సన్ స్ట్రోకు - మోపూరు రామశేషు

son stroke by mopuru Ramasheshu

ల్లం ఆదిశేషు పెద్ద పేరున్న నిర్మాత. ప్రొడక్షన్ బాయ్ గా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా ప్రొడ్యూసర్ గా అంచెలంచెలుగా ఎదిగాడు. పెద్ద పెద్ద హీరోలతో సిన్మాలు చేసాడు.

అల్లం ఆదిశేషు బీయం డబ్ల్యూ కారులో జుబ్లీ చెక్ పోస్టు దాటుకుని వెళుతున్నాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి వెనక ట్రాఫిక్ పోలీసులు ఆదిశేషు కారుని ఫాలో అవుతున్నట్లు అనిపించి కారు ఆపాడు. పోలీసులు ఆదిశేషుని చుట్టు ముట్టి "స్సార్! మీ కారులో ఏదో వింత జంతువు వున్నట్లు స్థానికులు గుర్తించారు. ఒకసారి మీ కారులో చెక్ చెయ్యాలి" వినమ్రంగా చెప్పాడు ట్రాఫిక్ ఎస్సై.

" కారులో మా అబ్బాయి తప్ప ఎవ్వరూ లేరు. ఎవరిని చూసి ఎవరో అని పొరపడినట్లున్నారు" చెప్పాడు ఆదిశేషు జేబులో నుండి త్రిబుల్ ఫైవ్ సిగరెట్ తీసి, కారు లోపల తల పెట్టి వెతుకుతున్న ట్రాఫిక్ ఎస్సై కెవ్వుమని అరిచాడు. "ఇదే సార్... ఆ జంతువు" వేలు పెట్టి చూపించాడు. గుప్పుమని సిగరెట్ పొగ వదులుతున్న అల్లం ఆదిశేషు కంగారుగా " ఏయ్! ఏమనుకుంటున్నారు. వాడు మా అబ్బాయి.." అన్నాడు. "సారీ! సార్" చెప్పాడు ట్రాఫిక్ ఎస్సై.సౌత్ ఆఫ్రికా నుండి పారిపోయి వచ్చిన చింపాంజీకి సూటు బూటు వేస్తే ఎలా వుంటుందో అలాంటి ఆకారం ఒకటి కారు దిగింది "నాన్నా" అంటూ. "ఏమీ లేదు! నాన్న నిన్నొక సారి చూడాలని ఎస్సై గారు అంటే చూపిస్తున్నా... నువ్వు ఎక్కు నాన్న..." అంటూ ఆదిశేషు ఎస్సై వంక చూసాడు, ఇక కదలమన్నట్లు. ఎస్సై వెళ్ళిపోయాడు. ఆదిశేషు కూడా బయల్ధేరాడు.

డాన్స్ మాస్టర్ నీలం "ఒన్ టూ, ఒన్ టూ, ఒన్ టూ" అంటూ అరుస్తుంది. ఆమె అరిచినప్పుడల్లా హీరో అవినాష్ బాబు శరీరాన్ని క్రిందకి పైకి, పైకి క్రిందకు పూనకం వచ్చిన వాడల్లా కదిలిస్తున్నాడు.
దర్శకుడు చంద్రమౌళి 'మానిటర్' లో హీరో మూవ్ మెంట్స్ చూస్తున్నాడు. వరుసగా నాలుగు బాక్సాఫీస్ హిట్లు ఇచ్చి ఊపుమీదున్నాడు చంద్రమౌళి.

అల్లం ఆదిశేషు కారు చంద్రమౌళి వున్న సెట్లోకి వచ్చింది. ఆదిశేషు కారుని చూసిన చంద్రమౌళి అసిస్టెంట్ ని పిలిచి నెక్ట్స్ షాట్ కి రెడీ చెయ్యమని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఆదిశేషు అవినాష్ బాబుని విష్ చేసి చంద్రమౌళి వున్న రూమ్ లో కెళ్ళాడు. " మా అబ్బాయితో సిన్మా తీయాలనుకుంటున్నాను. మీరే దర్శకులు" చెప్పాడు ఆదిశేషు.

చంద్రమౌళి కంగారుగా ఆదిశేషుని చూసి నా నెక్ట్స్ పిక్చర్ ఒక పెద్ద హీరోతో వుంది. అయినా క్రొత్త వాళ్ళతో ప్రయోగాలు చెయ్యలేను" కూల్ గా చెప్పాడు చంద్రమౌళి. ఆదిశేషు ఒకలా నవ్వి జేబులో నుండి చెక్ బుక్ తీసి మీ రేటు ఐదు కోట్లు, కానీ నేను ఫ్యాన్సీ రేటు ఇస్తా, పది కోట్లు తీస్కోండి. అడ్వాన్సు క్రింద ఈ ఒక కోటి వుంచండి" అంటూ చెక్ మీద సైన్ చేసి ఇచ్చాడు. చంద్రమౌళి ఇష్టం లేనట్టు మొహం పెట్టి, బలవంతాన తీసుకుంటున్నట్లు చెక్ లోపల పెట్టుకున్నాడు.

చంద్రమౌళి షూటింగ్ చేస్తున్న సెట్లో కలకలం వినిపించి కంగారుగా చంద్రమౌళి రూమ్ నుండి బయటకు వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు ఆయాసంతో రొప్పుతూ "స్సార్! జూ నుండి జంతువు ఒకటి తప్పించుకుని మన సెట్లోకి వచ్చింది. దానిని చూసి మనవాళ్ళు తలా ఒక దిక్కుకు పారిపోయారు" చెప్పాడు.

" రేయ్... ఆగండి... అది జంతువు కాదురా, మా అబ్బాయి. రేపో మాపో వాడిని హీరోగా లాంచ్ చెయ్యబోతున్నాను" కోపంతో చెప్పాడు ఆదిశేషు.

చంద్రమౌళి నిర్ఘాంతపోయి " అంటే నేను డైరక్షన్ చెయ్యాల్సిన హీరో ఇతనేనా?" అడిగాడు.

" అవును. చెప్పాపెట్టకుండా ఉగాండా నుంచి పారిపోయిన చింపాంజీలా వున్న వీడిని డైరక్టు ఎలా చెయ్యాలా? అని ఆలోచిస్తున్నారా? అందుకేగా మీ రెమ్యునరేషన్ రెండింతలు ఇచ్చింది" చెప్పాడు ఆదిశేషు.

చంద్రమౌళి మౌనంగా వున్నాడు. " చింపాంజీలా వున్న వీడిని స్పాంజీలా మార్చి ఒక నెల లో మీకు కనపడతా మంచి కధతో రడీగా వుండండి." అంటూ ఆదిశేషు చంద్రమౌళి కి షేక్ హ్యాండిచ్చి, కొడుకుతో సహా కారు ఎక్కాడు.

వీరేశం అదేదో పార్టీలో కార్యకర్త స్థాయి నుండి, కార్పొరేటర్ గా, జడ్పీ చైర్మన్ గా యం. ఎల్. ఏ గా, మంత్రిగా ఎదిగాడు. అల్లం ఆదిశేషుకి మంచి మిత్రుడు. ' ఆదిశేషు తీసే సిన్మాలకు మంత్రిగారు బినామీ అని కొంతమంది చెవులు కొరుక్కుంటారు కూడా.

" మొత్తానికి నీ కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నావన్న మాట" గొంతులోకి వెచ్చగా ఫారీన్ విస్కీ దిగుతుంటే మాటలు ముద్ద ముద్దగా వస్తున్నాయి వీరేశానికి.

" అవును. మరి నీ కొడుకు రాజకీయ ఆరంగ్రేటం ఎప్పుడు" అడిగాడు ఆదిశేషు నాటుకోడి లెగ్ పీసు తింటూ... కొడుకు గూర్చి గుర్తు చెయ్యగానే అసహనంగా తల విదిలించాడు వీరేశం.

" ఏం చెప్పమంటావు. వాడు నా పేరు చెప్పుకుని లాండ్ కబ్జాలు చేస్తున్నాడు. మొన్నే ఏదో కంపెనీ పెట్టుకుంటానంటే రూల్స్ కి వ్యతిరేకంగా ఒక జీవోని తయారుచేసి సంతకం పెట్టాను. ప్రతిపక్షాలన్నీ అసెంబ్లీలో నామీద దాడి చేసాయి. చెయ్యకపోతే మా వాడు దాడి చేస్తాడు. వీడు ఏదో ఒకరోజు నా కొంప ముంచేస్తాడని భయంగా వుందోయ్" వీరేశం బావురు మన్నాడు.

మనం ఏం చేసినా వారసుల కోసమే కదా! రేపు ఎలక్షన్లో మీ వాడిని ఎం. పీ గా నిలబెట్టు. వాడే నిదానంగా మారతాడు. మర్చిపోకు రేపు ఉదయం పది గంటలకి మా వాడి సినిమా ప్రారంభం. నువ్వు క్లాప్ కొట్టాలి" అంటూ పైకి లేచి తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు ఆదిశేషు. " అలాగే వస్తా! నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు" చెప్పాడు వీరేశం.

అన్నపూర్ణ స్టూడియోలో అతిరధ మహారధుల సమక్షంలో అత్యంత గ్రాండ్ గా ఆదిశేషు కొడుకు సినిమా ప్రారంభం అయ్యింది.

ఆల్ ఇండియాలో బెస్ట్ టెక్నీషియన్స్ ని ఈ సినిమాలో పెట్టుకున్నాడు ఆదిశేషు. హీరోయిన్ ని మాత్రం ఇంకా సెలక్టు చెయ్యలేదు.

ఆదిశేషు ఏదో పేరు చెప్పాడు. " పాల మీగడ లాంటి ఆ అమ్మాయి ప్రక్కన చెరకు గడ లాంటి మీ వాడు నప్పడేమో" అన్నాడు చంద్రమౌళి. కాని ఆదిశేషు వినలేదు. కోటి రూపాయల ఇచ్చి తను అనుకున్న హీరోయిన్ ని పెట్టుకున్నాడు. సిన్మా అంతా యూరప్ లో తీసారు.

ఆరునెలల్లో సిన్మా కంప్లీట్ అయ్యింది. దాదాపు నలభై కోట్లు పైన ఖర్చుపెట్టేసాడు. ఆడియో ఫంక్షను భారీ ఎత్తున చేసాడు. ఎక్కడెక్కడి జనాల్ని రప్పించాడు. సిన్మా రిలీజు డేటు దగ్గరి కొచ్చింది. కాని సినిమాని కొనడానికి ఒక్కరూ ముందుకు రాకపోవడంతో తనే స్వంతంగా రిలీజ్ చేస్కున్నాడు ఆదిశేషు. సినిమా భారీ ప్లాప్. అప్పుల క్రింద ఆదిశేషు ఇంటిని, స్థలాలను తీసేసుకున్నారు అప్పుల వాళ్ళు.

ఎలక్షన్లు వచ్చాయి. వీరేశం ఓడిపోయాడు. అధికారంలో వున్నప్పుడు చేసిన జీవోలన్నీ మెడకు చుట్టుకున్నాయి. సి. బి. ఐ వాళ్ళు విచారణకని తీసికెళ్ళి అరెస్టు చేసారు.

వీరేశం చంచల్ గూడ జైల్లో వున్నాడు. పుత్రప్రేమ వాళ్ళని ఈ పరిస్థితికి తెచ్చింది. అబిడ్స్ లో ' అల్లం మురబ్బా' అమ్ముకుంటున్నాడు ఆదిశేషు. బియం డబ్ల్యూ కారులో తిరిగిన ఆదిశేషు ఇప్పుడు బియ్యానికి డబ్బుల్లేవు అంటూ చేయి చాస్తున్నాడు. ఆదిశేషు కొడుకు మాత్రం తనో హీరో అనుకుని అన్ని స్టూడియో గేట్లు ముందు తచ్చాడుతున్నాడు అవకాశాల కోసం.

వడదెబ్బ తగిలినోడు కోలుకుంటాడేమో గాని, కొడుకు దెబ్బ ( సన్ స్ట్రోక్ ) తగిలినోడు కోలుకోలేడు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు