సిల్వర్ డ్రాప్స్ - పి. రామకృష్ణారావు

silver drops

"జాంకాయలు, చింతకాయలు అమ్మి, మీనాన్న మిమ్మల్ని చదువుకోవడానికి అమెరికా పంపిస్తాడు. మీరక్కడ బాగా చదువుకొని, కోట్లు సంపాదించి, ఇంటికొచ్చేసరికి, మీ నాన్న పాడె మీద వుంటారు!. ఇదీ ఇప్పుడు తీయబోయే సీన్ మేడం" వినయంగా వంగి చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్.

"అది నాకనవసరం! నేనేం చెయ్యాలో చెప్పండి, అదిచాలు"! పెదాలమీది లిఫ్టిక్‌ని నాలుక కొనతో సవరించుకుంటూ అంది హీరోయిన్.

"చనిపోయింది మీ కన్నతండ్రి కదా మేడం? కాబట్టి మీరు భాదతో ఏడ్వాలి" అన్నాడతను.

"అవునా? నాకు ఎక్స్‌పీరియన్స్ లేదుగా? ఎలా మరి?" క్యాజువల్‌గా అందామె.

అసిస్టెంట్ డైరెక్టర్‌కి తల గిర్రున తిరిగినట్టైంది.

"ఇందులో ఎక్స్‌పీరియన్స్ ఎందుకు మేడం, మనదగ్గరవాళ్లు చనిపోతే, ఏడ్వటం మామూలే కదా" అన్నాడతను.

"నిజమే అనుకో, మానాన్న ఇంకా చావలేదుగా, శుభ్రంగా ఇంకా బ్రతికే వున్నాడు.! అందుకే ఎలా ఏడ్వాలో తెలీదని చెబుతున్నాను. ఏదో డ్యూయెట్లూ, రొమాంటిక్ సీన్‌లైతే చాలా ఈజీగా చేసేదాన్ని, పోనీ ఎలా చెయ్యాలో చెప్పు" అంది కథానాయకి.

"మీ బంధువులు ఎవరైనా చనిపోయినపుడు వెళ్ళడం, అక్కడ వాళ్ళింట్లోవాళ్ళు ఏడ్వడం ఎప్పుడూ చూడలేదా మేడం" అడిగాడతను.

నిమిషంసేపు లిఫ్టిక్ పెదాల్ని కొరుక్కుని, "ఆ గుర్తొచ్చింది! మా పక్కింటి పిన్నిగారి వాళ్ళాయన పోతే, అప్పుడు చూశాను!" చెప్పిందామె.

అసిస్టెంట్ డైరెక్టర్ ముఖం వెయ్యి క్యాండిళ్ళ బల్బ్‌లా వెలిగింది.

"ఆ ఎక్స్‌పీరియన్స్ చాలు మేడం. ఏదీ ఒక్కసారి మీ పిన్నిగారు ఎలా ఏడ్చారో గుర్తుచేసుకుని, చూపించండి మేడం." అడిగాడతను.

ఐదుక్షణాలు గట్టిగా ఊపిరిపీల్చుకుని, ఒక్కసారిగా, కెవ్వుమని కేకపెట్టి, "ఓర్నాయనో నాకు అన్యాయంచేసి, వెళ్లిపోయాడ్రో దేవుడో.. నా ఐదోతనాన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోయాడ్రో భగవంతుడో.." అంటూ అరిచేసరికి, యూనిట్ మొత్తం కకావికలైపోయి, ఏం జరిగిందో అర్థంకాక డైరెక్టర్, నిర్మాత హీరోయిన్ దగ్గరకు పరిగెత్తారు.

అందరూ అక్కడికి వెళ్ళేసరికి, హీరోయిన్ ఎలా చేసానో చెప్పండంటూ చిద్విలాసంగా వుంది.

"అలాకాదు మేడం, మీరు హైలీ ఎజ్యుకేటెడ్ కదా..? అలా ఏడ్వకూడదు! మీ శోకం అఫిషియల్‌గా వుండాలి." చెప్పాడు డైరెక్టర్.

"అంటే ఎలా చేయాలో చెప్పండి సార్." అమాయకంగా అడిగింది హీరోయిన్.

"గంపెడుభారాన్ని గుండెల్లో దాచుకుని, మీలో మీరే, కుమిలిపోవాలి, శోకాన్ని పెదాల్లో అదిమిపెట్టి, కన్నీళ్లు కార్చాలి". చెప్పాడు డైరెక్టర్.

ఇంతలో, నిర్మాత డైరెక్టర్ దగ్గరికొచ్చి, చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు. వినిన వెంటనే, సంతోషంతో ఇద్దరూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు.

"ఈ సీన్‌తో మన సినిమా ఇంకో ఫిఫ్టీడేస్ గ్యారెంటీ గురూ" ఆనందంగా అన్నాడు నిర్మాత.

క్రింద తెల్లటి పరుపువేసి, దానిమీద తండ్రి వేషం వేస్తున్న నటుడ్ని పడుకోబెట్టారు. అతడిమీద, పూలమాలలతో నింపేసారు. అతనిచుట్టూ, పాతికమంది ముసలీముతకా జూనియర్ ఆర్టిస్ట్‌ల్ని కూర్చోబెట్టారు.

నిర్మాత, తనూ మాట్లాడుకున్న రహస్యాన్నే డైరెక్టర్ మేకప్‌మెన్ చెవిలో చెప్పాడు. మేకప్‌మెన్‌కి సీన్ అర్థమైంది.

హీరోయిన్ పెదాలకు దొండపండురంగులో లిఫ్టిక్ పూసి, ఆమె కళ్ళలో గ్లిజరిన్ చుక్కలు వేసాడు. హీరోయిన్‌తో నిమిత్తం లేకుండా, కన్నీళ్లు కారడం మొదలెట్టాయి.

"మేకప్ కరిగిపోదుగా"..! అమాయకంగా అడిగింది హీరోయిన్.

"లేదు మేడం ఇట్స్ ఇంపోర్టెడ్" బదులిచ్చాడతను.

డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్ళి, పైటను రెండుగుండెలమధ్య సన్నటిపాయలా సర్దాడు. సెన్సార్‌వారికి భయపడి, లోపలే దాక్కోలేక, కత్తిరిస్తారేమోనని, ఆందోళనగా తొంగిచూస్తున్న లేత అందాల్ని, తొంగిచూస్తూ నిర్మాత తృప్తిగా తలపంకించి, డైరెక్టర్ వైపు చూసాడు.

కెమెరామెన్ చూసిరమ్మంటే, ఫిల్మ్ ని కాల్చివచ్చే రకం. వెండితెరమొత్తం హీరోయిన్ గుండెలు, పెదాలు తప్ప మరేమీ కనిపించకుండా కెమెరా యాంగిల్ ఎక్కుపెట్టాడు.

హీరోయిన్ తన ఎర్రటి పెదాల్ని మునిపంటితో కసిగా కుర్రకారు కైపెక్కేలా కొరికి, కన్నీళ్లు తన రవికను తడిపి ముద్దచేసేలా రోదించింది.

డైరెక్టర్ అమితానందంతో మరో షాట్ చెప్పాడు.

హీరోయిన్ ఏకసంధ్యాగ్రాహిలా, దుఃఖంతో కుమిలిపోతుందో, విరహంలో కమిలిపోతుందో తెలియనంత లెవల్లో నటించింది. పదినిమిషాల లాంగ్‌షాట్ ఒకేషాట్లో ఓకే చేసేసరికి.. సెట్‌మొత్తం చప్పట్లతో మార్మోగింది.

తర్వాతి షాట్‌కోసం మిగతావాళ్ళు రెడీఅవుతుంటే, హీరోయిన్ తన చైర్‌లో రిలాక్స్‌డ్ గా కూర్చునివుండగా ఆమెచేతిలోని మొబైల్ మ్రోగింది.

అవతల ఇంటినుంచి పనిమనిషి తాయారు ఏడుస్తూ, "అమ్మగారూ.. పెద్దయ్య గుండెనొప్పితో చనిపోయారమ్మా..అంటోంది రోదిస్తూ.

"సర్లే వస్తున్నా.. ఫోన్‌పెట్టెయ్యి" విసుగ్గా అని, మొబైల్ ప్రక్కన పడేసింది హీరోయిన్.

"ఏమైంది మేడం? అలా వున్నారు?" అడిగాడు డైరెక్టర్.

"ఆ ఏంలేదులేసార్! హార్ట్అటాక్‌తో మా డాడీ చనిపోయాడంట, ఇంటిదగ్గరనుంచి ఫోనొచ్చింది" చాక్లెట్ కవర్ వూడదీసినంత తేలిగ్గా చెప్పిందామె.

డైరెక్టర్ అదిరిపడి, "అదేంటి మేడం? మీతండ్రిగారు పోతే, ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు???!" ఆశ్చర్యంగా అన్నాడతను.

"నాకు నావాళ్లకంటే నా ప్రొఫెషన్ దేవుడితో సమానం, అదేనాకు ముఖ్యం సార్.." బదులిచ్చింది హీరోయిన్.

"నీ అంకితభావానికి ఆస్కార్ ఇవ్వొచ్చు" అని మనసులో అనుకున్న డైరెక్టర్, అలాకాదు మేడం, ఎవరో ఐతే పర్వాలేదు., మీ ఓన్ ఫాదర్ కదా.? అందుకని దయచేసి, వెంటనే వెళ్ళండి" చెప్పాడతను.

"అంతేనంటారా? సరేఐతే, మనసినిమాకు ఎలాంటి నష్టం వుండదనే నమ్మకంతో వెళ్తున్నాను." వదల్లేక ,వెళ్తున్నట్టు వెళ్ళిందామె.

"మనతర్వాతి సినిమాకు ఈమెనే బుక్‌చేద్దాం డైరెక్టరూ," తడికళ్ళతో అన్నాడు నిర్మాత.

హీరోయిన్ తన ఇంటికి వెళ్ళేసరికి, ఓ చేపమీద ఆమె తండ్రిని పడుకోబెట్టి వున్నారు. చుట్టూ కొద్దిమంది బంధువులు.

హీరోయిన్ని చూడగానే, పనిమనిషి తాయారు "అమ్మగారూ .." అంటూ గట్టిగా రోదించడం మొదలెట్టింది.

రెండుక్షణాలు తండ్రిశవాన్ని చూసి, మెట్లెక్కి, నేరుగా తన బెడ్‌రూంలోకి వెళ్ళిపోయి తలుపేసుకుందామె.

మేకప్ తుడుచుకుంటూంటే ఆలోచనలు ఆమె గతం, బాల్యం ఫిలింరీల్స్‌లా గిర్రున వెనక్కు తిరిగాయి.

చిన్నతనంలోనే తల్లి చనిపోతే, తన రెక్కలుముక్కలు చేసుకుని, తనతండ్రి ఎలా తనను పెంచిపెద్దచేసాడో, తన సినిమా అవకాశాల కోసం ఎందరి కాళ్ళు పట్టుకుని, ఇంకెందరి చీత్కారాలు అనుభవించాడో అంతా గుర్తుకొచ్చిందామెకి. ఇప్పుడు తను అనుభవిస్తున్న స్టార్‌డం, స్టేజ్ సర్వం తనతండ్రి పెట్టినబిక్షే అని తెలిసొచ్చిందామెకి.

"కనీసం ఆయన కోసం కాసేపైనా భాదపడాలి, కొన్ని కన్నీళ్లైనా కార్చాలి" అనుకుందామె.

వెంటనే డైరెక్టర్‌కి కాల్‌చేసి, "సార్ మన మేకప్‌మ్యాన్ని తీసుకుని, వెంటనే రాగలరా?" అంది.

అర్థగంటలో వాళ్ళిద్దరు అక్కడికి చేరుకున్నారు.

"మా ఫాదర్ నాకోసం తన జీవితమంతా ఎంతో కష్టపడ్డాడు., ఆయన కోసం కాసేపైనా భాదపడకపోతే, బాగుండదు. కాబట్టి నేనిప్పుడు ఏడవాలి, ఆయనకోసం కొన్ని కన్నీళ్ళైనా కార్చాలి, అందుకు మీరు హెల్ప్ చెయ్యాలి"! చెప్పింది హీరోయిన్.

విత్‌ప్లెజర్ మేడం అన్నాడు డైరెక్టర్.

హీరోయిన్ ముఖంలో మేకప్ మారిపోయింది. ఏడ్చి, ఏడ్చి, వుబ్బినట్టుండే కళ్ళు, శోకంతో పాలిపోయిన ముఖం, కంటిక్రింద నల్లటి చారలు..

గుడ్, ఇప్పుడు మీరు నిరభ్యంతరంగా ఏడ్వచ్చు మేడం అన్నాడు డైరెక్టర్.

హీరోయిన్ తన తండ్రిశవం దగ్గరకు వెళ్ళి కూర్చుంది.

అయిదు, పదినిమిషాలు, అర్థగంట గడిచింది. ఆశ్చర్యం! హీరోయిన్ దుఃఖాన్ని అభినయించలేకపోతొంది, గ్లిజరిన్ వేసినా ఆమె కంట్లోంచి కన్నీళ్ళు కారడం లేదు!! శోకించడానికి శతవిధాలా ప్రయత్నించినా ఆమెవల్ల కావడం లేదు.!!

ఆమె నిస్సహాయంగా డైరెక్టర్‌వైపు చూసింది. అతని బుర్రలో తళుక్కుమని, ఓ ఐడియా మెరిసింది.

ఇంట్లో వున్న లైట్లన్నీ ఆన్ చేయించాడు, హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, ఎవరికీ వినపడకుండా, ఆమె చెవిలో నెమ్మదిగా " సైలెన్స్, లైట్సాన్, కెమెరా.. యాక్షన్.." అన్నాడు.!!

అంతే, అంతవరకూ కరువుతో అల్లాడిన ఆమె బుగ్గల్ని, వరదగోదారి ముంచెత్తింది. ఆమె భుజాలు వాటంతట అవే కదలడం మొదలెట్టాయి.,కడుపులో తన్నుకొచ్చిన శోకాన్ని, ఆమె పెదాల ఆనకట్టలు ఆపలేకపోయాయి.

ఆమె గంటసేపు తనివితీరా ఏడ్చి, సంతృప్తిగా డైరెక్టర్‌వైపు చూసింది. షాట్ ఓకే అన్నట్టు బొటనవేలు పైకెత్తి కళ్లతో అభినందించాడు డైరెక్టర్.

***

మరిన్ని కథలు

Kaliyuga yakshudlu
కలియుగ యక్షుడు
- దినవహి సత్యవతి
Maangalyam tantunaa
మాంగళ్యంతంతునా...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Aavakaya prahasanam
ఆవకాయ ప్రహసనం
- జీడిగుంట నరసింహ మూర్తి
Apaardham
అపార్థం
- బామాశ్రీ
Nijamaina ratnam
నిజమైన రత్నం
- బోగా పురుషోత్తం.
Snehamante Ide
స్నేహమంటే ఇదే
- కందర్ప మూర్తి
Andamaina muddu
అందమైన ముద్దు
- వారణాసి భానుమూర్తి రావు