చెప్పని మాట - గవాస్కర్

Cheppani maata

గుండ్లపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణ ఆ రోజు పెళ్ళి పందిరిలా కళకళలాడుతోంది. వేదిక మీద బ్యానరు, దాత శ్రీ ఉదయ్ ప్రతాప్ గారికి ఆత్మీయ సన్మానం. నేను బడికి కట్టించిన కొత్త భవనం ప్రారంభోత్సవం అది.

ఎమ్మెల్యేగారు గజమాల వేశారు. ముందు వరసలోంచి రవి గుసగుస, ఏమప్పా, పూలదండకే మెడ వంగుతాండాదే. ఆ కాలంలో ఒగ మాట చెప్పడానికి నాలుక ఎందుకు వంగలేదో. పక్కనే లచ్చి వాడి మోచేతికి ఒక్కటిచ్చింది. వెనక ఎనభై ఏళ్ళ కోటయ్య గజమాలను చూసి, ఆ దండ ఐదు కిలోలకు తక్కువుండదప్పా అని వేళ్ళ మీద లెక్క కడుతున్నాడు.

యువ టీచరు మైకు నా ముందుకు తెచ్చింది. సార్, దేవుడు ప్రత్యక్షమై ఒకే ఒక్క వరం కోరుకోమంటే, ఏం అడుగుతారు.

ఆ బడి రోజులు అన్నాను, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.

సభలో చప్పట్లు మోగాయి. అందరూ అది ఏదో అందమైన మాట అనుకున్నారు. కానీ ఆ మాటతో నా మనసు ముప్పై ఏళ్ళ పైచిలుకు వెనక్కి పరుగెత్తింది.

మా ఊరి నడుమ రావిచెట్టు, పక్కనే గంగమ్మ గుడి, ఊరి చివర ఎండిపోయిన వంక. ఈ ఏడైనా వాన పడతాదా అనేది మా ఊర్లో నమస్కారం కంటే ఎక్కువ వినిపించే మాట.

మా నాయన రామచంద్రయ్య పక్క ఊరి బడిలో టీచరు. ఊరంతా ఆయన్ని అయ్యోరు అనేది. ఆయనకు ముగ్గురు కొడుకులు. శేఖర్ అన్న, నేను, బాలు. నా కోసం అన్న ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసి ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు. మీ అన్న త్యాగం మర్చిపోబాకు అబ్బీ, చదువే మన చేను, చదువే మన పంట అనేవారు నాయన లాంతరు వెలుగులో. నా చొక్కాకు మాసికలు, పుస్తకాలు అన్న దగ్గరినుంచి వచ్చినవి. కానీ లెక్కల్లో నన్ను మించినవాడు లేడు.

పద్మావతి ఊరి బజారులో పెద్ద హోల్‌సేల్ దుకాణం చౌదరిగారి అంగడి యజమాని వెంకటేశ్వర చౌదరిగారి ఒక్కగానొక్క కూతురు. ఇంటి ముందు అంబాసిడర్ కారు, లోపల ఊర్లోనే మొదటి టీవీ. చౌదరిగారి మాటకు బజారులో తిరుగులేదు. కడప కాన్వెంటులో చదివిన పద్మ పదో తరగతికి మా ఊరి బడిలో చేరింది.

అంగడి గుమాస్తా కోటయ్య ఆమె టిఫిన్ డబ్బా తెచ్చేవాడు. ఏ మాటైనా తూకం లెక్కలోనే. ఒకసారి హెడ్మాస్టరుగారు బాగుండావా కోటయ్యా అంటే, తరుగు పోగా ముప్పావు వంతు బాగుండా సార్ అన్నాడు. అప్పటినుంచీ వాడు ముప్పావు కోటయ్య.

నాకూ పద్మకూ నడుమ ఆకాశానికీ భూమికీ ఉన్నంత దూరం. కానీ మనసులకు దూరాలు తెలియవు కదా.

లెక్కల అయ్యోరు నాగభూషణంగారి ఊతపదం, లెక్కలు రానోడు బజార్లో కొత్తిమీర అమ్ముకోవాల్సిందే. ఒకరోజు ఆవేశంలో, లేకపోతే చౌదరిగారి అంగట్లో పొట్లాలు కట్టుకోవాల్సిందే అనేశారు. తరగతంతా గొల్లుమంది. ముందు బెంచీలో పద్మ కనిపించి నాలుక కరుచుకుని, అంటే, పొట్లాలు కట్టడం కూడా ఒగ విద్యే అని ఇంకా ఇరుక్కుపోయారు.

ఆ లెక్క రాక పద్మ కళ్ళలో నీళ్ళు. నేను మాట్లాడకుండా నా పుస్తకంలో లెక్కను పెద్ద అక్షరాలతో రాసి ఆమెకు కనిపించేలా వంచాను. ఆ సాయంత్రం నా సంచిలో ఒక జామకాయ, ఒక కొత్త పెన్సిలు కనిపించాయి. ఆ పెన్సిలును ఎప్పుడూ వాడలేదు, పెట్టెలో దాచుకున్నాను.

ఒకరోజు బడి వదిలే వేళకు వాన దంచి కొట్టింది. పద్మ వరండాలో వణుకుతోంది. రెండు ఊసలు విరిగిన నాయన గొడుగును ఆమె చేతిలో పెట్టి, నేను వర్షంలో ఇంటికి పరుగెత్తాను. మూడు రోజులు జ్వరం. తిరిగి వచ్చేసరికి ఆ పాఠాలన్నీ రాసిన నోటు పుస్తకం నా బెంచీ కింద ఉంది. పేరు లేదు, కానీ ఆ గుండ్రటి అక్షరాలు ఎవరివో నాకు తెలుసు.

మాటలు లేవు, కానీ చేతలు మాట్లాడేవి.

నా స్నేహితుడు రవి, కరణంగారి అబ్బాయి, నోరు ఆగనివాడు. పద్మ స్నేహితురాలు లచ్చి. ఈ ఇద్దరికీ విషయం మాకంటే ముందే అర్థమైపోయింది. లచ్చి ఒక చీటీ రాసి జామెట్రీ బాక్సులో దాచింది. హిందీ పండితుడు శర్మగారు బాక్సు పట్టుకుని, క్లాసంతా వినండి అని గొంతెత్తి చదివారు, అరకిలో బెల్లం, పావుకిలో మినప్పప్పు, నాయనకు బీడీ కట్ట. తొందరలో లచ్చి సరుకుల జాబితా పెట్టుకుంది. అసలు చీటీతో కోటయ్య కందిపప్పు పొట్లం కట్టేశాడు. ఆ దేవుడికే మీ సంగతి ఇష్టం లేదే అని లచ్చి తల కొట్టుకుంది.

పదో తరగతి తర్వాత మేం నలుగురం కడప కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాం. పొద్దున ఏడున్నర ఎర్రబస్సు మా ప్రపంచం. చౌదరిగారు కోటయ్యను రోజూ తోడు పంపేవారు. ఆ కోటయ్య కళ్ళు పావుకిలో కూడా తప్పవు రా అని రవి గొణిగేవాడు. ఐదేళ్ళలో మేం మాట్లాడుకున్న మాటలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. కానీ బస్సు అద్దంలో ఒకరి ముఖం ఒకరికి కనిపించేలా కూర్చోవడం మాకు మాటల్లేకుండానే తెలుసు.

ఇంటర్లో ఒకరోజు టీ బంకు దగ్గర రవి ఒక సిగరెట్ నా చేతిలో పెట్టి, ఒగ దమ్ము లాగు రా, మగోడివనిపించుకో అన్నాడు. సరిగ్గా అప్పుడే బస్సు కిటికీలోంచి పద్మ నన్ను చూసింది. ఆ చూపులో వద్దు, బాగోదు అని స్పష్టంగా రాసి ఉంది. సిగరెట్ రవికే ఇచ్చేశాను. వాడు ఒక్క దమ్ము లాగి దగ్గి దగ్గి, ఇది యమలోకానికి డైరెక్టు టికెట్టు అని పారేశాడు.

నాకు సిగరెట్ అలవాటు లేకపోయినా, ఎప్పుడైనా అది చేతిలోకి వస్తే ఇంటర్లో ఆమె చూసిన ఆ వద్దు, బాగోదు అన్న చూపే గుర్తొస్తుంది. వెంటనే తిరిగిచ్చేస్తాను.

ఒక సాయంత్రం రావిచెట్టు అరుగు మీద రవి నిలదీశాడు. ఏమప్పా, ఒగ మాట చెప్పు. మహా అయితే చౌదరిగారు తూకం రాయి ఇసిరేస్తాడు. నేను అడ్డం నిలబడ్తా.

రవీ, అయ్యోరి కొడుకు చౌదరిగారి అమ్మాయి ఎనక పడ్డాడని ఒగ మాట బజార్లో పుడితే నాయన తల ఎత్తుకుని తిరగలేరు. అన్న నా కోసం చదువు ఆపేశాడు, ఎనక బాలు ఉండాడు. అందని ద్రాక్ష పుల్లన అని నేను అనను. కానీ దాని కోసం చెట్టు ఎక్కితే విరిగేది ఆయమ్మి కొమ్మ. మర్నాడే ఆయమ్మి కాలేజీ మాన్పించేస్తారు.

అదే సమయంలో గుడి మెట్ల మీద లచ్చి పద్మను అడిగిందట, నువ్వే ఒగ మాట అనవే.

లచ్చీ, మా నాయన పరువు రచ్చకెక్కితే ఆ దెబ్బ ఉదయ్ ఇంటి మీద పడతాది. ముందు నుయ్యి, ఎనక గొయ్యి. చెప్పకపోతే నా గుండె మాత్రమే బరువెక్కుతాది. చెప్తే వాడి బతుకే బరువెక్కుతాది. అయినా కొన్ని మాటలు నోటితో చెప్పాల్సిన పనిలేదే. వానికి తెల్సు.

ఇది ఎన్నో ఏళ్ళ తర్వాత లచ్చి చెప్పినప్పుడు నా గొంతు పూడుకుపోయింది.

డిగ్రీ చివరి ఏడాది జాతరలో రవి చివరి పథకం వేశాడు. మా ఇద్దర్నీ జెయింట్ వీల్ ఎక్కించాలని. తీరా ఎక్కింది వాడొక్కడే. పైకి వెళ్ళాక కరెంటు పోయింది. గంగమ్మా కాపాడు, కోడిపుంజు ఇస్తా, కాదు, పొట్టేలు ఇస్తా అని అరగంట అరిచాడు. కింద నేనూ పద్మా పొట్ట చెక్కలయ్యేలా నవ్వాం. కలిసి అంతగా నవ్వింది ఆ ఒక్కసారే.

వీడ్కోలు రోజు ఆటోగ్రాఫ్ పుస్తకంలో నేను రాశాను, ఎక్కడ ఉన్నా బాగుండాలి. ఆమె రాసింది, నువ్వు పెద్దవాడివి కావాలి. రవి చదివి తల పట్టుకున్నాడు. ఐదేళ్ళకు ఈ రెండు లైన్లా, టెలిగ్రాము కూడా ఇంతకంటే పొడుగుంటాది.

చివరి పరీక్ష రోజు కాలేజీ గేటు దగ్గర ఎదురుపడ్డాం. ఒక్క నిమిషం. ఆమె కారు ఎక్కబోతూ ఆగింది. నేను సైకిల్ పట్టుకుని నిలబడ్డాను. ఆమె కళ్ళు తడిశాయి. నేను తల దించుకున్నాను. కారు కదిలింది. ఎర్రమట్టి దుమ్ము లేచి మెల్లగా కిందకు దిగింది. ఆ దుమ్ము ఈ రోజుకీ నా గుండెల్లోంచి పూర్తిగా దిగలేదు.

ఆరు నెలల్లో ఆమె పెళ్ళి బెంగళూరు వ్యాపారితో జరిగింది. ఆ రోజు నేను బ్యాంకు పరీక్ష కోసం తిరుపతిలో ఉన్నాను.

బ్యాంకులో పదేళ్ళు పనిచేశాక కడపలో రియల్ ఎస్టేట్ మొదలుపెట్టాను. నిజాయితీగా చేస్తే ఏ పనైనా పూజే రా అన్న నాయన మాటే నా పెట్టుబడి. వ్యాపారం ఎదిగింది. అన్నకు కొత్త కెమెరాలు, బాలుకు ఇంజనీరింగ్, ఊరి పేద పిల్లలకు స్కాలర్‌షిప్ నిధి. ఇప్పుడు ఈ బడికి కొత్త భవనం.

ఇన్నేళ్ళూ రవి, లచ్చి మా మధ్య తెగిపోని దారం. నా వృత్తిలో ఓడిపోయిన ఒకే కేసు మీదే రా. సాక్ష్యాలన్నీ ఉండాయి. గొడుగు, నోటు పుస్తకం, జామకాయ, నేను దగ్గి చచ్చిన సిగరెట్టు. నిందితులే నోరు విప్పరు అంటాడు రవి.

ప్రతి సంక్రాంతికి అరుగు మీద అడుగుతాను, అందరూ బాగుండారా. రవికి తెలుసు ఆ అందరూ ఎవరో. బాగుండాది రా. పిల్లలు సెటిలైనారు. ఊరి గుడికి ఏటా చందా పంపుతాది. మంచిది, బాగుండాల అంటాను.

అటు పద్మ కూడా లచ్చికి ఫోన్ చేసి గొంతు తగ్గించి అడుగుతుందట, వాడెట్లుండాడే. ముప్పై ఏళ్ళుగా మీ ఇద్దరి మధ్య పోస్టుమాను ఉద్యోగం చేస్తాండా, ఒగ్గ చీర కూడా పెట్టలేదు అని లచ్చి దెప్పుతుందట.

సార్, సార్. టీచరు పిలుపుతో ఉలిక్కిపడ్డాను. వెనకనుంచి కోటయ్య, అయ్యోరి కొడుకు నిలబడే నిద్రపోయినాడా ఏంది.

ఆ బడి రోజులే ఎందుకు సార్.

ఆ రోజుల్లో నా దగ్గర ఏమీ లేదమ్మా. మాసికల చొక్కా, విరిగిన గొడుగు, ఏడున్నర బస్సు. కానీ జీవితానికి కావాల్సినవన్నీ అక్కడే దొరికాయి. రియల్ ఎస్టేట్‌లో ఏ భూమైనా కొనొచ్చు. కానీ జ్ఞాపకాల భూమికి రిజిస్ట్రేషను ఉండదు.

కార్యక్రమం అయ్యాక రవి అడిగాడు, అప్పుడు ఒగ్గ మాట చెప్పి ఉంటే కథ వేరేలా ఉండేదేమో అనిపించలేదా.

రవీ, మేం చెప్పుకోలేదు అనుకుంటాండావు. కానీ ఆ గొడుగు చెప్పింది. ఆ నోటు పుస్తకం, ఆ జామకాయ, ఆ పెన్సిలు చెప్పినాయి. బస్సు కిటికీలోంచి ఆ వద్దు అన్న చూపు చెప్పింది. కాలేజీ గేటు కాడ ఆ ఒగ్గ నిమిషం చెప్పింది. నోటితో చెప్పలేదు, అంతే. మా మౌనం చౌదరిగారి పరువును, నాయన గౌరవాన్ని, అన్న త్యాగాన్ని కాపాడింది.

అంతలో లచ్చి ఫోను పట్టుకుని పరుగున వచ్చింది. పద్మ ఫోన్ చేసింది, నీకు ఒగ మాట చెప్పమంది.

నా గుండె ముప్పై ఏళ్ళ నాటి లాగే కొట్టుకుంది. ఏమందీ.

బాగుండాల అని.

రవి నెత్తి కొట్టుకున్నాడు. ముప్పై ఏళ్ళాయ, ఒగ్గ పదం కూడా మారలేదు.

నేను నవ్వాను. ఆటోగ్రాఫ్ పుస్తకంలో నేను రాసిన మాటే అది.

ఆ రాత్రి పాత ట్రంకు పెట్టె అడుగున దాచిన ఆ పెన్సిలును ఒక్కసారి చేతిలోకి తీసుకుని, మళ్ళీ అక్కడే పెట్టేశాను. ముప్పై ఏళ్ళుగా దానికి ముల్లు చెక్కలేదు. కొన్ని జ్ఞాపకాలు వాడుకోవడానికి కాదు, దాచుకోవడానికే. పెట్టె మూసేస్తూ మనసులోనే అనుకున్నాను. మరో జన్మంటూ ఉంటే, ఈ సారి ఊరి మాట కాదు, పెద్దల మాట కాదు, ఇంకెవరి మాటా కాదు. నా మనసు మాటే వింటాను, నా ప్రేమ మాటే వింటాను.

కొన్ని ప్రేమలు పెళ్ళి పందిళ్ళకు చేరవు. కొన్ని మాటలు పెదవులు దాటవు. అయినా అవి ఓడిపోయినట్టు కాదు. మౌనంగా వెలిగే దీపం లాగా అవి జీవితాంతం తోడుంటాయి.

చెప్పని మాట, చెప్పిన మాట కన్నా ఎక్కువ కాలం బతుకుతుంది.

సమాప్తం

మరిన్ని కథలు

Todokarundina ade bhagyamu
తోడు ఒక్కరున్నా అదే భాగ్యము!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Nalakoobara manigreevulu
నలకూబర మణిగ్రీవులు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
Phone call
ఫోన్ కాల్
- డా: సి.హెచ్. ప్రతాప్
Vasudhaika kutumbam
వసుధైక కుటుంబం
- అంబల్ల జనార్దన్
Daivam manusha roopena
దైవం మానుషరూపేణా
- టి. వి. యెల్. గాయత్రి
Kanche chenu meste
కంచే చేను మేస్తే.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
Aakali nerpina paatham
ఆకలి నేర్పిన పాఠం
- సి.హెచ్. ప్రతాప్
Nenu manishine
నేను మనిషినే
- బోయ మహేష్