ఉదయాన్నేఅస్పష్టమైన నిద్రలో నా చేతులు హిమ కోసం వెతికాయి. వెచ్చని హిమ శరీరం కాకుండా మెత్తని దిండు తగిలింది.ఒక్కసారిగా హిమను రాత్రే బెంగుళూరు ట్రయిన్ఎక్కించింది గుర్తొచ్చింది. తన రీసర్చ్ లో భాగంగా కొన్నిహోటళ్ళు ఎన్నుకుని వాటిపై సర్వే కోసం వెళ్ళింది. హిమ లేకపోవడం చాలా వెలితిగా అనిపించింది. కానీ హిమకు నేనున్నప్పుడు నేను, పుస్తకం ముందున్నప్పుడు పుస్తకం సర్వస్వం . తను చదువుకుంటున్నప్పుడు ఎంత ముద్దుగా అనిపించినా వెళ్లి అలా ఆమె బుగ్గను తాకడానికి కూడా నాకు భయం వేస్తుంది ...ఆమె ఏకాగ్రతను భంగం కలిగించిన క్షణం లో ఆమె చూపుల్లోని వాడి, వేడి నన్ను తాకుతాయి. నాకు నవ్వొచ్చింది ...ఎంత అమాయకంగా ..స్పష్టంగా..సున్నితంగా వుండే హిమ.. అమ్మో... కోపం లో జ్వాలే! వడ్డెర చండి దాస్ హిమజ్వాల చదివి వాళ్ళ నాన్న హిమ అని పేరు పెట్టారట , జ్వాలని వదిలేసారు కానీ..నాకు మాత్రం నాణానికి మరో వైపు వున్నజ్వాల చాలా సార్లు కనపడింది. మండి, మసి అయిపోకుండా నన్ను నేను కాపాడుకుంటూ, ఆమె చదువు తపస్సుకు భంగం వాటిల్లకుండా ఆమె కటాక్ష వీక్షణం కోసం ఎదురు చూస్తున్నాను.
చీరే కట్టుకోకపోతే ఇంక మల్లెలు, జాజులు లేవు, గాజుల గలగలలు లేవు ..కనీసం మెడలో ఒక చిన్నచైను అయినా వేసుకోమని వాళ్ళ అమ్మగారు ,మా అమ్మగారు చెబితే వాళ్ళుండగా వేసుకుని వాళ్ళు వెళ్ళగానే తీసి పడేస్తుంది. చివరకి బొట్టు పెట్టించడానికి కూడా నాకు చాతకాలా..! ఇంకేదయినా చెప్పబోతే, "అందంగా లేనా, అసలేం బాలేనా !" అంటూ గోదావరి లో పాట మొదలెడుతుంది. తను ఏది వేసుకున్నా అందంగా వుంటుంది అది వేరే సంగతి కానీ ...హిమను ఇలా చూసి నా ఊహల్లోని భారతీయ స్త్రీ నమూనా మెల్లిగా చెదిరి పోతోంది. ఇంకెంతకాలం లే తను థీసిస్ సబ్మిట్ చేసాక కొంత కాలం జాబ్ కి వెళ్లనని నా బిజినెస్స్ కూడా నేను ప్రక్కన పెట్టితే శృంగార లోకంలో విహరిద్దామనే హిమ వాగ్దానం తలచుకుని ఊరట పొందా ! అడ్డం చెప్పని ఫోటో పై తమకంగా ముద్దు పెట్టుకున్నా. రాత్రి హిమ గోముగా మిస్ యూ డార్లింగ్ అంటూ పెనవేసుకున్నది గుర్తొచ్చి మనసు గాలిలో తేలిపోయింది. మౌనంగా ..మహా ఏకాగ్రతతో చదివే ఆ కళ్ళు ఎంత అల్లరిగా నవ్వుతాయి నన్నుదగ్గరగా తీసుకున్నప్పుడు ! ఎప్పుడూ లాప్ టాప్ కీ పాడ్ పై ఆడే ఆ వేళ్ళు నా సమక్షం లోకి రాగానే ఎంత చురుగ్గా నా జుట్టుతో ఆడతాయి ..! పెదాలు బిగించి ఎలా నన్ను కవ్విస్తుంది ! ఫోటోని వున్న చోటే పెట్టేసి ..తల విదిలించి షూస్ వేసుకుని వాకింగ్ కి బయలు దేరా !
నవ్వాడు ఇబ్బందిగా ..తర్వాత ఏదో చెప్పాలని ప్రయత్నించాడు ..కానీ మానుకున్నాడు.
నేనుకదల బోతుంటే "సర్ " అన్నాడు … ఏంటి అన్నట్లు చూశా!
"సర్ …రాత్రి డ్యూటి అయి ఇంటికి వెళ్ళే టప్పటికి తెల్లారుతుంది, ..అందరూ పనుల్లో వుంటారు మా ఇల్లు చిన్నది, కనీసం నా భార్యతొ మాట్లాడడానికి కూడా కష్టంగా వుంది ..కొన్ని రోజులు నాకు పగలు డ్యూటి, కొన్నిరోజులు రాత్రి డ్యూటి వేయమని అడుగుతారా …సారీ సర్ నా భార్య చాలా బాధపడుతోంది అందుకే …" ఆపాడు ఆలోచనలలో పడ్డ నన్నుచూసి.
"ఆలోచిస్తాలే.. ప్రయత్నం చేద్దాం .. కనుక్కుని ఫోన్ చేస్తాలే" అన్నా.
హిమ ఫోన్ చేసింది “హాయ్ డార్లింగ్ ! ఏం చేస్తున్నావ్? ఎంతకు చేరావు... ప్రయాణం ఎలాఉండింది ?" అడిగా.
"ఇట్ వాస్ గుడ్, నో ప్రాబ్లం , వాక్ కి వెళ్ళావా ?"
"ఆ... శేఖర్ తో మాట్లాడుతున్నా ..నైట్ డ్యూటి వలన ఇబ్బంది పడుతున్నాడు ... పాపం వుమ్మడి కుటుంబంలో పగలు ఏకాంతం ఎలా దొరుకుతుంది ? మాట్లాడడానికి కూడా కుదరదేమో, అందుకని పగలు షిఫ్ట్ వేయించమని అడిగాడు, చూస్తానని చెప్పాను, కానీ వుద్యోగం అడిగాం, మళ్ళి ఈ ఫేవర్ అడగాలంటే డెలికేట్ గా వుంది."
"సరే, థింక్ అబవుట్ ఇట్ .. హావ్ టు గొ.... ఉండనా !"
"అప్పుడేనా …!కాసేపు మాట్లాడు .."
"సారీ డాళింగ్ కాసేపయ్యాక చేస్తాలే ఆన్ ది వే టు హోటల్, ఓకే నా... !"
"ఓకే" నీరసంగా అన్నా.
ఇంటికొచ్చి నా ముంబై ప్రయాణం కు బట్టలు సర్దుకున్నా, స్నానం చేసి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాల్సిన సమయం చెక్ చేసుకున్నా ..
లోకంలో ఎన్నో సమస్యలు, కలిసివున్నా హిమ పూర్తి సమయం నాకివ్వలేదని నా బాధ, అసలు భార్యతొ మాట్లాడేందుకు కూడా అవకాశం లేని జీవితం శేఖర్ ది .ఎందుకో శేఖర్ సమస్య కు పరిష్కారం నేనే ఇవ్వగలనేమో. అతనికి ఆనందాన్ని ఇవ్వడంలో నాకూ ఆనందం వుందనిపిస్తుంది. సుఖం వేరే, ఆనందం వేరే ..ఆనందం యొక్క వ్రేళ్ళు ఎక్కడినుండి మొదల వుతాయి? నా మెదడు చురుగ్గా పని చేసింది. శేఖర్ కు పగలు డ్యూటీ మార్పుకై అడుగు దామని సెక్రటరి నంబర్ బ్రవుస్ చేశా , అంతలోనే ఏదో ఆలోచన మెరిసింది .మంచి ఆలోచన చేసినందుకు నాపై నాకే ఇష్టం అయింది...మళ్ళి అమ్మో ..! అందాల రాక్షషి కి చెప్పకుండానా! వెంటనే హిమకు ఫోన్ చేశా! నా ఆలోచన చెప్పాను .
"దట్స్ గ్రేట్, అలాగే చెయ్యి" అంది .
శేఖర్ కి ఫోన్ చేశా...అప్పటికే ఇంటికి వెళ్లి పోయాడు ...విషయం చెప్పా! నా ఫ్లైట్ టైం లోపల శేఖర్ తన భార్యను తీసుకొచ్చాడు. హిమ పది రోజులు రాదు, నేను పది రోజులు దాకా ముంబై లో ఉంటా ...ఈ పదిరోజులు నా ఇల్లు శేఖర్ కి ఇస్తే, వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా దగ్గరితనాన్ని అనుభవిస్తారు, ఇది వాళ్ళ దాంపత్య జీవితానికి ..ట్రయినింగ్ పీరియడ్ లా వుంటుంది. నా కున్న మూడు బెడ్ రూముల్లో గెస్ట్ రూం ని వాడుకోమని చెప్పా ..వంటకు కావాల్సిన వన్నీ వున్నాయి ఇంక ఏవైనా అవసరమైతే కావలసినవి కొనుక్కోవడానికి కొంత డబ్బు ఇచ్చాను. "సంతోషంగా వుండండి .. " సెలవు తీసుకుంటూ అన్నా. శేఖర్, అతని నవవధువు కళ్ళలో మెరుపుతొ పాటు ఆనందం, కృతజ్ఞత నాకు కనిపించాయి. ఆకాశంలోకి ఎగిసిన విమానం తొ పాటు నా మనసుకూడా నీలిమబ్బులపై సంతోషంగా తేలియాడింది. ఇచ్చుటలో వున్న హాయి ఎంత గొప్పదో .... అనుభవించా !