"నగ్మా చెల్లెలు ఎవరు?" అప్పుడే నిద్రలేచి మంచం మీదనుండి దిగబోతున్న నా శ్రీమతి ప్రశాంతిని అడిగాను.
'రామా కృష్ణా అంటూ మేల్కొనాల్సిన సమయంలో 'నగ్మా చెల్లెలు ఎవరు, ఇలియానా అక్క ఎవరు? అంటూ ఈ వెధవ ప్రశ్నలేంటి ' అన్నట్టుగా సీరియస్సుగా చూసింది నా వంక.
బోలెడంత భయపడిపోయి అటువైపునుండి కిందకు దిగి గోడకున్న దేవుడికి రెండు చేతులెత్తి నమస్కరించి పడగ్గదిలో నుండి బయటపడ్డాను. శ్రీమతి తాళిబొట్టుని కళ్లకద్దుకుని మంచం దిగింది. 'ఎంత పతిభక్తి...' అనుకున్నాను.
నిజానికి నా వ్యాధి గురించి నా శ్రీమతికి పెళ్లికి ముందునుండే తెలుసు. హఠాత్తుగా ఏదో మరచిపోయిన విషయం గుర్తొస్తుంది. ఇక రోజంతా దాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంటాను. ఇవాళ ఉదయమే ఎందుకో నగ్మా చెల్లెలు ఎవరో మరచిపోయిన విషయం గుర్తొచ్చింది. 'ఎవరై వుంటారబ్బా!'... బుర్ర గోక్కుని, జుట్టు పీక్కుంటూ బ్రష్షూ, పేస్టూ తీసుకున్నాను. నగ్మా చెల్లెలు టూత్ పేస్ట్ యాడ్ చేసి వుంటుందా? మీ టూత్ పేస్టులో ఉప్పుందా? ఉప్పు, కారం, నిమ్మకాయ రసం, గాడిద గుడ్డు... అన్నీ వున్నాయి... నగ్మా చెల్లెలే... ఎవరో గుర్తు రావడం లేదు...
పళ్లు తోముకుని హాల్లో వున్న సోఫాలో కూర్చున్నాను. కమ్మని కాఫీ ముక్కుపుటాల్ని తాకింది. తలతిప్పి చూశాను. వేడి వేడి కాఫీ కప్పుని చేతిలో పట్టుకుని నిలబడి వుంది నా శ్రీమతి ప్రశాంతి.
'నగ్మా చెల్లెల్నింకా మరచిపోలేదా?' అనే వేడి వేడి చూపు కూడా నన్ను తాకింది. ఆ చూపుని తప్పించుకుంటూ నేను కాఫీ అందుకున్నాను. నా ఆలోచనలు మళ్లీ నగ్మా చెల్లెలి దగ్గరకు వెళ్లిపోయాయి.
'నగ్మా చెల్లెలు టీ, కాఫీ యాడ్స్ ఏమైనా చేసి వుంటుందా?' 3 రోజెస్, తాజ్ మహల్, చక్ర గోల్డ్, బ్రూ... కాజల్, సూర్య... వీళ్లంతా కళ్ల ముందు కదిలారు... నగ్మా చెల్లెలు మాత్రం అందులో లేదు.
కాఫీ చప్పరిస్తూ యధాలాపంగా రిమోట్ ని చేతిలోకి తీసుకుని టీవీ ఆన్ చేశాను. 'కాజలు చెల్లివా, కరీనాకి అక్కవా?' అని ప్రశ్నిస్తున్నాడు రవితేజ. 'నగ్మా చెల్లివా, నీతూ చంద్ర అక్కవా?' అని రాయొచ్చుగా...
నా ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ "స్నానానికి నీళ్లు తోడాను. ఇంక టీవీ కట్టేసి స్నానం చేసి రండి" అంటూ వంటింట్లో నుండి అరచి మరీ చెప్పింది ప్రశాంతి.
'నా మాట విని కూడా కదలకపోయావో నీ తల వేయి వక్కలవుతుంది ' అనే సున్నితమైన బెదిరింపు వుంది ఆ మాటలో. టవలు తీసుకుని బాత్రూంకేసి మౌనంగా నడిచాను.
మా బాత్రూం తలుపుకి గడియ వున్నా పాటలు పాడ్డం నాకు అలవాటు. ఎందుకంటే, అక్కడ మనల్ని అడ్డుకునేవారెవరూ వుండరు కదా!
సబ్బుని ప్రేమగా చేతిలోకి తీసుకున్నాను. 'నా సౌందర్య రహస్యం లక్స్... ఇది ఫిక్స్...' నగ్మా చెల్లెలు సబ్బు యాడ్ ఏమైనా చేసి వుంటుందా? రెక్సోనా, హమాం, లైఫ్ బాయ్, ట్రిపుల్ ఎక్స్... ఎక్సెట్రా... ఐశ్వర్యా రాయ్ గుర్తొచ్చింది గానీ, నగ్మా చెల్లెలు మాత్రం మొహమాటానిక్కూడా మదిలో మెదలలేదు.
స్నానం కానిచ్చేసి పూజగదిలోకి చేరుకున్నాను. అగరొత్తులు, నూనె, దీపం, హారతి కర్పూరం... దేన్ని చూసినా నగ్మా చెల్లెలే నన్ను వెంటాడుతోంది. ఎలాగోలా గాయత్రీజపం, పూజ కానిచ్చేసి బయటకొచ్చాను. ప్యాంటూ, షర్టూ వేసుకుని హాల్లోకొచ్చాను. మా ఆవిడ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లో వేడి వేడి ఇడ్లీలు వడ్డించి రెడీగా నా కోసం ఎదురు చూస్తోంది. ఒక సాధారణమైన చూపుని ఇడ్లీల వైపు విసిరాను. కానీ, మాయావిడ ఆ చూపుని చిన్నచూపు చూసి అపార్థం చేసుకుంది.
"నగ్మా చెల్లెలు ఇడ్లీల యాడ్ చేయలేదు"
"నగ్మా ఎవరు, నగ్మా చెల్లెలు ఎవరు?" అంటూ ఎదురుదాడి చేశాను.
"అబ్బ ఛా... నేను మిమ్మల్ని ఈరోజు కొత్తగా చూడట్లేదు... నాకు చెప్పకండి కథలు..." అనేసింది ప్రశాంతి నవ్వేస్తూ...
"పోనీ, విషయం తెలుసు కదా! నగ్మా చెల్లెలు ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోవచ్చు కదా?" అన్నాను.
"అదంత కొంపలంటుకుపోయే విషయమేమీ కాదుగానీ... తమరు ఆఫీసుకు బయల్దేరండి, టైమైపోతోంది!"
నా అంతర్జాతీయ సమస్యను అంత తేలిగ్గా తీసుకుంది నా శ్రీమతి.
ఇక ఏమీ అనలేక టిఫిన్ బాక్సు తీసుకుని మళ్లీ మౌనంగా బయటకు నడిచాను.
టూ వీలర్ మీద ఆఫీసుకు బయల్దేరిన నాకు దారిలో ఎన్నో హోర్డింగులు కనిపించాయి. రోజూ కనిపించేవే అయినా ఇవాళ వాటిని కొత్తగా చూశాను, నగ్మా చెల్లెలు కనిపిస్తుందేమోనని...
ప్చ్... లాభం లేదు... ఎక్కడా కనిపించలేదు. ఎట్టిపరిస్థితుల్లోనైనా కనుక్కోలేనా అనే ఆలోచనతోనే ఎట్టకేలకు ఆఫీసుకు చేరుకున్నాను.
వెళ్లి నా సీటులో కూర్చున్నాను. ఓ రెణ్ణిమిషాలు గడిచాక ఆఫీస్ బాయ్ లక్ష్మణ్ మంచినీళ్లు, టీ తీసుకుని వచ్చాడు.
"ఒరే, నువు సినిమాలు బాగా చూస్తావా?" అని అడిగాను వాడిని.
"సల్మాన్ ఖాన్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం సార్" అని బదులిచ్చాడు.
"నగ్మా చెల్లెలు ఎవరో నీకు తెలుసా?"
లక్ష్మణ్ బుర్ర గోక్కుని "హిందీ సినిమాల్లో నటించిందా సార్? ఎందుకంటే, నేను తెలుసు సినిమాలు తక్కువగా చూస్తాను సార్!" అని అడిగాడు.
"ఒరే, ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడూ సమాధానం కాదురా!" అన్నాను.
వాడు మరోసారి బుర్ర గోక్కుని "గుర్తొస్తే చెప్తాన్లెండి సార్!" అంటూ అక్కడి నుండి తుర్రుమన్నాడు.
అంతలో నా కొలీగ్ జయంత్ అటువేపొచ్చాడు.
"జయంతుడూ, నీకు నగ్మా చెల్లెలు తెలుసా?" అంటూ ఆశగా అడిగాను.
"నగ్మాకి ఇద్దరు చెల్లెళ్లు కదన్నయ్యా, ఏ చెల్లెలి గురించి అడుగుతున్నారు మీరు?" అన్నాడు జయంతుడు.
హతోస్మి... వీడొకడు, కొత్త సమస్య తెచ్చిపెట్టాడు. ఇప్పుడు నేను నగ్మా చెల్లెలి గురించి ఆలోచించాలా, లేక నగ్మా చెల్లెళ్ల గురించి ఆలోచించాలా?
"సరే, ఓసారి ఇద్దరి పేర్లూ చెప్పరాదూ..." అన్నాను, నా సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో.
నా దురదృష్టంకొద్దీ సరిగ్గా అప్పుడే వాడి ఫోన్ మోగింది.
అప్పుడే కాదు, ఎప్పుడూ అంతే... సరిగ్గా సరైన సమయంలో వాడి ఫోన్ రింగవుతుంది. ఫోన్లో మాహాడుతూ అక్కడినుండి వెళ్లిపోయాడు. ఇక వాడిమీద ఆశలు వదలుకోవాల్సిందే... ఎందుకంటే. వాడు ఒకసారి మాయమైతే మళ్లీ ప్రత్యక్షమవడానికి ఎంత సమయం పడుతుందో వాడే చెప్పలేడు...
నా టేబుల్ మీదున్న మ్యాగజైన్స్ చేతిలోకి తీసుకుని తిరగేశాను, నగ్మా చెల్లెలు కనిపిస్తుందేమోనన్న ఆశతో... అక్కా కనిపించలేదు, చెల్లెలూ కనిపించలేదు.
మ్యాగజైన్స్ ని పక్కన పడేసి పనిలో పడ్డాను.
బాసుబాబు... నిజమే! బాసే... కానీ, హీరోబాబులా ఫీలైపోతూంటాడు. సిగ్గులేకండా విగ్గు పెట్టుకు తిరుగుతూంటాడు.
నన్ను పిలిచాడు. "పిలిచారా సర్?" వీలైనంత వినమ్రంగా అడిగాను.
"అవునోయ్... ఒక ఎన్నారై నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానంటున్నాడు. ఏంచేద్దాం?" దరిద్రుడు... డైరెక్టుగా పాయింటులోకి వచ్చాడు.
"భలేవారే... ఏంచేయడమేంటి సర్... బ్రహ్మాండంగా చేయండి. కాకపోతే, హీరోయిన్ ఎవరనుకుంటున్నారు సర్?" నగ్మా చెల్లెలి పేరు చెప్తాడేమోనని ఆశగా అడిగాను.
కాస్త ఆలోచించి "కొత్తమ్మాయి అయితేనే నా పక్కన ఫ్రెష్ గా వుంటుందని వాళ్లు ఫీలవుతున్నారోయ్!" అన్నాడు ముదురు బెండకాయ.
రెణ్ణిమిషాలాగి "నీ సలహా ఏంటి?" అన్నాడు.
"నగ్మా చెల్లెలైతే మీ పక్కన హీరోయిన్ గా బావుంటుందని నాకనిపిస్తోంది సర్!" అన్నాను.
పక్కలో బాంబు పడినట్టు ఉలిక్కిపడి "నగ్మా చెల్లెలా? ఏంటయ్యా బాబూ... నువ్వేదో యూత్ సలహా ఇస్తావనుకుంటే ఇలాంటి సలహా ఇస్తున్నావేంటయ్యా?" అన్నాడు మానవుడు.
వీడో సూపర్ హీరో... వీడి పక్కన నటించడానికో అందాలరాశి కావాలి...
ఓ పది నిమిషాలు సొల్లు కబుర్లు మాట్టాడాడు గానీ, నాకు కావలసిన నగ్మా చెల్లెలి పేరు మాత్రం అందులో బయటపడలేదు. చిరాకెత్తుకొచ్చి బయటకొచ్చేశాను.
అలా అలా పనిపనిలో పడి నగ్మా చెల్లెలికి విరామం ఇచ్చాను.
"ఏవండీ గోపీకృష్ణగారూ! ఇంటికెళ్లరా?" అన్న మూర్తిగారి మాటతో ఠక్కున ఈ ప్రపంచంలోకి వచ్చిపడ్డాను. టిఫిన్ బాక్సు తీసుకుని ఇంటికి బయలుదేరాను.
ఇంతకీ నగ్మా చెల్లెలు ఎవరై వుంటారు? బైకు నడుపుతున్నానన్న మాటేగానీ నా బుర్రలో అదే తిరుగుతోంది.
ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాను. బయట చెప్పులు విప్పేసి లోపలికి అడుగుపెట్టాను.
నా శ్రీమతి ప్రశాంతి తులసికోట దగ్గర జ్యోతి వెలిగిస్తూ కనిపించింది. నా శ్రీమతి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దేవుడి దగ్గర జ్యోతి వెలిగించకుండా వుండదు. అలా జ్యోతి వెలిగించడంవల్ల తనకు మనశ్శాంతిగా కూడా వుంటుందని అంటుంది ప్రశాంతి. జ్యోతి... జ్యోతి... జ్యోతిక... హుర్రే... నగ్మా చెల్లెలి పేరు జ్యోతిక... సాధించాను... సాధించానోచ్... "జ్యోతికా... ఐ లవ్ యూ!" అని పెద్దగా అరుస్తూ నాకు తెలీని భరతనాట్యం, కథాకళి మొదలైన డ్యాన్సులన్నీ కలిపి స్టెప్పులేయడం మొదలెట్టాను.
ప్రశాంతి పరిగెత్తుకొచ్చి "ఏంటండీ... మీ సమస్య పరిష్కారమైందా?" అంది ఆనందంగా.
"అవునోయ్!" అని అంటూ యధాలాపంగా మా పక్కన అపార్ట్ మెంటువైపు చూశాను. సరిగ్గా మా ఇంటికి ఎదురుగా కనిపించే ఫ్లాట్ బాల్కనీలో నుండి ఒకావిడ ఖోపంగా చూస్తూ విసవిసా లోపలికి వెళ్లిపోయింది.
"ఆవిడేవిటోయ్... అలా నన్ను ఖోపంగా చూస్తూ వెళ్లిపోయింది?" అని అడిగాను ప్రశాంతిని.
"ఆవిడ పేరు జ్యోతిక అండీ!" చల్లగా చెప్పింది శ్రీమతి.
"హయ్యోరామా, ఆ విషయం నాకేం తెలుసు? పోనీ వెళ్లి సారీ చెప్పిరానా?" అన్నాను ఖంగుతిని.
"చేసిన ఘనకార్యం చాలు! నేను మీ వ్యాధి గురించి చెప్పి వస్తాను" అంటూ వాళ్లింటివేపు వెళ్లింది ప్రశాంతి.
నేను బట్టలు మార్చుకుని సోఫాలో కూర్చున్నాను. హమ్మయ్య... ఓ పనైపోయింది. నగ్మా చెల్లెలెవరో నాకు తెలిసిపోయింది. రిమోట్ చేతిలోకి తీసుకుని టీవీ ఆన్ చేశాను. మా ఆవిడ అప్పటివరకూ పాత జ్ఞాపకాలను నెమరేసుకుందేమో, మా ఫోటో ఆల్బం చూస్తూ... దాన్ని చేతిలోకి తీసుకున్నాను. మా ఆవిడ ఆకుపచ్చ చీరలో తీయించుకున్న ఫోటో నా కంటబడింది. ఆ ఫోటో అంటే నాకంటే ఎంతిష్టమో... ఆ ఫోటోలో నా ప్రశాంతి ఎంతో అందంగా వుంటుంది. అన్నవరమో, ద్వారకా తిరుమలో వెళ్లినప్పుడు తీసుకున్న ఫోటో అది. అన్నవరమా... కాదనుకుంటాను. ద్వారకా తిరుమల వెళ్లక ముందే ప్రశాంతి ఈ చీర కొనుక్కుందా? లేదనుకుంటానే... అన్నవరమా, ద్వారకా తిరుమలా? గుర్తు రావడం లేదే...