యానాదుల దిబ్బ - నక్కా విజయరామరాజు

yanadula dibba

"మాపిటేల యానాదుల దిబ్బ దగ్గర పెద్దారం డొంక తగాదా సంగతి మాట్లాడుకుందాం మీ ఊరోల్లని పదిమందిని పిల్చుకురా" అన్నాడు ఊరిపెద్ద బసవయ్య పెద్దారం పెద్ద ఉప్పులూరి బుచ్చారావుతో.

"రత్తప్పా రేపు యానాదుల దిబ్బకిందున్న రాగిచెట్టు చేలో నాటు మరిచిపోమాక" మరీ మరీ చెప్పింది కొట్లో భాగ్యం, రత్తమ్మతో.

"అత్తో యానాదుల దిబ్బ దగ్గరున్న అయిలాపురపు కాలవలోకి కొత్త నీల్లొదిలారంట! గుడ్డలుతుక్కొత్తా ఈ బుడ్డోడ్ని గూసేపు సూత్తా వుండు" అంటూ పిల్లోడ్ని
అప్పగించి బట్టలుతుక్కొవడానికి వెళ్ళింది పంతగాని మారెమ్మ.

"రేపు అమాసకి కోడి పందాలు లంక దిబ్బ మీద కాదు. యానాదుల దిబ్బ మీద మనోళ్ళందరికీ చెప్పు" అంటూ కోళ్ళ సుధాకర్, భట్టిప్రోలు వెంకటేశ్వర్లుతో అన్నాడు. కోడిపందాల స్పాట్ నిర్ణయించేది సుధాకరే.

***

అటు పెద్దాపురం పోవాలన్నా ఇటు ఐలారం రావాలన్నా పడమటి దిక్కున కనగాల పోవాలన్నా... దక్షిణాన కూరేటిపాలెంతో పాటు దానికింద పదహారు ఊర్లు చేరాలన్నా యానాదుల దిబ్బ మీదుగా వెళ్ళాల్సిందే. చుట్టుపక్కల ఊర్లకు చౌరస్తా యానాదుల దిబ్బ!

పేరుకే యానాదుల దిబ్బ గానీ, ఇప్పుడక్కడ యానాదులెవ్వరూ లేరు. అది అత్తలూరి గోపాలరావుగారి పాలెం మెరక దిబ్బ. చుట్టుపక్కల ఊర్ల జనానికదొక కొండ.

నలభై, ఏభై ఏళ్ళ కిందట అక్కడ ఐదారు యానాదుల గుడిసెలుండేవి. పిల్లా పాపల్తో కళకళలాడుతూ గుడిసెల ముందు బంగినపల్లి మామిడిచెట్టు, వెనక ఉసిరిచెట్టు, కాలువ గట్టున కుంకుడు చెట్టు, దిబ్బ చుట్టు కోటకి కాపలా కాస్తున్న సైనికుల్లా పిల్లలకోడి, గంగ భవానీ కొబ్బరిచెట్లు, గుడిసెల మీద పాకిన బీర, సొరపాదులతో పచ్చగా ఉండేది. అక్కడే వుండి చుట్టు పక్కల పొలాలన్నీ కాపలా కాసేవాడు యానాది పుల్లన్న అక్కడున్న నాలుగు గుడిసెల్లో ఒకటి అల్లుడిది, మిగిలిన రెండిట్లో కొడుకులుంటే, నాలుగోది ఆయనది. ఆయన సంతానం డజను మంది. మిగిలిన కొడుకులు సంజీవి, ఎంకన్న మాచెర్ల చెరువుకట్ట మీద గుడిసెలేసుకుని ఊళ్ళో మురికి కాలువలు శుభ్రం చేసే పని చేసే వాళ్ళు. వాళ్ళ పెళ్ళాలు కోమట్ల ఇళ్ళలో అంట్లు తోమి, ఇల్లు ఊడ్చేవారు. మిగతా పిల్లలు మునసబుగారి దిబ్బ మీదొకడు, అద్దెపల్లి సాలిచెరువు మీదొకడు, కనగాలన గుప్తా గారి కాఫీ హొటల్లో కప్పులు కడగడానికొకడు. అట్టా అందరి పెళ్ళిళ్ళయి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు.

ఇంక మిగిలింది కడకూటి పిల్ల. దానికి అద్దేపల్లి బుర్ర తూము కాలువ గట్టు మీదున్న ముద్దుల లాలాలజపతిరాయ్ గారి బావి దగ్గర గుడిసె ఏసుకున్న యానాది
ఎంకన్న కొడుకుతో పెళ్ళి నిశ్చయమైపోయింది. శ్రీరామనవమి పండగ వెళ్ళిన తర్వాత రెండో రోజు పెళ్ళి.

యానాది పుల్లన్న అంటే చుట్టుపక్కల తెలీని మనుషులుండే వారు కాదు. ఆయన ఒడ్డు పొడుగు ఆ వంశంలో ఎవరికీ రాలేదు. ఆజానుబాహుడు. చెయ్యెత్తితే ఆయన ఉంగరాల జుత్తు తగిలేది కాదు. తలపాగా చుట్టడానికి మామూలు కండువాలు చాలక, ఏకంగా అతని పెళ్ళాం రంగమ్మ ఏడు గజాల చీరని చుట్టుకునేవాడు. చొక్కా తొడుక్కోవడం ఎవ్వరూ చూసింది లేదు. మొలకి గోచిలా చిన్న అంగోస్త్రం బిగించి కట్టేవాడు.

ఒకసారి అత్తలూరి గోపాలరావు గారింటి కొచ్చిన చల్లపల్లి రాజా వారు యానాది పుల్లన్న పర్సనాలిటీ చూసి "మావూరొచ్చి మా కోట ముందు వేషం వేసుకుని నిలబడరా! రెండెకరాల పొలం ఇస్తా" అన్నాడంట. "మా దిబ్బ ఈ ఊరొదిలి యాడికి రాను దొరా" అన్నాడంట పుల్లన్న. గోపాలరావు గారెంత చెప్పినా వినకుండా యానాదుల దిబ్బ మీదే వుండిపోయాడు పుల్లన్న.

యానాది పుల్లన్న తలపాగా చుట్టుకుని, బానా కర్ర వీపు వెనక పెట్టుకుని దాన్ని రెండు చేతుల్తో వెనగ్గా పట్టుకుని ఊర్లోకి వస్తే ఇళ్ళలోని ఆడోళ్ళు కిటికీలు తీసి చూసేవాళ్ళు. కోమట్లు దుకాణాల్లోంచి పిలిచి పొగాకు కాడలిచ్చేవారు. ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడేవాడుకాదు. ఏమన్నా, కాదన్నా నవ్వి ఊరుకునే వాడు. ఆయన రోడ్డంబట వెళ్తుంటే ఆగి చూసే వాళ్ళు జనం. నెలకొకసారి మాత్రం అత్తలూరి గోపాలరావు గారి మేడకు వెళ్లేవాడు పుల్లన్న నూకలకోసం పెళ్ళాం రంగమ్మ ఊళ్ళో కోమట్లు, బ్రామ్మలు, పద్మశాలీల, కాపుల ఇళ్ళల్లో మంత్రసాని పని చేసేది.

***

సలగాలన దుర్గయ్య యానాదుల దిబ్బ మీదకి చేరేసరికి, మామిడి చెట్టు కింద కూర్చుని నల్ల కుక్క తెల్ల పిల్లి ఆడుకునే ఆటలు చూస్తున్నాడు యానాది పుల్లన్న.

"వాటి ఆటల ధ్యాసలో పడి మడిసొచ్చాడన్న సంగతే మర్చిపోయావే మామా?" అన్నాడు సలగాల దుర్గయ్య పక్కనే కూర్చుంటూ.

వాళ్ళిద్దరికీ వయసులో అట్టే తేడా లేకపోయినా అట్టా "మామా - అల్లుడు" అని పిలుచుకునే వారు చిన్నప్పట్నుంచి.

"అవంటే పేనం నాకు! ఈ 'వీరబాహుడంటే మరీను' అంటూ నల్లకుక్క వంక ప్రేమగా చూస్తూ భుజాల మీదకి కుక్కనెత్తుకున్నాడు యానాది పుల్లన్న.

"కుక్కకి, పిల్లికి పడదంటారు గందా! ఇయ్యేంటిట్టా అన్నదమ్ముల్లాగా ఆడుకుంటున్నాయి?" అన్నాడు దుర్గయ్య.

"నీది నాది ఒక కులమా? సావాసంగా లేమా? అయి అంతే! ఆ తెల్ల పిల్లి ఎలకల్ని ఉడతల్ని, ఎంటవాలని పట్టుకొత్తే, ఈ వీరబాహుడు (నల్లకుక్క) నా చేలోకి గొడ్డు, గోదా, దొంగోల్లు రాకుండా కాపలా కాత్తాడు" అన్నాడు కుక్కను వదిలేసి పుల్లన్న.

కుక్కా, పిల్లి కలిసి మళ్ళీ ఆడుకోసాగాయి, అక్కడ ఇద్దరు మనుషులున్నారన్న సంగతే మర్చిపోయి.

"పనిబడి పాలెం మీదుగా కనగాల ఎల్తున్నా... అటో సారొత్తావేంటి రెండు ముంతల కల్లు తాగొద్దాం" అన్నాడు దుర్గయ్య పొగాకు కాడ అందిస్తూ.

"దొరగారి మేడకెళ్లాలి నూకల కోసం! పద" అంటూ లేచాడు పుల్లన్న తలపాగా చుట్టుకుంటూ. పిల్లితో ఆటలు వదిలేసి పుల్లన్నను వెంబడించింది నల్లకుక్క.

***

గోపాలరావుగారి మేడ దగ్గరికొచ్చాడు పుల్లన్న ఆ సంగతి ఎట్టా తెలిసిందో, దివాణంలో పన్జేసే వాళ్లంతా ఆయన చుట్టూ మూగారు. సపోటా చెట్టు కింద విస్తరాకేసి అన్నం పెట్టించింది గోపాలరావు భార్య సుభద్రమ్మ గారు. జీతగాళ్ళు మాట్లాడుతూనే వున్నారు. పుల్లన్న అన్నం తిన్నంత సేపు. గోపాలరావు గారి పిల్లలు డాబా పిట్ట గోడమీద నుంచి చూస్తూనే ఉన్నారు. హడావిడి విని గోల్డుప్లాక్ సిగరెట్టు కాలుస్తూ మేడ దిగాడు అత్తలూరి గోపాలరావుగారు.

"ఏరా పుల్లన్నా నెల నుండి పత్తా లేవు? మొన్న యానాదుల దిబ్బ మీదకొస్తే ఒక్కడూ లేడు! యానాదులంతా ఎటు పోయార్రా?" అన్నాడు నరసరావుపేట పడక కుర్చీలో కూర్చుంటూ. చేతి పంపుదగ్గర చెయ్యి కడుక్కుని తలపాగాకి తుడుచుకుంటూ నిలబడ్డాడు యానాది పుల్లన్న.

గోల్డు ఫ్లాక్ పెట్టెల్లోంచి ఒక సిగరెట్టు తీసి పుల్లన్న మీద గిరటేశాడు గోపాలరావుగారు. పుల్లన్న దాన్ని తీసుకుని తలపాగాలో పెట్టుకున్నాడు.

"హరి పిచ్చోడా! కాల్చకుండా దాచుకున్నావా? కాల్చు! ఏమీ కాదు! అంతా మనోళ్ళేగా! మొన్నొచ్చినప్పుడు ఒక్కడూ పత్తాలేడు ఎటు పోయార్రా?" అన్నాడు గోపాలరావు సిగరెట్ పొగ వదుల్తూ.

యానాది పుల్లన్నతో ఏదోకటి మాట్లాడితీనే నోరు తెరుస్తాడు. పుల్లన్న ఏది చెప్పాలన్నా పాటలాగా చెబుతాడు. పాటలాంటి ఆయన మాటలంటే గోపాలరావు గారికే కాదు, ఆయన దొడ్లో పన్జేసే వాళ్ళందరికీ ఇష్టం అందుకనే కావాలని ఏదేదో మాట్లాడి పుల్లన్న నోరు తెరిపించేవాడు గోపాలరావు గారు.

"యానాదు లేనాడు లెందుపోయిరే?
జిల్లేడి చెట్టు కింద జంగు పిల్లులే"
అంటూ కర్ర తిప్పుతూ ఆడి, పాడి, గోపాలరావు గారి ముందు కూర్చున్నాడు పుల్లన్న.

పెద్ద గుమస్తా బాయగోడు చిన్నయ్య వచ్చేసరికి పుల్లన్న ఆట, పాట చూస్తున్న పనోల్లంతా ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోయారు. చిన్న గుమస్తా శంభుడు, నూకలు కొలిస్తే - తలపాగా కింద పరిచి దాన్ని రెండు మడతలేసి నూకలు మూటకట్టుకుని, చిన్న మూటలాగా సంకలో సంకలో పెట్టుకుని వెళ్ళిపోయాడు యానాది పుల్లన్న. నల్ల కుక్క ఆయన వెనకే కదిలింది.

***

శ్రీరామనవమి పండుగ ఊళ్లోనే కాదు చుట్టుపక్కల పదహారు గ్రామాల్లో బాగా చేసేవారు. కొత్త తాటాకు పందిల్లేసి, నాటకాలాడి, హరికథలు, బుర్రకథలు, పానకాలు, వడపప్పు, కొబ్బరిముక్కలు పెట్టి, పండగ తెల్లారి కూరేటి పాలెంలో భోజనాలు పెట్టేవారు. చాలామంది జనం వెళ్ళేవాళ్ళు. ఆ వూరిలో ఆ ఆచారం ఎన్నో ఏళ్లనుంచి వుంది. అక్కడ పప్పన్నాలు మధ్యాన్నం పెడితే, పెద్దారంలో రాత్రికి పెట్టేవారు. పెద్దారం ఊరు రెండుగా విడిపోయి పెద్దముఠా అయ్యింది. ఆ యేడాది పెసలు బాగా పండితే, భోజనాలు మీద పెసరపప్పు, పెసర పూర్ణాలు, పెసరగారెలు... అట్టా పెట్టేవారు.

ఇక పెద్ద ముఠా వాళ్ళు పాయసం పోస్తే... చిన్న ముఠా వాళ్ళు పరమాన్నం పెట్టేవాళ్ళు. ఒకళ్లు బూరెలు పెడితే, ఇంకొకళ్ళు లడ్డూలూ... అట్టా పోటాపోటీగా... ఒకరంటే ఒకళ్ళు గొప్ప అన్నట్టుగా పండుగ చేసి భోజనాలు పెట్టేవాళ్ళు.

శ్రీరామనవమి పండుగ రోజు యానాది పుల్లన్నతో పాటు మిగిలిన హోల్ ఫామిలీ వాళ్ళంతా పుల్లుగా తాగి ఎక్కడోల్లక్కడ పడిపోయారు. తెల్లారి నిదరలేచి ఎవరి పన్లోకి వారు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల చేలల్లో మినుము, పెసర పీకేశారు. పాలెం పొలం గట్ల మీదున్న మామిడిచెట్లు బంగినపల్లి, చిత్తూరు, చిన్నరసాలు, చెరకురసాలు విరగాసినయి. కూరేటిపాలెం భోజనాలకెళ్ళే జనమంతా పాలెం పొలం గట్ల మీదుగా వెళ్ళాల్సిందే!

కాయలు కోస్తారని పుల్లన్న, నల్లకుక్కతో గుడిసె దగ్గరే ఉన్నాడు. అదుంటే చుట్టుపక్కల తాటి ఆకుల మీదగానీ, కొబ్బరి బొండాల మీదగానీ మామిడికాయల మీదగానీ చెయ్యి వెయ్యడానికి ఎవరికీ ధైర్యం చాలదు. పుల్లన్న పెళ్ళాం రంగమ్మ ఊళ్ళోకెళ్ళింది. పొద్దున్నే బచ్చు వీరయ్య పెళ్ళానికి నొప్పులొస్తున్నాయంటే! గుడిసెల్లోని పిల్లలంతా నల్లకుక్కతో కలిసి చేలల్లో మినప కల్లాలలో ఎలుకలు పట్టుకుంటున్నారు. మినుములు, పెసలు తిని ఒక్కొక్క ఎలుక పందికొక్కులా బలిసింది.

గుడిసె ముందున్న మామిడి చెట్టుకింద ఈతాకుల చాప మీద కునుకు తీస్తున్నాడు పుల్లన్న. మాగన్నుగా నిద్రపట్టింది. మామిడికాయల బరువుకి కొమ్మలు వంగి నేలను తాకుతున్నాయి. గాలి వీచినప్పుడల్లా కాయలు అటూ, ఇటూ ఊగుతున్నాయి. కొబ్బరిచెట్ల నిండా గెలకి ముఫ్ఫై దాకా బొండాలు వేలాడుతున్నాయి. రెండు ఉడుతలు 'కీక్... కీక్' అంటూ కొబ్బరి చెట్టు ఎక్కుతూ దిగుతూ అల్లరి చేస్తూ ఆడుకుంటున్నాయి. ఆ పొద్దున్నే తెల్లపిల్లి రెండు కూనల్ని ఈనింది. పిల్లల్ని వదిలి బయటికి రావడం లేదది. లేకపోతే అదికూడా ఎలుకల వేటకి నల్లకుక్కతో కలిసి కళ్ళాల్లోకి వెళ్లేదే!

సలగాలన దుర్గయ్య యానాదుల దిబ్బమీద కొచ్చేసరికి పొద్దు పడమటికి వాలింది. అప్పటికే ఊరి జనం, చుట్టుపక్కల ఊరోళ్ళు కూరేటిపాలెం వెళ్ళిపోయారు భోజనాలకి. మగతగా పడుకున్న పుల్లన్నను లేపాడు దుర్గయ్య. "రాత్తిరి బాగా ఎక్కువయ్యినట్టుంది అల్లుడు!" అంటూ లేచి సొంతకుండలో నీళ్ళు పుక్కిలించి ఊసి - ఎంత సేపయిందల్లుడు నువ్వొచ్చి, మగత కమ్మింది. పాడు నిద్దర! ఎండ పైకొచ్చినా మెలుకువే రాలేదు చూశావా?" అంటూ ఈత చాప తీసి మామిడిచెట్టునీడ వున్న చోటేసి కూర్చున్నాడు పుల్లయ్య. దుర్గయ్య ఇచ్చిన పొగాకు కాడ అందుకుంటూ.

చుట్టముట్టిస్తూ "కూరేటిపాలెం అన్నాలకెల్దామన్నావ్ మర్చిపోయావా?" అన్నాడు దుర్గయ్య. "నిన్న సందెకాల తిన్న బువ్వ దాని సంగతే మర్చిపోయా నివ్విపుడనంగానే గుర్తొచ్చింది. ఇంటిది ఊర్లోకెల్లింది. ఎవరో కోమట్లామిడ నొప్పులు పడుతుందంట. అదెప్పుడొచ్చుద్దో! మామిడితోటని వదిలేసి దగ్గరెవరు లేకుండా ఎట్ట అల్లుడూ" అన్నాడు పుల్లన్న మామిడిచెట్టు కాయల వంక చూస్తూ.

"గసిక్కర్రల్లాంటి నీ మనవళ్ళు, మనవరాళ్ళు, రేచుక్కల్లాంటి వారబాహుడు ఉండగా ఇంకా ఏంది మామ ఆలోచిస్తున్నావు? అదొక్కటే పది మంది పెట్టు" అన్నాడు. దుర్గయ్య దూరంగా చేలో ఎలుకల్ని పడుతున్న పిల్లల్ని, నల్లకుక్కని చూసి.

ఇద్దరూ బయల్దేరారు. ఎట్టా పసిగట్టిందో నల్లకుక్క పరిగెత్తుకుంటూ వచ్చి పుల్లన్న వెంట పడింది. పో గుడిసె దగ్గరుండు అంటూ వదిలేశాడు పుల్లన్న దాన్ని. నేనూ వస్తానన్నట్లు చాలాసేపు గింజుకుందది. వీరబాహుడు తోడు లేకుండా ఎక్కడికి కదలడు పుల్లన్న "పోనీ వీరబాహున్ని కూడా తీసుకుపోదామా?" అన్నాడు దుర్గయ్య దాని అరుపులు విని.

"అక్కడ భోజనాల దగ్గర ఊరకుక్కలుంటాయి. లడాయి పెట్టుకుంటే మన నల్లోడు ఊరుకోడు. ఎందుకొచ్చిన గొడవలు అల్లుడూ" అంటూ కూరేటిపాలెం వైపు బయల్దేరారు ఆ ఇద్దరు.

***

పిల్లలంతా కలిసి ఇరవైకి పైగా ఎలుకల్ని పట్టారు. వాటిని గుడిసె ముందు వరిగడ్డి, కొబ్బరి జీబుల్తో బాగా కాల్చారు. అరడజను మంది దాకా ఉన్నారు. పిల్లలు. అంతా పదేళ్ళలోపే! వీరబాహుతో కలుపుకుని ఒక్కొక్కళ్ళకి మూడేసి ఎలకలొస్తాయని లెక్కేసి చెప్పాడు వాళ్ళల్లో కొంచెం సన్నగా పొడుగ్గా వున్న పిల్లోడు. బాగా కాలిన ఎలుకల్ని ఆరనిచ్చి పిన్నీసుతో వాటి పొట్టలు చీల్చి, పేగులు బయటికి తీసి, దూరంగా వాడేవాడు పెద్ద పిల్లోడు. పడమటి గాలి వీస్తోంది. బాగా కొవ్వు పట్టి నూనె కారుతున్నాయి ఎలుకలు. "మినుములు, పెసలు మెక్కి బాగా బలిసినయి కదాన్నా" అంటుంది అందరిలోకి చిన్నగా వున్న చింపిరి జుత్తు పిల్ల. మామిడిచెట్టు కింద కూర్చుని ఎలుకల్ని ముక్కలుగా కోసి వాటా లేసుకుంటున్నారు. వాళ్ళంతా.

గుడిసె ముందు పిల్లలు ఆర్పిన మంటల్లో పొగరాసాగింది. దానికి పడమటి గాలి తోడై పొగ పెరిగి నిప్పు రాజుకుంది. గాలికి నిప్పు కణికొకటి ఎగిరి గుడిసె ముందున్న ఎండిన సొరపాదు మీద పడింది. అది అంటుకుని గుడిసె చూరు ముట్టుకుని చురచుర కప్పు దాకా పాకింది. గాలికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అది చూసిన పిల్లలు కాల్చిన ఎలకల్ని వదిలేసి గుడిసె దగ్గర గోలగోలగా ఏడుస్తున్నారు. కనుచూపు మేరలో ఒక్కమనిషి కనబడ్డం లేదు. యానాది పుల్లన్న కడగూటి కూతరు పెళ్ళికోసం తెచ్చిన గుడ్డలు, సరుకులు గుడిసెలోనే వున్నాయి.

"అన్నా! మన తెల్లపిల్లి దాని పిల్లలు గుడిసెలోనే వున్నాయంటూ" ఏడుపు లంకించుకుంది చింపిరి జుత్తు చిన్నపిల్ల.

గుడిసెలోనికెళ్ళడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. ఆ వేడికి గుడిసె దగ్గరికే పోలేకపోతున్నారు. పిల్లి పిల్లల్ని వదిలి బయటికి రావడం లేదు. అందరిలో పెద్ద పిల్లోడు... పిల్లి సంగతి నల్లకుక్కకి సైగ చేసి చెప్పాడు.

నల్లకుక్క గుడిసెలోనికెళ్ళింది. తెల్లపిల్లిని నోట కరుచుకుని బయటికి తెచ్చింది. పిల్లి మియం... మియం అనకుండా అట్టాగే పడివుంది. చచ్చిపోయిందేమోననుకుని కదిలిస్తే కొంచెం కదిలింది. 'అమ్మయ్య బతికే వుందన్న' అంటూ ఏడుపు ఆపేసింది చిన్నపిల్ల. మళ్లీ గుడిసెలోకెళ్ళింది నల్లకుక్క ఒక పిల్లి కూనని కరుచుకుని తెచ్చింది. అదింకా కళ్ళు తెరవలేదు. 'మి... మి...' అంటూ అటు, ఇటూ కదుల్తూంది. దాన్ని అమ్మ దగ్గరకు చేర్చింది చిన్న పిల్ల. మిగిలిన పిల్లలకోసం గుడిసెలోకెళ్ళింది. నల్లకుక్క... మంటలు బాగా పెరిగి గుడిసె కూలిపోయింది. అప్పటికే పక్కనున్న గుడిసెలకు పాకాయి మంటలు. మిగిలిన గుడిసెలతో పాటు మామిడిచెట్టు, కొబ్బరి చెట్లు కాలిపోయినయి. గుడిసెలోని కెళ్ళిన నల్లకుక్క బయటికి రాలేదు.

***

యానాది పుల్లన్న సలగాల దుర్గయ్య కూరేటి పాలెంలో అన్నాలు తిని బయలుదేరేసరికి దీపాలు పెట్టారు. అట్నుంచి అటే పాలెం డొంక పట్టుకుని పెద్దారం వెళ్ళారు. ముందుగా పెద్ద ముఠా వాళ్లు రాంమందిరం ముందువేసిన తాటాకు పందిర కింద తిన్నారు. ఆ తర్వాత చిన్న ముఠా దగ్గరకు చేరారు. అక్కడా తిందామనుకున్నారు. కానీ కడుపులో పెసరగింజ పట్టేంత ఖాళీ కూడా లేదు. అక్కడ లడ్లు, బూరెలు, పులిహోర పైపంచలో మూటగట్టుకుని బ్రహ్మం గారి నాటకం చూసి ఇళ్ళకు చేరేసరికి మలికోడి కూసింది.

***

దుర్గయ్య నిద్రలేచేసరికి "నిన్న మాపిటేల యానాదుల దిబ్బ మీదున్న గుడిసెలన్నీ కాలిపోయినయి. రాతిరి చెబుదామంటే నువ్వొచ్చేలోపలే నిద్దురపోయానంటూ" చెప్పింది దుర్గయ్య భార్య సుబ్బమ్మ.

"ఊరోళ్ళంతా వెళ్లారు పలకరించడానికంటున్న" ఆమె మాట పూర్తికాకముందే పరుగులాంటి నడకతో చేలకడ్డాలపడి యానాదులదిబ్బ చేరాడు దుర్గయ్య.

ఊరు ఊరంతా అక్కడే ఉంది. అంతా పుల్లన్న దగ్గర జేరి ధైర్యం చెబుతున్నారు. తోకల ఎంకటేసు, పర్రె బసవయ్య, పంచుమర్తి వెంకటేశ్వర్లు, ఎరికిల వీర్లంకయ్య, గౌండ్ల వీరస్వామి. అక్కడంతా కాలిపోయిన సొరకాయల బుర్రలు, కొబ్బరికాయలు మామిడిచెట్టు బొగ్గయిపోయింది. కొంతమంది కాలిన సామానంతా ఒకచోట గుట్టగా వేస్తున్నారు.

దిగులుగా కూర్చున్న యానాది పుల్లన్న చుట్టూ కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, పెళ్ళికోసం అద్దేపల్లి నుంచొచ్చిన చుట్టాలు, వియ్యంకుడు, వియ్యపురాలు, అల్లుడు చేరారు. చూడ్డానికి వచ్చిన కొంతమంది పలకరించి వెళ్ళిపోతున్నారు.

ఇంకా మంచి గుడిసెలేసుకోచ్చని ధైర్యం చెబుతున్నారు. కొంతమంది. పుల్లన్న ఏమీ మాట్లాడకుండా దీనంగా కూర్చున్నాడు.

"ఏమేమి కాలిపోయినయి యానాది పుల్లన్న" అంటూ అత్తలూరి గోపాలరావుగారి పెద్ద గుమస్తా బాయిగాడు చిన్నయ్య అడిగాడు. "నిట్టాటి గుడిసెలేసుకోవడానికి దొరగార్నడిగి తాటాకులు కొట్టుకొందువులే" అని ధైర్యం చెప్పాడు. మాట్లాడలేదు పుల్లన్న.

"ఇంకేమన్నా కాలినయా పుల్లన్నా? అంటూ పర్రె బసవయ్య అడిగాడు. కదలకుండా అట్టాగే కూర్చున్నాడు.

అప్పుడే అక్కడికొచ్చిన సలగాల దుర్గయ్యను వాటేసుకుని కొంచెం సేపు ఏడ్చాడు పుల్లన్న. అంత పెద్ద మనిషి ఏడుస్తుంటే అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగినయి. ఆయన కూతుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు - శోకాలు పెట్టి ఏడ్చారు.

కొంచెం నెమ్మగిల్లినాక... "పిల్లగాల్లకేం కాలేదు గందా? ఏమేం కాలినయి మామా!" అంటూ అడిగాడు సలగాల దుర్గయ్య. లేచి కాలిబొగ్గయిన మామిడిచెట్టు కానిచ్చిన బానకర్ర తీసుకుని తలపాగా చుట్టుకున్నాడు. యానాది పుల్లన్న. కర్రని అటూ ఇటూ తిప్పుతున్నాడు. కుడిచేతిలోంచి ఎడమచేతిలోకి, ఎడమచేతిలోంచి కుడిచేతిలోకి.

మళ్లీ మెల్లగా అడిగాడు దుర్గయ్య పక్కనున్న వియ్యంకుడు యానాది ఎంకట సోమన్నని. "ఏమేమి కాలిపోయాయి యానాదెంకటి సోమన్న" అని - ఎత్తుకున్నాడు పుల్లన్న కర్ర తిప్పుతూ.

"ఏమేమి కాలిపోయే
యానాదెంకటి సోమన్నా!! యానాది పుల్లన్నా!
తిర్రికాలే! మొర్రి కాలే!!
తిరిగిమోత సట్టికాలే
కూతురికి దాచుకున్న కొత్తకోక కాలిపోయే!
అల్లుడికి దాచుకున్న గళ్ళలుంగీ కాలిపోయే
కోడలికి దాచుకున్న కుంకుంబరిణి కాలిపోయే
ఇంకేమి కాలిపోయే యానాదెంకటి సోమన్న! యానాది పుల్లన్నా!!
వియ్యపురాళ్ళకు దాచుకున్న ఈరుప్పని కాలిపోయే
చుట్టాలకు దాచుకున్న చుట్టపీకెలు కాలిపోయే
గజాశూలాల్లాంటి గసికర్రలు కాలిపోయే
మనవడిలా పెంచుకున్న మామిడిచెట్టు కాలిపోయే
కూతురులా చూసుకున్న కుంకుడుచెట్టు కాలిపోయే
పేనానికి పేనమైనా నా పేనానికి పేనమైనా నా వీరబాహు కాలిపోయే!!
ఇంకేమి కాలిపోయే యానాదెంకటి సోమన్న... యానాది పుల్లన్నా"

అంటూ పుల్లన్న, ఎంకటసామి కలిసి ఆడి పాడుతుంటే జనాలకి దుఃఖం ఆగలేదు. మిగిలిన యానాదులంతా కల్లుతాగి వారితో కలిసి ఆరోజల్లా వీరంగం వేస్తూనే వున్నారు. ఆ రోజుకే పిల్ల పెళ్ళయి పోయినట్టుగా తేల్చుకున్నట్టున్నారు. అమ్మాయి, అబ్బాయి కలిసి వీరంగం వేశారు. వారితో పాటు మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు కలిశారు. పలకరించడానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు.

ఆ రాత్రంతా యానాదులు పాడుతున్న పాటలు, డమరుక మోతలు వినపడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత యానాది పుల్లన్న మాచెర్ల చెరువుకట్ట మీదున్న పెద్దకొడుకు సంజీవి దగ్గర ఇంకో గుడిసె వేసుకున్నాడు. ఆ ఏడాది దసరా పండక్కి సంజీవి కల్తీ సారా తాగి చచ్చిపోతే... ఆయన పని పుల్లన్న చాలాకాలం చేశాడు.

***

యానాదుల దిబ్బ మీద మళ్లీ ఏ యానాది గుడిసె వేయలేదు. ఎప్పుడన్నా యానాదుల దిబ్బ మీదుగా వెళ్తుంటే గీ... అని గాలి రోద పెట్టేది. "ఇంకేమి కాలిపోయే యానాది ఎంకటిసోమన్నా! యానాది పుల్లన్న అన్నట్టుండేది ఆ రోద!

***

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Improper donation
అపాత్ర దానం
- పద్మావతి దివాకర్ల
Ruby in clay
మట్టిలో మాణిక్యం
- డాక్టర్. షహనాజ్ బతుల్
మహత్కార్యం
మహత్కార్యం
- పద్మావతి దివాకర్ల
Teaching (children's story)
ఉపదేశం (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Miracle
ఎండమావి
- సన్నిహిత్
papodu
పాపోడు
- అఖిలాశ
sulti
సుల్తి
- అఖిలాశ
house wife
గృహిణి
- చంద్ర శేఖర్ కోవూరు