రిటైరయ్యాక పిల్లల పెళ్లిళ్లు కూడా పూర్తిచేసిన రాజేశ్వరరావుకు, జీవిత చరమాంకంలో మరో బాధ్యతను నెత్తిన వేసుకోవాలంటే విరక్తిగా అనిపించేది. కొడుకు శ్రీకాంత్ అదే నగరంలో ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలతో వేరుగా ఉంటున్నాడు. తల్లిదండ్రులను తన దగ్గరే ఉంచుకోవాలని అతనికి ఉన్నా, అందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు.
వాళ్లు నివసిస్తున్న నగరంలో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒకప్పుడు బోర్లు వేస్తే నీళ్లు సమృద్ధిగా వచ్చేవి. ఇప్పుడు వందల అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదు. అపార్ట్మెంట్లకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. మొదట్లో అడిగినప్పుడల్లా వచ్చేవి. ఇప్పుడు డబ్బులు ముందుగా చెల్లించినా రోజుల తరబడి ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. నీటి కోసం తెల్లవారుజామునే ఖాళీ బిందెలతో వీధుల్లో నిలబడటం, నీళ్ల పంపిణీ విషయంలో వాదోపవాదాలు జరగడం నిత్యకృత్యాలయ్యాయి.
ఈ పరిస్థితుల్లో ఇంటి యజమానులు కూడా తమ ఇళ్లకు అద్దెకు వచ్చేవారి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరు, ముగ్గురు, సభ్యులున్న చిన్న కుటుంబాలకే ప్రాధాన్యమిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకునే ఉద్యోగస్థులకు ఇళ్లు దొరకడం కష్టమవుతోంది. పెద్ద కుటుంబమంటే నీటి వినియోగం ఎక్కువవుతుందని, బంధువుల రాకపోకలతో మరింత నీరు ఖర్చవుతుందని యజమానులు భావిస్తున్నారు.
రాజేశ్వరరావు ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసి రిటైరయ్యాడు. పెన్షన్ లేదు. జీవితమంతా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసినా చెప్పుకోదగ్గ ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. అయితే ఇంట్లో మాత్రం అవసరానికి మించిన సామాను పేరుకుపోయింది. పాత మంచాలు, బీరువాలు, కుర్చీలు, వంటపాత్రలు, ఎన్నో ఏళ్లుగా వాడని వస్తువులు... వాటిని పారేయడానికి భార్య రామేశ్వరి ససేమిరా ఒప్పుకునేది కాదు.
“ఏదో ఒకరోజు పనికొస్తాయి. వాటిని కొనడానికి అప్పట్లో ఎంత ఖర్చుపెట్టామో తెలుసా?” అనేది ఆమె సమాధానం.
రాజేశ్వరరావు నివసిస్తున్న ఇంటి యజమాని ఒకరోజు వచ్చాడు.
“రావుగారూ! మీ ఇంట్లో మీరు ఇద్దరే ఉన్నా, మీ కొడుకు కుటుంబం తరచూ వస్తూ ఉంటోంది. అడపా దడపా బంధువులు కూడా కనిపిస్తున్నారు. మా రికార్డుల ప్రకారం మీ నీటి వినియోగం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ట్యాంకర్ల ఖర్చు మాకు తడిసి మోపెడవుతోంది. నెలకు పదివేలు పెంచితే కానీ మేము నీళ్ళు సమకూర్చే పరిస్థితి కనపడటం లేదు. లేకపోతే ఇల్లు ఖాళీ అయినా చేయాల్సి వస్తుంది “ అని నిర్మొహమాటంగా చెప్పేశాడు.
రాజేశ్వరరావుకు ఆ మాటలు అవమానంగా అనిపించాయి.
“అయ్యా! మేము అద్దె సక్రమంగానే చెల్లిస్తున్నాం. నీళ్లకు అయ్యే ఖర్చులో మా వాటా కూడా ఇస్తున్నాం. అయినా ఎప్పుడో ఒకసారి వచ్చే బంధువులను సాకుగా చూపించి పదివేలు కట్టమనడం భావ్యంగా లేదు. ..” అంటూ తన బాధను వ్యక్తం చేశాడు.
“మీరు చెప్పేది బాగానే ఉంటుంది. కానీ నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మా చేతిలో ఉన్నది అంతే. పెద్ద కుటుంబాల వల్ల నీళ్ల ఖర్చు పెరుగుతోంది. మేము కూడా నష్టపోలేం కదా! త్వరగా ఏదో ఒకటి ఆలోచించి చెప్పండి. ఇల్లు కావాలంటూ మాకూ చాలామంది వస్తున్నారు ..” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఈ విషయం తెలిసి శ్రీకాంత్ తల్లిదండ్రులను తన దగ్గరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ నగరంలో ఎక్కడ ఇల్లు వెతికినా పెద్ద కుటుంబాలకు అద్దెకు ఇవ్వడానికి యజమానులు ముందుకు రావడం లేదు. తల్లిదండ్రులు, తాను, భార్య, ఇద్దరు పిల్లలు కలిసి ఉండాలంటే కనీసం మూడు పడకగదుల ఇల్లు కావాలి. అలాంటి ఇళ్ల అద్దెలు కూడా అందుబాటులో లేవు. పైగా కుటుంబ సభ్యుల సంఖ్య చెప్పగానే యజమానులు నీటి సమస్యను కారణంగా చూపి నిరాకరిస్తున్నారు.
ఏది ఏమైతే అదయ్యింది అని ధైర్యం చేసి తల్లి తండ్రులను తన ఇంటికి తీసుకొచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అవసరం అయితే అపార్ట్మెంట్ వాళ్ళకు ఎంతో కొంత డబ్బు చెల్లించడానికి సిద్దపడ్డాడు.
“ కానీ మనం అందరమూ ఒకే ఇంట్లో అడ్జస్ట్ అయ్యి ఉండాలంటే రెండు సంసారాలకు సరిపడా ఉన్న సామాను ఏం చేయాలి అనేదే నా ఆలోచన. వాటిని పూర్తిగా వదిలించుకుని ముఖ్యమైన వస్తువులతో రాగలిగితే అందరూ కలిసి కష్టమో,నష్టమో ఒకే చోట ఉండటానికి అవకాశం ఉంటుంది “అని కొడుకు చెప్పడంతో రామేశ్వరి గుండెల్లో రాయి పడింది. కొడుకు పెట్టిన ప్రపోజల్ ఆమెకు నచ్చలేదు.ఉన్నట్టుండి మొత్తం సామానంతా ఎవరెవరికో ఇచ్చేసి వట్టి కట్టు బట్టలతో కొడుకు ఇంటికి వెళ్లాలంటే మనసొప్పలేదు.
కొంతకాలంగా రాజేశ్వర రావు టీవీలో ఎంతోమంది ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలు వింటూ వస్తున్నాడు. అందులోని సారం ఏమిటంటే డిటాచ్మెంట్ . డబ్బయ్యేళ్లు దాటాక ఇక ఏవో ఆస్తులు కూడ బెట్టుకోవాలని, విలాసవంత జీవితం అనుభవించాలని కోరుకోక ,అన్నిటితోనూ డిటాచ్ అయ్యి ,భగవంతునితో అటాచ్ అవడం మంచిది అని తరచుగా చెప్పేది ఆయనలో తాత్వికంగా కొన్ని బలమైన ఆలోచనలను రేకెత్తించింది.
జీవితమంతా కూడబెట్టుకోవడమే కాదు, అవసరమైనప్పుడు వదులుకోవడం కూడా నేర్చుకోవాలని అతని మనసు చెబుతోంది.
చివరకు కొడుకుతో చర్చించి ఇంట్లోని పాత సామానును తగ్గించాలని నిర్ణయించుకున్నాడు.
ఎన్నో ఏళ్లుగా వాడకుండా అటక మీద పడేసిన సామానులు, వాడని కుర్చీలు, వంటపాత్రలు ఒక్కొక్కటిగా బయటకు వెళ్లసాగాయి. పనిమనుషులు, బట్టలు ఉతికేవారు తమకు కావలసిన వస్తువులు తీసుకెళ్లారు.
అలా ఎన్నో వస్తువులను వదులుకున్నాక, చివరకు తల్లిదండ్రులు కొడుకు దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. శ్రీకాంత్ కూడా తనకు తెలిసినవారి సహాయంతో ఇంట్లో కొంత మార్పులు చేసుకుని తల్లిదండ్రులకు అవసరమైన స్థలం ఏర్పాటు చేశాడు. ఇంటి యజమాని అనుమతితో నీటి వినియోగాన్ని పొదుపుగా నిర్వహించేందుకు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
రామేశ్వరికి మొదట్లో ఇబ్బందిగానే అనిపించింది. చిన్న ఇల్లు, పరిమితమైన గదులు, వస్తువులు పెట్టుకోవడానికి తగినంత స్థలం లేకపోవడం... కానీ రాత్రి మనవడు తాత పక్కన పడుకున్నప్పుడు, కోడలు అత్తతో కలిసి వంటగదిలో మాట్లాడుతున్నప్పుడు, కొడుకు ఆఫీసుకు వెళ్లే ముందు తండ్రి మందులు తీసుకున్నాడో లేదో అడిగినప్పుడు ఆమె మనసు క్రమంగా మారింది.
తన పాత సామాను లేకపోయినా, ఇంట్లో ఆత్మీయతకు కొదవ లేదని ఆమెకు అర్థమైంది.
అయితే రాజేశ్వరరావు మనసులో ఒక ప్రశ్న మాత్రం తొలుస్తూనే ఉంది.
నీటి కొరత నిజమే. నీటిని పొదుపుగా వాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతే. కానీ ఆ సమస్య కారణంగా వృద్ధ తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండాలా? ఒక ఇంట్లో ఎక్కువమంది ఉంటే నీటి వినియోగం పెరుగుతుందనే కారణంతో కుటుంబాలను విడగొట్టడం ఎంతవరకు సమంజసం?
ఒకరోజు శ్రీకాంత్ ఇంటి ఓనర్ వచ్చాడు. అతను కూడా నీటి సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. తన అపార్ట్మెంట్లోని ఇతర యజమానులతో మాట్లాడి నీటి వినియోగాన్ని నియంత్రించే మార్గాలను అన్వేషిస్తున్నాడు.
శ్రీకాంత్ తో మాట్లాడుతూ, “శ్రీకాంత్ గారూ ! ఈ నీటి సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదు. ట్యాంకర్ల మీద ఆధారపడటం రోజురోజుకూ భారంగా మారుతోంది. పెద్ద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వకపోతేనే సమస్య తగ్గుతుందని కొందరు అంటున్నారు. కానీ అది సరైన పరిష్కారమో కాదో అర్థం కావడం లేదు. ఇప్పుడు మీరు మీ తల్లి తండ్రులను కూడా ఇక్కడకు తీసుకొచ్చి పెట్టుకున్నారు. మీ నీటి వినియోగం కూడా పెరిగింది. అద్దె పెంచమంటే బాధపడతారు. ఆలోచించండి . మేము కూడా ఎక్కడనుండి నీళ్ళు తెచ్చి ఇవ్వాలి ?” అడిగాడు ఓనర్ కాస్త నిష్టూరంగానే .
అప్పుడు వాళ్ళ సంభాషణలో రాజేశ్వరరావు కలిపించుకోక తప్పలేదు.
“నీటి సమస్యను పరిష్కరించాల్సింది కుటుంబాలను విడదీయడం ద్వారా కాదు. నీటి లభ్యతను పెంచడం ద్వారా. వర్షపు నీటిని ఒడిసిపట్టే ఏర్పాట్లు చేయాలి. వాడిన నీటిని శుద్ధి చేసి మరుగుదొడ్లకు, తోటలకు తిరిగి వినియోగించాలి. అపార్ట్మెంట్లలో నీటి వృథాను అరికట్టాలి. ప్రభుత్వాలు శుద్ధి చేసిన నీటిని పైపుల ద్వారా సరఫరా చేసే ఆధునిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. భూగర్భ జలాలు పెరిగేలా దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇంటి యజమానులు కూడా తమ వంతుగా నీటి పొదుపు ఏర్పాట్లు చేసుకోవాలి. నీళ్లు లేవని చెప్పి పెద్ద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వకపోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. పైగా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరుగుతుంది” అన్నాడు ఆవేదనగా.
ఆ మాటలు ఇంటి యజమానిని ఆలోచింపజేశాయి.
“మీరు చెప్పింది నిజమే. నీటి వినియోగాన్ని నియంత్రించడానికి ఏర్పాట్లు చేయడం మన బాధ్యత కూడా. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునేలా మనమూ కోరాలి. కానీ కుటుంబాలను విడదీయడం మాత్రం సరైన పరిష్కారం కాదు. మీ అభిప్రాయాన్ని మన అపార్ట్మెంట్లో అందరూ ఓనర్లకు ఈ రోజు మీటింగ్ పెట్టి తెలియచేస్తాను. ఆ మీటింగుకు దయచేసి మీరు కూడా వస్తే బాగుంటుంది ..” అని అనడంతో రాజేశ్వర రావు అంగీకరించాడు.
కొన్ని రోజుల తర్వాత నగరంలో నీటి సమస్యపై అపార్ట్మెంట్ ఓనర్ల నుండి, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రకటించింది. నగరానికి అదనపు నీటిని అందించే మార్గాలను అభివృద్ధి చేయడంతోపాటు, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించే కేంద్రాలు, వర్షపు నీటి సంరక్షణ ఏర్పాట్లను విస్తరించే ప్రణాళికలను సత్వరమే తీసుకోవడానికి ఒక కమిటీని వేస్తున్నాము” అని చెప్పడంతో రాజేశ్వర రావు కళ్ళు ఆనందంతో మెరిచాయి. తన ఆవేదనను అర్ధం చేసుకుని దాన్ని కార్యరూపంలో పెట్టిన వారందరినీ పేరు పేరునా అభినందించాడు. కొద్ది రోజులలోనే నీటి సరఫరాను మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి.
“రావుగారూ! నీటి సమస్యను సాకుగా చూపి కుటుంబాలను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని మాకందరికీ అర్థమైంది. ఈ విషయంలో మీరు పెద్దరికం చేసుకుని చొరవతో మా అపార్ట్మెంట్ల వాళ్ళకు అవగాహన కలిపించి ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచారు. మా అపార్ట్మెంట్లో నీటి పొదుపు ఏర్పాట్లు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇతర కుటుంబాలకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం” అన్నాడు అపార్ట్మెంట్ల సెక్రెటరీ ఆనందంతో.
“నాన్నా ! నువ్వు ఒక పెద్ద సమస్యను నీ గత అనుభవంతో అపార్ట్మెంట్ ఓనర్ల సహాయం తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సిటీకి ఎంతో ఊహించని మేలు చేశావు. నీటి పొదుపు విషయంలో ప్రతి ఒక్కరినీ జాగ్రీకృత పరిచావు. తల్లి తండ్రులను , వారి పిల్లలను ఒక చోట చేర్చావు...” అంటూ ఆనందంగా కౌగిలించుకున్నాడు.
వాళ్ళ సంభాషణ దూరం నుండి వింటున్న రామేశ్వరి సజల నేత్రాలతో భర్తను ,కొడుకును చూస్తూ ఉండిపోయింది ******
సమాప్తం

