ఈ కాలం - అత్తలూరి విజయలక్ష్మి

ee kaalam

"ఏంటంత అర్జంటుగా మాట్లాడాలని ఫోన్ చేశావు?" లోపలికి అడుగుపెడుతూనే అడిగింగి లాయర్ సంధ్య లాలిత్యని...

"ముందు కూర్చో... వెళ్ళిపోవాలా?" చిరాగ్గా అంది లాలిత్య...

"వెళ్ళేదాన్ని అయితే ఇక్కడికెందుకు వస్తాను... చెప్పు" అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య...

లాలిత్య డైనింగ్ హాల్లోకి ఫ్రిజ్ లోంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గాజు గ్లాసులో పోసి తెచ్చింది.

"ఎండనబడి వచ్చావు తాగు చిరాకు తగ్గుతుంది" అంటూ సంధ్య చేతికి గ్లాసు అందించింది.

సంధ్య గ్లాసందుకుని నవ్వుతూ అంది "చిరాకు కాదు, పరాకు కాదు... నువ్వలా కొంపలంటుకుపోతున్నట్టు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్ తో వచ్చాను అంతే..."

లాలిత్య నవ్వలేదు... గడ్డం కింద చేయి ఆనించుకుని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది.

"చెప్పవే..." ఆమెని పరీక్షగా చూస్తూ అంది సంధ్య...

సరిగా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నింపాదిగా అంది "నాకు విడాకులు కావాలి..."

సంధ్య ఒక్క క్షణం తెల్లబోయి చూసి ఫకాల్న నవ్వి అంది... "ముందే చెప్పి ఉంటే బ్యాగులో వేసుకుని వచ్చేదాన్నిగా..."

"జోక్ కాదు సంధ్యా! నిజంగా చెబుతున్నాను... ఇంక మా ఇద్దరికీ పడదు... ఈ సంసారం సాగదు... విడిపోతే ఎవరి బతుకు వాళ్లు బతకచ్చు... ఒకళ్ల నొకళ్ళు ద్వేషించుకుంటూ ఒక గూట్లో ఎలా కలిసి ఉంటాం చెప్పు!"

సంధ్య లాలిత్య మొహంలోని సీరియస్ నెస్ గమనించింది... నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా ఏం చెబుతుందో అన్నట్టు చూడసాగింది.

లాలిత్య ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది...

సంధ్యా, లాలిత్యా చిన్నప్పటి నుంచీ క్లాస్ మేట్స్... సంధ్య లాయర్ అయింది... లాలిత్య ఇంజనీరు అయింది... సంధ్యకి స్వంతంగా ప్రాక్టీస్ ఉంది... మంచి సివిల్ లాయర్ గా పేరుంది. ఆ చనువుతోటే లాలిత్య ఈ నిర్ణయానికి వచ్చి సంధ్యకి ఫోన్ చేసింది ఓసారి రమ్మని. ఇలాంటిదేదో ఉందని సంధ్య ఊహించలేదు ఎందుకంటే వ్యాస్, లాలిత్యలది చక్కటి జోడీ. వ్యాస్ చాలా మంచివాడు. నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, ఏ చెడ్డ అలవాట్లు లేనివాడు... మంచి ఉద్యోగం, కంఫర్టబుల్ శాలరీ... ఒకరినొకరు కోరి చేసుకున్నారు... పెద్దలు చేసిన పెళ్లి అయినా కుదుర్చుకున్నది మాత్రం వాళ్లే... లాలిత్య కూడా మంచి పిల్లే... ఇద్దరూ ఇంజనీర్లే... ఏమైంది?

సంధ్యకి అర్ధం కాలేదు... పడట్లేదు అంటే ఏం జరుగుతోంది... ఎందుకు పడడం లేదు... పెళ్లయి రెండేళ్లు అవుతోంది... అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలు ఏం జరిగి ఉంటాయి వీళ్ల మధ్య... "ఏం జరిగిందే? ఎందుకు ఇంత దూరం వచ్చావు" అడిగింది అనుమానంగా...

నిట్టూర్చింది లాలిత్య... "ఏం చెప్పను?" అంది ఆమె వైపు చూసి.

"ఏం జరుగుతుందో అదే చెప్పు..."

"ఏమీ జరగడం లేదు..."

"అంటే..."

"మా ఇద్దరి మధ్యా మాటా, మంతీ లేదు... సరదాలు, సరసాలు అసలే లేవు... తన దారి తనది నా దారి నాది అన్నట్టు ఉంటోంది. ఏమో మేము ఒకళ్ల నొకళ్ళు సరిగా అర్ధం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాం అనిపిస్తోంది... అదృష్టవశాత్తూ మాకు పిల్లలు లేరు... ఉండి ఉంటే నేనీ విషయం ఆలోచించేదాన్ని కాదు..."

సంధ్య సాలోచనగా చూసింది.. "వ్యాస్ తో ఈ విషయం చర్చించావా?"

లాలిత్య కొన్ని నిమిషాల నిశ్శబ్దం తరువాత అంది... "తనే ఈ ప్రపోజల్ తెచ్చాడు..."

"తనే తెచ్చాడా?" విస్తుబోతూ చూసింది... "ఎందుకు? ఎప్పుడు? ఎలా?"

లాలిత్య మాట్లాడలేదు.. ఆమెకి నెలక్రితం వ్యాస్ కీ, తనకీ జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది...

ఆ రోజు లాలిత్య ఆఫీస్ కి వెళ్లడానికి తయారై క్యాబ్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది... క్యాబ్ రాలేదు... ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో ఉన్నానని చెప్పాడు డ్రైవర్... ఆరోజు సి ఇ ఓ తో రెండు, మూడు మీటింగ్స్ ఉన్నాయని త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్. టైం అయిపోతోంది... టెన్షన్ గా బాల్కనీలోకి, లోపలికి తిరుగుతోంది లాలిత్య...

అంతలో వ్యాస్ ఆఫీస్ నుంచి హడావుడిగా వచ్చాడు...

భార్యని చూడగానే హుషారుగా అన్నాడు... "లాలీ ఈ రోజు లీవు పెట్టేయవా? ఎటన్నా వెళ్లి సరదాగా ఎంజాయ్ చేద్దాం... నాకివాళ చాలా బోర్ గా ఉంది.."

"లీవా? ఇవాళా? ఇంకా నయం ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాను... కుదరదు సి ఇ ఓ తో మీటింగ్ ఉంది" అంది లాలిత్య.

"నాకన్నా నీకు సి ఇ ఓ తో మీటింగ్ ఎక్కువా? ఎన్నాలైంది కాస్త సరదాగా గడిపి మనం... నాకీ మెకానికల్ లైఫ్ చాలా విసుగ్గా ఉంది. అసలు మనం భార్యా భర్తలమేనా అని అనుమానం కూడా వస్తోంది. కోపంగా అడిగాడు... ఆ అడగడంలో బాధా, ఉక్రోషం కలగలిసి అతని మొహాన్ని కందగడ్డలా మార్చేయడం గమనించింది లాలిత్య...

"ఏం చేద్దాం? మన ఉద్యోగాలు అలాంటివి... కొత్త ప్రాజెక్ట్ వచ్చింది... దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్... పని, పని నువ్వు చూస్తూనే ఉన్నావుగా ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను... హార్డ్ లీ ఫైవ్ అవర్స్ పడుకుంటున్నానేమో... అదే స్థాయిలో అంది లాలిత్య... మళ్లా అంది.. "నీ దారిన నువ్వు కూడా బిజీగానే ఉన్నావుగా! నన్నంటావేం? లాస్ట్ సాటర్ డే నేను టోటల్ ఫ్రీగా ఉన్నాను... నువ్వా ల్యాప్ టాప్ పెట్టుకుని కనీసం వంటలో సాయం కూడా చేయలేదు."

"నాదీ ఉద్యోగమేగా... నాకూ నెలకి యాభైవేలిస్తున్నారుగా... నేనూ పనిచేయాలి... కానీ, పనేనా జీవితం అంటే... అసలు మనం ఈ రెండేళ్లలో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా? ఇలాగే జరిగితే నువ్వు నా భార్యవన్న విషయం కూడా మర్చిపోతాను" కసిగా అన్నాడు వ్యాస్...

ఇంతలో క్యాబ్ రావడంతో లాలిత్య పరిగెత్తింది...

ఆ సంఘటన ఆధారంగా మర్నాటి నుంచీ ఇద్దరి మధ్యా వాదోపవాదాలు, గొడవలు, అలకలు, కోపాలు ఎక్కువైపోయాయి...

"ఏనాడన్నా నా మొహాన కమ్మగా వండి పెట్టావా? మొగుడికి వంట చేసి పెట్టలేని పెళ్లాం నాకెందుకు?" మండిపడ్డాడు వ్యాస్ ఓ రోజు కయ్యానికి కాలు దువ్వుతూ...

"వంట పెళ్లామే చేయాలని రూల్ లేదు... నువ్వు కూడా చేయచ్చు... పోనీ నీకు పెట్టకుండా నేను పంచభక్ష్యపరమాన్నాలు చేసుకుతింటున్నానా? ఎందుకలా నోరుపారేసుకుంటావు?"

"నేను నోరు పారేసుకోడం కాదు... నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావు... అందుకే నన్ను వదిలించుకోడానికి చూస్తున్నావు... ఈ ప్రపంచంలో నువ్వేనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి. నూటికి ఎనభై మంది ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు... వాళ్లంతా మొగుడితో కాపురాలు చేయడం లేదా? వండిపెట్టడం లేదా?" వెటకారంగా అన్నాడు వ్యాస్.

"షటప్... ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ భార్యమీద నీకున్న నమ్మకం, ఇదేనా భార్యని గౌరవించే పద్ధతి... నేనే ఆ మాట అంటే..." రెచ్చిపోయింది లాలిత్య...

సడన్ గా వెక్కి, వెక్కి ఏడవడం మొదలుపెట్టిన లాలిత్యను చూసి నిశ్చేష్టురాలైంది సంధ్య...

"ఏయ్ లాలిత్యా... కమాన్... ఏడవకు" ఆమె దగ్గరగా జరిగి కన్నీళ్లు తుడుస్తూ అంది "సరేలే నువ్వనుకున్నట్టేచేద్దాం... ఒకసారి అతనితో కూడా మాట్లాడటం నా ధర్మం... అతనుకూడా కావాలంటే ఆరునెలల్లో విడాకులు ఇప్పిస్తాను... సరేనా? కూల్ డౌన్..."

"ఏంటో సంధ్యా... మా ఇద్దరి మధ్యా రోజు, రోజుకీ గ్యాప్ పెరిగిపోతోంది... కొంతకాలం స్నేహితుల్లా ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం వీకెండ్స్ సినిమాకో, మాల్ కో వెళ్లి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళం... ఈ మధ్య చాలా రొటీన్ గా, మెకానికల్ గా అయిపోయింది లైఫ్... మా మధ్య అసలు మాటలు లేవు" కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది...

"ఒక్కసారి అతనితో కూర్చుని అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చుగా లాలిత్యా..."

"ఇంకా ఏం తెలుసుకోను? రోజూ గొడవలు, కోపాలు, అరుచుకోవడాలు... ఆఖరికి విడాకులు తీసుకుందాం నా మనసు విరిగిపోయింది అన్నాడు... నా మనసూ విరిగిపోయింది... విరిగినపాలతో పెరుగు తోడేయలేంగా సంధ్యా!"

సంధ్య నిట్టూరుస్తూ అనుకుంది "మీరొక్కళ్ళే కాదులే లాలిత్యా... ప్రస్తుతం వివాహవ్యవస్థలో ఏదో లోపం వస్తోంది... మంత్రాల్లో బలం తగ్గిందో, మనుషుల్లో మమతలు తగ్గాయో!"

అనుభవజ్ఞురాలైన సంధ్యకి బాగా తెలుసు... ఆవిడ దగ్గరకి రోజుకి కనీసం నాలుగు విడాకుల కేసులైనా వస్తుంటాయి... కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు ఇప్పించాల్సి వస్తోంది. అలాంటప్పుడు ఆమె ఎందుకీ వృత్తి ఎంచుకున్నాను నేను అని పశ్చాత్తాపపడుతూనే ఉంటుంది... ఆమెకి ఒక్కోసారి భార్యాభర్తల్ని విడదీస్తున్న పాపానికే తనకి ఏ సంబంధమూ కుదరక ముఫ్ఫై కి దగ్గరవుతున్నా పెళ్లికాలేదేమో అనికూడా అనిపిస్తుంటుంది. ఇప్పుడు స్నేహితురాలే తనచేత మరో పాపం చేయిస్తోంది.

"సరేలే శనివారం వస్తాను... ఇద్దరూ ఇంట్లో ఉంటారుగా మాట్లాడతాను... నువ్వింక రెస్ట్ తీసుకో నైట్ డ్యూటీ చేసి వచ్చావు... మళ్లీ సాయంత్రం ఆఫీస్ కి వెళ్ళాలిగా..." అంటూ సంధ్య వెళ్లిపోయింది.

లాలిత్య ఆలోచిస్తూ అక్కడే సోఫాలోనే వాలిపోయి కాసేపట్లో నిద్రలోకి జారిపోయింది...

వేదవ్యాస్, లాలిత్య కూడా ఒక పెద్ద కార్పోరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు... లాలిత్యది అమెరికన్ బేసిడ్ కంపెనీ... ఆమె పనివేళలు రాత్రి ఎనిమిది నుంచి తెల్లవారిందాకా ఉంటాయి... వ్యాస్ ది సింగపూర్ కంపెనీ... ఉదయం పదకొండు నుంచీ ఆరింటిదాకా... అతను ఇంటికి వచ్చే టైం, ఆమె ఆఫీస్ కి వెళ్లే టైమ్... పెళ్లి అయి కాపురం పెట్టిన ఈ రెండేళ్లలో వాళ్లు సరదాగా గడిపింది ఒక వారం రోజులు... అది కూడా లాలిత్య అక్క వారిజ వాళ్ల పెళ్ళికి గిఫ్ట్ గా హనీమూన్ కి టికెట్లు కొనివ్వడంతో తప్పలేదు... ఊటీ, మైసూరు, వగైరా తిరిగి వచ్చారు... ఆ తరువాత లీవులు అయిపోయి ఆఫీసుల్లో రిపోర్టు చేశారు... సోమవారం నుంచీ శుక్రవారం దాకా ఇద్దరూ బిజీ.. కేవలం శని, ఆదివారాలే వాళ్లకి మిగిలేది... ఈ మధ్య ఇద్దరికీ పని ఒత్తిడి పెరిగింది... చిరాకులు, పరాకులు కూడా ఎక్కువైనాయి... ఒకళ్లు సర్దుకుపోవడానికి ప్రయత్నించినా, మరొకళ్ల పంతాలతో గొడవలు వస్తున్నాయి... ఇది నాలుగోసారో, అయిదోసారో వాళ్లు గొడవపడడం... అందుకే లాలిత్య ఇద్దరికీ కుదరదని నిర్ణయించుకుంది. దానికి తోడు వ్యాస్ కూడా మనకి కుదరదు విడాకులు తీసుకుందాం అనడంతో ఆమె ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి సంధ్యతో ప్రస్తావించింది. ఆ మర్నాటి నుంచీ వ్యాస్ తో పూర్తిగా మాటలు మానేసింది.

ఇది జరిగిన నాలుగోరోజు ఉదయాన్నే వ్యాస్ తల్లి పవిత్ర విజయవాడ నుంచి సూట్ కేస్ తో దిగింది...

ముందుగా ఏమాత్రం తెలియచేయకుండా వచ్చిన తల్లిని చూసి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే అమ్మ వచ్చింది కడుపునిండా తిండి తినచ్చు అని మురిసిపోయాడు వ్యాస్...

"అదేంటత్తయ్యా ముందు కబురు చేస్తే రిసీవ్ చేసుకునేవాళ్లం కదా" అంది లాలిత్య...

"అనుకోకుండా వచ్చానమ్మా... నా స్నేహితురాలి కూతురు పెళ్లి కూకట్ పల్లిలో... అందుకని వాళ్లతో వచ్చాను" అంది పవిత్ర...

ఆ తరువాత ఆవిడ వంటగది హ్యాండోవర్ చేసుకుంది... వ్యాస్ కి ఇడ్లీ, వడ, ఉప్మా లాంటి రక రకాల బ్రేక్ ఫాస్ట్ లు, మంచి వంటలతో క్యారేజీలు ఆవిడ వచ్చాక హాయిగా ఉంది. అలాగే కోడలికి కూడా ఒద్దన్నా వినకుండా రాత్రికి డిన్నర్ ఏం తింటావు వద్దంటే ఎలా అంటూ పుల్కాలు, కూర చేసి ఇస్తోంది పవిత్ర... తల్లి వచ్చాక వ్యాస్ కొంచెం త్వరగా రావడం మొదలుపెట్టాడు ఆఫీసు నుంచి... లాలిత్య కూడా అత్తగారు ఉన్న ఆ నాలుగురోజులూ త్వరగా వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకుంది ఆఫీసులో... ఆవిడ సడన్ గా రావడంతో వాళ్ల విడాకుల చర్చ కొద్ది రోజులు వాయిదా పడింది. సంధ్యకి ఫోన్ చేసి విషయం వివరించి ఆవిడ వెళ్లాక ఫోన్ చేస్తాను అని చెప్పింది లాలిత్య.

లాలిత్య సాధారణంగా ఉదయం ఐదింటికి వస్తుండేది... ఇప్పుడు మూడింటికల్లా క్యాబ్ దింపేస్తోంది... అంచేత మూడునుంచి ఉదయం ఏడింటిదాకా నిద్రపోయి లేచేయడంతో లాలిత్యకి అనుకోకుండానే తెలియని ఉల్లాసం కలగసాగింది... ఉదయం వ్యాస్ ఆఫీస్ కి వెళ్ళేలోగా అత్తగారితో కబుర్లు చెబుతూ వంటలో సాయం చేయడం, మధ్య, మధ్య అనుకోకుండానే వ్యాస్ తో మాటలు కలపడం జరిగింది... వ్యాస్ లో కూడా నిర్లిప్తత, చికాకు పోయి అటు తల్లితో, ఇటు లాలిత్యతో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు... తమాషాగా ఆ ఇంట్లో స్తబ్దత పోయి ఏదో ఉత్సాహం, చైతన్యం వచ్చినట్టుగా అనిపిస్తోంది ఇద్దరికీ... నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో టీవి మోగుతోంది... ఇంట్లో ఉన్నంతసేపూ పవిత్ర ఏవో తినుబండారాలు సప్లై చేస్తూనే ఉంటుంది...

శనివారం... ఇద్దరికీ సెలవురోజు...

లాలిత్య కాసేపు అత్తగారికి వంటలో సాయం చేసి వచ్చి లాప్ టాప్ పట్టుకుని కూర్చుంది...

వ్యాస్ టి వి చూస్తూ కూర్చున్నాడు... పవిత్ర వంట పూర్తి చేసి వచ్చి అంది... "సెలవు పూట కూడా పనేంటమ్మా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చుకదా..."

లాలిత్య నవ్వింది.. "కార్పోరేట్ వాళ్లకి సెలవులు, వర్కింగ్ డేస్ అన్నీ ఒకటే అత్తయ్యా కంపెనీవాళ్లు ఈ ల్యాప్ టాప్ ఇచ్చింది ఇరవై నాలుగు గంటలూ పనిచేయడానికే తప్పదు..."

"ఏం దిక్కుమాలిన ఉద్యోగమో... వేరే ఉద్యోగం చేసుకోవచ్చుకదా..."

"మనకి కావాల్సినప్పుడు ఏం ఉద్యోగాలు దొరుకుతాయత్తయ్యా! ఏ కంపెనీ అయినా ఇంతే... టెక్నికల్ జాబ్స్ ఇలాగే ఉంటాయి."

ఆవిడేం మాట్లాడలేదు. కొద్ది క్షణాల తరువాత అంది. "ఎక్కడికన్నా తీసికెళ్ళకూడదూ నాకు విసుగ్గా ఉంది.."

"సారీ అత్తయ్యా... మీరూ, మీ అబ్బాయి వెళ్లిరండి... నాకు చాలా పని ఉంది..."

వ్యాస్ చురుగ్గా చూశాడు ఆ మాటకి... "పదమ్మా మనం వెడదాం" అన్నాడు సోఫాలోంచి లేస్తూ...

ఆవిడ పెదవి విరుస్తూ అంది... "పోనీలేరా ఆ అమ్మాయికి పని ఉందంటోందిగా.. ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెడతాం?"

లాలిత్యకి బాధనిపించింది.. రాక, రాక వచ్చిందావిడ... వచ్చిన దగ్గర్నించి పాపం ఇంటెడు చాకిరీ మీద వేసుకుని చేస్తోంది. ఒక్కరోజు ఆవిడ కోసం వెచ్చించకపోడం ధర్మం కాదనిపించింది... వెధవ పని రోజూ ఉండేదే అనుకుంటూ ల్యాప్ టాప్ పక్కన పెట్టి లేస్తూ అంది "వస్తాలెండి... లంచ్ చేసి వెళ్దాం... గోల్కొండ లైట్ అండ్ మ్యూజిక్ షో కి వెళదాం."

ఆవిడ కళ్ళు మెరిసాయి... చక, చకా డైనింగ్ టేబిల్ దగ్గర అన్నీ రెడీ చేసింది... ముగ్గురూ కలిసి భోజనానికి కూర్చుంటే ఆ అనుభవం కొత్తగా, వింతగా అనిపించింది... ఈ డైనింగ్ టేబిల్ వాడిన రోజులు చాలా తక్కువ... వర్కింగ్ డేస్ ఆఫీసులో, మధ్య, మధ్య ఇంట్లో తిన్నా ఏదో ఇంత ప్లేటులో పెట్టుకుని ఏ సోఫాలోనో కూర్చుని స్ఫూన్ తో తింటూ మధ్య, మధ్య ఐపాడ్ లో మెసేజ్ లు చెక్ చేసుకుంటూ భోజనం అయిందనిపించడం తప్ప ఇంత పద్దతిగా వేడి అన్నం, వేడి సాంబారు, కూర, పచ్చడి, పెరుగుతో ఇలా తీరుబడిగా కూర్చుని భోజనం చేయడం ఎంత బాగుంది అనిపించింది వ్యాస్ కీ, లాలిత్య కీ కూడా...

ఇలా తినడానికి కూడా అదృష్టం ఉండాలి... ఈవిడ ఉన్నారు కాబట్టి కానీ, మళ్లీ ఈవిడ వెళ్లాక మామూలేగా... అయినా విడిపోతున్నాం కదా... ఎలా ఉంటే ఏం? అనుకుంది విరక్తిగా.

ముగ్గురూ ట్యాక్సీ మాట్లాడుకుని బయల్దేరారు... ముందు సీట్లో కూర్చోబోతున్న కొడుకుతో "నేను వెనకాల ఎక్కలేనురా మోకాళ్ళు నొప్పి నువ్వు వెనక కూర్చో" అంటూ తాను ముందు సీట్లోకి వెళ్లింది పవిత్ర... తప్పనిసరి పరిస్థితుల్లో లాలిత్య పక్కన కూర్చోవాల్సి వచ్చింది వ్యాస్ కి... ఆమెకి ఎడంగా పొరపాటున కూడా తాకకుండా కూర్చున్నాడు... అతనలా కూర్చోడంతో లాలిత్యకి బాధతో పాటు కోపం కూడా వచ్చింది. ఎన్నడూ తనని తాకనివాడిలా దూరంగా కూర్చున్నాడు. అంత పనికి రాకుండా పోయానా అనుకుంది... మళ్లీ విడిపోయేవాడితో నాకెందుకు ఎక్కడ కూర్చుంటే ఏం? ఈవిడ ఉన్నన్ని రోజులూ సరిపెట్టుకోవాలి అనుకుంది...

గోల్కొండ మొత్తం తిరిగి షో మొదలయ్యే టైం కి అక్కడ చేరి, లైట్ అండ్ మ్యూజిక్ షో చూశారు... ఆ జనంలో మధ్య, మధ్య వ్యాస్ తనకి తగలడం సారీ అంటూ దూరం జరగడం లాలిత్యకి గుండె కోస్తున్నట్టు అనిపించింది... అలాగే వ్యాస్ కి కూడా లాలిత్య అక్కడ కూడా తనతో నవ్వుతూ మాట్లాడకపోడంతో ఈమెకి నా మీద ప్రేమ పోయిందా? ఎందుకిలా దూరమవుతోంది అనిపించింది...

బైట డిన్నర్ చేసి ఇల్లు చేరేసరికి పదకొండు అయింది...

చీర మార్చుకుని నైటీ వేసుకుని వచ్చి ల్యాప్ టాప్ పట్టుకున్న కోడలిని చూసి నొసలు ముడేసింది పవిత్ర... "పడుకోమ్మా పెందలాడే లేపుతాలే అప్పుడు చేసుకో ఆ పని" అంది.

ఆవలిస్తూ "చాలా పనుందత్తయ్యా" అంది లాలిత్య...

"ఉంటే ఉందిలే రేపు ఆదివారమేగా చేయచ్చు పడుకో ఆరోగ్యం పాడుచేసుకోకు... వేళకి తిండీ, నిద్రా లేని ఉద్యోగం దేనికి? ఆ సంపాదన దేనికి?" చిరాకు పడిందావిడ...

అత్తగారి ఎక్స్ ప్రెషన్స్ చూసి ల్యాప్ టాప్ మూసేస్తూ అనుకుంది లాలిత్య అవును నిద్రవస్తోంది ఉదయాన్నే చేసుకోవచ్చులే పని అనుకుంటూ సోఫాలో వాలిపోయింది.

"అదేంటి ఇక్కడ పడుకున్నావు... నడుం పట్టేస్తుంది... లే వెళ్లి గదిలో పడుకో" మందలించింది పవిత్ర...

లాలిత్య లేచి వెళ్లక తప్పలేదు... అప్పటికే వ్యాస్ మంచం మీద వాలిపోయాడు...

లాలిత్య లోపలికి వెళ్ళగానే పవిత్ర తనే తలుపు వేసి బైట నుంచి గడియవేసింది...

లాలిత్య మంచం మీద వాలగానే మంచం కొద్దిగా కదలడంతో కళ్ళు తెరిచాడు వ్యాస్...

"సారీ డిస్టర్బ్ చేశాను... మీ అమ్మగారు గొడవ చేస్తున్నారు తప్పలేదు ఇక్కడికి రాక" అంది లాలిత్య...

బెడ్ లైట్ వెలుగులో ఆమె మొహంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ సూటిగా చూసిన అతని చూపులతో ఆమె చూపులు చిక్కుకుపోయాయి... చాలా కాలం తరువాత అతి సన్నిహితంగా తగిలిన ఆమె ఊపిరి అతనికి గిలిగింతలు పెట్టింది... పక్కకు వత్తిగిల్లి కళ్ళు మూసుకోబోతుంటే అతని విశాలమైన ఛాతీ విశ్రాంతి తీసుకోమన్నట్టు ఆహ్వానించింది ఆమెని...

ఎవరు ఎవరి దగ్గరకు చేరారో తెలియని ఓ మైకంలో ఇద్దరూ ఒకటయ్యారు...

ఆదివారం... పెసరట్లు బ్రేక్ ఫాస్ట్... డైనింగ్ టేబిల్ దగ్గర మూడుప్లేట్లు ఉండాల్సిన చోట నాలుగో ప్లేటు కనిపించి "ఇదెవరికత్తయ్యా" అడిగింది లాలిత్య.

నాకు అంటూ వచ్చింది సంధ్య...

"అరె నువ్వెప్పుడు వచ్చావే" ఆశ్చర్యంగా అడిగింది లాలిత్య...

"ఇప్పుడే" అంటూ స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చిన వ్యాస్ కి కరచాలనం చేస్తూ గుడ్ మార్నింగ్ అంది సంధ్య...

"వెరీ గుడ్ మార్నింగ్" అంటూ లాలిత్య పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు...

"రా సంధ్యా! పెసరట్లు చల్లారిపోతాయి" అంది పవిత్ర ప్లేట్లలో వేడి, వేడి పెసరట్లు అల్లం చట్నీ వేస్తూ...

చూపుడు వేలితో అల్లం చట్నీ తీసుకుని నాలిక్కి రాసుకుంటూ "చాలా బాగుందాంటీ చట్నీ... పుల్ల, పుల్లగా, తీయగా, కారంగా, అచ్చు వీళ్ల కాపురంలా" అంది సంధ్య కొంటెగా లాలిత్యని చూస్తూ.

లాలిత్య చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. కనురెప్పలు బరువుగా వాలిపోయాయి... వ్యాస్ ఆమె వైపు క్రీగంట చూసి మెత్తగా ఆమె పాదం మీద కాలివేలితో నొక్కాడు... అతని చర్యకి పులకించిపోతున్న శరీరాన్ని అదుపుచేసుకుంటూ కోపంగా చూస్తున్న లాలిత్య చెవులకి మంత్రాల్లా వినిపించాయి అత్తగారి మాటలు.

"ల్యాప్ టాప్ లు, ఐపాడ్ లు వచ్చి కాపురాల్ని పాడుచేస్తున్నాయి సంధ్యా! ఈసారి ఎవరన్నా విడాకులకోసం నీ దగ్గరకు వస్తే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని బైట పారేయమని చెప్పు"

"అంతపని చేయనులే ఆంటీ... మీకాలం ఆ కాలమైతే రాబోయే కాలమంతా ఈ కాలమ్" అంది సంధ్య...

ఏ కాలమైనా భారతీయ వివాహవ్యవస్థని నాశనం చేసే మాయదారి కాలం కాకపోతే చాలు అంది పవిత్ర పెసరట్టు తుంచి నోట్లో పెట్టుకుంటూ.

వ్యాస్, లాలిత్య ఒకళ్ల మొహం ఒకళ్లు చూసుకుని ఫక్కున నవ్వుకున్నారు...

***

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ