు బిడ్డ, ఆ తల్లికి కూతురు. కన్నకూతురి సుఖం కోసం వేల డాలర్లు ధారపోసాడు. తండ్రిగా దగ్గర కూచోపెట్టుకొని ఆ పిల్లకి మన దేశం, సంస్కృతి, సంప్రదాయాలు ఎప్పుడైనా చెప్తే కదా? కనీసం కాస్త పాటి తెలుగు కూడా నేర్పించలేకపోయాను. ఇక్కడి వాళ్ళు చక్కగా హిందీ, భరతనాట్యం, సంగీతం, యోగా నేర్చుకుంటూ మన వస్త్ర ధారణ లో కనిపిస్తూ భారతీయ సంస్కృతి ని గౌరవిస్తోంటే నా కూతురు సగం భారతీయురాలినన్న విషయాన్ని కూడా ఎప్పుడో విస్మరించి, మనసా, వాచా, కర్మణా పూర్తి అమెరికన్ గానే చెలామణి అయిపోతోంది.

ఉన్నట్టుండి మరో షాక్ ! ఏ కారణం లేకుండానే హెలీనా ఒకరోజు విడిపోదామని ప్రపోజల్ పెట్టింది. అర్ధం కాలేదు నాకు. “లైఫ్ ఈజ్ సో బోరింగ్ భాన్!. ఐ నీడ్ సం ఛేంజ్. అట్లాంటా వెళ్లిపోవాలని ఉంది. యూ డోంట్ వర్రీ. నా షేర్ ఏమిస్తావ్? ఐ మీన్ ఇన్నేళ్లు నీతో ఉన్నాగా!” అంటూ కనుబొమ్మలెగరేసింది. విదేశీ సంస్కృతికి,యాంత్రిక జీవనశైలికి అలవాటుపడ్డ తనకి భార్య ప్రపోజల్ అంతగా బాధించలేదు. ఎప్పుడు ఆమెతో మనస్ఫూర్తిగా తీరిగ్గా సమయం గడిపాడు గనక? లక్ష డాలర్లు తీసుకొని ముద్దుపెట్టి “బాయ్” అంటూ హేపీ గా వెళ్ళిపోయయింది ఇల్లాలు నా జీవితం లోంచి. కొడుకు, కూతురు దూరంగా ఉండడంతో ప్రయోగాలు, సంపాదన మీదే ఇంక దృష్టి లగ్నం చేశాడు. ఇక్కడ ఇంత ఫ్రస్టేషన్ కి లోనవుతున్నా అమ్మానాన్న, చెల్లి గుర్తొచ్చేవాళ్లేకాదు అదేంటో!

ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశాక మురళి లో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడూ తన మాట జవదాటని కొడుకు మొదటిసారిగా ఎదిరించి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఎందుకు? ప్రేమించిన పిల్ల కోసం కాదు. ఆరోజు తనకి బాగా గుర్తు. “సారీ నాన్నా. నేనింక ఈ బందిఖానా లో ఉండలేను. నిస్సారమైన ఈ యాంత్రిక జీవితం నాకు వెగటు కలిగిస్తోంది. ఈ రంగుల లోకం నాకొద్దు. డాలర్ల వ్యామోహం లో పడి అస్తిత్వాన్ని, జీవన మాధుర్యాన్ని కోల్పోతానేమో అని భయం గా ఉంది. నేను మీలాగా పెద్ద లక్ష్యాలున్నవాణ్ణి కాదు..ఇలా అంటున్నందుకు క్షమించండి నాన్నా. నాన్నమ్మ చెప్పేది ఎంత సంపాదించినా నా అన్న వాళ్ళని నలుగురిని మిగుల్చుకోలేకపోతే ఈ జన్మకి సార్థకత ఉండదని... అమ్మ, చెల్లి మమతానురాగాలు నాకెప్పుడూ అందలేదు. నాకు! నాన్నమ్మ, తాతయ్య, అత్తయ్య, మామయ్య, పిల్లలు .. వీళ్ళందరి తో నా చిన్నతనం ఎంతో ఆహ్లాదంగా గడిచింది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఫొటోల్లోనూ, ల్యాప్ టాప్ లోనే తప్ప ప్రత్యక్షం గా చూడలేదు. నాకు ఊహ తెలిసాక మళ్ళీ వాళ్ళని ఎప్పుడూ కలవలేదు.” మురళి ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్ధం కావట్లేదు.

“ఇంక ఆలస్యం చేయడం నాకిష్టం లేదు. నాకు మమతలు పంచే కుటుంబం కావాలి. నా రక్త సంబంధీకులు కావాలి. అందుకే ఇండియా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. మిమ్మల్ని రమ్మనే సాహసం చేయ(లే)ను. నన్ను ఆపే ప్రయత్నం మీరూ చేయకండి. నాన్నమ్మకి, తాత గారికి వార్ధక్యం లో ఆసరాగా నిలబడతాను. వస్తా” అని వెళ్లిపోయాడు.

అహంకారం, మొండితనం అణువణువునా నిండిపోయిన తను హుంకరించి మిన్నకుండిపోయాడే గాని కొడుకు మాటల్లో తనవాళ్ళపట్ల ఉన్న ప్రేమానురాగాల్ని, బాధ్యతని గుర్తించి కళ్ళు తెరుచుకొని అమ్మానాన్నల దగ్గరికి వెళ్లాలని మాత్రం అనుకోలేదు. ఒకరోజు కూతురు బోయ్ ఫ్రెండ్ తో గొడవపడి విడిపోయి ఇంటికొచ్చి ఏదో బిజినెస్ చేస్తా డబ్బులిమ్మంది. ఆ అబ్బాయితో కలిసి ఉండమని సర్ది చెప్పాలని చూశాను. ఇదివరకు చూసినట్టే వింతగా చూసింది. ఎన్ని అర్ధాలో? ఇంకా నువ్వు మారలేదా? అనో లేక నీ పెళ్ళామే నిన్ను వదిలి చక్కాపోయింది నువ్వు నాకు చెప్పేంతటివాడివా? అనో మరి. మారు మాట్లాడకుండా ఆస్తి సగం దాని పేర రాసేశాడు ఇంకా మళ్ళీ మళ్ళీ అడక్కుండా. నెల రోజులకి ఇంకొక పిల్లాడిని వెంటబెట్టుకొచ్చింది “మీట్ మై న్యూ బోయ్ ఫ్రెండ్” అంటూ. వాళ్ళని మనస్ఫూర్తిగా దీవించాను.. మనసులో ... కొన్నాళ్ళైనా కలిసి ఉండమని. రోసీ అమాయకురాలేం కాదు. నా పోలికే. మనుషుల్ని వాడుకుంటుంది అవసరం తీరిపోతే వదిలించేసుకుంటుంది. ఏ రకమైన ఎటాచ్ మెంట్స్ , ఫీలింగ్స్ వుండవు. దాని గురించి బెంగ అనవసరం. కానీ పూర్ బోయ్ (ఫ్రెండ్)!

కొన్నాళ్ళకి అమెరికా నించి యూరోప్ వచ్చేశాడు ఇంకా మంచి ఉద్యోగం రావడంతో. అక్కడ పరిచయమైన జెన్నిఫర్ తో కొంతకాలం సహజీవనం సాగించాడు. జెన్నీ మొదటి భర్త మరణించడంతో కొన్నాళ్ల నించి ఒంటరిగా ఉంటోంది. ఇద్దరం కల్సి ఉండాలని నిర్ణయించుకున్నాం. నా లాగే ఆలోచించే జెన్నీ కొంతకాలం అద్భుతం గా అన్పించింది. కొన్నాళ్ళకి నేను కోరుకునే జీవితం ఇదికాదు, ఇంకేదో ఉంది, ఏదో మిస్సవుతున్న భావన మొదలయ్యింది లోలోపల. బహుశా వృద్ధాప్య చాయలు ఆవరిస్తోండడం వల్లనేమో! అమ్మానాన్నలతో, కొడుకు తో ఫోన్ లో మాట్లాడుతున్నా ఏదో... అపరాధ భావం! ఎలా అయిందో ఏంటో హఠాత్తుగా జెన్నీ అధ్యాత్మికం వైపు ఆకర్షించబడి హరేకృష్ణ బృందం లో జేరి దేశాంతరం వెళ్లిపోయింది. ఐదేళ్లు గడిచిపోయాయి. రోసీ టాప్ బిజినెస్ ఉమన్ గా సెటిల్ అయిపోయింది, టీవి ల్లో కన్పిస్తూ ఉంటుంది ఇంటర్వ్యూ లిస్తూ. రెండో అబ్బాయి తోనే కంటిన్యూ అవుతున్నట్టుంది నా ఆశీర్వాదం ఫలించి. ఒక కొడుకు దానికి. మేనమామ పోలిక వస్తే బాగుండు అనుకుంటా ఎప్పుడూ.

దీప కూతుర్ని పెళ్లిచేసుకొని మురళి నాన్నమ్మ, తాతయ్యల్ని ప్రేమగా చూసుకుంటూ కొడుకు గా నిలబడ్డాడు..తను ఇక్కడ ఒంటరిగా ప్రేమరాహిత్యంగా కాలక్షేపం చేస్తున్నాడు. అమ్మ చనిపోయినప్పుడు కూడా వెళ్లలేకపోయాడు. కెనడా టూర్ లో ఉండడంతో. అన్నీ మురళియే చూసుకున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ప్రశ్నలు! నా జీవితం లో ఏం సాధించానసలు? సొంతవాళ్లని ఎప్పుడు సంతోషపెట్టాను? వాళ్ళకి కొడుకుగా ఏం బాధ్యత తీసుకున్నాను?? భార్యని ఎప్పుడు అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాను? కూతుర్ని పద్ధతిగా ఏం పెంచాను? కొడుకు మాటకి ఎప్పుడు విలువిచ్చాను? డబ్బు, తెలివితేటలు ఉంటే ఇంకేమీ అక్కర్లేదు అనుకున్నా.

అనుకోకుండా ఒక రోజు యూట్యూబ్ లో “చాగంటి వారి రామాయణం - మానవ సంబంధాలు” వింటుంటే నేను చేసిన తప్పులన్నీ తేట తెల్లమయ్యి నా జీవితం నన్ను వెక్కిరించసాగింది. మహానుభావుడు ఎంత బాగా కాచి వడపోశారో జీవితసత్యాలని! “ఏది సుఖాన్నిస్తుందో అదే కొన్నాళ్ళకి దుఖహేతువు అవుతుంది.. అది మనిషే కావచ్చు, డబ్బే కావచ్చు. దేని పట్ల విశేషమైన అనురక్తి పెట్టుకోకండి. డబ్బుతో, కీర్తితో మనసు నిండదు. కన్నవాళ్లని ఉసురు పెట్టకండి. ప్రతిఫలమాశించకుండా ప్రేమించేది, తప్పు చేసినా క్షమించేది కన్నవాళ్ళే”. జీవితమంతా సంపాదన యావే తప్ప మంచి పుస్తకాలు ఎన్నడయినా చదివానా? ఆధ్యాత్మిక ప్రసంగాలు విన్నానా? వారి మాటల్లో ఏదో అద్భుతమైన ఆకర్షణ నన్ను మంత్ర ముగ్ధుణ్ణిచేసింది. ఆరోజు నించి నా ఆలోచనా దృక్పథం మారింది. అంతర్యానం మొదలైంది.

బీర్ తాగడం పూర్తయ్యాక డిన్నర్ ఆర్డర్ చేసి ఎదురుగా ఉన్న టేబిల్ వైపు చూశాను. ముగ్గురు యూరోపియన్ యువకులు 4 శాండ్ విచ్ లు ఆర్డర్ చేసి, మూడే తిని నాల్గింటికి డబ్బు చెల్లించారు. ఇదిక్కడ మామూలే… హోటల్స్ లో ఎక్కువ పదార్థాలకి ఆర్డర్ చేసి, కొంత మాత్రమే తిని మొత్తం బిల్లు కట్టేస్తారు. ఇది సస్పెండెడ్ ఐటం అన్నమాట. బీదవాళ్ళ సహాయార్ధం ఉపయోగిస్తారు. హోటల్ వాళ్ళు ఆ రోజు వచ్చిన సస్పెండెడ్ ఐటమ్స్ ని ఒకపక్కన ఉంచుతారు. ఎవరైనా అన్నార్తులు, బీదవాళ్లు వచ్చి సస్పెండెడ్ ఐటం కావాలని అర్ధిస్తే హోటల్ వాళ్ళు వారికి ఇవి అందజేసి బిల్లు కట్టిన వాళ్ళ పేరు చెప్తారు. వారు ఆనందంగా స్వీకరించి దానం ఇచ్చిన వాళ్ళకి మంచి జరగాలని ఆశీర్వదిస్తారు. నాకెందుకో ఒక్క క్షణం సస్పెండెడ్ శాండ్ విచ్ లా “సస్పెండెడ్ లవ్” కూడా ఉంటే ఎంత బాగుండు అన్పించింది. ఒకప్పుడు అందరి ప్రేమ కి పాత్రుడైన తాను, తీసుకోవడమే గాని ఇవ్వడం తెలియక ఇప్పుడు సంధ్యా సమయం లో అదే ప్రేమ కోసం కొట్టు మిట్టాడుతూ, వారి దగ్గరికి వెళ్లడానికి మొహం చెల్లక పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. దూరంగా కొండల ఆవల అస్తమిస్తున్న ఆదిత్యుడు... తన జీవితానికి సింబాలిక్ గా! “తూర్పు” తల్లి గర్భాన్ని చీల్చుకొని వెలుగు పుంజాలతో పుట్టి పెరిగిన భానుడు “పడమటి” మోజుతో చకచకా పరుగులు తీసి చివరికి అక్కడే అస్తిత్వాన్నికోల్పోతున్న దృశ్యాన్ని చూస్తూ మలి సంజె వేళ మమతల కోసం ఆక్రోశిస్తున్నాడు ఈ “పడమటి భానుడు.”

***

మరిన్ని కథలు

Improper donation
అపాత్ర దానం
- పద్మావతి దివాకర్ల
Ruby in clay
మట్టిలో మాణిక్యం
- డాక్టర్. షహనాజ్ బతుల్
మహత్కార్యం
మహత్కార్యం
- పద్మావతి దివాకర్ల
Teaching (children's story)
ఉపదేశం (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Miracle
ఎండమావి
- సన్నిహిత్
papodu
పాపోడు
- అఖిలాశ
sulti
సుల్తి
- అఖిలాశ
house wife
గృహిణి
- చంద్ర శేఖర్ కోవూరు