ప్రేయసి రావే - లాస్య రామకృష్ణ

Preyasi Raave story by Lasya Ramakrishna

ప్పుడిప్పుడే సూర్యుడు అస్తమించడానికి సిద్దపడుతున్నాడు.నీలాకాశం నుదుటిపైన సింధూరం లా సూర్యుడు ముద్దొస్తున్నాడు. చల్లటి సాయంత్రం. వీచే గాలి ఈ పార్క్ లో ఉన్న చెట్లతో గుస గుస లాడుతోంది. సన్నగా మొదలవబోతోంది వర్షం అన్నట్టుగా వాతావరణం మారుతోంది.

క్రమంగా ఆకాశం లో మబ్బులు కమ్ముకున్నాయి. చినుకు చినుకు భూమి మీదకి పడుతోంటే మొట్ట మొదటి చినుకుల తడితో భూమి పై నుండి వచ్చే మట్టి వాసన తన ప్రేమ సంకేతాన్ని తెలుపుతున్నట్టుగా ఉంది.

నేను ఎదురుచూస్తున్న వ్యక్తి ఇంకా రాలేదు.

ప్రకృతి రొమాంటిక్ గా ఉంది. నా మనసులోని భావనలకి ప్రకృతి సహకరిస్తున్నట్టుగా ఉంది.

ఎన్నాళ్ళ నుండో నాలోని మౌనంగా దాగిన మాటని లేఖలో ఆమెకి తెలిపాను. ఆ అమ్మాయి ఎలా స్పందిస్తుందో ఈవేళ బయటపడబోతోంది.

ఆమె హృదయంలో సేదదీరే రోజు త్వరలోనే రాబోతోంది అని తలచుకుంటేనే నా మనసు పులకరిస్తోంది.

ఆమె సౌందర్యం వర్ణనాతీతం. మత్తెక్కించే ఆమె చూపు, వయ్యారాల నడక, అన్నింటికీ మించి ఆమెకి మాత్రమే ప్రత్యేకమైన ఒక స్టైల్.

ఆ స్టైల్ లో నే ఒక వైబ్రేషన్ ఉంది.

ఎంత ప్రయత్నించినా వేరే అమ్మాయిలు ఎవరికీ ఆమె స్టైల్ రాదు. పొందికగా అన్నీ చక్కగా ఎక్కడివక్కడ అమరినట్టుగా ఉండే శరీర సౌష్టవం. పెదవులు కదిపీ కదపకుండా ఆమె మాట్లాడుతుంటే మతి పోగొట్టే ఆమె ముఖ కవళికలు. నవ్వితే ఆమె ముందు పడిపోవడానికి సిద్దంగా ఉండే బోల్డు మంది అబ్బాయిలు. అలా నడచుకుంటూ వెళితే ఆమె వెనక ఏర్పడే క్యూ.

అమ్మాయిలకు కూడా ఈర్ష కలిగించేంత అందం ఆమె సొంతం. ఎప్పుడెప్పుడు తనతో పరిచయం చేసుకుందామా అని అబ్బాయిలు ఎదురుచూస్తూ ఉంటారు.

అలాంటి అమ్మాయితో మాట్లాడే అవకాశం కోసం అబ్బాయిలంతా ఎదురు చూస్తూ ఉంటే ఆ అమ్మాయే నాతో మాటలు కలపడం నాకు అమితానందం కలిగించింది.

ఆ సంఘటన తరువాత నేను కనీసం రెండు రోజులు నిద్రాహారాలు లేకుండా ఉన్నాను.

ఆ రోజు సోమవారం.

ఉదయం పది గంటలకి యదా విధిగా తయారయి ఆఫీసు బస్సు కోసం ఎదురుచూస్తున్నాను. ఆ అమ్మాయి కూడా మా ఆఫీసులోనే పనిచేస్తుంది అనుకుంట. మొట్ట మొదటి సారి ఆ అమ్మాయిని చూసాను.

ఎంతో సైలెంట్ గా సిన్సియర్ గా ఉండే నేను ఆ అమ్మాయిని చూసిన తొలిచూపులోనే మనసు పారేసుకున్నాను.

ఆ రోజు తను బేబీ పింక్ కలర్ శారీ లో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకుని వాటిపైన బ్లాక్ కలర్ బీడెడ్ నెక్లెస్ వేసుకుంది. వంశీ సినిమాలోని హీరోయిన్ లా ఆ అమ్మాయికున్న డ్రెస్ సెన్స్ నన్ను ఆకర్షించిన వాటిలో ముఖ్యమైనది. వేరే ఆకర్షణల గురించి చెప్పేదేముంది. బ్లాక్ కలర్ హాఫ్ షూస్ తెల్లని ఆమె పాదాల అందాన్ని రెట్టింపు చేసాయి.

బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ బీడ్స్ పాపిడి చైను, నిలువాటి బ్లాక్ కలర్ బొట్టు, ఆ బొట్టు పైన మెరిసే ఇంకొక గుండ్రటి బొట్టు, కంటికి కాజల్, పెదవులకి లైట్ పింక్ లిప్ గ్లాస్ తో ఆకర్షణీయమైన తన చెవులకి పొడవైన బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ హాంగింగ్స్ ముద్దోస్తున్నాయి. చేతులకి బోలెడు గాజులతో మోడరన్ కం ట్రెడిషనల్ లుక్ ని క్యారీ చేసిన ఆ అమ్మాయి పేరే హాసిని అని ఆఫీసులో ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను.

చాలా రిజర్వుడ్ గా ఉండే ఆ అమ్మాయి ఎవరికీ అతిగా చనువిచ్చేది కాదు. ఆమె ఎక్కువగా రోజీ అనే అమ్మాయితోనే మాట్లాడేది. కాఫీ కి, టిఫిన్ కి రోజీ తోటే వెళ్ళేది.

నిన్న సాయంత్రమే ఏదో క్లైంట్ ఇష్యూ విషయంలో నా డెస్క్ వద్దకి వచ్చినప్పుడు అందరూ నన్నొక అదృష్టవంతుడిని చూసినట్టు చూసారు.

అప్పుడే తనతో తొలిసారిగా మాట్లాడాను. ఆమె మాట్లాడుతున్నంత సేపు నాకు ఏమీ వినిపించలేదు. ఆ అందం నా చెవులని పనిచెయ్యకుండా చేసింది.

"ఓకే హర్ష, థాంక్ యు, ప్లీజ్ అప్డేట్ ది క్లైంట్ అబౌట్ దిస్ ఇష్యూ" అని తను వెళ్లిపోతుంటే అర్ధమయింది ఇదేదో ఇంపార్టెంట్ క్లైంట్ కి సంబంధించిన ఇష్యూ అని.

మళ్ళీ విషయం అడిగే సరికి ఆమె మొహం లో కలిగిన చిరాకు నాకు ఇంకా గుర్తుంది. చిరాకు లో కూడా ఆమె అందంగా ఉంది.

"యా, ఫైన్ ఐ విల్ అప్డేట్ అండ్ కన్ఫర్మ్ యు" అని చెప్పాను.

తను వెళ్లిపోతుంటే నా మనసు ఏంతో బాధపడింది. వీలయితే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ అని అడగమంది. కానీ నా భయం నాకు అడ్డొచ్చింది.

పక్క డెస్క్ లో ఉన్న నా స్నేహితుడు మరియు కొలీగ్ అయిన వెంకట్ నన్ను గమనించి "ఏంటి మామా, లవ్ లో పడినట్టున్నావు"

"అరె, ఎలా రా కనిపెట్టేసావు"

"ఇప్పటికి పదిహేను మందిని ప్రేమించాను నాకు తెలియదా" అని హీరోలా పోజ్ ఇవ్వబోయి కింద మెట్లు గమనించకుండా కమెడియన్ లా పడ్డాడు.

నవ్వుని బలవంతంగా ఆపుకోలేక పగలబడి నవ్వేసి వాడిని పైకి లేపి "పదిహేను మందినా" అని వాడి టాలెంట్ ని గమనించినట్టుగా అడిగాను.

"అవునురా అమ్మాయిలను ఎలా పడేయ్యాలో నన్నడుగు. అందులో పి హెచ్ డి చేసాను" అన్నాడు

"అయినా అంత మంది ఎందుకురా. ఒకరు లేకపోతె ఇద్దరు చాలు కదా" అని నా ధర్మ సందేహాన్ని వ్యక్తం చేశాను.

"నాకు లైఫ్ లాంగ్ లవ్ మీద నమ్మకం లేదురా"

"అదేంట్రా, ప్రేమంటేనే నమ్మకం కదా"

"నమ్మకం, అది నా మొదటి ప్రియురాలికి లేకపోవడం వల్లే ఈ షార్ట్ టర్మ్ ప్రేమల కాన్సెప్ట్ ని కనిపెట్టా"

"ఇంతకీ ఇప్పుడు ఎవరిని పీడిస్తున్నావ్ సారీ ప్రేమిస్తున్నావ్"

"ఇప్పుడు నా లవ్ జెనీలియా, తను ఒట్టి మొండి ఘటం. ఇంకా నా లవ్ ని యాక్సెప్ట్ చెయ్యట్లేదు. "నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీవేళ" అంటూ ఒక పాట పాడి పడేయాలి. నా లవ్ స్టోరీస్ గురించి నీకు చెబితే తట్టుకోలేవు గాని నీ సంగతి చెప్పు"

నా సంగతి చెప్పేదేముంది ఇంకా ఈ కాన్సెప్ట్ లో పాకే విద్యార్ధులం.

"ఎవరి మీద"

"ఎవరి మీద కాదురా మహా ప్రభో, నువ్వు పి హెచ్ డి అన్నావు కదా మేము ఎల్ కె జీ అన్న మాట"

"అర్ధమయింది అర్ధమయింది. నీకంత సీను లేదని నాకు ముందే తెలుసు. ఇంతకీ ఆ అమ్మాయికి నువ్వు ప్రేమిస్తున్న విషయం తెలుసా"

"ఇంకా నాకే తెలియదు. ఇవాళే తెలిసింది. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియట్లేదు."

"మై హూ నా, నీకేం భయం లేదు. పద కేఫటేరియాకి నాకొక పిజ్జా, ఒక చికెన్ బిర్యానీ, ఒక పెప్సీ ఆర్డర్ చెయ్యి. నీకొక అద్భుతమైన ఐడియా ఇస్తాను"

"సర్లే తప్పదుగా" అన్నాను గుస గుసగా

కట్ చేస్తే సీన్ కేఫటేరియా లో.

హాసినీ తన ఫ్రెండ్ రోజీ తో కలిసి లంచ్ కి వచ్చింది. నేను ఈ బకాసురుడు అలియాస్ వెంకట్ తో లంచ్ కి వచ్చాను.

బిల్ పే చేసేది నేనే కాబట్టి మరికొన్ని ఆర్డర్ చేస్తూ వాటిని ఆస్వాదిస్తూ మధ్య లో "ఆ ఇప్పుడు చెప్పరా" అన్నాడు వాడు.

"అదేరా నా ప్రేమ విషయం ఆ అమ్మాయికి ఎలా చెప్పాలి. నా కసలే ఇలాంటి విషయాలు కొత్త"

"అందుకేరా దేవుడు నన్ను నీకు స్నేహితుడిగా ఇచ్చింది. నువ్వు ఎంత తొందరగా ఆ అమ్మాయితో నీ ప్రేమను చెప్పేస్తే అంత మంచిది. ఇప్పటికే మన ఆఫీసు లో ని పెళ్ళైన మగవాళ్ళతో సహా పెళ్లి కానీ మగవాళ్ళ కళ్ళన్నీ ఆమె పై పడ్డాయి"

"అయ్యో, నన్నింకా భయపెట్టకురా, అసలు విషయం చెప్పు"

"వెంటనే ఆ అమ్మాయిని ప్రపోజ్ చెయ్యి"

"చెళ్ళు మని లాగి కొడితే"

"అవును కదూ, ఆ రిస్క్ కూడా ఉంది"

"???"

"ఓకే, నాకొక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది"

"మెరుపు, కొంచెం తెలుపు"

"ప్రేమ లేఖ"

"ప్రేమ లేఖా?"

"అవును, ప్రేమలేఖ రాయడం"

"నాకు లీవ్ లెటర్ రాయడమే రాదు, లవ్ లెటర్ ఎలా రాయాలి"

"మళ్ళీ మై హూ నా, డిన్నర్ కూడా నువ్వే ఇప్పించు లవ్ లెటర్ సిద్దం చేసేస్తా. నీ ఆటోగ్రాఫ్ మాత్రం ఇవ్వు" అని చటుక్కున అయిదు నిమిషాలలో లవ్ లెటర్ ని సిద్దం చేసేసాడు.

"ఓకే రా థాంక్ యు సో మచ్. కానీ ఎలా ఇవ్వాలి, నువ్వెళ్ళి ఇస్తావా?"

"నేను వెళ్లి ఇస్తే, లెటర్ కన్నా లెటర్ తెచ్చి ఇచ్చిన నీ ధైర్యం నచ్చింది అని ఆ అమ్మాయి నాతో లవ్ లో పడే అవకాశం ఉంది జాగ్రత్త"

సినిమాలో కమెడియన్ మొహము నువ్వు. నిన్ను చూసి ఎవరు లవ్ లో పడతారురా.

"ఏంటి బాస్, చెప్పు"

"ఆ లవ్ లెటర్ ఎలా ఇవ్వాలో ఐడియా ఇవ్వరా"

"అందుకే కదరా మన ఆఫీసు వాళ్ళు ఎంప్లాయిస్ కి ఫ్లోర్ కి అవతల లాకర్స్ ఇచ్చింది. సైలెంట్ గా వెళ్లి లవ్ లెటర్ ని ఆ అమ్మాయి లాకర్ లో పడెయ్యి. అంతే. మాటర్ క్లోజ్"

"ఇన్నాళ్టికి ఒక మంచి ఐడియా ఇచ్చావు రా. నువ్వు తిన్న ఈ ఫుడ్ కి ఋణం తీర్చుకున్నావు. మరి ఆ అమ్మాయి లాకర్ నెంబర్ ఎంతో"

"లాకర్ నంబర్ 9 రా తను హ్యాండ్ బాగ్ అందులో పెడుతుంటే చూసాను"

"ఓహ్ థాంక్ యు సో మచ్"

ఇద్దరం సైలెంట్ గా వెళ్లి ఎవరూ చూడట్లేదు అని నిర్ధారించుకున్నాక పింక్ కలర్ లవ్ లెటర్ ని ఆమె లాకర్ లో ని సన్నటి సందులోంచి లోపల తోసేశాం.

ఆ లెటర్ లో రాసినట్టు ఇవాళ నన్నుకలవడానికి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందని నేను ఎదురుచూస్తున్నాను.

అదిగో వస్తోంది తనే అనుకుంట.

నా మనసు దోచుకున్న ప్రేమ దేవత నా కోసం వస్తోంది. నాకు సిగ్గేస్తోంది. తనే వచ్చి నన్ను పలకరించాలి అనుకుంటూ నేను ఇటువైపు తిరిగి నించున్నాను.

నా దగ్గరికి వచ్చినట్లు ఆమె పట్టీల శబ్దం చెప్తోంది.

"నా భుజం పైన ఆమె చెయ్యి వేసి "హర్షా, ఐ టూ లవ్ యు, నేనే ఈ విషయం నీకు చెబుదామని అనుకున్నాను. కానీ ఆడపిల్లను కదా, సిగ్గేసింది" అని అంది.

"హుర్రే" అంటూ ఒక గెంతు గెంతి పట్టు తప్పి కిందపడిపోయాను.

"హర్షా జాగ్రత్త" అని నాకు తన మెత్తటి చెయ్యినందించింది.

తల ఎత్తి చూస్తే నేను హాసినీ కి రాసిన ప్రేమ లేఖను చేత్తో పట్టుకుని సిగ్గుపడుతున్న రోజీ.

మరిన్ని కథలు

Markatapuram-Story picture
మర్కటపురం
- యు.విజయశేఖర రెడ్డి
Daridrudu
దరిద్రుడు
- mahesh amaraneni
Giligadi vachche puligadu chachche
గిలిగాడు వచ్చె-పులిగాడు చచ్చె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kotta jeevitam
కొత్త జీవితం
- చచెన్నూరి సుదర్శన్
Yachakulu kaanidi evaru
యాచకులు కానిది ఎవరు?
- యాచకులు కానిది ఎవరు?.
Vimukti eppudo
విముక్తి ఎప్పుడో!
- రాము కోలా.దెందుకూరు.
Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.