జీవిత సత్యం - నారంశెట్టి ఉమామహేశ్వరరావు,

jeevana satyam

శ్రీహరిపురంలో ఉండే మంగయ్య తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన పొలం దున్నుకుంటూ బ్రతికేవాడు. కానీ తన కొడుకులిద్దరినీ బాగా చదివించాడు. పెద్దకొడుకు పున్నయ్య, చిన్నకొడుకు చెల్లయ్యలు చదువులో బాగా రాణించారు. చదువులు పూర్తి చేసిన తరువాత ఉపాధి కోసం ఉద్యోగ ప్రయత్నంలో పడ్డారు.

ఒకసారి రాజుగారి కోశాగారంలో ఏర్పడిన గణికుడి ఉద్యోగ భర్తీకి జరిగిన పరీక్షలకి పున్నయ్య హాజరయ్యాడు. అక్కడ తన ప్రతిభని మెరుగ్గా ప్రదర్శించినప్పటికీ ఎంపిక చెయ్యలేదు రాజోద్యోగులు. తన బంధువుని ఆ ఖాళీలో నియమించమని సైన్యాధికారి సిఫార్సు చెయ్యడo వల్ల రాజోద్యోగులు అతనికి అనుకూలంగా ప్రవర్తించారు.మరొకసారి భీమవరం జమిందారు గారి ఖజానాలో చెల్లింపులు జరిపే ఉద్యోగానికి ప్రయత్నించాడు పున్నయ్య. కొందరు ముఖ్య అధికారులు ప్రతిభకి విలువ ఇవ్వకుండా కానుకలు తీసుకుని పున్నయ్యకంటే దిగువున ఉన్న వ్యక్తిని నియమించారు. అలా మూడు నాలుగుసార్లు జరిగేసరికి పున్నయ్యలో నిరుత్సాహం పెరిగింది. తన ప్రతిభ చూసి ఎవరూ ఉద్యోగం ఇవ్వరని అనుకున్నాడు. పలుకుబడి లేకపోయినా, లంచం ఇవ్వకపోయినా ఉద్యోగం రాదని తెలుసుకున్నాడు. తన తండ్రి అవేవీ చెయ్యలేడు కాబట్టి తాను ఉద్యోగం పొందలేనని అనుకోవడం మొదలుపెట్టాడు.

కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మంగయ్య గబగబా ఇంటికి వచ్చి పున్నయ్యని పిలిచాడు.“సైన్యంలో చేరడానికి ఆసక్తి, అర్హతలు ఉన్నవాళ్ళని రమ్మని రాజుగారు దండోరా వేయించారు. నువ్వు వెళితే తప్పకుండా నీకు అవకాశం వస్తుంది” అన్నాడు మంగయ్య. దానికి పున్నయ్య ‘అక్కడ ఎంపిక ఏ పద్ధతిలో జరుగుతుందో బాగా తెలుసు. నేను వెళ్ళను. నన్ను బలవంత పెట్టవద్దు” అన్నాడు నిరాశగా. అప్పటి నుంచి మరొక ఉద్యోగ ప్రయత్నం చెయ్యడం మానేశాడు.

ఇక మంగయ్య రెండవ కొడుకు చెల్లయ్య సంగతికి వస్తే అతడిది ఇందుకు పూర్తిగా విరుద్ధం. నగరంలోని భాగ్యవంతుడి బంగారు నగల దుకాణంలో ఖాతాలు సరిచూసే ఉద్యోగానికి నియమిస్తామని కబురు వచ్చినా వెళ్ళలేదు. అలాంటి చిన్నపనులు చెయ్యనన్నాడు చెల్లయ్య.పట్టణంలో ఉన్న మంగయ్య మిత్రుడు దేముడయ్య నుండి మరొక కబురు వచ్చింది చెల్లయ్యకి. తమ చెరుకు మిల్లులో ఖాళీగా ఉన్న పర్యవేక్షకుడి ఉద్యోగంలో చేరడానికి వెంటనే రమ్మనమని సారంశం. అయినా వెళ్ళలేదు చెల్లయ్య.

“నేను చిన్నచిన్న ఉద్యోగాలలో చేరను. రాజాస్థానంలో తగిన ప్రాతినిధ్యం ఉన్న పదవి వస్తే చేరాతాను. నేను విద్య నేర్చుకున్న గురుకులంలో అందరి కంటే ప్రతిభావంతుడిని. నాకు రాజాస్థానంలో మంచిపదవి వస్తుందని గురువుగారు ఎప్పుడో చెప్పారు. ఒక జ్యోతిష్కుడు కూడా నా జాతకం చూసి గొప్ప స్థితికి వెళతానని చెప్పాడు. ఇలాంటి వాటిలో చేరితే ఆ అవకాశం తప్పిపోతుంది” అనేవాడు.

కొడుకులిద్దరి ప్రవర్తనతో మంగయ్యకి విసుగు వచ్చింది. ఒకడు జరిగిoది తలచుకుని బాధపడుతుoటే ఇంకొకడు జరగబోయేది ఊహిస్తూ కలలు కంటున్నాడు. దాంతో మనశ్శాంతి కోసం గుడికి వెళ్ళడం ప్రారంభించాడు. తన ఇద్దరి కొడుకులకు మంచి బుద్ధిని ప్రసాదించమని దేవుడిని మొక్కడం ప్రారంభించాడు.

ఒకరోజు భక్తుల సoఖ్య తక్కువ ఉండడంతో మంగయ్యని పలకరించాడు పూజారి. అతడు పంచాంగం చూసి ముహూర్తాలు పెట్టడం , జాతక సమస్యలకు పూజలు చేయించడం కూడా చేస్తాడు. “ నీలో మునుపటి హుషారు కనిపించడం లేదు. దేనికో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. నీ సమస్య దేముడితో చెప్పినప్పటికీ నాతో కూడా చెబితే పరిష్కారం దొరుకుతుందేమో ఆలోచిస్తాను” అన్నాడు.

దానికి మంగయ్య తన కొడుకుల ప్రవర్తన చెప్పి దానికి పరిష్కారం కోరాడు. అది విన్న పూజారి “ మీ ఇంట్లో ఒక వ్రతం చేద్దాము. దాoతో మీ ఇంట్లో శాంతి కలుగుతుంది. నేను వచ్చినప్పుడే నీ కొడుకులతో మాట్లాడి పరిష్కారం చెబుతాను” అన్నాడు.

మంగయ్య ఇంటికి వెళ్ళి “గుడిలో అర్చకుడు నా జాతకం చూసి, మన కొడుకులకి ఉద్యోగం రాకపోవడానికి నా జాతకంలో ఉన్న చిన్న లోపమే కారణమని చెప్పారు. దైవశాoతి కోసం వ్రతం చెయ్యమన్నారు.” అన్నాడు.

మంగయ్య మాటలు వినగానే కొడుకుల ముఖాల్లో కళ వచ్చింది. అలాగే చేయించమన్నారు.

అనుకున్న రోజునాడు శాస్త్రోక్తంగా వ్రతం జరిపించాడు పూజారి. మంగయ్య కుటుంబసభ్యులకు ప్రసాదo, అక్షoతలు ఇచ్చి “మీ ఇంటిని పట్టి పీడిస్తున్న గ్రహాలన్నీ పారిపోయాయి. మీకు దైవానుగ్రహం కలిగింది” అన్నాడు.

అక్కడే ఉన్న పున్నయ్యతో “ఈ వ్రతంతో మీ ఇంటికి పట్టిన గ్రహలన్నీ పోయాయి. నీకు ఉద్యోగం వస్తుంది. ప్రయత్నం మొదలుపెట్టు ” అన్నాడు. పున్నయ్య మోహంలో ఆనందం, ఆత్మవిశ్వాసం కనిపించాయి.

తరువాత చెల్లయ్య వైపు తిరిగి “తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి మానవుడు. చిన్నపని పెద్దపని అని తేడాలు ఉండవు. చేస్తున్న పనినే దైవంగా భావిoచి ప్రయత్నం చేస్తే పెద్దస్థాయికి అంచెలంచెలుగా చేరుకుంటావు. నేరుగా పెద్దస్థాయి కలగాలనుకునే భావన నుండి బయటకు వచ్చెయ్యి. వచ్చిన అవకాశం వదలకుండా వెంటనే ఏదో ఒక పనిలో చేరు. ఆ అవకాశాన్ని ఒక నిచ్చెనగా వాడుకో. తెలివైనవాడు అలాగే చేస్తాడు. నీవు కూడా గురువులు మెచ్చిన తెలివైనవాడివి కదా” అని చెప్పాడు. ఆ మాటలకు చెల్లయ్యలో కూడా చలనం వచ్చింది.

రెట్టించిన ఉత్సాహం తెచ్చుకుని కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు చెల్లయ్య, పున్నయ్యలు. అతికొద్దికాలంలో స్థిరపడ్డారు వాళ్ళు.అందుకు సంతోషించిన మంగయ్య కొన్ని కానుకలు పట్టుకుని గుడికి వెళ్లి పూజారిని కలిసాడు. ‘మీరు వ్రతం చేయక పోయినట్లయితే నా కొడుకులు ఇప్పటికీ స్థిరపడక పోయేవారు” అని మెచ్చుకున్నాడు.

దానికి పూజారి “ఇందులో నా గొప్పతనమేమీ లేదు. నీ కొడుకులు చేస్తున్న పొరపాటు సరిదిద్దాను. గడిచిపోయిన దాని గురించి ఊరకనే ఆలోచిస్తూ కూర్చుంటున్న మీ పెద్దకొడుకు పున్నయ్యకు పాతవిషయాలు మరిచిపోయి మరొక ప్రయత్నం చెయ్యమని చెప్పాను. అలాగే జరగబోయే దాని గురించి ఆశాసౌధాలు కడుతూ కూర్చుంటున్న మీ చిన్నకొడుకు చెల్లయ్యకి గాలిలో మేడలు కట్టకుండా తనకి వచ్చిన అవకాశం వినియోగించమని, అవకాశాలు అదేపనిగా రావనీ, వచ్చినప్పుడే వాడుకొమ్మని సూచించాను. విచక్షనాజ్ఞానం ఉన్నవాడు వర్తమానంలో నివసిస్తూ ఎప్పుడు చెయ్యాల్సిన పనులను అప్పుడే చేస్తాడని జీవిత సత్యం బోధించాను. అయితే మామూలుగా చెబితే నమ్మరు కాబట్టి వ్రతం అడ్డుపెట్టుకున్నాను” అన్నాడు నవ్వుతూ పూజారి. మంగయ్య పూజారి యుక్తికి మెచ్చుకున్నాడు.

మరిన్ని కథలు

Oddika
ఒద్దిక .
- Aduri.HYmavathi.
Maro konam
మరో కోణం
- గాయత్రి
Snanam
స్నానం
- మద్దూరి నరసింహమూర్తి
Swaadheenapatika
స్వాధీన పతిక
- వీరేశ్వర రావు మూల
Ekkadainaa baava
ఎక్కడైనా బావ..
- ఎం బిందు maadhavi
Kundalo Gurralu Tolaku
కుండలో గుర్రాలు తోలకు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు