నిర్మానుష్యం - డా II అప్పారావు పంతంగి

nirmanushyam

“కర్నూల్ – హైదరాబాద్” నాలుగు గంటల ప్రయాణం తరువాత హైదారాబాద్ యం.జి.బి.యస్ లో బస్సు దిగాం

నేను నా ఫ్రెండ్ ఈశ్వర్.

అర్ధరాత్రి 12 దాటింది. సమయం 1:30 నిముషాలు

నిద్రతో పోరాటం మాది ... జీవన పోరాటం వాళ్లది

వస్తున్న నిద్రను ఆపుకుంటున్న మేము ... వస్తున్న ఉదయాన్ని ఆగమంటున్న వాళ్ళు

సి.బి.యస్ నుంచి ఉస్మానియా వరకు ఆటో ... ఎవ్వరూ రెండు వందలు రూపాయలు తగ్గటం లేదు

రాత్రి సమయం కదా...

1,2,3,4 ... ఎంతమంది ఆటోవాళ్లను అడిగినా రెండు వందలు...

ఎంత ఐక్యమత్యమో... తెలంగాణా , ఆంధ్ర అని తన్నుకుంటున్న సమయంలో...

వచ్చిన వాడు ఎవడైతేనేం ... ఎవడైనా సరే ... రెండు వందలు

చెరో పది... మహాయితే ఇరవై రూపాయల టిక్కెట్ కోసం... రెండు వందలు ఇవ్వాలా ?

చూస్తూ చూస్తూ రెండువందలు ... అక్షరాల రెండువందలు... కష్టంగా అనిపించింది ... మరీ దారుణం అనిపించింది...

ఆంగ్లంలో ఇట్స్ వెరీ టూమచ్ అనిపించింది. ఇవ్వలేమంటున్న మేము, ఈ సమయంలో ఇక్కడినుంచి అక్కడికి ఏమీ ఉండవంటున్న వాళ్ళు ... మాటల్లో పడి మొత్తమ్మీద మూడుకిలోమీటర్లు నడిచాం...

*****

అంతా చీకటి... దానిని తరిమేందుకు దారిపొడవునా ఎలక్ట్రిక్ దివిటీ...

మా అడుగుల చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు మాకు

ఎంత నిర్మానుష్యంగా ఉందో... ఎంత నిశ్శబ్దంగా ఉందో...

ఒక పక్క పుస్తకాలమ్మే వాళ్ళు... మరోపక్క ఆపాదమస్తకాలూ చూసేవాళ్ళు...

ఒక పక్క గాజులు... మరోపక్క సన్నజాజులు...

వేడి వేడి ఇడ్లీలు ... బజ్జీలు... గరమ్ గరమ్ ఛాయ్...

చలచల్లని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్...

ఒకపక్క హ్యాండ్ లూమ్స్ , ఒకపక్క హ్యాండ్ బ్యాగ్స్...

మనం అడక్కపోయినా రండి రండి మీదే బోని అని పిలిచే జీవన పోరాట కర్తలు....

చిన్న పిల్లలు, ముసలివాళ్లు, ఆంటీస్, అంకుల్స్ ... పాలిచ్చే అమ్మలు, చెయ్యి పట్టుకునే నాన్నలు

అన్నింటినీ మించి హోళీ నడిచొస్తుందా అనిపించే అమ్మాయిల సమూహాలు, వాళ్ళ నవ్వుల ప్రవాహాలు...

ఒకరినొకరు రాసుకుంటూ, ఒకరినొకరు నొకరు చూసుకుంటూ...

వచ్చేవాళ్లు , పోయేవాళ్లు... వచ్చి పోయేవాళ్లు , పోయి వచ్చే వాళ్ళు...

ఎక్కేవాళ్లు, దిగేవాళ్లు, ఎక్కిదిగే వాళ్ళు, దిగి ఎక్కే వాళ్ళు, మనుషులు, వారి మనసులు, బరువెక్కిన పాపపు ఆలోచనలు... అన్నిటినీ నింపుకొని, అలుపూ... సొలుపూ లేకుండా ప్రయాణించే బస్సులు ...

అల్లకల్లోలంగా ఉండే నగరం...

గందరగోళంగా ఉండే నగరం...

గరమ్ గరమ్ గా ఉండే నగరం...

భిన్న స్వరాలను వినిపించే నగరం... నిద్ర పోతుంది.

అవును నగరం నిద్రపోతుంది. ఎవరూ వినని స్వరాన్ని వినిపించడం కోసం... నగరం నిద్ర పోతుంది.

ఎంత నిర్మానుష్యంగా ఉందో... ఎంత నిశ్శబ్దంగా ఉందో...

*****

దీనంగా... హీనంగా... నీచంగా... వినిపిస్తున్న ఆస్వరం వింటుంటే భయమేస్తుంది, బాధేస్తుంది.

మేమిద్దరమే...

మూడోజీవి అక్కడ కనిపించడం లేదు... మూడో శ్వాస అక్కడ పయనించడంలేదు.

నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో మాకు అప్పుడే అర్ధమయ్యింది.

మా మాటలతో దానిని ఛేదించాలని ప్రయత్నిస్తున్నా... మా గుండెల్లో మాత్రం నిశ్శబ్దమే మిగిలింది.

అంతకు ముందు మాకు ఎదురైన సంఘటన అలాంటిది

ఒక్కసారి వెనక్కి తిరిగిచూశాం...

ఏంట్రా బాబు ఉస్మానియా వరకు నడిపిస్తావా ?!

నడవరా బాబు రెండువందలు మిగులుతాయిగా!

నడిచే ఓపిక లేదురా నాయనా ... పోతే పోయినాయ్ రెండొందలు ఏదైనా ఆటో మాట్లాడరా...

ఇలా మాట్లాడుకుంటూనే మా నడకను కొనసాగిస్తున్నాం

ఇంతలో...

వెనుక నుంచి... ఏయ్.... ఎక్కడి వరకు బావలూ... అనే పిలుపుతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాం.

మమ్మల్ని తోడు రమ్మంటారా ?! అంటూ వాళ్ళు మా వెనుకే వస్తున్నారు. మేము మాత్రం ఏమీ మాట్లాడలేదు.

నాకు మాత్రం భయంగా ఉంది. మావాడు మాత్రం ధైర్యంగానే వెనక్కి తిరిగాడు , నేను మాత్రం కాస్త దూరంగా వెళ్ళి ఆగాను. ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కాసేపటి తరువాత వాడు వాళ్ళకి డబ్బులిచ్చి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. మేము ముందుకు సాగాం. వాళ్ళు మళ్ళీ పిలిచారు. వెనక్కి తిరిగి చూశాం. “వాళ్ళు నవ్విన నవ్వు ఇంకా నా గుండెల్లో అలా మిగిలిపోయింది.” భగవంతుడు వాళ్లను హిజ్రాలుగా పుట్టించినా, ఇంట్లో వాళ్ళు వాళ్ళని మెడబట్టి గెంటేసినా, అటు ప్రభుత్వాలు కానీ, ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ వారికి సరైన స్థాయిలో ఉపాధి కల్పించకపోయినా, అవమానాలు, చీదరింపులు, ఛీత్కారాలు అనుక్షణం వాళ్ళ వెన్నంటే ఉన్నా... చావకుండా బ్రతుకుతున్న వాళ్ళను చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. మగాళ్లుగాపుట్టి, ఆడాళ్లుగాపుట్టి ఉన్నత చదువులు చదువుకొని చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి అటు ఆడ, ఇటు మగా కాకుండా జీవన పోరాటాన్ని సాగిస్తున్న వీళ్ళ జీవితాలు పాఠాలు, గుణపాఠాలు నేర్పితే అంతకంటే కావాల్సిందేముంది అనిపించింది. అందుకే నవ్వుతున్న వాళ్ళను చూసి మాట్లాడాలనిపించింది.
ఆగాను...

అడిగాను...

“ఇలా పుట్టినందుకు బాధగా లేదా ?”

“మేమూ మనుషులమేగా...”

వాళ్ళ సమాధానానికి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. అంతలోనే అందరూ మాలా ఉండరు బావా!!! అనే సరికి గుండె గుభేల్ మంది. గమ్యాన్ని చేరేలోపు ఇంకా ఎంతమంది ఎదురవుతారో అనే భయంలోపల ఉన్నా ధైర్యంగానే ముందుకెళు తున్నాం. ఎందుకంటే వాళ్ళూ మనుషులే కదా!

*****

నిద్ర కళ్ళతో నడుస్తున్న మాకు... నిద్ర మత్తెక్కి, కళ్ళు వగరెక్కి, తాగిన వాళ్లలా నడుస్తున్న మాకు ‘మత్తువద లరా, నిద్దుర మత్తువదలరా’ అనేలా తగిలిన షాక్ మా నిద్దురకొండెక్కేలా చేసింది. వాళ్ళ గురించి, వాళ్ళ జీవితాల గురించి, సమాజంలో వాళ్ళు పడుతున్న అవమానాల గురించి చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నాం...

మంచి ఎత్తు, ఎత్తుకు తగిన లావు... ఎంత అందంగా ఉందో నిమ్మపండు రంగు ఛాయ... చూడగానే... చూస్తు న్నవాళ్లు చూస్తున్నట్టుగా శిలలుగా మారిపోయేలా... వెన్నెల రాత్రి కదా! ఒంటరి చీకటి కదా! తుంటరి ఆలోచనలు కదా! నిమ్మపండు ఛాయ కదా! అందుకేనేమో ....“మాకంటే వయసు పెద్దదే... కానీ మల్లెపూల వాసనకు మనసు వెనుక ఉన్న వయసు వద్దంటే వినదే...”

“కరెంట్ స్తంభం క్రింద, మల్లెల్ని వాలుజడతో సహా ముందుకు వేసుకొని, యద సంపద కనిపించేలా పైటను పైనుంచి జారవిడుచుకొని పిలుపులకు సిధ్ధంగా, వలపుల పలుపులు పట్టుకొని చూస్తుంటే, తలపుల తలుపులు ఆగక కొట్టుకుం టుంటే మనసును, వయసును అదుపులో ఉంచుకొని నిష్టాగరిష్టులులా వెళ్లిపోతున్న మాకు... ఆ కరెంట్ స్తంభానికి ఉన్న విద్యుద్దీపం తను తాకడం వల్లనే అంత కాంతివంతంగా వెలుగుతుందా అనిపించింది.

“చూసి చూడనట్లే పోతున్నారు ... ఆగాలని లేదా!? ... మల్లెలతో ఆడాలని లేదా!? ... నాతో ,... ముందుకు సాగాలని లేదా!?” అంటున్నా మేము ముందుకు వెళుతూనే ఉన్నాం...

“సన్యాసులా లేక ఆశ్రమవాసులా లేక ....”

మావాడు దేనినీ వదలడు....

“ఆవిడ దగ్గరకు వెళ్ళి వయసులో పెద్దదానివి కదా వరసకావేమోనని ఆలోచిస్తున్నాం.”

“మాలాంటి వాళ్ళకు వావివరసలు లేవు ఎవర్నీ కాదనము, ఏమడిగినా లేదనము....”

“నీకు పెళ్లైనదా ?”

“అవన్నీ నీకెందుకు నీకు కావాల్సింది నువ్వు తీసుకొని నాకు కావలసింది నాకు ఇవ్వు”

“ఏమడిగినా లేదనము అన్నావు కదా ?! అడిగిన వాటికి సమాధానం చెప్పు మాకు కావాల్సింది మేము తీసుకోక పోయినా నీకు కావాల్సింది నీకిస్తాం”

“చెప్పు నీకు పెళ్లైనదా ?”

“అయ్యింది.”

“భర్త ఉన్నాడా?”

“ఉన్నాడు... ఉన్నా లేనట్లే... ”

“పిల్లలు..?”

“ఒకకొడుకు, ఒక కూతురు.”

“రేపు నీ కూతుర్ని కూడా ఇలానే తయారుచేస్తావా ?”

“ఇప్పుడు నీ కొడుకొస్తే మాలానే వాడినీ పిలుస్తావా ?”

నాకు మాత్రం వాడు మాట్లాడే మాటలకి కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి.

ఆవిడ ముఖంలో నెత్తురు చుక్క లేదు.

“క్షమించమ్మా నిన్ను చూస్తుంటే నీ వయసులోనే ఉన్న మా అమ్మ గుర్తొచ్చింది.! అమ్మని అలా ఎవరూ చూడాలనుకోరు కదమ్మా! అందుకే ఇలా మాట్లాడాను. నువ్వు భర్త ఉన్నా లేనట్లే అన్నావు. అప్పుడే అర్ధమయ్యింది నువ్వు ఈ పని డబ్బు కోసమే చేస్తున్నావని, ఇష్టాపూర్వకంగా చేయడంలేదని. నీకు కావలసింది డబ్బే కదా! ఇదిగో తీసుకో అని ఎంత ఇచ్చాడో తెలియదు కానీ ఇచ్చాడు. చాలాసేపు ఆవిడ తీసుకోలేదు. సొంతకొడుకులాగా చేతిలో పెట్టి వెనక్కి తిరిగాడు. మేము వెళ్లిపోతున్నాం. ఒక్కసారి ఆవిడని చూడాలనిపించి వెనక్కి తిరిగి చూశాను. ‘చేతులెత్తి దండం పెడుతుంది...ఆమె కళ్ళల్లో కన్నీళ్లు... జోడించిన రెండు చేతుల్ని కడిగేస్తున్నాయి.’ నాకనిపించింది తన పాపాలు ఈ రోజు తన కన్నీళ్లతోనే కడిగి వేయబడ్డాయని, మళ్ళీ పాపంచేయదని...”

“తాను పుండై వేరొకరికి పండై... తాను శవమై వేరొకరికి వశమై...” అనే కవితను తలచుకుంటూ మేము ముందుకు సాగిపోతున్నాం. సాహిత్యాన్ని చదువుకున్న, సమాజాన్ని చదువుతున్న విద్యార్ధులం కదా!

*****

‘కొత్తొక వింత పాతొకరోత’ అన్నట్లు , ఇప్పుడు ఇంకో కొత్త విషయం దొరికింది మేము మాట్లాడుకోవడానికి ...

పాత విషయం గతంలో కలిసిపోయింది ... అవును కదా మనిషి కొత్తది దొరికినప్పుడు పాతదానిని మరిచిపో తుంటాడు. ఇది చాలా సహజమైన విషయం. అలా మరిచిపోకపోతే అక్కడే ఉండిపోవలసి వస్తుంది.అక్కడే వాడిపోవలసి వస్తుంది. గాయాన్ని మాన్పుకోవాలంటే పడినచోట నుంచి అడుగులు వడివడిగా గమ్యంవైపు సాగిపోవాలి. పాత గాయాన్ని మాన్పుకోవడానికి కొత్త గాయాన్ని మందుగా వేశాం. పాపం మానభంగాలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు, వరకట్న వేధింపులు, వేశ్యాజీవితాలు.... 33% రిజర్వేషన్ ఇలాంటి విషయాలలో బాగా అమలవుతుందనుకుంట. ఎప్పుడు మారుతుందిరా సమాజం. ఎప్పుడు మారుతుందిరా ఈ మనుషుల నైజం...ఇలా స్త్రీలను ఉధ్ధరించే దిశగా ఆలోచిస్తూ అడుగులు చకచకా ముందుకు వేస్తున్న మేము ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోయాం.

*****

““చలికాలంలో కూడా ఏసి రూముల్లో పడుకుని దుప్పటి కప్పుకునే వాళ్ళు....”

“మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కూడా నాన్ వెజ్ తినే వాళ్ళు....”

“కుక్కలకుకూడా పిజ్జాలు, బర్గర్లూ పెట్టేవాళ్లు...” ఉన్న ఈ సమాజంలో రోడ్డుప్రక్కన పడిఉన్న అనాథలను, అభాగ్యులను పట్టించుకునే వాళ్ళు లేరు. ఒళ్ళు దాచుకోవడానికి సరైన బట్టలు లేక, కప్పుకోవడానికి దుప్పటి లేక, చెప్పుకోవడానికి నా అనే మనుషులు ఉండీ , లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళను చావు కూడా చేరదీయడానికి వెనుకాడుతుంది. వయసు మళ్లిన ముసలివాళ్లను, వయసొచ్చిన కొడుకులు చూడకపోతే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయనేది కొడుకులుగా ఉన్న మాకు తెలియడం కోసం విధాత ఆడుతున్న వింత నాటకమా ఇది అని అనిపించేలా ఎంత హృదయవిదారకంగా ఉందో...! కష్టపడి నలుగురు కొడుకుల్ని రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తే ఆస్తులు అమ్ముకొని తలోదిక్కు వెళ్లిపోయి వీళ్లని మాత్రం దిక్కులేని వాళ్ళను చేశారట. చాలా బాధేసింది. మావాడు కప్పుకోవడానికి దుప్పటి ఇస్తే మాకొద్దు నాయనా మీరూ మాలాంటి తల్లిదండ్రులకి కొడుకులుగానే ఉన్నారు. వాళ్ళని మాలాంటి స్థితికి తీసుకురాకుండా చూసుకోండి. మీ దగ్గరనుంచే కాదు మీలాంటి కొడుకుల దగ్గరనుంచి మేము ఏమీ ఆశించం. మీరు పచ్చగా ఉంటే చాలు అదే మాకు పదివేలు....ఇక బయలుదేరండి.” అనే సరికి మాకు దిమ్మతిరిగింది. ఆ వయసులో కూడా, ఏమీ లేని స్థితిలో కూడా ఆముసలివాళ్ళకు ఎంత ఆత్మాభిమానం, వాళ్ళ మీద వాళ్ళకు ఎంత ఆత్మవిశ్వాసం. సిగ్గూ, ఎగ్గూ లేకుండా బ్రతికే మనలాంటి వాళ్ళకు వేలకు వేలు ఖర్చు పెట్టినా ఏ విద్యాసంస్థలు నేర్పగలవు ఆ విలువలు.

*****

‘అనుభవం పాఠాలు నేర్పుతుందంటారు’ మాకు ఎదురైన ఈ అనుభవాలు జీవితంలో ఎలాంటి పాఠాలు నేర్పుతాయో కానీ ఈ రాత్రి నిద్రను మాత్రం వదిలించాయి.

“పగలు భయంకరంగా ఉండే నగరం రాత్రి నిద్రపోతుందని, నిర్మానుష్యంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. నిజానికి నగరం పగలే బావుంటుంది. రాత్రి భయంకరంగా బావురుమంటుంది. ఆ నిర్మానుష్యపు నీడల్లో జీవనపోరాటాల బ్రతుకు చిత్రాలు చిత్రాతి చిత్రంగా సాక్షాత్కరిస్తుంటాయి. ‘మన నీడను చూసి భయపడిపోయే మనమే భయపెట్టే నీడల్ని చూసి బాధపడుతుంటాం. మన గాయాల్ని చూసి బాధపడిపోయే మనమే బాధలలోయల్లో ఉన్నవాళ్లను చూసి జాలిపడుతుంటాం.’”

ప్రతి సంఘటనను చూసి చలించిపోతున్న మనం ఇప్పటికీ పురాణ వైరాగ్యంలోనే ఉంటున్నాం. అన్నీ చదివి పుక్కిట పురాణాలంటున్న మనం వాటి నుంచి నీతులు కొన్నైనా నేర్చుకోలేకపోతున్నాం.ఇప్పుడనిపిస్తుంది నిర్మానుష్యంగా ఉంది నగరం కాదు మన హృదయం.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి