జోరున వాన కురుస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దాని ప్రభావంతో విజయవాడ పరిసర ప్రాంతాలను వాన ముంచెత్తుతోంది. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదిత్య ఆదేశాలు జారీ చేశాడు. ఆ పనిలోనే అధికారులు నిమగ్నమయ్యారు. కొద్దిగా వాన తగ్గింది. తన బంగ్లాకు వచ్చాడు ఆదిత్య. భర్తకు టీ తెచ్చి ఇచ్చింది దేవిక. ఆదిత్య తన కింద పనిచేస్తున్న అధికారులకు ఫోన్ చేసి సహాయ కార్యక్రమాల గురించి కనుక్కున్నాడు. అతడికి అసంతృప్తిగా అనిపించింది. “ఒకసారి పరిస్థితిని సమీక్షిద్దాం” అనుకుని తనే స్వయంగా బయలుదేరాడు ఆదిత్య. అతడి సిబ్బంది కూడా వెంట రాలేదు. అంతకుముందే డ్రైవర్‌ను ఇంటికి పంపించాడు. “మీరొక్కరే ఎందుకు? డ్రైవర్‌ను, మీ అసిస్టెంట్‌ను ఫోన్ చేసి పిలిపించండి.” “అవసరం లేదు దేవికా! అక్కడిదాకా వెళ్లి రావడానికి పెద్ద సమయం కూడా పట్టదు. వాన కూడా తగ్గిపోయింది” అన్నాడు ఆదిత్య. “నేను కూడా మీతో వస్తాను!” అంది దేవిక. వద్దని వారించాడు ఆదిత్య. కానీ దేవిక వినలేదు. అతడి వెంటే వస్తానని మొండికేసింది. చివరకు ఇద్దరూ కారులో బయలుదేరారు. కారు డ్రైవ్ చేస్తున్నాడు ఆదిత్య. పాయకాపురం దాటి బుడమేరు దగ్గరికి వచ్చారు. ఇంకా కొంతమంది జనాలు అక్కడే ఉన్నారు. అధికారులు వాళ్లను ట్రాక్టర్ల మీద పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆదిత్యను చూడగానే అధికారులు వచ్చి సహాయ కార్యక్రమాల గురించి వివరించారు. అక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడాడు ఆదిత్య. అనంతరం కారెక్కి ఇంటికి బయలుదేరారు ఆదిత్య, దేవిక. సరిగ్గా పది నిమిషాలు డ్రైవ్ చేశాడో లేదో... బుడమేరు కట్ట తెగింది. అది ఎవరూ ఊహించని పరిణామం! ఉధృతంగా నీటి ప్రవాహం వచ్చేస్తోంది. ఆదిత్య కారును వెనక్కు మళ్లించాలని చూశాడు. ఇంతలో వరద నీరు కారును చుట్టుముట్టింది. కారు అదుపు తప్పి ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. ఏం చేయాలో తోచలేదు ఇద్దరికీ. ఇంతలో స్థానికులు కేకలు వేసుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్ల వెనకే వచ్చిన అధికారులు పరిస్థితిని చూసి తాళ్లను తీసుకుని పరుగెత్తుకొచ్చారు. బలిష్ఠంగా ఉన్న ఇద్దరు యువకులు తాళ్లతో సహా ప్రవాహంలోకి దూకారు. అప్పటికే కారు సగం మునిగిపోయింది. దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు దేవిక, ఆదిత్య. యువకులు కారు దగ్గరికి రాగానే ఆదిత్య కారు తలుపు తెరిచాడు. ఒక్కసారిగా నీళ్లు లోపలికి తన్నుకొచ్చాయి. ఇంతలో కొంతమంది అధికారులు కూడా ఈదుకుంటూ అక్కడికి వచ్చారు. అందరూ కలిసి తాళ్ల సహాయంతో ప్రవాహం నుంచి ఆదిత్య దంపతులను రక్షించారు. అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. గజగజా వణుకుతున్న ఆదిత్య దంపతులకు స్థానికులు పొడి బట్టలు తెచ్చి ఇచ్చారు. “మీకేదో సహాయం చేద్దామని వచ్చి, మేమే బాధితులమయ్యాము. ఇలా మీ సహాయాన్ని పొందాము !” అన్నాడు ఆదిత్య నవ్వుతూ. అక్కడి వాళ్లంతా నవ్వారు. కాసేపటికి అందరూ పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. “మేమిద్దరం మునిగిపోతామనుకున్నాను. దైవం మీ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడాడు!” అంది దేవిక, అక్కడివాళ్లు ఇచ్చిన టీ తాగుతూ. “ఇంట్లో హాయిగా కూర్చోకుండా మీరు మా కోసం పరిగెత్తుకొచ్చారు కదమ్మా! మనిషికి మనిషి తోడు” అంది ఒక పేదరాలు. “అవును!” అంటూ నవ్వాడు ఆదిత్య. (సమాప్తం )

