నాకూ బతకాలని ఉంది … - డా అప్పారావు.పంతంగి

నానాటి బ్రతుకు నాటకము
కానక కన్నది కైవల్యము…
పుట్టుటయు నిజము , గిట్టుటయు నిజము
నట్టనడుమ నీపని నాటకము...

అన్న అన్నమాచార్య సంకీర్తన గుర్తుకొస్తుంది.ఈ జగన్నాటకాన్ని చూస్తుంటే

అవును నిజమే కదా , పుట్టటం నిజం,గిట్టటం నిజం నడుమ ఈ జీవితమంతా నాటకమే కదా!జగన్నాటకమే కదా!! ఈ జగన్నాటకంలో పశుపక్ష్యాదుల నుంచి , క్రిమికీటకాదుల నుంచి అన్నీ తెలిసిన ,ఏమీ తెలియని మనిషి వరకు అందరికీ బ్రతుకంటే బోలెడంత తీపి. నాకూ బ్రతకాలని ఉంది అని అనుకోని క్షణం రాని జీవితం, ఈ లోకంలో ఏ ప్రాణికీ ఉండదేమో. తినగ తినగ వేము తీయనుండు అన్న వేమన మాటల్ని కొంచం మారిస్తే తినగ తినగ తీపి కూడా చేదవుతుందనిపించటం లేదూ…అయినా మనకుందిగా తినగా తినగా గారెలు కూడా చేదవుతాయట అలాగే బ్రతగ్గా బ్రతగ్గా బ్రతుకుమీద ఉన్న తీపి కూడా చేదవుతుందేమో…


బ్రతుకు బ్రతకడానికి కాదనుకున్నప్పుడు బ్రతకాలంటే భయం కలిగినప్పుడు చచ్చే వరకు బ్రతకాలి అన్నది మరిచినప్పుడు బ్రతుకు మహా చేదవుతుంది , బ్రతుకు బండెడు బరువవుతుంది.


************

దీపం మిణుకు మిణుకు మంటూ వెలుగుతోంది, వెలుతురు స్థిరంగా లేక వణుకుతోంది... పోవాలో ఉండాలో తెలియని ప్రాణంలాగా, సడీ చప్పుడు కాకుండా వీస్తున్న చల్లగాలికి. చీకటి,వెలుతురు నువ్వా నేనా అంటూ సమరం సాగించే సమయమది. చీకటే ఎక్కువ ఆవరించింది దీపంలో నూనెలేక,వెలుతురుని కాపాడుకునే చేతుల్లేక…వర్షం కురిసి వెలవలేదు , గొడవ జరిగి ఆగలేదు… అయినా ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందంటే బహుశా తుఫాను ముందు ప్రశాంతత అంటే అదేనేమో.ఆ ఇంట్లో మిగిలేది చీకటే అని చెప్పటం కోసమేనేమో చావాలనుకుంటున్న ఆ తల్లీపిల్లల మధ్య చీకటే మిగిలింది .

కరెంట్ పోయింది...

నిశబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడే అర్ధమయ్యింది వాళ్ళకి... ఆ అరుపులు విని పిల్లలిద్దరూ ఉలిక్కి పడ్డారు,సీతామహాలక్ష్మితో సహా...చెవులు రిక్కించుకొని వినవలసిన అవసరం లేదు రాత్రి వేళ కావడం చేత అరుపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి . నా కూతుర్ని రక్షించండి,నా కూతుర్ని కాపాడండి అంటూ ఆ తల్లి చేస్తున్న ఆర్తనాదాలు విని సీతామహాలక్ష్మి అలా తలుపు వరకు వెళ్లి చూద్దాం అనుకుంది.వెంటనే నా బ్రతుకే బండలైనపుడు ఇంకొకరిది మనకెందుకు అనుకుంది .వెనువెంటనే నలుగురితోపాటు నారాయణ, కులంతో పాటు గోవిందా అన్నారు. నలుగురూ ఉండే ఊరు ,నవ్వుకైనా,ఏడుపుకైనా నలుగురు కావలసిన తీరు..అందుకే అలా ఇంటి వాకిలి వరకూ వెళ్ళింది ఏమిటా చూద్దామని…

మంటలు నర్తిస్తున్నాయి , మంటలు కీర్తిస్తున్నాయి…

ఏ నాట్యమో తెలియదు , ఏ రాగమో తెలియదు …

కాని ఆ కళలో కాలిపోతుంది ఆడది,అది మాత్రం తెలుస్తుంది...లో లోపల నవ్వుకుంది. కాదు కాదు నవ్వుని అలుముకుంది…అయ్యయ్యో సాటి ఆడది మంటల్లో కాలిపోతుంటే ఆ దృశ్యాన్ని చూసి భయపడనేమిటి,ఆ సంఘటనకు బాధపడనేమిటి అసలు నేను ఆడదానినేనా అనుకుంది...నేను ఆడదానిని కాకపోవడం ఏమిటి ఆడదానినే, లేదంటే భర్త కొట్టినా,తిట్టినా,సిగరెట్లు కాల్చి వాతలు పెట్టినా, సీతామహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నందుకు ఆ సీతామ్మవారిని అనుమానించినట్టు నన్ను అనుమానిస్తున్నా సీతమ్మోరిశరలు పడుతూ ఇంకా ఎవరినీ చంపకుండా లేదా నేను చావకుండా సహనంతో ఉన్నానంటే నేను ఆడదానినే...

….. తన ఆలోచనల్లో స్థిరత్వం లేదు..వాళ్ళింట్లో వెలుగుతున్న దీపపు వెలుగు లాగా.....

సీతామహాలక్ష్మికి అది చూసిన తరువాత భయం అనిపించలేదు,బాధ అంతకన్నా లేదు అసలు తను మనిషినన్న భావనతో చలించనూ లేదు.. ఎందుకంటే తనకు ఇదేం కొత్త కాదు. అడుగడుగునా జరిగేదే కదా, అడుగడుగునా ఇదే కథ. ఏం జరగనట్టు లోపలికెళ్ళి కూర్చుంది సీతామహాలక్ష్మి.

*************

పాపం పిచ్చితల్లి, నాకు బతకాలనుంది...నాకు బతకాలనుంది అని ఎంత తపనపడిందో పాపిష్టి దేవుడు ప్రాణం లాక్కెళ్ళిపోయాడు.పసిపిల్లల్ని తల్లిలేనిదానిని చేశాడు.అంతా కట్టుకున్నోడివల్లే.... భూమిమీద నూకలు చెల్లిపోనాయి ఎల్లిపోయింది , తినే రాత లేదు, చిన్న వయసు అప్పుడే నూరేళ్ళునిండిపోనాయి,ఇంకెక్కడ కనిపిత్తది సచ్చిపోయింది అని ఆయమ్మ,ఈయమ్మ అనుకుంటున్న మాటలు సీతామహాలక్ష్మి చెవిన పడ్డాయి... అంతలోనే సీతామహాలక్ష్మి కూతురు చిన్నితల్లి...ఐదు ఆరేళ్ళు ఉంటాయనుకుంట...అమ్మా చచ్చిపోతే మన గురించీ ఇంతే మాట్లాడుకుంటారా,మనం ఇంక ఎవరికీ కనిపించమా, మనం కూడా అలా మంటల్లో కాలిపోతామా... (ఎప్పటి నుంచో కాలిపోతున్నారన్న సంగతి తెలియక) , ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ, చచ్చిపోయే ముందు నాకు బతకాలని ఉంది అని ఆ ఆంటీలాగా మనం కూడా అంటామా అమ్మా…!! అని అడిగితే సమాధానం చెప్పలేక పోయింది సీతామహాలక్ష్మి.

అమ్మా…నాకూ బతకాలని ఉంది అని చిన్నితల్లి అంటే తల్లి గుండెలు బ్రద్దలైపోయాయి ...అమ్మా చెప్పమ్మా.. మనమెందుకు చచ్చిపోవాలి... మా మాష్టారు చెప్పారు బ్రతుకున్నది బ్రతకటం కోసమని కాని నువ్వు చచ్చిపోదామంటున్నావు.బళ్ళో మాష్టారు చెప్పింది కరెక్టా,ఇంట్లో అమ్మ చెప్పేది కరెక్టా ఇప్పుడు నేను ఎవరిమాట వినాలమ్మా..నాకూ బతకాలనుందమ్మా అని చిన్నితల్లి మాట్లాడే పెద్ద మాటలకు సీతామహాలక్ష్మి ముఖం చిన్నబోయింది , గొంతు మూగబోయింది. కానీ చిన్నితల్లి గొంతు పెద్దదయ్యింది... చెప్పమ్మా...మనం ఎందుకు చచ్చిపోవాలి.ఓ...ఓ..హెచ్ ఐ వి ఉంటే ఎలాగూ చచ్చిపోతాం కదా అందుకే చచ్చిపోదామంటున్నవా… గుండెల్లో వేగం,పెదవుల్లో వణుకు,కళ్ళల్లో నీళ్ళు … ఈ విషయం చిన్నితల్లికి ఎలా తెలిసిందో అర్ధం కాలేదు.ఇదిగో తోక అంటే అదిగో పులి అనే సమాజంలో బ్రతుకుతున్నాం మనం, ఆ విషయం అర్ధమైతే చాలు.గోరంతలుదానిని కొండంతలు చేయటం జీవితంలో ఎప్పుడైనా చేసుంటే చాలు చిన్నితల్లికి ఎలా తెలిసిందో అర్ధమవుతుంది.

************

విషాద సమయం ఆసన్నమయ్యింది.వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు సెకన్ల ముల్లు,వెళ్ళాలా వద్దా అన్నట్టు నిముషాల ముల్లు గంటల ముల్లు నేసుకొని ఎట్టకేలకు 12 మీదకు చేరాయి.. భారంగా…సీతామహాలక్ష్మి జీవితంలా. ఇక ఆఇంట్లో రాహు కాలాలు ,యమ ఘడియలు మొదలవబోతున్నాయి రోజూలాగా... సమయం అర్ధరాత్రి 12 దాటింది.రఘురామ్ ఇంకా ఇంటికి రాలేదు.ఈపాటికి రావాలి...గంటలు 12 మ్రోగగానే అమ్మా నాన్న వస్తాడేమో కనిపించకుండా ఎక్కడైనా దాక్కుందామా,ఎటైనా పారిపోదామా నిన్న కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదు రా.. అమ్మా…ఎటైనా వెళ్దాం,పోనీ నువ్వు చెప్పినట్టు చచ్చిపోదామా,నాన్న కొట్టే దెబ్బలు తినడంకంటే చచ్చిపోవడమే నయం.బళ్ళో మాష్టారు చెప్పింది కాదమ్మ నువ్వు చెప్పిందే కరెక్ట్ చచ్చిపోదామమ్మా...

పిల్లల్ని గుండెకు హత్తుకుంది ఏంకాదు తల్లీ ఏంకాదు నాకు బతకాలనుంది అన్నావు కదా నీకే కాదు నాకూ బతకాలనుంది .ఈ రాత్రి గడవనీ తల్లీ ,రేపటి ఉదయం నుంచి మనం బతుకుదాం.బతుకంటే ఏమిటో తెలియచెప్పేలా బతుకుదాం, బతుకు విలువ అందరికీ తెలిసేలా బతుకుదాం.మన బతుకు మనం బతుకుదాం... పదండి పడుకుందాం అంటూ పిల్లల్ని నిద్రపుచ్చింది సీతామహాలక్ష్మి. చిన్నితల్లికి ఏమీ అర్ధం కాలేదు. నిద్రపోతున్నట్టు నటిస్తూ ఏం జరగబోతుందా అని ఎదురుచూస్తుంది. ఏదో హర్రర్ అండ్ సస్పెన్స్ సినిమా చూస్తున్నదానిలా...

**************

గేటు విరిగినట్టుంది , తలుపు పగిలినట్టుంది సీతామహాలక్ష్మి పిల్లల దగ్గర్నుంచి లేచి వచ్చేలోపే… రఘురామ్ అరిచిన అరుపులకు భయపడిపోయిందనుకుంట పోయిన కరెంట్ కూడా తిరిగి వచ్చింది . అంతకు ముందే వేసిన లైట్లు వెలిగాయి,ఫ్యాన్లు తిరిగాయి,టి.వి ఆన్ అయ్యింది అంతే కరెంట్ బిల్లు ఎవడు కడతాడే నీ పుట్టింటోళ్ళా...ఎవడి బాబు సొమ్ము ఇక్కడ తేరగా ఉందని ఇన్ని లైట్లు, ఫ్యాన్లు...అవునూ! నేను లేకుండా పడకగదిలో ఏంచేస్తున్నవే,ఆ జుట్టు ఏంటే అలా చెరిగిపోయింది, ఆ చీరేంటే అలా నలిగిపోయింది...ఇలా అయినదానికి , కానిదానికి భార్యను తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు రఘురామ్.ఇది తనకి కొత్తేం కాదు,అలవాటే….ప్రిజ్ లో ఉన్న మందు సీసా తీసుకురమ్మన్నాడు తెచ్చింది ,వేడి వేడిగా ఆంబ్లెట్ తీసుకురమ్మన్నాడు తెచ్చింది. వాళ్ళూ వీళ్ళూ అన్న మాటలు అప్పుడు గుర్తొచ్చాయి .ఆ మందు కలిపేటప్పుడు కాస్త ఎంట్రిన్ కూడా కలిపితే పీడవిరగడ అవుతుంది. ఆడదాని కడుపు చీల్చుకొని పుట్టిన వాడు ఆడదాని కడుపు మీద తంతున్నాడు.ఆడదాని ఉసురు తగిలి.... వాడిలాంటి వాళ్ళు బ్రతికితే, చస్తే... భూమికి భారం తీరుతుంది. ఈ మాటలు వింటే మొదట్లో పట్టలేనంత దుఖం వచ్చేది సీతామహాలక్ష్మికి కానీ ఇప్పుడు...

సీతామహాలక్ష్మి భారతీయ స్త్రీ కదా!తనకు పతియే ప్రత్యక్ష దైవం.భర్త తాగుబోతు అయినా,తిరుగుబోతు అయినా కొట్టినా,తిట్టినా పసుపు-కుంకాలూ, మనసు-మాంగల్యాలూ అంటూ పడి ఉండే సీతామహాలక్ష్మి లాంటి వాళ్ళు మారనంతకాలం రఘురామ్ లాంటి వాళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి.

************

తరాలు మారిపోతున్నాయి , అంతరాలు పెరిగిపోతున్నాయి , విలువలు తరిగిపోతున్నాయి
మనసులు కరిగిపోతున్నాయి , మమతలు చెరిగి పోతున్నాయి , కలతలు పెరిగిపోతున్నాయి
మనుషుల ఆలోచనలు , జీవన విలువలు , వేష భాషలు , ఆహారవిహారాలు అన్నీ అన్నీ మారిపోతున్నాయి

ఇన్ని మారగా లేనిది సీతామహాలక్ష్మి మారితే ఏమవుతుంది…మారిపోయింది . భర్త కొట్టిన దెబ్బలకు రక్తంకారినపుడు, ఇరుగు,పొరుగు వాళ్ళు చూసి ఇక ఇకలు,పక పకలు విదిలించినపుడు, ఒళ్ళు పులిసిపోయి నీరసంగా చెకప్ కోసం వెళ్ళినపుడు,ఆమెను చూసి, చెకప్ చేసి హెచ్..వి అని చెప్పినప్పుడు ,తనతో పాటు తన పిల్లలకు కూడా హెచ్..వి అని తెలిసినపుడు, వీటన్నిటికీ కారణం తన భర్తే అని అందరూ అన్నపుడు కూడా మారని సీతామహాలక్ష్మి నాకూ బతకాలనుందమ్మా అని చిన్నితల్లి అన్నప్పుడు మారిపోయింది. ఎంతైనా అమ్మ కదా! ప్రాణం పోస్తుందే కాని ప్రాణం తీయదు కదా!!

రఘురామ్ ని మందులో ఎంట్రిన్ కలిపి చంపుదాం అనుకుంది,ఆంబ్లెట్ లో సైనైడ్ కలిపి చంపుదాం అనుకుంది , కిరోసిన్ పోసి తగలబెడదామనుకుంది , కత్తికో కండగా నరుకుదామనుకుంది, ఇనుపరాడ్డు తీసుకొని తలబద్ధలు కొడదామ నుకుంది ఇలా ఎన్నో ఆలోచనలు...ఒక్కసారిగా సీతామహాలక్ష్మి ని చుట్టుముట్టాయి.ఇవేవీ చేయకూడదను కుంది.ఒక్కసారి కూర్చొని మాట్లాడాలనుకుంది , రఘురామ్ తో మాట్లాడటం మొదలుపెట్టింది

యావండీ !

ఎందుకిలా తాగుతున్నారు,తాగి తాగి ఇల్లు,ఒళ్ళు గుల్ల చేస్తున్నారు ఊళ్ళో, బంధువుల్లో పరువు లేకుండా పోయింది.పేరుకే మనుషుల్లాగా బతుకుతున్నాం. ప్రాణం లేని బంగారానికైనా విలువుంది కానీ మన బతుకులకు విలువలేకుండా పోయింది. ఇప్పటికైనా ఈ తాగుడు, తిరుగుడు మానండి, నా మాట వినండి , రఘురామ్ తను మాట్లాడే మాటలు వింటున్నాడనుకుంది కాని తను తాగిన మత్తులో నిద్రలోకి జారుకున్నాడు.తను మాట్లాడిన మాటలన్నీ రఘురామ్ కి జోలపాటలయ్యాయి.అయినా వదల్లేదు బిందెడు నీళ్ళు ముఖాన కొట్టి మరీ లేపింది మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది ఎందుకు మా జీవితాలు నాశనం చేశారు,ఎందుకిలా తాగుతున్నారు చెప్పండి ..చెప్పండి అని కాలర్ పట్టుకొని సీతామహాలక్ష్మి అడిగిన ప్రశ్నకు రఘురామ్ చెప్పిన సమాధానం నాకు బతకాలని ఉంది అందుకే తాగుతున్నాను, తాగకపోతే నేను బతకలేను అందుకే తాగుతున్నాను.ఏం చేస్తావు. …ఏం…చేస్తావు… ఏంచేస్తావో చేసుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో.... నీదిక్కున్న చోటికిపో.... అని రఘురామ్ తాగిన మత్తులో కూడా తడబడకుండా చెప్పాడు.

ఏంచేస్తావో చేసుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో… నీదిక్కున్న చోటికిపో...పదే పదే , ఇదే ఇదే సీతామహాలక్ష్మికి గుర్తొస్తుంది అవును ఆడదానికి పెళ్ళి అయితే దిక్కూ మొక్కూ లేనట్టే...మొగుడు ఏం చేసినా గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేసుకోవాలనే వాళ్ళే తప్ప అక్కున చేర్చుకొని ఆదరించే వాళ్ళు ఎవరున్నారు,పుట్టింటి వాళ్ళ దగ్గర్నుంచి,అత్తింటి వాళ్ళ వరకూ...వయా(జీవితం ప్రయాణం కదా!) బంధువులు కూడా…అందుకే ఆడదానిని తిట్టేటప్పుడు మొట్టమొదట , చిట్టచివర వచ్చే పదం నీ దిక్కున్న చోట చెప్పుకో,నీదిక్కున్న చోటికిపో.... ఆడది ఏం చేయగలదు మహా అయితే చస్తుంది అనుకుంటాం కానీ ఆడది తలచుకుంటే రాజ్యాలు కూల్చగలదు అవే రాజ్యాలు నిలబెట్టగలదు, ప్రాణాలు తీయగలదు అవే ప్రాణాలు పోయగలదు, అణువణువున కనిపించే ఆడది అడుగడుగును కదిలించే ఆడది ఏమైనా చేయగలదు. కానీ సీతామహాలక్ష్మి ఇవేవీ చేయలేదు, పిల్లల్ని తీసుకొని వాళ్ళని బతికించుకోవడానికి తాగకుండా బతకలేని, భరించలేని భర్తకు దూరంగా వెళ్ళిపోయింది .

నాలుగు దిక్కులూ నావేనంటూస్వేచ్ఛా జీవిని నేనేనంటూ...నాకూ బతకాలని ఉంది , అంటూ...

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి