ముందుకు - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

munduku

నీలానగరం అనే ఊరిలో రుద్రయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు పార్ధుడు, చిన్నవాడి పేరు కృష్ణుడు. ఇద్దరినీ పెద్ద చదువులు చదివించాడు రుద్రయ్య. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు రుద్రయ్య కొడుకులిద్దరూ. తమ అర్హతలకి సరిపడే ఉద్యోగం దొరికే వరకూ తండ్రి దగ్గర వ్యాపారంలో మెలుకువలు నేర్చుకోసాగారు.

పార్దుడికి తగిన ఉద్యోగానికి రాజాస్థానంలో ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలిసి అందులో పాల్గొన్నాడు పార్ధుడు. ఉత్తమ ప్రతిభను ప్రదర్శించాడు. తనకే ఆ ఉద్యోగం వస్తుందని అనుకున్నాడు. అయితే ఎంపిక ఫలితం తరువాత చెబుతామని అనడంతో ఇంటికి బయల్దేరాడు పార్ధుడు.

తిరుగు ప్రయాణంలో పార్ధుడు ఉండగా మార్గమధ్యంలో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. తన పేరు నందనుడనీ, రాజధాని పొరుగునే ఉన్న విజయపురం నివాసిననీ అతడు చెప్పాడు. పార్ధుడి కంటే పెద్ద వయసు వాడే కానీ ఇద్దరికీ స్నేహం కుదిరింది.

మాటల మధ్యలో తాను వెళ్ళిన పని చెప్పాడు పార్ధుడు. అది విన్న నందనుడు “నీకు ఆ ఉద్యోగం వస్తుందని నమ్ముతున్నావా?” అన్నాడు. బాగా ప్రతిభ కనబరిచిన విషయం చెప్పిన పార్ధుడు, ఆ ఉద్యోగం తనకే రావచ్చునని చెప్పాడు.

నందనుడు గట్టిగా నవ్వి “ఉద్యోగంపై ఆశలు పెట్టుకోవద్దు. ఇప్పటికే మరొకరికి ఇచ్చేసినట్టు రాజకొలువులో ఉన్న మా బంధువు చెప్పాడు” అన్నాడు.

ఆ మాటలు వినగానే డీలా పడ్డాడు పార్ధుడు. నందనుడి మాటలు నమ్మకుండా కొన్నాళ్ళు పాటు ఉద్యోగపు ఫలితం తెలిపే వార్త కోసం ఎదురు చూశాడు పార్ధుడు. చాలా రోజులు గడిచినా వార్త తెలియక పోయేసరికి దగ్గరలోని రాజోద్యోగిని కలిసి విషయం చెప్పాడు పార్ధుడు. రాజోద్యోగి తనకి తెలిసిన వాళ్ళని సంప్రదించి, ఆ ఉద్యోగంలో వేరెవరో చేరినట్టు, పనిచేస్తున్నట్టు చెప్పాడు. అది వినగానే చాలా బాధపడ్డాడు పార్ధుడు.

ఇకపోతే కృష్ణుడు కూడా కొన్ని ఉద్యోగాలకి జరిగిన ఎంపిక పరీక్షలలో పాల్గొన్నాడు. అయితే అందరూ అతడి కంటే ప్రతిభావంతులే వస్తుండడంతో ఉద్యోగం మీద ఆశ వదులుకున్నాడు. అతడి ప్రయత్నాలు గమనించిన ఒక అపరిచితుడు కృష్ణుడిని కలిసి, ధనం సర్దుబాటు చేస్తే ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. అతడు చెప్పింది నమ్మిన కృష్ణుడు తండ్రిని ఒప్పించి ధనం చెల్లించాడు. తరువాత చాలా రోజులు గడిచిపోయినా ఉద్యోగంలో చేరమని కబురు రాలేదు.

అప్పుడు మధ్యవర్తి గురించి వాకబు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించిన వాడు మోసగాడనీ, ఇంతకు ముందు చాలా మందిని మోసగించాడని తెలిసింది. తమ ధనం మీద ఆశ వదులుకున్నారు రుద్రయ్య కుటుంబం. ఉద్యోగమూ రాలేదు, ఇంట్లో ఉన్న ధనం కూడా నష్టపోయామని బాధపడ్డాడు కృష్ణుడు.

ఆ తరువాత కూడా చాలా ప్రయత్నాలు చేశారు పార్దుడూ, కృష్ణుడూ. ఎక్కడా కలిసిరాలేదు.
ఒకరోజు రుద్రయ్య కొడుకుల్ని పిలిచి “మన చాలా వ్యాపారాలలో శ్రద్ధ పెడితే నెల జీతానికి మించి ఇక్కడే సంపాదించవచ్చు” అన్నాడు. తండ్రి మాటల మీద గౌరవంతో వ్యాపారంలో దిగారు అన్నదమ్ములు. వ్యాపారరంగం కూడా అనుకున్నంత సులభం కాదు. అక్కడా విపరీతమైన పోటీ ఉంది.

తొలిప్రయత్నంలోనే కొందరు రాజోద్యోగులను మంచి చేసుకుని పేదల కోసం నడుపుతున్న అన్నసత్రాలకీ, వసతి గృహాలకీ సరుకులు పంపించే ఒప్పందం పొందారు అన్నదమ్ములు. అనుకున్న రోజుకి పంపడానికి వీలుగా సరుకుల నిల్వలు సిద్ధం చేసారు. చాలా మొత్తం ధనం వాటికి ఖర్చు చేశారు.

అంతలో సరకుల సరఫరా ఒప్పందం మరొక వ్యాపారికి అప్పగించినట్టు కబురు రావడంతో ఎందుకలా జరిగిందో తెలుసుకోవాలని వెళ్ళాడు పార్ధుడు. అక్కడ ఉన్న ఒక ఉద్యోగి “నేను చిన్న పరగణాకి అధికారిని. రాజుగారు పంపించిన వర్తమానం అమలు చెయ్యడం మా బాధ్యత. మంత్రిగారి దగ్గర పలుకుబడి ఉన్న మరొక వ్యాపారి ఈ ఒప్పందం దక్కించుకున్నారని తెలిసింది” అంటూ అశక్తత వ్యక్తపరిచాడు. దాంతో పార్దుడూ, కృష్ణుడూ పూర్తిగా డీలా పడిపోయి “మేము చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. నిజాయితీకి విలువే లేదు. జీవితంలో గెలుపు సాధించలేకపోతున్నాం” అన్నారు బాధగా.

ఇలా కాదని, కొడుకులిద్దరినీ పిల్చి కూర్చోబెట్టుకుని ఇలా చెప్పసాగాడు రుద్రయ్య.

“ఈ లోకంలో అవకాశాలకు కొదవలేదు. భూమి మీద పుట్టిన ప్రతిప్రాణికీ తగిన అవకాశం, ఆహారం, పనీ కల్పించాడు దేవుడు. దానికోసం గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో విఫలమయినప్పుడు కృన్గిపోకూడదు. మరొకసారి ప్రయత్నించాలి తప్ప బాధపడుతూ కూర్చోకూడదు. అలాగని అంత తేలిగ్గా అందితే ఎవరికీ దేని విలువా తెలిసే అవకాశమే లేదు. దేనికైనా మనలాగే పదిమందీ ప్రయత్నించినపుడు ఖచ్చితంగా పోటీ ఏర్పడి తీరుతుంది....

ఎవరికున్న దారులను వారు ఉపయోగించి ప్రయత్నించినపుడు, మనకున్న దారులేమిటీ...అవెంతవరకు మనకుపయోగపడతాయని ఆలోచించుకుని ముందుకు సాగాలి.......మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్న సమయంలో మీకింకా ఆర్థికంగా నా అండ, నేను సంపాదించి పెట్టిన మంచిపేరు ఎంతో కొంత ఉన్నాయి. అదే నేను మీ వయసులో బ్రతుకు దెరువు కోసం ఊరూరా సరుకులు తీసుకుని తిరిగే సమయంలో నాణ్యతను చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు. వారిని నమ్మించడంకోసం సరుకులు అరువుగానే ఇచ్చి వాళ్ళకు సంతృప్తి కలిగిన తర్వాతే మళ్ళీ వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది... అంతకంటే మీరెన్నిరెట్లు మీరే ఆలోచించుకోండి.....

నోరు జారిన మాట , ఎగిరి పోయిన పక్షి, గతించిన కాలము, పోగొట్టుకున్న అవకాశం తిరిగి లభించడం కష్టం. కాబట్టి జరిగిన దానిని తలచుకుని బాధ పడడం కంటే ఆ విషయం మరిచిపోయి కొత్త ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నిఒచాలి. తరువాత ప్రయత్నంలో విజయం తప్పక వరిస్తుంది. ఆలస్యం అవుతుందేమో కానీ సఫలీకృతులవడం ఖాయం’.

తండ్రి మాటలతో నూతన ఉత్సాహం తెచ్చుకుని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అనుకున్నది సాధించారు పార్ధుడు, కృష్ణుడు.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి