ఆవిష్కరణ - డా.పి.కె. జయలక్ష్మి

aavishkarana

"మేడమ్, ఇవాళ సాయంత్రం ఆరున్నరకి మధురానగర్ ఓల్డ్ ఏజ్ హోం లో నా కథాసంకలనం ఆవిష్కరణ సభ జరుగుతుంది. తప్పక రావాలి" అన్నాను ఇన్విటేషన్ ప్రిన్సిపాల్ రాధాదేవి చేతిలో ఉంచుతూ, "ఓ, వెరీ గుడ్!, కంగ్రాట్స్ దివ్యా, ఇంతకీ ఎవరు రిలీజ్ చేస్తున్నారు?" ఆసక్తిగా అడిగారావిడ. "వృద్ధాశ్రమం సీనియర్ మెంబర్ ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ చేస్తున్నారు మేడమ్" అన్నాను ఉత్సాహంగా.

"ఓ, నో... లోకల్ ఎం.పి. నో, కనీసం మేయర్ నో, కమీషనర్ నో పిలిస్తే ఎంత బాగుండేది.? అది కూడా వృద్ధాశ్రమంలో కాకుండా ఏహోటల్లోనో ఫంక్షన్ పెడితే ఎంత గ్రాండ్ గా ఉండేది. ముందు ముందు మన కాలేజికి ఎంత పబ్లిసిటీ... ఎంత పాపులార్టీ. ఒక్కమాట ముందుగా చెప్తే నేను చూసుకునే దాన్నిగా!" కించిత్తు కినుకగా అంటూ "ఓకే, ఆల్ ద బెస్ట్, వీలయితే వస్తా" అందామె కార్డు సొరుగులో పడేస్తూ. నాకు మనస్సు చివుక్కు మన్పించింది.

నా ఉద్దేశాలు, ఆదర్శాలు వీళ్ళకి తెలియవు. సామాజిక స్పృహతో నిండిన రచనలు చేయడమే కాకుండా, సమాజానికి, వృద్ధులకి ఏదో చేయాలనే తపన నాలో మెండు. ప్రతిదానిలో స్వలాభాన్ని, స్వార్ధాన్ని మేలవిస్తూ లెక్కలు కట్టడం నాకు అసలు ఇష్టంలేదు. నన్నెందుకు అర్ధం చేసుకోరు వీళ్ళు?... పెదవి నములుతూ ఆలోచిస్తూ మెయిన్ స్టాఫ్ రూంలో అడుగుపెట్టాను. "హాయ్ దివ్యా! కంగ్రాట్స్, నీ కథాసంకలనం ఇవాళేగా ఆవిష్కరణ, పేపర్లో చూసాను, పార్టీ ఏది?" కామర్స్ లెక్చరర్ సీమ నవ్వుతూ పలకరించింది. "తప్పకుండా, సాయంత్రం ఫంక్షన్ కి వస్తావుగా" అన్నా ఇన్విటేషన్ ఇస్తూ. "అబ్బా ఈఫంక్షన్స్ కి, నాకూ బహుదూరం నీకు తెలుసుగా, సాయంత్రం, మాఆయన, అత్తగారి సేవలు, ఎక్కడికీ రాలేను... హవుస్ అరెస్ట్" అనేసింది. దగ్గరే ఉన్న ఇద్దరు, ముగ్గురు లెక్చరర్స్ ఆహ్వానపత్రికలు అందుకుని "ట్రైచేస్తాం మేడమ్" అన్నారు.

సెకండవర్ క్లాసయి వస్తోంటే దారిలో మెట్ల దగ్గర కలిసారు పావని, రుక్మిణి లాంగ్వేజ్ లెక్చరర్స్. 'హాయ్' చెప్పి ఫంక్షన్ కి ఆహ్వానించాను. "మధురానగర్ వృద్ధాశ్రమం అంటే శారీమేలా పెట్టారు. అక్కడేనా?" అడిగింది పావని. "వావ్! అదేనే, ఆమధ్య మనవాళ్ళంతా భలే భలే చీరలు కొనుక్కున్నారు. ఇవాళే లాస్టట. మనమూ వెళదాం. మా అన్నయ్య వెయ్యి రూపాయలు పంపాడుగా" అంది తొందర చేస్తున్నట్లు. "ష్యూర్" అని నా వైపు తిరిగి "టైంకి గుర్తు చేసావు దివ్యా, నీఫంక్షన్ చూస్కొని షాపింగ్ చేస్తాం, ఇంతకీ డిన్నర్ ఉందా?" అడిగింది ఆశగా. వాళ్ళ మనస్తత్వం అర్ధమైపోయింది నాకు. "హోంలో సభ పెట్టాం కదా వాళ్ళే స్నాక్స్, టీ అరేంజ్ చేస్తున్నారు సాయంత్రం!" నవ్వుతూ చెప్పేసి ముందుకు నడిచాను. "మరి వాళ్ళు స్నాక్స్ ఇస్తే నువ్వు డిన్నర్ ఇవ్వచ్చు కదోయ్!" అంటూ వెనక నుంచి ఇద్దరు ఏదో జోక్స్ వేసుకుని నవ్వడం విన్పించింది.

నా రూంలో ఫ్యాన్ వేసుకొని కూచుని ఆలోచనల్లో పడ్డాను. సాయంత్రం ఫంక్షన్లో ఏం మాట్లాడాలో, పుస్తకాలు ఎవరెవరికి ఇవ్వాలో ఆలోచిస్తూ ఒక ఇన్విటేషన్ కాలేజ్ నోటీస్ బోర్డులో పెట్టాలని లేవబోతుంటే, రాజులమ్మ గదిలోకి నీళ్ళు పట్టుకొని వచ్చింది. "దన్నాలమ్మ టిఫిను సేసినారేటి, క్లాసుకి వెల్తున్నారుగావల్న" అంది. "అవును గాని ఈపేపరు కాస్త నోటీసు బోర్డులో పెట్టివస్తావా?" అన్నాను అందిస్తూ. "ఏటమ్మా ఇది?" కుతూహలంగా అడిగింది. "సాయంత్రం నేను వ్రాసిన కథల పుస్తకం గురించి సభ ఏర్పాటు చేస్తున్నారు మదురానగరంలో... దానికి సంబంధించింది" అన్నా నవ్వుతూ.


"ఓలమ్మో! నువ్వు పాఠాలు సెప్పడమే కాకుండా, కథలు కూడా రాస్తావేటి, ఇంతకీ నేను మదురానగరు కాన్నించేగా వచ్చేది, ఎక్కడమ్మా సబ జరిగేది?" అడిగింది మరికాస్త ఆసక్తిగా. "అదే అక్కడో వృద్ధాశ్రమం ఉందిగా అక్కడే. ఇక నువ్వు వెళ్తావా నేను వెళ్ళి పెట్టుకోనా?" అడిగి విసుగ్గా "ఇదిగో సిటికెలో ఎల్తా" అని తుర్రుమని వెళ్ళిపోయింది.

రాజులమ్మ మా కాలేజీలో స్వీపరు. దాని మొగుడు ఆటో వేస్తాడు, ముగ్గురు పిల్లలు. కష్టపడి పని చేస్తుంది. కాలేజీ పని కాకుండా ఉదయం, సాయంత్రం పాచిపన్లు కూడా చేస్తుంది, మేమేం చెప్పినా విసుక్కోకుండా ఒళ్ళుదాచుకోకుండా పని చేస్తుంది. నేను అప్పుడప్పుడు ఏదైనా పాతబట్టలు ఇస్తూ ఉంటాను. మంచిపనిమంతురాలు, అప్పుడప్పుడు నాదగ్గర కొచ్చి చదువు నేర్పమని అడుగుతూ ఉంటుంది. ఇన్నాళ్ళకి సంతకం మాత్రం నేర్చుకుంది.

లంచవర్లో మా చిన్నాన్న గారి కొడుకు నాకు అన్న అవుతాడు, వాడికి ఫోన్ చేసి పిలిచాను. "ఓహో రచయిత్రి అన్నమాట! ఇంతకీ పబ్లిషర్ ఎవరు? ఎన్ని కాపీలు వేయించావు? రాయల్టీ ఎంతేంటి?" అన్ని ఆరాలు అడిగి "ఫ్రెండ్ పెళ్ళి వుంది రాలేను" అని చెప్పేసాడు. సీనియర్ మేడమ్స్ కొందరు మనస్ఫూర్తిగా అభినందించి 'మేము రాలేకపోయినా, వచ్చినట్లుగా భావించమని, మరోలా అనుకోవద్దని' చెప్పారు. ఎవర్ని పిలిచినా ఏదో ఒక వంక చెప్తూనే ఉన్నారు. చుట్టాలు వస్తున్నారనో, ఒంటరిగా రాలేమనో, పిల్లలకి హోం వర్క్ చేయించాలనో కొందరయితే 'ఏం పార్టీ ఇస్తావు! 'స్వీట్స్ తేలేదే!' సాయంత్రం ఏ చీర కట్టుకుంటావ్?' 'పుస్తకాలమ్మిన డబ్బుతో ఏం కొంటావ్?' ఇలాంటి చచ్చు ప్రశ్నలే కాని ఒక్కరు కూడా పుస్తకంలో ఎన్ని కథలు రాసావని గాని, ఎంత కష్టపడి రాసుంటావో అని గాని, పుస్తక రూపం రావడానికి ఎంత ప్రయాస పడివుంటావో అనిగాని మాట వరసకి కూడా అనలేదు.

ఎవరొచ్చినా రాకపోయినా ఏదీ ఆగదు కదా! అనుకున్న ప్రకారం వృద్ధాశ్రమంలో విశ్రాంతాచార్యుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. నేను అనుకున్న వాళ్ళు గాని, నా సర్కిల్ వాళ్ళుగాని ఎవరు రాకపోయినా సాహిత్యాభిమానులు, నా శ్రేయోభిలాషులు కొందరు, పేపరు చూసి కొందరు రావడం నాకెంతో ఆనందాన్ని కల్గించింది. హాల్ దాదాపు నిండింది. వృద్ధాశ్రమంలో ఇలాంటి ఫంక్షన్ జరగడం ఇదే ప్రధమమంట. పుస్తకం ధరలో సగానికి విక్రయించి ఆసొమ్ము వృద్ధాశ్రమానికి బహుమతిగా ఇవ్వాలని నేను మాఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీస్కున్నాము. వెంటనే సెక్రటరీ అనౌన్స్ చేసారు ఆ విషయాన్ని.

"దివ్య, దినేష్ దంపతులు ఆవిష్కరణానంతరం కథా సంకలనాలని కొనుక్కున్నవారికి డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా ఆసొమ్ముని మన ఆశ్రమానికి డొనేట్ చేయదల్చినందున అందరు కొనుక్కోవాల్సిందిగా అభ్యర్దిస్తున్నాము" అని. మొట్ట మొదలు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిని చూసి తెల్లబోయాను, ఎవరో కాదు రాజులమ్మ. యాభై రూపాయలు తీసి సెక్రటరీ చేతిలో పెట్టి పుస్తకం అందుకుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు దాదాపు పది, పన్నెండు మంది దాకా పుస్తకం కొనుక్కున్నారు. చెప్పనట్లుగా ఆసొమ్ము వృద్ధాశ్రమానికి అందజేశాము. చివరగా నాకూ, శ్రీవారికి ఆశ్రమం వాళ్ళు సన్మానం చేసి, ఆశీర్వదించారు. మంచిపని చేస్తున్నందుకు అభినందించారు.

మర్నాడు కాలేజికి వెళ్ళగానే అంతా పలకరించారు - 'ఫంక్షన్ బాగా జరిగిందా?' రాలేకపోయాం ఏమనుకోకు', 'చుట్టాలు వచ్చారు', 'ఒంట్లో బాగోలేదు' అంటూ ఏవో కారణాలు చెప్పారు. ముందు ఊహించినదే కాబట్టి పెద్దగా నేను రియాక్టవలేదు. నా ఫ్రెండ్ రాగిణి మాత్రం సిన్సియర్ గా బాధపడింది. ఊరికి దూరంగా కోలనీలో ఉంటున్నారు వాళ్ళు. భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేటయిపోయిందట. రావాలని ఉన్నా కుదరాలిగా. నేను ఓదార్పుగా చెప్పాను. "మనకి రావాలనే కోరిక ఉన్నా అవకాశం ఉండాలి, అవకాశం ఉన్నా ఆటంకం ఎదురవకుండా ఉండాలి. నీకు రావాలని ఉంది, మీ ఆయన త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేసి అవకాశం కల్పించినా, బైలుదేరే వేళకి ఎవరో ఒకళ్ళు రావడమో, లేక ఇంకేదో అవరోధం వస్తే నువ్వేం చేయగలవు? అందుకని ఆసక్తి, అవకాశం, అవరోధం ఈ మూడు ముడిపడి వుంటాయి. తెల్సుకో! అవకాశం ఉండి. అవరోధాలు లేకపోయినా కొంతమందికి ఆసక్తి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇంట్రస్టులు వేరుగా ఉండచ్చు. కాబట్టి రాగిణీ నువ్వేం ఫీలవకు నెక్ట్స్ టైం బెటర్ లక్!" అని రూంలోకి వచ్చాను.

రాజులమ్మ నవ్వుకుంటూ నాటేబుల్ తుడుస్తోంది. "హాయ్ రాజులమ్మా, చాలా థాంక్స్, పిలిచిన వాళ్ళు రాకపోయినా పిలవకపోయినా నువ్వు నా ఫంక్షన్ కి రావడమే కాకుండా పుస్తకం కూడా కొన్నావు. అయినా నీకు రావాలని ఎలా అన్పించింది?" ఆసక్తిగా అడిగాను. "ఏటమ్మా, మరీ సెప్తారు? ఇంతపెద్ద కాలేజీలో అందరేసి పిల్లలకి బలేపాటాలు సెప్పే టీచరమ్మవి! ఏ ఫంక్షన్ అయినా టేజి మీద సక్కగా ఉపన్నాసాలు ఇచ్చేత్తావు, పిల్లలతో శానా సరదాగా, నవ్వుతూ మాట్టాడతావు, టీచరమ్మలతోనే కాకుండా మాలాటి పనోళ్ళని కూడా పేరుతో పలకరించి కట్టం సుకం మాట్టాడతావు, అలాటిది నీ పుస్తకం సబ అవుతుంటే రాకుండా ఎట్టా ఉంటాను?"

"అదికాదు, నీకు పన్లు వుంటాయిగా సాయంత్రం...?" "ఆ.. పన్లు, పిచ్చిపన్లు రోజూ ఉండేయేగా, మాఅత్తకి గుంటల పని అప్పసెప్పి వచ్చినా. ఓలమ్మో పెద్దోల్లంతా నీ పుస్తకం గురించి ఎంత బాగా మాట్టాడారమ్మా! నువ్వు సరేలే ఎప్పుడు బానే మాట్టాడతావుగా! అందుకే ముందు నేనే కొనాలా అని పుస్తకం కొనేసినా" అంది నవ్వుతూ. "నీకు చదువు రాదుగా ఏంచేస్తావా పుస్తకాన్ని?" అడిగాను ఉత్సుకత నిండిన గొంతుతో, "ఏటీ, సదువు రాదా? ఎంత మాట అనేసినావు తల్లో? నానుండేది ఎక్కడ?... ఇస్కూల్లోనేనా! ఇంటికాడ నాగుంటలు సదూకుంటున్నారా నేదా! ఎవర్నడిగితే సదివి పెట్టరు. సెప్పు? కాళీటయంలో ఒక్క కత సదివి సెప్పమంటే సెప్పరా అమాత్తరం! ఇంత పుస్తకం నువ్వు కట్టపడి రాయగానేంది, నానామాత్తరం యాబయి రూపాయిలెట్టి కొనుక్కొని సదివించుకోలేనా? ఏటో పిచ్చితల్లి. ఇన్ని సదువులు సదివావు, ఈమాత్తరం తెలీదా?" అని నవ్వుకుంటూ చీపురు తీసుకుని వెళ్ళిపోయింది రాజులమ్మ.

ఎంత ఆశ్చర్యం? పెద్దచదువులు చదివి, పెద్దవుద్యోగాలు వెలగ పెడుతూ కూడా తోటి ఉద్యోగినిని అభినందించడానికి ఆమడదూరం పారిపోతుంటే ఏమీ చదువుకోని ఒక చిరుద్యోగి చదువు పట్ల ఎంత మన్నన కనబరుస్తోందో చూస్తుంటే రాజులమ్మ వ్యక్తిత్వం ముందు నాకు అందరూ మరుగుజ్జుల్లాగా తోచారు. కన్పించని సత్యమేదో కళ్ళముందు ఆవిష్కరించబడుతుంటే కిటికీలోంచి దూరంగా రాజులమ్మ కన్పించింది అక్షరం విలువ తెలియచెప్తున్న అపర సరస్వతిలా!

***

మరిన్ని కథలు

Aparadhulu
అపరాధులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Prema lekha
ప్రేమ లేఖ
- వెంకటరమణ శర్మ పోడూరి
Adrusta chakram
అదృష్ట చక్రం
- కందర్ప మూర్తి
Sishya dakshina
శిష్య దక్షిణ
- వెంకటరమణ శర్మ పోడూరి
Pelliki mundu
పెళ్ళికి ముందు .....
- జీడిగుంట నరసింహ మూర్తి
Kodalu diddina kapuram
కోడలు దిద్దిన కాపురం
- - బోగా పురుషోత్తం.
Sarparaju
సర్పరాజు
- కందర్ప మూర్తి
Devaki Vasudevulu
భాగవత కథలు - 18 దేవకీ వసుదేవులు
- కందుల నాగేశ్వరరావు