ఆకాశ రామన్న - చెన్నూరి సుధర్శన్

aakaasharaamanna

“హల్లో..”

“హల్లో..”

“హల్లో.. ఆత్మాభిమాన సాహిత్య మాస పత్రిక సంపాదకులు.. సూర్యం గారేనా?..”

“అవునండీ.. మాట్లాడుతున్నాను..”

“సార్.. మీరు హాస్య కథానికల పోటీ నిర్వహిస్తున్నారు కదా..”

“ఆ.. అవును. ఏంటో చెప్పండి..”

“ఏం లేదు సార్... నేను పంపిన కథానిక ‘ప్రచురించకుంటే ప్రాణం తీస్తా’..”

“ఏంటీ! ప్రచురించకుంటే ప్రాణం తీస్తావా?..”

“అయ్యొయ్యో.. మీరు పొరబడ్తున్నారు సార్.. నేను రాసిన హాస్య కథానిక పేరు ‘ప్రచురించకుంటే ప్రాణం తీస్తా..’ పోటీకి పంపించాను. దానికి తప్పకుండా ప్రథమ బహుమతి ఇవ్వాలి సార్..”

“ఎవరయ్యా.. నువ్వు.. మతుండే మాట్లాడుతున్నావా?...”

“ఎవరైతే ఏం సార్.. కౌన్ కిస్కా గాణ్ణి.. ఆకాశరామన్న అనుకో. మతి ఎవరికుందో లేదో కాసేపట్లో తేలిపోతుంది గాని.. ముందు నాకథానిక సంగతి తేల్చండి స్వామీ. తప్పకుండా ప్రథమ బహుమతి ఇచ్చి తీరాలి.. మీ ఋణం ఉంచుకోను.. పది శాతం కమీషనిచ్చుకుంటాను..”
“నోర్ముయ్యి.. దగ్గర్లో ఉంటే కాళ్లు విరిచి చేతిలోపెట్టే వాణ్ణి”

“ఓసోస్!.. కొంచెం ఆవేశం తగ్గించుకొండి. ఎందుకు అనవసరంగా బి.పి. పెంచుకుంటారు. నేను చాలా మర్యాద పూర్వకంగా బతిమాలు కుంటున్నాను. దయ చేసి నా కథకి ప్రథమ బహుమతి ఇప్పించండి”

“ఆకాశరామన్నగారూ.. అలా ఎలా కుదురుతుందండీ!.. దానికో కమిటీ ఉంటుంది.. వాళ్ళ చేతుల్లోనే బహుమతుల నిర్ణయముంటుంది.. పైగా ఆప్రాజెక్ట్ దాదాపు పూర్తై పోయింది కూడా.. ఎల్లుండి బుధవారం విడుదలయ్యే పత్రికల్లో ఫలితాలు.. ప్రథమ బహుమతి కథానిక గూడా అచ్చు కాబోతుంది.”

“కమిటీ ఎక్కడ నుండి పుట్టింది సార్.. ఆకాశంలోనుండి ఊడి పడిందా ఏంటి? మీరు భిక్ష ప్రసాదించిన వాళ్ళే కదా.. మీరు చెబితే కాదంటారా.. ఏంచేస్తారో ఏమో.. నాకు మాత్రం తెలీదు. నాకథకు ప్రథమ బహుమతి ఇచ్చి తీరాల్సిందే...

“సారీ ఆకాశరామన్నగారూ.. అది నాచేతుల్లో లేదు. నామీద ఇంకా చీఫ్ ఎడిటర్, మేనేజింగ్ డైరక్టర్ అంతా ఉంటారు.. అయినా నీ కథ బాగుంటే తప్పకుండా బహుమతి వచ్చి ఉంటుంది... ”

“కథ బాగుందో లేదో నాకేం తెలుసు సార్.. ఏదో రాశాను... అచ్చులో నాపేరు చూసుకుందామని ఆశ పడ్తున్నాను. ఒకవేళ ప్రథమ బహుమతి కాకున్నా తృతీయ బహుమతి అయినా ఇప్పించండి. బహుమతి వచ్చిందంటే.. నాజీవితాశయం నెరవేరినట్లే.. ఇక నాజన్మలో నేనేమీ ఆశించను. మీరు తలుచుకుంటే పని అవుతుందనీ.. మీమాట ఆఫీసులో వేదవాక్కని తెలుసుకొనే మీకు ఫోన్ చేస్తున్నా.. ”

“ఇలా ఫోన్లు చేసి విసిగించడం ఏంబాగోలేదు.. నేనసలే చండ శాసనుణ్ణి.. నీతో ఇంత సేపు మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ..”

“అలాగా!.. ఆగాగు.. ఫోను పెట్టెయ్యకు. నువ్విలా ఓవరై పోతావని నాకు ముందే తెలుసు. నీకో ఝలకిస్తాను చూడు.. ఇటు మాట్లాడు..” “...హల్లో.. డాడీ.. నేను డాలీని..”

“డాలీ.. ఎక్కడున్నావురా?.. ఏడ్వకు తల్లీ..!”

“వీడెవ్వడో.. తలకు మంకీ టోపీ పెట్టుకుని నన్ను స్కూల్ గ్రౌండ్‍లో నుండి ఎత్తుకొచ్చాడు డాడీ. ఎక్కడున్నానో తెలీదు. నువ్వురా డాడీ..”

“డాలీ నువ్వు ధైర్యంగా ఉండురా బేటా.. నేనొస్తున్నా. ఫోన్ వాడికి ఇవ్వు..”

“విన్నావా.. అరవింద్. నీముద్దుల కూతురు స్వీట్ వాయిస్..”

“హల్లో ఆకాశరామన్నగారూ.. నాడాలీని ఏం చేయొద్దు ప్లీజ్.. ”

“మరి మంత్రాలకు చింతకాయలు రాల్తాయా?.. మేము కథలు రాసి, స్వంత చిరునామా కలిగిన కవర్లూ జతపరుస్తాం. మీరేమో కథలు అచ్చు వేయరు సరికదా. తిరిగి పంపడానికీ చేతులు రావు. మాస్టాంపులు గూడా మీరే జీర్ణించుకుంటారు. నాబుద్ధెరిగినప్పటి నుండి కథానికలు రాసి పంపిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఒక్క కథానిక కూడా అచ్చుకు నోచుకోలేదు. పైగా పదివేలు బొక్క. అందుకే ఈప్లాన్ వేశాను. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ఒకటి నా కథానిక అచ్చు. రెండవది నా బొక్కకు పదివేలు వాపసు వచ్చు. ఎలా ఉంది నాప్లాను?...”

“ఇది మరీ ధారుణం ఆకాశరామన్నగారూ!.. ప్రచురణకునోచుకోని కథలను మేము త్రిప్పి పంపిస్తూనే ఉంటాం. అవి మీకు చేరడం లేదంటే అది పోస్టల్ డిపార్టుమెంటు సేవాలోపం.. కాని మాదేం తప్పు చెప్పండి?...మంచి కథలను మేము ఎల్లప్పుడు ఆదరిస్తూనే ఉంటాం.. మీరచనలే కదా... మాపత్రికలకు ఊపిరి.. ప్లీజ్ మా డాలీని ఏంచేయ్యొద్దు.. ఎక్కడున్నారో చెప్పండి..”

“అమ్మా!.. ఆశ దోశ అప్పడం వడ.. అంత తేలిగ్గా చెబుతాననుకున్నావా?.. ముందు నాకథానిక సంగతి తేల్చు సామీ.. అంత వరకు డాలీ నాదగ్గరే డాగ్‍లా పడి ఉంటది...”

“నీకెలా చెప్పాలో నాకర్థం కావడంలేదు.. నిజంగా అది నా చేతుల్లో లేదు నన్ను నమ్మండి...”

“ఉందో.. లేదో!.. నాకనవసరం. తేల్చుకోవాల్సింది మీరు. ఇరవై నాలుగు గంటల టైమిస్తున్నా. రేపు తిరిగి ఇదేసమయానికి మళ్ళీ ఫోన్ చేస్తా. ఈవిషయం పోలీసులకు చెప్పినా.. బయటికి ఏమాత్రం పొక్కినా.. నీ డాలీ డాగ్ చావే.. ఆపై నీఇష్టం. మరో ముఖ్యమైన షరతు. నాకు ముందుగా ఒక కాంప్లిమెంటరీ కాపీ అందచేయాలి. అది నేను చూసుకొని తృప్తి చెందితేనే నీ డాలీ నీకు దక్కదు..”

ఫోన్ కటయ్యేసరికి అరవింద్ ముఖంలో అరవై నాల్గు కలలూ ఆవిరై పోయి ప్రేతకళ ముస్తాబవుతోంది.

సూర్యం అంటే ఒక వ్యక్తి కాదు. శక్తి. అని భుజాలు పైకి ఎగరేసుకుంటూ తిరిగే వాడు. కాని ఈఫోన్ కాల్‍తో రెండు ఇంచులు కుంచించుకు పోయి కుదేలైపోయాడు. ఏసీ ఆన్‍లో ఉన్నా ఒళ్ళంతా చెమటలు పడుతూ కాళ్ళు వణుక సాగాయి. చేతిలోని కలం కదలడం లేదు.రవళిక ముద్దు పేరు డాలి. తమ ఒక్కగానొక్క గారాలపట్టి. ఆ నీచుని చేతిలో ఎన్ని అవస్థలు పడుతుందో ఏమో!.. తల్చుకుంటుంటే సూర్యం గుండెలో రైళ్ళు పరుగెడ్తున్నాయి.

ముందుగా తన ధర్మపత్నికి ఫోన్ చేసి తెలివిగా విషయం కన్‍ఫాం చేసుకున్నాడు. లాభం లేదు. డాలీని కిడ్నాప్ చేసింది వాస్తవమే. మరి ఈవిషయం బయటికి పొక్కవద్దంటే ఎలా? అని ఆలోచించనలోమునిగాడు. అసలే ఆడవారి నోట మాట నీటి మూట. పెద్ద రాద్ధాంతమైపోతుంది. టీవీలో లైవ్‍షోలు.. పోలీసులు.. విలేకర్లూ.. వగైరా.. వగైరా..

మరోసారి అరవింద తన సతీమణికి ఫోన్ చేసాడు.

“డాలీని తీసుకొని అర్జంటుగా బేబీషో కోసం విజయవాడ వెళ్తున్నాను. రెండు రోజుల్లో తిర్గి వస్తాను” అంటూ అటువైపునుండి సమాధానం కోసం చూడకుండానే తన వైఫ్ సైడు చానల్ కట్ చేశాడు.

‘ప్రచురించకుంటే ప్రాణం తీస్తా’ కథానికను తెప్పించుకొని చదివాడు.

‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెను... దీనుని కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా..’ బమ్మెర పోతనగారు రచించిన గజేంద్రమోక్షంలోని పద్యం మదిలో ఆలపిస్తుంటే కళ్ళు బైర్లు కమ్మాయి.

ఆకాశరామన్న ఎదుర్గా ఉంటే చొక్కా విప్పి వీపుపై కారప్పొడి చల్లుతూ చింత బరిగెలతో బ్యాండ్ మేళం వాయించాలన్నంత కోపం వస్తోంది. కాని ‘విధి వైపరీత్యం. నాఖర్మ ఇలా కాలబడింది..’ అని వాపోయాడు.

హామీ పత్రం చదివాడు. ఆకాశరామన్న కలం పేరు. అసలు పేరు చిరునామా. అన్ని వివరాలూ ఉన్నాయి. అది అసలు చిరునామానో కాదో.. తెలీదు. తెలుసు కుంటున్నట్లు తెలిసిందంటే డాలీ ప్రాణానికి ముప్పు. ఈ విషయం కక్కలేక మింగలేక తల్లడిల్లసాగాడు...

ఇక తప్పదన్నట్లు పత్రిక ప్రింటింగ్ సెక్షన్ వైపు దారి తీశాడు సూర్యం.
ఇరవై నాల్గు గంటలసమయానికింకా గంట సమయముంది.
సూర్యం ఒంటరిగా తన ఆఫీసు గదిలో ఆకాశరామన్న ఫోన్ కాల్ కోసం ఎదురి చూస్తూ కూర్చున్నాడు.
భయాందోళనలతోనే కడుపు నిండి పోయేసరికి లంచ్ చేయాలన్న ధ్యాసే రాలేదు. లంచేం ఖర్మ. నిన్నటి నుండి ముద్ద దిగితే ఒట్టు.
సమయం దగ్గర పడ్తోంది.. దగ్గర పడ్తోంది.. పడ్తోంది..
గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. గోడ గడియారం శబ్దం వినరాకుండా పోయింది.
సరిగ్గా నిన్నటి సమయానికే సెల్ ఫోన్ మ్రోగింది..
లిప్త కాలం పాటు ఒళ్ళు జలదరించి.. చల్లబడి పోయాడు సూర్యం.
“హల్లో!.. ఎడిటర్ సూర్యం గారూ.. గుడాఫ్టర్‍నూన్ సార్..”
“ఎవరూ! ఆకాశరామన్నగారా..”
“అవును సార్. ఈ రోజు నానంబర్ మారింది కదూ! గొంతు గుర్తుబట్టావా? లేక మరో మారు మీ డాలీతో మాట్లాడించాలా?”
“ఎలా ఉంది డాలీ?.. మాట్లాడించు”
“ముందు నాకథానిక సంగతి తేల్చు గురువా..”
“మార్కెట్లో చాలా కాంపిటీషనుంది ఆకాశరామన్నగారూ.. ఈమారు పోటీకి అసంఖ్యాకంగా కథానికలు వచ్చాయి. అయినా చాలా రిస్క్ తీసుకున్నాను. నీకథానిక చాలా వెరైటీగా ఉందనీ.. శైలి అదిరి పోయిందనీ వాదించి కమిటీ సభ్యులను ఒప్పించి నీకు తృతీయ బహుమతి ఇప్పించే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చిందంటే నమ్ము”
“ఓ.. థాంక్యూ సార్.. థాంక్యూ వెరీ మచ్.. నిజంగా నాకథ అంత బాగుందా సార్?”
‘నీశ్రాద్ధం. నీ పిండా కూడు’ అని మనసులో అనుకుని పైకి మాత్రం “మీరు నమ్ముతారో లేదోనని మీకోసం పంపించే కాంప్లిమెంటరీ కాపీని నేనే స్వయంగా మీకందచేద్దామని తీసుకున్నాను”
“ఓ.కే. నాకు కావాల్సిందీ అదే. మీరాకాపీని నాకందజేసి మీ డాలీని తీసుకెళ్ళండి. అయితే మాకిడ్నాపర్ల అసోసియేషన్ నియమ నిబంధనలు కొన్ని ఏడ్చి చచ్చాయి. జాగ్రత్తగా వినండి( గుస, గుస, గుస..). కాని ఒక విషయం మర్చి పోవద్దు. నీ కదలికలపై మాకిడ్నాప్ అసోసియేషన్ డేగ కన్నేసే ఉంటుంది” అని మీరు మర్చి పోవద్దు.
కిడ్నాపర్ ఆకాశరామన్న సూచనల ప్రకారం సూర్యం కంప్లిమెంటరీ కాపీని తీసుకొని ఆఫీసులో మాయమై కూకట్‍పల్లి లోని నిజాంపేట క్రాస్ రోడ్డు జంక్షన్‍లో వున్న చెత్త కుండీ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఆకాపీని చెత్త కుండిలో వేసి దానిపైనున్న జి.హెచ్.ఎం.సి. నంబర్ నోట్ చేసుకున్నాడు. అటునుండి నేరుగా మియాపూర్ జంక్షన్ లోని హైటెక్ హోటల్‍కు వెళ్ళాడు. కౌంటర్లో ఉన్నతనికి తను నోట్ చేసుకున్న నంబర్ చెప్పగానే.. ఆకాశరామన్నకు ఫోన్ చేసి కన్ఫాం చేసుకున్నాడు. ‘రిలీజ్’ కార్డ్ తో బాటు పిన్ నంబర్ ఇచ్చాడు. ఒక టోకెన్ ఇస్తూ రూం నంబర్ చెప్పాడు.
సూర్యం గుండె వేగంగా కొట్టుకో సాగింది. గబ, గబా రూంవద్దకు వెళ్ళి టోకెన్ ఇన్సెర్ట్ చేశాడు.
రూం తెర్చుకుంది. ఎదుర్గా ఒక ఏ.టి.ఎం. యంత్రం లాగా ‘కిడ్నాప్’ అని ఒక ప్రక్క ‘సెండాఫ్’ అని మరో ప్రక్క అని రాసి ఉన్న యంత్రం కనబడింది. చీకటి వెలుగులమయంలో రూమంతా మిణుకు, మిణుకు మంటోంది.
‘సెండాఫ్’ కెదుర్గా నిల్చున్నాడు. యంత్రంపై రాసి ఉన్న సూచనలమేరకు తన వద్ద ఉన్న కార్డ్ ను యంత్రంలో తోసేశాడు. పిన్ నంబరడిగింది. ఎంటర్ చేశాడు. ఒక స్లిప్ బయటికి వచ్చింది. అందులో డాలీ అడ్రసుంది. పరుగు తీశాడు.
‘ఆపరేషన్ సక్సెస్.. గండం గడిచింది’ అన్నట్లుగా డాలీని గుండెలకత్తుకొని ఇంటికి పరుగెత్తాడు అరవింద్...
***
మరునాడు ‘ఆత్మాభిమాన సాహిత్య మాస పత్రిక’ మార్కెట్లోకి అడుగు పెట్టే రోజు...
తన కాంప్లిమెంటరీ కాపీలో తన కథానిక ‘ప్రచురించకుంటే ప్రాణం తీస్తా’ తృతీయ బహుమతి పదివేలు చూసుకొని మురిసిపోయాడు ఆకాశరామన్న.
మియాపూర్ లోని హైటెక్ హోటల్లో హైలెవల్లో పార్టీ అరేంజ్ చేశాడు.
పార్టీలో పాల్గొన్న వాళ్ళకే కాకుండా తన వాడంతా పత్రికలు పంచి పబ్లిసిటీ చేసుకోవాలనే తాపత్రయంతో ఆత్మాభిమాన సాహిత్య మాస పత్రిక ఏజంట్లను బుట్టలో వేసుకొని బ్లాకులో రెట్టింపు ధర వెచ్చించి వేయి కాపీలు సంపాదించాడు.
ముందు మందు గొంతులో దిగందే సభ రక్తిగట్టదన్నారు మందుబాబులు.
‘రసపట్టులో తర్కం కూడద’న్నట్లు ‘తథాస్తు’ అన్నాడు ఆకాశరామన్న.
సభ ఆరంభమైంది..
పూలమాలాలంకరణ కార్యక్రమం పూర్తయింది.
ఊగుతూ.. తూలుతూ.. చీఫ్ గెస్ట్ గా వచ్చిన వార్డ్ కార్పోరేటర్ రెడ్ రిబ్బన్ కట్ చేసి మాసపత్రికలను సభికులకు పంచాడు.
పత్రికలను తిరగేసిన సభ్యులు ఒక్కసారిగా గావు కేకలు వేశారు.
“కిక్కెక్కువైంది” అనుకున్నాడు ఆకాశరామన్న.
కార్పోరేటర్ మాడిపోయిన బల్బులా మారి పోయి టేబుల్‍పై వాలిపోయాడు.
ఆకాశరామన్నకు అనుమానమొచ్చి కార్పోరేటర్ చేతిలోని సంచికను లాక్కొని చూశాడు. తన కథ అడ్రసు లేదు సరికదా.. తృతీయ బహుమతి వచ్చింది వేరే ఒకరికి.
తనమెడలోని దండను టేబుల్‍పై గిరాటేసి బ్యాగులో నుండి తనకు అందజేసిన కాంప్లిమెంటరీ కాపీ తీశాడు. అందులోనూ తాను చూసిన హాస్య కథానికల బహుమతి వివరాలలో తన పేరు లేదు. ఎలా జరిగింది. తాను సరిగ్గానే చూశాడే.. ఎలా పేరు తారుమారు అయ్యింది?..
ఖర్చు మాత్రం తడిచి మోపడైంది అనే ఆలోచన రాగానే దెబ్బకు నిశా దిగిపోయింది. ఆమితమైన ఆవేశంతో సూర్యం ఎదురుగా వుంటే ముక్కలు ముక్కలు కింద నరికి పడి వేయాలన్నంత కోపం వచ్చింది.
కాని ఎదురుగా కన్పించింది పోలీసుల బృందం. బేడీలు పట్టుకుని నిల్చున్నారు.
అనుకోను పరిణామానికి నిర్ఘాంత పోయాడు ఆకాశరామన్న.
బాడీలో ఎముకలు మిగలవన్న సంగతి తెలిసిపోయింది.
మరునాడు అన్ని దిన పత్రికలు ఎడిటర్ సూర్యం సాహసాన్ని శ్లాఘిస్తూ రాసాయి.
ఆత్మాభిమాన మాసపత్రిక సర్క్యులేషన్ పెరిగి సూర్యం ప్రథాన సంపాదకుడయ్యాడు.
***
జైల్లో ఊచలు లెక్కించాల్సిన ఆకాశరామన్న మనసంతా పింజం పింజం కాసాగింది. తాను విడుదలయ్యే సమయం వరకు వేచి ఉండలేక పోతున్నాడు. ఎలాగైనా సూర్యానికి ఫోన్ చేసి ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉబలాటం తనని కుదురుగా ఊచలు లెక్కపెట్టనివ్వటం లేదు. చివరికి డబ్బులు ఆశ చూపి జైలు కాపలా పోలీసుని బుట్టలో వేసుకున్నాడు. సెల్ ఫోన్ సంపాదించి ఫోన్ చేశాడు.
సూర్యం ఫోన్ ఎత్తి “హల్లో” అన్నాడు.
“హల్లో.. ఎడిటర్ సూర్యం గారేనా?”
“అవును”
“సార్.. నేను ఆకాశరామన్నని. దయచేసి మీరు వివరంగా ఆ రహస్యాలు చెబితే నాకు కాస్తా మనశ్శాంతిగా ఉంటుంది”
“నీకు చెబితే ఎలా? మన పాఠకులకు తెలిసిపోతుంది కదా..”
“మన కథ అచ్చు అయితే కదా సార్ పాఠకులు తెలుసుకునేది. ఎలాగూ ఇది చెత్త బుట్టలో వేసే కథ. ఏం ఫరవాలేదు చెప్పండి. లేకుంటే నేను చచ్చిపోయేలా వున్నాను” అంటూ ఏడ్పు ముఖం పెట్టాడు ఆకాశరామన్న.
“చెబితే పెద్ద చాట భారతం అవుతుంది కాని రెండు ముక్కల్లో చెబుతా. నువ్వు మా రహస్యాన్ని బయటపెట్టొద్దు”
“ప్రామీస్ సార్.. చెప్పండి. ఆ రహస్యాలు కాపాడుతానని దేవుని మీద ఒట్టు వేస్తున్నాను” ఎలగైనా ఆ రహస్యాలు తెలుసుకోవాలాని ఆకాశరామన్న పడే ఆరాటం చూసి కాస్తా దయ తలిచాడు సూర్యం.
“ముందు నిన్ను జైల్లో ఊచలు లెక్కపెట్టించే రహస్యం.. మాలాంటి పత్రికలకు ఇలాంటి బెదిరింపు ఫోన్లు రావటం సర్వసాధారణం. అందుకే మేము మా ఆఫీసు ఫోన్లకు అధునాతన టెక్నాలోజీ అమర్చుకున్నాం. బ్లాక్‍మెయిల చేసే కాళ్లు మా ఫోన్ సెన్సార్లు గుర్తించి ఆటోమెటిక్‍గా పోలీసు యంత్రానికి చేర వేస్తూంది. నువ్వు మాట్లాడిన ఫోన్‍ను గుర్తించి నీ కదలికలను పోలీసులకు రికార్డు చేసి పంపిస్తూంది. నా డాలీని నేను కాపాడుకునే వరకు పోలీసులు నాకు సహకరించారు...
ఇక ప్రింటింగ్ విషయం. చైనాలో ‘సియోన్ క్సిమో అన్‍ఝాంగ్’ అనే రసాయన శాస్త్ర ప్రొఫెసర్ ‘వాటర్ జెట్’ టెక్నాలోజీని కనుగొన్నాడు. తరువాత ‘ఇంక్ జెట్’ ప్రింటింగ్ వచ్చింది. దీంతో మనం ప్రింటింగ్ చేసిన అంశాలు ఇరవై నాలుగు గంటల్లోగా మాయమై పోయి తెల్ల పేపర్లుగా మారి పోతాయి. ఈ టెక్నాలోజీని ‘టట్టూస్’ తుడిచెయ్యటానికి కూడా వాడుతున్నారు. దీనినే ‘వ్యానిషింగ్ ఇంక్ టెక్నాలోజీ’ అంటున్నారు.
తెల్ల పేపర్లు చూసి మోస పోయామని కోర్టులో కేసు వేస్తున్నారని ప్రస్తుతం మరింత అధునాతన టెక్నాలోజీ వచ్చింది. ఇది ‘డబుల్ ప్రింటింగ్ టెక్నాలోజీ’. అందుకే అంటున్నాను అతి రహస్యమని. ఈ కథ ఎలాగూ అచ్చు కాదనే ధైర్యంతో చెబుతున్నాను. నీకు ఇచ్చిన కాంప్లిమెంటరీ కాపీలో నీపేరు దగ్గర డబుల్ ప్రింటింగ్ యు.వి. లైట్ సహాయంతో చేశాం. నీ పేరు కొద్ది గంటల్లోనే ఎగిరిపోయి ఒరిజినల్ పేరు బయట పడింది..
ఈ టెక్నాలోజీతో ‘జిరాక్స్’ మెషీన్స్ కూడా వచ్చాయి. ఒక పేపరు పై లెక్కలేనన్ని సార్లు జిరాక్స్ చేయవచ్చు. పాతది పోతుంది. కొత్తది ప్రింట్ అవుతుంది.
ఇంకో రహస్యం చెప్పనా?.. ప్రస్తుతం ‘ఫ్లాష్ మెమొరీ చిప్స్’ వాడుతూ ‘ఫేస్ బుక్’ లో ‘ట్విట్టర్’ లో సందేశాలు పంపిస్తున్నారు. అవి చదివిన వెంటనే చెరిగి పోతాయి. వ్యానిషింగ్ ఇంక్ పెన్నులు కూడా వచ్చాయి...” అంటూ సూర్యం చెబుతుంటే ‘కిడ్నాప్’లో తమది అత్యంత అధునాతన టెక్నాలోజీ అని విర్రవీగిన తను, తన తలదన్నే టెక్నాలోజీలు ఆవిష్కరించ పడుతుండడటం తన అజ్ఞానికి సిగ్గు పడ్డాడు ఆకాశరామన్న.
కాని మనసులో ఆశ చచ్చిపోలేదు. ఈ అనుభవాలన్నీ ఒక కథగా రాసి వచ్చే హాస్య కథానికల పోటీలో అయినా బహుమతి కొట్టేయాలని ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు జైల్లో తృప్తిగా ఊచలు లెక్కిస్తూ.. ఆకాశరామన్న.***

మరిన్ని కథలు

Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.