పాతికేళ్ళ ప్రేమలేఖలు - డా. అప్పారావు పంతంగి

paatikella premalekhalu

“వెలుగున్నప్పుడు అన్నీ కనిపిస్తాయి, వెలుగు ఉన్నా లేకపోయినా కనిపించేది హృదయం మాత్రమే”

అలాంటి హృదయం వాళ్ళకు ఉంది కాబట్టే , పాతికేళ్ళ వాళ్ళ వైవాహిక జీవితంలో ఎలాంటి అరమరికలూ లేవు. నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల జీవితాలలో కూడా అంత సంతోషం కనిపించదేమో, అంత సంతోషంగా ఉండరేమో... కానీ మానస, రఘురామ్ లు ఇద్దరూ ఒకరిని మించి ఒకరు, ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకునే వారు. కారణం ఒక్కటే, “ప్రేమించే గుణం వారిలో ఉండటం, దొరికినదానితో సంతృప్తి పడటం, జరిగేదంతా మన మంచికే అనుకోవడం.” భర్త ముఖం చూడనిదే నిద్ర లేచేది కాదు భార్య. భార్య అనుమతి లేనిదే బయటకి వెళ్లే వాడు కాదు భర్త.

“ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు” అనే వాక్యాన్ని రఘురామ్ బాగా నమ్ముతాడు.అలానే “పతియే ప్రత్యక్ష దైవం” అనే వాక్యాన్ని బాగా నమ్ముతుంది మానస. వీరు నమ్మిన ఆ వాక్యాల్లోని భావాన్ని జీవితానికి అన్వయించుకొని చుట్టుపక్కల వాళ్ళలో, బంధువులలో ఆదర్శ దంపతులైపోయారు. ఏకంగా ఆ కాలనీలో వాళ్ళు ఉత్తమ భార్య, ఉత్తమ భర్త అనే బిరుదులు కూడా ఇచ్చేశారు.

“బొట్టూకాటుక,పూవులు గాజులు,పసుపుకుంకుమలు ఒకజంట

సీతారాములు, శివ పార్వతులు, రాధాకృష్ణులు ఒకజంట....”

ఎక్కడో దూరంగా పాత పాట వినిపిస్తుంది. శక్తి సినిమా. భార్య భర్తల అన్యోన్యాన్ని తెలిపే ఆ పాట చాలా బావుంది. ఆ పాటలో “మానస రఘురామ్ లు ఒకజంట” అనే పదాలు కూడా చేరిస్తే ఇంకా బావుంటుంది అనిపిం చింది.సీతారాముల్లో, శివ పార్వతుల్లో, రాధాకృష్ణుల్లో అయినా లోపాలు ఉండవచ్చేమో, కానీ ... వీరి దాంపత్యంలో మాత్రం ఎలాంటి లోపాలు లేవనేది అందరి నమ్మకం. ఒకవేళ ఉన్నా సర్ధుకుపోయే స్వభావం ఇద్దరిలోనూ ఉంది కాబట్టే అంత అన్యోన్యంగా ఉంటున్నారని ఆ కాలనీ వాసుల అభిప్రాయం.

*****

సంక్రాంతి .... అది అందరికి పెద్ద పండుగ

ఊరంతా సందడి సందడిగా ఉంది.

బూజులు దులుపుకోవడం, ఇల్లు కడుక్కోవడం,

పరిసరాలని, పశువులని శుభ్రం చేసుకోవడం,

అయిన వాళ్లందరికి, ముఖ్యంగా కొత్త అల్లుళ్ళకి పండక్కి రమ్మని కబురు పెట్టడం,

అప్పటికే వచ్చిన వాళ్ళంతా...

“పిన్ని బావున్నావా”, “బాబాయి బావున్నావా”,

“సీత ఎప్పుడు వస్తుంది”, “రాణి నెలతప్పిందట కదా”,

ఇంతకీ “అరిసెలు,చక్రాలువండావా!? మొత్తం మీరే తింటారా?! మాకేమన్నా పెడతారా?!” ఇలా పలకరింపుల తో, పులకరింపులతో ఆ కాలనీ అంతా కొత్త సొగసులు దిద్దుకుంది.

మానస,రఘురామ్ లు కూడా తొందరపడుతున్నారు.

ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నారు...

పిండి వంటలు వండుతున్నారు...

పాపం ఇద్దరే కదా ఎవరున్నారని చేయడానికి....

అలా అని ఎవరూ లేరని కాదు,

కొడుకు బెంగుళూరులో జాబు, కూతురు కూడా అక్కడే...

ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా పనిచేస్తున్నారు. పండక్కని వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ కోసమే మానస పిండి వంటలు చేస్తుంది. సిటీలో ఉద్యోగం చేసేవాళ్ళు కదా! సుఖానికి అలవాటు పడిన వాళ్ళు మరి ఈ చిన్న చిన్న ఇళ్ళలో సుఖంగా ఉంటారో ఉండరోనని వాళ్ళ కోసమే రఘురామ్ ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు ఇక్కడే పెరిగారన్న సంగతి మరచి...

“ఇల్లు శుభ్రం చేస్తున్న రఘురామ్ చెయ్యి తగిలి పైన ఎక్కడో ఉన్న పాత పుస్తకాల బస్తా ఒకటి పొరపాటున జారి క్రింద పడింది. తీసి పక్కన పడేద్దామనుకున్నాడు. కానీ అందులో మానస పేరు మీద ఉన్న ఉత్తరం రఘురామ్ కి కనిపించింది. రఘురామ్ తీసుకెళ్లి మానసకే ఇద్దామనుకున్నాడు. కానీ దాని మీద ఉన్న చేతిరాత ఎక్కడో చూసినట్టుగా అనిపించింది.... ఎందుకో చదవాలనిపించింది. అందులో ఏముందో తెలుసుకోవాలనిపించింది. ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందోనని వెనక్కి తిప్పి చూశాడు.” గుండెపగిలినంత పనైంది. నిశ్చేష్టుడై పోయాడు. ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు....*****

నా ప్రియమైన మానసకి,

నీ ప్రియమైన నేను , నీ నుంచి అంతులేని ప్రేమను ఎదురుచూసే నేను వ్రాయునది, ఇన్నాళ్ళు, ఇన్నేళ్లు... ఇన్నేళ్ల నా జీవితం నువ్వు లేకపోవడం వల్ల వ్యర్ధమైంది. నీ గురించి వింటున్న ఆక్షణమే నా హృదయం ద్రవీభవించింది , నా ప్రాణానికి కూడా విలువుందని తెలిసింది. అమ్మ అప్పుడప్పుడు నన్ను తిట్టేది ఎందుకు పుట్టావురా నా కడుపున అని? అప్పుడు నాకార్ధం కాలేదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు పుట్టానో... నేను పుట్టింది నీ కోసమే, నా ఈ జీవితం నీ కోసమే. అవును ప్రియా! నన్ను నమ్ము. “ఈ భూమ్మీద అన్నిటికంటే దు:ఖకరమైన విషయం ఆడపిల్లగా పుట్టడం అంటారు.” కానీ అది నాకు వరం. ఎందుకంటే నువ్వు ఆడపిల్లగా పుట్టింది నాకోసమే... నా ప్రేమను అంగీకరించు. నీరూపం నాకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను అపురూపంగా చూసుకుంటాను. అలా అని నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటాను, దేవతలా పూజించుకుంటాను అని చెప్పను, కానీ నాకున్నంతలో మహారాణిలా చూసుకుంటాను. నీ గురించి విన్నప్పుడు జీవితంలో పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. నీ తోడుగా ఉండాలనుకున్నాను. నీ చూపు నా నవ్వుగా మారాలి, నా ఊపిరి నువ్వై పోవాలి, మనమిద్దరం ఒకటవ్వాలి. నిన్ను ఇంతవరకూ చూడలేదు ఇకపై కూడా చూడకపోతే నా చూపు ఎడారైపోతుంది. నీకు నా భావాలు తెలపకపోతే నా గుండె మోడైపోతుంది. అందుకే మా స్నేహితుని దగ్గర నీ చిరునామా తీసుకొని నేను నీకు మొదటిసారిగా ప్రేమలేఖ రాస్తున్నాను. చిరునామా తీసుకున్న వాడిని నీ ఫోటో కూడా తీసుకోవచ్చు. కానీ నీ మంచితనం తెలుసుకున్నాక ఆ మంచితనాన్నే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నీ ఫోటో చూడటంలేదు. నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే పెళ్లి పీటల మీద మాత్రమే నిన్ను చూస్తాను. నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు చూడాలనుకుంటే నన్ను చూడొచ్చు. నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే ఈ చిరునామాకి లేఖ రాయమని అర్ధిస్తున్నాను. అది ప్రేమలేఖ అయితే నా ఊపిరికి ఊతమిచ్చినవాళ్లవుతారని ఆశిస్తున్నాను.

”“వసంత కాలంలో చెట్లు చిగురిస్తాయి అనే మాట ఎంత నిజమో! నీ గురించి వినగానే నా మనసు చిగురించిందనే మాట కూడా అంతే నిజం!”

“వసంతం ఏడాదికి ఒకసారే వస్తుంది.కానీ నువ్వు నాతో ఉంటే నాకు ప్రతీక్షణం వసంతమే...”

“ఏ పనీ పాట లేని నీకు పిల్లనెవరిస్తారురా?” అనే వాళ్ళకు

బంగారాన్ని పెళ్లి చేసుకున్నానురా! అని చెప్పే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను.

ఈ దినం నుంచి అనుదినం... నా మదివనం...

నీ ప్రేమ కొరకు ప్రయాణం చేస్తుందని మనవి చేస్తూ

నిలువెల్లా కన్నులు చేసుకొని నిరీక్షిస్తూ .... నీ , నేను...”

*****

ఈ ప్రేమలేఖ చదవగానే రఘురామ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తను ఎంతగానో నమ్మిన, ప్రేమించిన మానస ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇద్దరి మధ్య ఈ పాతికేళ్లలో ఎలాంటి దాపరికాలు లేవు. కానీ మానస తన దగ్గర ఈ విషయం ఎందుకు దాచిందో అర్ధం కాలేదు. గుండు సూది కొనే దగ్గరి నుంచి గుడికి వెళ్లే వరకు తనకు చెప్పకుండా చేయని మానస, అంతులేని స్వేచ్ఛ ఇచ్చినా ఏ రోజూ దుర్వినియోగం చేయని మానస , మౌనంలో కూడా మహామహా భావాలను పలికించగల మానస మరి ఈ ప్రేమలేఖ విషయాన్ని తన మదిలోనే పాతికేళ్లు ఎలా పదిలంగా దాచుకోగలిగింది. శివుడు గరళాన్ని కంఠంలో దాచినట్టుగా తను కూడా ఈ గరళాన్ని తనలోనే ఉంచుకొని మదన పడకుండా, అలా అని బయటపెట్టకుండా కంఠంలోనే దాచుకుందా!? ఆడవాళ్ళకు నచ్చకపోతే మన్మథుడు వచ్చినా మనసంగీకరించదంటారు కదా! అంటే మానసకు ఇది గరళం కాదు అమృతం. అందుకే ప్రేమలేఖ ని కూడా పదిలంగా దాచుకుంది. అని లోలోపల మదన పడ్డాడు, వేదన పడ్డాడు.మానసను పిలిచి అడుగుదామనుకున్నాడు. కానీ ఏమని అడగాలి...ఎవర్నో ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని అడగాలా?ఈ ప్రేమలేఖను ఇన్నాళ్ళు ఎందుకు పదిలంగా దాచుకున్నావని అడగాలా?

ఏ దాపరికాలు లేని మన మధ్య ఇది మాత్రం ఎందుకు దాచావని అడగాలా ?

ఏమని అడగాలో... ? ఎలా అడగాలో... ?

రఘురామ్ కి అర్ధం కావడంలేదు. కానీ అడగాలి... అదే...ఎలా ? ఎలా ? తనకు అర్ధం కావడంలేదు.

అడిగితే.... ఉత్తమ భర్తగా,ఉత్తమ భార్యగా, ఆదర్శ దంపతులుగా ఎలాంటి అరమరికలు లేక సాఫీగా సాగిపోతున్న వీరి జీవిత ప్రయాణంలో అన్నీ ప్రమాదాలే జరుగుతాయి. పెళ్లీడుకొచ్చిన పిల్లలు, పదిమందిలో లో ఉన్న గౌరవం, మర్యాద అన్నీ ఒక్కసారిగా కోల్పోవల్సి వస్తుంది. ఈ పాతికేళ్లలో మానస తనకు కానీ , తన కుటుంబానికి కానీ ఏ విషయంలోనూ లోటు చేయలేదు. అలాంటప్పుడు “గతాన్ని కావాలని తవ్వుకొని ఎందుకు తను బాధపడటం , మానసని బాధ పెట్టడం” అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలను కున్నాడు.

*****

పిల్లలు వచ్చారు. వాతావరణం అంతా మారిపోయింది. ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. కానీ రఘురామ్ లో ముఖంలో కళ పోయింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ రఘురామ్ మనసును మాత్రం “ఆ ప్రేమలేఖ పురుగులా తొలిచేస్తుంది.” అయినా పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడు. అతని తీరుని గమనించిన మానస విషయం ఏమిటో తెలుసుకోవాలని అడిగినా మాట దాటేశాడు రఘురామ్. భోగి తలకలు పోసుకున్నారు. పిల్లలిద్దరూ స్నేహితులని కలుద్దామని అలా ఊళ్ళోకి వెళ్లారు. మానస భర్తకు తలంటు తుండగా....

*****

సంక్రాంతిని తీసుకురావాలని సూర్యుడు తెగ సంబరపడిపోతున్నాడు అందుకే మరుసటి రోజుని పంపించడం కోసం ఆ రోజు చాలా త్వరగా గడిచిపోయింది. చీకటి పడింది. అందరూ పడుకున్నారు. మానస, రఘురామ్ కూడా... కానీ రఘురామ్ కి నిద్ర పట్టడం లేదు. అందుకే లోలోపల ఉన్న ఆ అనుమానాన్ని తొలగించుకోవాలనుకున్నాడు.

“మానస, ఎవరతను ?” అని ధైర్యం చేసి అడిగేశాడు.

“మానస వినీ, విననట్టుగా ఉంది... మళ్ళీ అడిగాడు రఘురామ్ ,”

“మానసా... నిన్నే ఎవరతను” అని మళ్ళీ అడిగాడు...

“అతనంటే ?” అడిగింది మానస...

“అదే... పాతికేళ్ళ క్రితం నీకు ప్రేమ లేఖ రాసి పేరు రాయకుండా “నీ నేను” అని వదిలేశాడే అతను?”

“ఓ... అందుకేనా మీరు అదోలా ఉన్నారు... ఆ లేఖ మీకు ఇన్నాళ్లకు దొరికిందన్నమాట...”

“అన్నమాట కాదు ... ఉన్నమాటే... చెప్పు ఇంతకీ ఎవరతను”

“అవును...పాతికేళ్ళ క్రితం రాసిన ప్రేమలేఖ అన్నారు కదా, అయినా...అది పాతికేళ్ళ క్రితం రాసిందని మీకెలా తెలుసు?” రఘురాం లో మౌనం !....

“చెప్పండి !?”

“అది పాతికేళ్ళ క్రితం రాసిందని మీకెలా తెలుసు?”

“మన పెళ్ళయి పాతికేళ్ళయ్యింది కదా! ఇలాంటి ప్రేమ వ్యవహారాలన్నీ పెళ్ళికి ముందే ఉంటాయి కదా! అందుకే పాతికేళ్ళయ్యిందన్నాను.”“సరే చెప్పు ఎవరతను?”

కాసేపాగి...

“మీరే...” అని సమాధానం ... చెప్పింది.

“నేను అడిగేది. పాతికేళ్ళ క్రితం నీకు ప్రేమలేఖ రాసిన “నీ నేను” గురించి.”

“నేను చెప్పింది కూడా పాతికేళ్ళ క్రితం నాకు ప్రేమలేఖ రాసిన “నీ నేను” గురించే.”

“ ఆ “నీ నేను” మీరే కదా? మీరు కాదా?!”

“అయితే చెప్పండి ఈ క్షణమే నేను మిమ్మల్ని వదిలి నా రఘు దగ్గరికి వెళ్లిపోతాను.” అని మానస అనడంతో రఘుకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. కానీ అలా ప్రశ్నించిన రఘురామ్ ని చూసి మానస ముళ్ళకంచెలో చిక్కుకు పోయిన మల్లెతీగలా విలవిలలాడి పోయింది.

“పాతికేళ్ళ క్రితం మీరు రాసిన ప్రేమలేఖని పదిలంగా దాచుకున్నందుకు మీరు ఇంత మదన పడుతున్నారే, మరి అదే పాతికేళ్ళ క్రితం మానస రాసిన ప్రేమలేఖలను మీరెలా దాచుకున్నారు. అందుకు నేను బాధపడటం లేదు, మానస మీద ఇంకా మీకు ప్రేమ ఉన్నందుకు, ఆ మానస నేనే అయినందుకు సంతోషపడుతున్నాను. మీకు ప్రేమలేఖ రాసిన మానస, మీరు పెళ్లి చేసుకున్న మానస ఇద్దరూ ఒకటే. ఆ విషయం మీకు ఇప్పుడే తెలిసింది. కానీ నన్ను చూడకుండానే నాకు ప్రేమలేఖ రాసి అందులో పేరు రాయడం మరిచిపోయిన లేక కావాలనే రాయకుండా వదిలేసిన రఘు , నేను పెళ్లి చేసుకున్న రఘురామ్ ఇద్దరూ ఒకటే...”

“నాకోసమే పుట్టానన్న మీరు, నేను లేకుండా బ్రతకలేనన్న మీరు, బంగారాన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పాలనుకున్న మీరు చివరకు పరిస్థితులకు తలవంచి మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిధ్ధపడ్డారు. మీరు నాకు రాసిన లేఖలో కావాలంటే మీరు నన్ను చూడొచ్చు అని రాశారు. కానీ చిరునామా మీ స్నేహితుడిది రాశారు. నేను మీకు మొదటి ప్రేమలేఖ రాయడానికి ముందే చూశాను, చూసిన తరువాతే రాశాను. మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం అమ్మాయి ఎవరో కాదు మా పిన్నిగారమ్మాయి. చివరి నిముషంలో మీకు ఏ ఉద్యోగం, సద్యోగం లేదని పిల్లనివ్వనంటే అప్పుడు మా నాన్న గారితో జరిగిన విషయం చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిధ్ధపడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కాదనుకున్న సంబంధాన్ని మేము చేసుకు న్నందుకు మా వాళ్ళతో కానీ, నాతో కానీ మా పిన్ని వాళ్ళు మాట్లాడరు. మీ కోసం మా వాళ్ళనందరిని నేను వదిలేసుకో వలసిన పరిస్థితి నాకు ఏర్పడింది. అయినా మీ ప్రేమలేఖ చదివి, మిమ్మల్ని ప్రేమించి మీరే కావాలనుకుని ఇష్టపడి మరీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను.”

“ప్రేమించడం, ప్రేమను సాధించడం... ఈ ప్రయాణం అంతా ముళ్లబాటలోనే సాగిపోతుంది, ఆ ప్రేమను సాధించుకున్న తరువాత బ్రతుకంతా పూలబాటే...” నాకు ఇన్నాళ్లూ పూలబాటలానే అనిపించింది కానీ మీరు ఇలా ప్రశ్నిస్తుంటే మొదటిసారిగా చివుక్కుమంది మనసు. ఎక్కడో హృదయాంతరాళల్లో పదునెక్కిన ముల్లు పదిలంగా ప్రాణాన్ని తొలిచినట్టు...”

“మీరు నాకు రాసిన ప్రేమలేఖ ఇన్నేళ్ల తరువాత మీరే చదివినప్పుడు అంతులేని సంతోషంతో గంతులేస్తూ నాదగ్గరికి వచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని, ఎత్తుకొని మీరు ప్రేమించిన మానస మీద పాతికేళ్లుగా కురిపించలేని ప్రేమ ఒక్కసారిగా కురిపిస్తారనుకున్నాను” కానీ ఇలా...నిలదీస్తారనుకోలేదు.

నన్ను పెళ్లి చేసుకున్నందుకు... నన్నే పెళ్లి చేసుకున్నందుకు మీకు సంతోషం ఉందో, లేదో నాకు తెలియదు. కానీ, “మానస నన్ను కాకుండా ఎవర్ని పెళ్లి చేసుకున్నా ఇలానే ఉండేది కదా!? ఆ ప్రేమలేఖ నేను కాకుండా ఇంకెవరు రాసినా ఇలానే దాచేది కదా?!” అనే ఆలోచన మిమ్మల్ని తొలిచేస్తుందని నాకు తెలుసు. “మీకు ప్రేమించడానికి ఒకరు కావాలి, పెళ్లి చేసుకోవడానికి ఒకరు కావాలి. ఉత్తమ భర్తైనా... మీరూ మగాడే కదా! మగ బుధ్ధి పోనిచ్చుకోలేదు.”

*****

రఘురామ్ కళ్ళల్లో కన్నీళ్ళు...

మానస కాళ్ళ మీదా అవే కన్నీళ్లు...

ఆ తరువాత వారిద్దరి మధ్య కౌగిళ్లు...

సూర్యుడి కిరణాలు పడిన వాకిళ్ళు...

సంక్రాంతి గొబ్బిళ్ళు…

ఒకరినొకరు అర్ధం చేసుకొని సర్ధుకుపోతే ఆ జీవితాల్లో అనుక్షణం పండగ పరవళ్ళు...

మరిన్ని కథలు

Oddika
ఒద్దిక .
- Aduri.HYmavathi.
Maro konam
మరో కోణం
- గాయత్రి
Snanam
స్నానం
- మద్దూరి నరసింహమూర్తి
Swaadheenapatika
స్వాధీన పతిక
- వీరేశ్వర రావు మూల
Ekkadainaa baava
ఎక్కడైనా బావ..
- ఎం బిందు maadhavi
Kundalo Gurralu Tolaku
కుండలో గుర్రాలు తోలకు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు