నేను సైతం - చెన్నూరి సుదర్శన్ ,

nenu saitam

పూర్వం మర్పల్లి గ్రామంలో మణెమ్మ, మారయ్య దంపతులు నివసించే వారు. వారికి సంతానం లేక సకల దేవతలకు పూజలు పునస్కారాలు చేయసాగారు. రోజులు గడుస్తూ వున్నాయి. ఈడు మీరి పోతోంది. ఆందోళన అధికం సాగింది.

ఓ శుభ సమయాన ఆ ఊరి చివర జ్ఞానేశ్వరుడనే మునీశ్వరుడు బస చేసాడని తెలిసి అతడి దర్శనార్థం వెళ్ళారు. తమ బాధను వెల్లబోసుకున్నారు. ఆ దంపతులను చూడగానే జ్ఞానేశ్వరునికి వారి భవిష్యత్తు కాలం అంతా గోచరించింది. దానిని వారికి వివరించాడు. అయినా వారు వెనుకంజ వేయలేదు. ప్రత్యమ్నాయంగా మరో కోరిక కోరుకున్నారు. వారి కోరిక జ్ఞానేశ్వరునికి అమితమైన ఆశ్చర్యం కల్గించింది. వారి అభ్యర్థన మేరకు అనుగ్రహించక తప్పలేదు.

‘‘అభీష్ట సిద్ధిరస్తు..” అని దీవించి వారికి ఒక మామిడి పండు ప్రసాదించాడు.

ఇంటికి వెళ్ళి అది ఆరగించిన వెంటనే మారయ్య దంపతులు జ్ఞానేశ్వరుడు చెప్పినట్లు గతాన్ని మర్చి పోయారు.

మణెమ్మ గర్భం ధరించింది.. వారి ఆనందానికి అవధులు లేవు.

పుట్టబోయే బిడ్డకు సకల సౌకర్యాలు కలిగించాలి అనే తపనతో మారయ్య అదనంగా కష్ట పడసాగాడు. మారయ్యకు ‘నా’ అన్న వాళ్ళు ఎవరూ లేరు.మణెమ్మకు చేదోడు వాదోడుగా విధవరాలైన తన అత్తగారు వరమ్మను పిలిపించాడు. మణెమ్మ భర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంది. మణెమ్మ పురుడు పోసుకుంది. పండంటి అబ్బాయికి జన్మనిస్తూనే భవిష్యత్తు కాలాన్ని జ్ఞానేశ్వరుడు వివరించినట్లుగా మణెమ్మ తనువు చాలించింది. అదే సమయంలో తన పుత్రుణ్ణి చూడకుండానే అడవిలో మారయ్య కట్టెలు కొడ్తూ ప్రమాదవశాత్తు కన్నుమూసాడు. వరమ్మ ఆవేదన వర్ణణాతీతం.. కాని విధి రాతకు తల వంచక తప్పదు.. కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది..

పుట్టుకతోనే తల్లి దండ్రులను కోల్పోయిన ఆ పసికందుకు లోకేశ్వర్ అని నామకరణం చేసింది వరమ్మ.

ఆ మరునాడు తెల్లవారు ఝామున పెరట్లోకి వెళ్ళిన వరమ్మ ఆశ్చర్యపోయింది..

అపురూపంగా పెనవేసుకొని వున్న రెండు చెట్లు కనపడ్డాయి. అందులో ఒక దానికి కొన్ని మామిడి పండ్లు మరొక దానికి ఒకే ఒక పనస పండు కాయడం విస్తుపోయింది.

దేవుడు తమకు బతుదెరువు చూపించాడని వరమ్మ సంబర పడింది.

పనస పండు కోస్తుంటే ఘల్లుమని ఒక బంగారు నాణెం పళ్ళెంలో పడింది. కాసేపు కొయ్యబారి పోయింది.. ఇదంతా తన మనుమని అదృష్టమని లోకేశ్వర్‍ను ఎత్తుకొని మురిసిపోయింది. నాణాన్ని కళ్ళకద్దుకుంది. దేవుని ముందు నాణెం దక్షిణ సమర్పించింది. రెండు మామిడి పండ్లు నైవేద్యం పెట్టి దీపారాధన చేసింది. జీవనయానం సాఫీగా సాగిపోతోంది..

లోకేశ్వర్ పెరిగి పెద్దవాడయ్యాడు. ఇంట్లో దినుసులు నిండుకునే సరికి చెట్టుకు పనస పండు ప్రత్యక్షమౌతోంది. దాన్ని కోస్తుంటే ఒక బంగారు నాణెం.. సరేసరి. మామిడి పండ్లు లేని రోజు లేనే లేదు.

వరమ్మ బంగారు నాణెం రహస్యం రహస్యంగా వుంచినా మామిడి పండ్ల వింత ఊరూరా పాకి పోయింది. జనం తండోపతండాలుగా వచ్చి చూడసాగారు.

ఒక రోజు జ్ఞానేశ్వరుడు మహాముని మనసునకేదో కీడు శంకించింది. వెనువెంటనే ఆనాడు తన దీవెనలు పొందిన మారయ్య దంపతుల కోరిక ఫలించినవైనాన్ని తిలకించడానికి లోకేశ్వర్ ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో గొడ్డలి ఎత్తి పనస చెట్టు మొదలంటా నరకడానికి సిద్ధంగా వున్నాడు లోకేశ్వర్. ఎప్పుడో అప్పుడు ఒకే ఒక కాయ కాసే పనస చెట్టు వుండి దండగ.. విరివిగా పూసే కాసే మామిడి చెట్టుకు అడ్డంకిగా వుంది అని ఈ నిర్ణయం తీసుకున్నాడు లోకేశ్వర్. వరమ్మకు కూడా చెప్పలేదు.

“నీ తండ్రి గారిని నరికేద్దామనుకుంటున్నావా బిడ్డా..! ” అన్నాడు జ్ఞానేశ్వర్ మహాముని.

ఎత్తిన గొడ్డలి ఠక్కున కింద పడవేసి ఆశ్చర్యపోయాడు లోకేశ్వర్. ఇంతలో వరమ్మ పరుగెత్తుకుంటూ వచ్చింది. వరమ్మ, లోకేశ్వర్‍లు మహాముని పాదాలపై పడ్డారు.

“అవును నాయనా ఆ మామిడి, పనస చెట్లు నీ తల్లిదండ్రులు” అంటూ గత వృత్తాంతాన్ని చెప్పసాగాడు..

“నీ తల్లిదండ్రులు ఆనాడు నావద్దకు వచ్చినప్పుడు వారి భవిష్యత్తు గురించి చెప్పాను. సంతానం యోగం వుంది.. ఒక పుత్రుడు పుడ్తాడు కాని వెనువెంటనే మీరిరువురు కాలగర్భంలో కలిసి పోతారు.. సంతానం వద్దనుకుంటే నిండు నూరేళ్ళు బతుకుతారు అని వివరించాను. సంతు లేని జీవితం నిరర్థకం.. అని వారు పుత్ర వాత్సల్యంతో చావుకు సిద్ధపడ్డారు.. ”

వరమ్మ, లోకేశ్వర్‍లు గజ గజ వణుకుతూ కన్నీళ్ళు పెట్టుకోసాగారు.

జ్ఞానేశ్వరుడు కాసేపు మౌనముద్ర వహించి మళ్ళీ చెప్ప సాగాడు.

“ఆ పుణ్యదంపతులు ఒక కోరిక కోరారు. బిడ్డ పుట్టగానే వాడి బాగోగులు చూడకుండా మేము కన్ను మూస్తున్నాం కనుక మా పుత్రుని యెడల మా కర్తవ్యం నెరవేర్చుకోడానికి అవకాశం కలిగించుమని వేడుకున్నారు. ప్రతీ ఆత్మకు మరణం లేదు.. పాత వస్త్రాన్ని విడ్చి నూతన వస్త్రాన్ని ధరించినట్లే ఆత్మ తన భౌతిక రూపాన్ని మార్చుకుంటుంది...

నేను దివ్య దృష్టితో చూశాను. మారయ్య మణెమ్మలు అడవిలో మ్రానులుగా జన్మించే అవకాశం వుంది. అది మారయ్య అడవిలో కట్టెలు కొట్టినందుకు పాపపరిహారం...

నేను నా తపశ్శక్తితో వారిని ఈ ఇంటిలో ఫలప్రద మ్రానులుగా ఉద్భవింపజేశాను. అవి తమ కన్న కుమారుని జీవితం మోడుబారకుండా కాపాడుకుంటున్నాయి.. వాని బాధ్యత త్వరలో తీరబోతోంది.. పునర్జన్మకు సన్నాహం చేసుకుంటున్నాయి..” అంటూ జ్ఞానేశ్వరుడు తన బసకు బయలుదేరుటకు సిద్ధమయ్యాడు.

“మునీశ్వరా.. నా తప్పిదనాన్ని మన్నించండి. నేను తెలియక ఒడిగట్టిన మహా పాపానికి పరిహారం చెప్పండి.. నా తల్లిదండ్రుల ఋణం తీర్చుకునే మార్గాన్ని సెలవియ్యండి” అంటూ కన్నీరుమున్నీరయ్యాడు లోకేశ్వర్.

జ్ఞానేశ్వరుడు మహాముని ప్రసన్నుడయ్యాడు.

“లోకేశ్వర్..! నీ పేరును సార్థకం చేసుకో.. లోకమంతా తిరుగుతూ ప్రజల చేత లక్షలాది మొక్కలు నాటించు. చెట్లు లేనిదే మనషికి మనలేడని వివరించు. పర్యావరణాన్ని పరిరక్షించు. అలా లోక కళ్యాణ ప్రచారంతో నీ తల్లిదండ్రుల ఋణం తీర్చుకున్న వాడివి అవుతావు” అంటూ దీవించాడు జ్ఞానేశ్వర మహాముని.

“తమరి ఆజ్ఞ శిరసావహిస్తాను..” అంటూ కార్యోన్ముఖుడయ్యాడు లోకేశ్వర్. వరమ్మ ‘నేను సైతం’ అన్నట్లుగా మనుమని వెంట నడిచింది.

మరిన్ని కథలు

Oddika
ఒద్దిక .
- Aduri.HYmavathi.
Maro konam
మరో కోణం
- గాయత్రి
Snanam
స్నానం
- మద్దూరి నరసింహమూర్తి
Swaadheenapatika
స్వాధీన పతిక
- వీరేశ్వర రావు మూల
Ekkadainaa baava
ఎక్కడైనా బావ..
- ఎం బిందు maadhavi
Kundalo Gurralu Tolaku
కుండలో గుర్రాలు తోలకు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు