చూపులు కలవని శుభవేళ - మాలాకుమార్

choopulu kalavani shubhavela

"ఏందిరా యాద్ గిరీ పండావు, డాక్టర్ సాబ్ ఇంటికి బోలే" స్టూడియోలోకి వస్తూ , బెంచి మీద పడుకొని వున్న యాదగిరి ని అడిగాడు వెకటేశ్.

"లేదన్నా కడుపులనొస్తోంది. నువ్వొచ్చినంక చెప్పి ఇంటికిబోదమని పండుకొన్నా."జవాబిచ్చాడు యాదగిరి.

"బయట తినొద్దురా అంటే వినవ్. ఏం తిన్నవురా ? "అడిగాడు వెంకటేశ్.

"ఏం తినలేదన్నా."మూలుగుతూ జవాబిచ్చాడు.

"మరి డాక్టర్ సాబ్ ఇంటికి రఘుబోయినాడు రా ?"అడిగాడు వెంకటేశ్.

"లేదన్నా , వాడి తాత దినాలని వూరెళ్ళిండు."

"ఎన్ని సార్లు దినాల కెళుతాడురా?" విసుక్కుంటూ "శ్యాం ఏడి ? వాడెళ్ళిండా?" అడిగాడు.

"లేదన్నా వాడి అమ్మకు బాగలేదట, దవఖానా కు తీసుకెళ్ళిండు."

"ఓరినీ దుంపల్తెగ అందరికీ ఈ రోజే ఏమొచ్చిందిరా?"కంగారుపడిపోయాడు వెంకటేశ్.

"అన్నా ఇగనేనింటికి బోతా."ముక్కుతూ మూలుగుతూ వెళ్ళిపోయాడు యాద్ గిరి.

ఇంక తప్పదన్నట్లు తనే విడియో తీసుకొని, పని కుర్రాడు సాయి ని బతిమిలాడి బామాలి వెంటతీసుకొని వెళ్ళాడు.పెళ్ళి హాల్ లో కెమెరామాన్ శేషు వెనక వరసలో దిగాలుగా కూర్చొని వున్నాడు!

"ఏమైందన్నా అట్లా వున్నావు?" అని అడిగాడు వెంకటేశ్.

"మా పొరగాళ్ళందరూ రాకుండా తప్పించుకున్నారు.ఎందుకా అనుకున్నాను, ఇక్కడికొస్తే తెలిసింది, ఇక్కడ అందరికీ కళ్ళకలకలు వచ్చాయి.కనిపిస్తలే , అందరూ నల్లకళ్ళద్దాలు పెట్టారు."అన్నాడు శేషు.

"హోరినీ ఇందుకా మా పోరగాళ్ళు కూడా తప్పుకున్నారు."ఆశ్చర్యపోయాడు వెంకటేశ్.

ఇంతలో పెళ్ళి తంతు మొదలైందని వీళ్ళను రమ్మని పిలిచారు. ఏమైనా మనం తప్పించుకోలేము కదా అని ఒకరినొకరు దీనంగా చూసుకుంటూ , తమతమ సరంజామా సద్దుకొని లేచారు.

సన్నాయి వాళ్ళు శ్రావ్యం గా వాయిస్తున్నారు.మల్లెపూల సువాసనలు గాలిలో తేలి వస్తున్నాయి.చిన్నపిల్లలంతా కళ్ళద్దాలు సద్దుకుంటూ సరదాపడిపోతూ హాలంతా పరుగులుపెడుతున్నారు. హాలంతా సందడి సందడిగా వుంది. ఒకరిమాట ఒకరికి వినిపించకపోయినా గొంతు పెంచి మరీ గలగలా మాట్లాడేసుకుంటున్నారు.అథిదులు ఒకరొకరుగా వస్తున్నారు. హాల్ బయట నల్ల కళ్ళద్దాలు అమ్ముకుంటున్న అతనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏ పెళ్ళి హాలు ముందైనా బూరలు, బూజు మిఠాయి లాంటివి అమ్ముకుంటారు. కాని ఇక్కడ ఏమిటీ నల్ల కళ్ళద్దాలు అమ్ముతున్నారు అనుకుంటూ లోపలికి వస్తే అంతా కళ్ళ జోళ్ళ తో కనిపించారు.

"అదేమిటండీ , ఈ పెళ్ళి లో నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవాలని ఏమైనా డ్రెస్ కోడ్ ఏమైనా పెట్టారా?" వింతగా పరంధామయ్య , వెంకట్రావును అడిగాడు.

"అబ్బే లేదండి . వూళ్ళో కళ్ళకలక వుంది కదా , పెళ్ళింట్లో అందరికీ వచ్చింది. ఇక్కడేదో లాభసాటి బేరం అనుకొని కళ్ళజోడు షాప్ వాడు మొత్తానికి ఇక్కడే అమ్మకాలు మొదలు పెట్టాడు. ఎందుకైనా మంచిది మీరు ఓటి పెట్టుకోండి . మీకు రాకుండా వుంటుంది ."అన్నాడు. భోజనాల దగ్గర అందరిని కనుక్కుంటూ తిరుగుతోంది సుభద్ర. మామ్మగారు సుభద్రను పిలిచి "అమ్మాయ్ కొత్త నెక్లెస్ కొన్నావుటే , చూపించు అంది."

"లేదు మామ్మా జాకెట్ కు నెహ్రూ కాలర్ పెట్టించుకున్నాను. దాని మీద ఎంబ్రాయిడరీ చేసుకున్నాను. అది నీకు కళ్ళద్దాలలో నుంచి నెక్లెస్ లా కనిపిస్తున్నట్లుంది ." అంటూనే అటుగా చేతిలో ఐస్క్రీం తో వెళుతున్న చింటూ ని రెక్క పట్టుకొని ఆపి, "వెధవా ఇది ఎన్నో ఐస్క్రీం రా ?"అని గదమాయించింది.

"అమ్మా నీకు కనిపిస్తోందా ?" ఆశ్చర్యంగా అడిగాడు చింటూ.

"ఏరా నాకు కనిపించదనుకొని ఇన్ని తినేస్తున్నావా ?వెధవా మళ్ళీ ఐస్క్రీం దగ్గరకు వచ్చావంటే నాలుగు తగిలిస్తాను."అని కోపం చేసి వాడిని వదిలేసింది.

పెళ్ళి కూతురిని తీసుకొచ్చి పీటల మీద కూర్చో పెట్టారు.మధ్యలో తెర పట్టారు. ముహూర్తానికి ఇంకా సమయము వుందని పెద శాస్త్రులుగారు ఏవో మంత్రాలు చదువుతున్నారు. ఇదే సందని పెళ్ళికొడుకు గోపీ తెరను కొంచం కిందికి దించబోయాడు. చిన్న శాస్త్రులుగారు తెర పట్టుకొని "అయ్యా పెళ్ళికొడుకు గారూ మీరలా చూడకూడదు " అన్నాడు.

"శాస్త్రులుగారూ, ఈ నల్ల కళ్ళాద్దాల వారు , అసలు పెళ్ళికూతురినే తెచ్చారో , ఇంకెవరినన్నా తీసుకొచ్చారో ఓసారి చూడనీయండి."అన్నాడు గోపీ.

"పెళ్ళికుమార్తె గారి అన్నయ్య మీ స్నేహితులేనట కదా ? వారు పొరపాటు ఎందుకు పడతారు?" అని ప్రశ్నించాడు చిన్న శాస్త్రులు గారు."అదేనండి సమస్య. ముందే వాడికి పెళ్ళికాకుండా నాకైతోందని కుళ్ళుకుంటున్నాడు.ఇప్పుడు పొరపాటు చేసాననటానికి వీలు చిక్కింది. మీకు తెలీదండి , పెళ్ళికూతురు మారిపోతే నా కొంప కొల్లేరవుతుంది.నన్ను చూడనీయండి."

“అయ్యా పెళ్ళికొడుకు గారూ, మీరలా పేచీలు పెట్టకూడదు. "

"ఏమిటీ నేను నిన్ను చూసి కుళ్ళుకుంటున్నానా ? నాకు తోచలేదు ఏ ఎత్తుపళ్ళు, మెల్లకన్ను వున్నదాన్నో తేవాల్సింది తిక్క కుదురేది." పెళ్ళికూతురు అన్న సుధీర్ పోట్లాటకు దిగాడు.

"ఊ ఊ ఇక సమయమైంది. పెళ్ళికొడుకుగారూ మీ చేయి ఇలా ఇవ్వండి "అంటూ చేయి అందుకున్నారు పెద్దశాస్త్రులవారు.

"అయ్యో అయ్యో నేను పెళ్ళికుమారుని కాదండి. వాడి తండ్రిని. శాస్త్రులు గారు కాస్త జాగ్రత్తగా గమనించి చేయండి. లేదా మీ కళ్ళ జోడు తీసేయండి ."అని కొంచం కోపంగా అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి.

"అయ్యా క్షమించండి. కళ్ళజోడు తీస్తే కష్టం కదండి . జాగ్రత్తగానే వుంటాను లెండి ."అని వధువు, వరునితో జీలకర్రాబెల్లం పెట్టించి తెరతీసారు శాస్త్రులు గారు.

"బాబూ పెళ్ళికొడుకు గారూ, అమ్మా పెళ్ళికూతురుగారూ మీరిరువురూ ఒకరినొకరు చూసుకోండయ్యా . ఈ శుభముహూర్తాన మీ చూపులు కలవాలి."అన్నారు శాస్త్రులు గారు.

గోపీ, రేఖా కళ్ళద్దాలు తీసారు .ఒకరినొకరు చూసుకున్నారు . ఇద్దరి కళ్ళూ ఎర్రగా నిప్పుఖణికలలా వున్నాయి .కళ్ళద్దాలు తీయగానే కళ్ళ నుంచి జలజలా నీరుకారి మసకగా ఐపోయాయి.

"ఏ చూపులు కలవటమో అసలు చూడటమే కష్టమైపోతోంది. సన్నాయి వాళ్ళూ చూపులు కలసిన శుభవేళా అని కాదయ్యా , చూపులుకలవని శుభవేళా అని వాయించండి ." అని గొణిగాడు పెళ్ళికొడుకు!

మరిన్ని కథలు

Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి
Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.