నీవు నేర్పిన విద్యయే... - మౌద్గల్యస

neevu nerpina vidyaye

‘‘ఈ సమస్య నుంచి సూర్యారావు ఒక్కడే తనను తేలిగ్గా బయట పడేయగలడు. వెంటనే అతన్ని కలవాలి. వివరాలు చెప్పాలి’’ అనుకున్నాడు దాలయ్య.

ఆ ఊళ్లో క్రిమినల్ లాయర్ గా సూర్యారావుకి మంచి పేరుంది.

‘‘అతను ఎలాంటి క్లిష్టమైన కేసులనయినా చేపడతాడు. అవతల వాళ్లని తికమక పెట్టి తిమ్మిని బమ్మిని చేసయినా అవలీలగా చిక్కులు బయట పడేస్తాడు. కేసు చేపట్టాడంటే నీపంట పండినట్టే ’’ తెలిసిన వాళ్లెవరో దాలయ్యకు సలహా ఇస్తే అతని ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు.

అతను వెళ్లేసరికి సూర్యారావు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వాళ్లను పంపించాక దాలయ్యను వచ్చిన పని గురించి అడిగాడు. దాలయ్యకి చిన్న షాపు ఉంది. అది పెట్టుకోటానికి ఊర్లో మార్వాడీ నుంచి అప్పు చేశాడు. అందుకు నెలనెలా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాడు.
ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. ఖర్చులూ పెరిగాయి. కొత్త కొత్త షాపింగ్ మాల్స్ రావటంతో షాపులో బేరాలు తగ్గు ముఖం పట్టాయి. వ్యాపారం కష్టమవుతోంది. దాంతో నెలనెలా వడ్డీ చెల్లించటం భారమయింది.

ఇలాంటి పరిస్థితుల్లో తను అప్పు కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదురువుతాయంటూ మార్వాడీ చేసిన హెచ్చరికలు తనను కలవరపరుస్తున్న సంగతిని దాలయ్య ఏకరవు పెట్టాడు.

‘‘నేను తీసుకున్న అప్పు కంటే కట్టిన వడ్డీ చాలా ఎక్కువ. ఇంకా చెల్లించాలంటే నా వల్ల కాదు. తలకు మించిన ఈ భారం మోయలేను. మార్వాడీ డిక్రీ పొందితే తను తనఖా పెట్టిన ఇంటిని కూడా స్వాధీనం చేసుకోటానికి చట్టం వెసులు బాటు కల్పిస్తోంది. ’’ అతని వైపు సానుభూతిగా చూశాడు సూర్యారావు.

‘‘అసలే వ్యాపారం దివాళా తీసిపోయింది. ఉన్న ఇల్లు కూడా మార్వాడీ పాలయితే, నేనూ, నా పిల్లలు వీధిన పడతాం. దయచేసి నన్ను ఈ ప్రమాదం నుంచి బయట పడేయండయ్యా.. లేకపోతే అంతా కలిసి ఆత్మహత్య చేసుకోవటం తప్ప గత్యంతరం లేదు’’ కన్నీటి పర్యంతమయ్యాడు దాలయ్య.

సూర్యారావు తీవ్రంగా ఆలోచించాడు. రకరకాల ప్రశ్నలు వేసి సమాచారం తీసుకున్నాడు. అతని చెప్పిన సమాధానాలన్నీ విని సంతృప్తి చెంది...

‘‘ నీ కేసు నేను తీసుకుంటున్నాను. ఫీజు అవసరంలేదు.. కాకపోతే.. నీ కుడిచేతకున్న కంకణం నాకు బహుమతిగా ఇవ్వాలి’’. తన కోరికను బయటపెట్టాడు సూర్యారావు.

తాత ముత్తాల నుంచి తనకు వారసత్వంగా వచ్చిన ఆ కంకణాన్ని వదులుకోటానికి దాలయ్యకు మనస్కరించలేదు. అది తమకు సెంటిమెంట్. మరణించేవరకూ అది తన చేతిలో ఉండవలసింది. అలాంటిదాన్ని తనెలా ఇవ్వగలడు?

సూర్యారావు కోరికను కాదంటే కేసు తీసుకోడు. అప్పుడు మార్వాడీ చేతిలో తను బలికాక తప్పదు. తర్వాత ఏదయిదే అదవుతుంది. ప్రస్తుతానికి తలాడిస్తే పోలా?’’ అని మనసులో అనుకుని...

‘ అలాగే... మీరు కోరినట్టే ఈ కంకణం ఇచ్చేస్తా’.. నమ్మకంగా చెప్పాడు.

సూర్యారావు సంతృప్తి చెందాడు.

తనకు కావలసిన అన్ని వివరాలు దాలయ్య నుంచి రాబట్టాడు.

కోర్టులో నడుచుకోటమెలాగో వివరించాడు.

‘‘ నువ్వు మార్వాడీ నుంచి అప్పు తీసుకున్నావా?’’ ప్రశ్నించాడు జడ్జి బోనులో ఉన్న దాలయ్యను ఉద్దేశించి...‘‘ ఇచ్చినవాడెవడు? పుచ్చుకున్నవాడెవడు? ’’ సమాధానమిచ్చాడు దాలయ్య.

‘‘నా ప్రశ్న నీకు సరిగా అర్ధం కాలేదనుకుంటా?’’ మళ్ళీ అడిగాడు.

‘‘ నువ్వు ఈ మార్వాడీ దగ్గర అప్పు తీసుకున్నావా? నెలనెలా వడ్డీ కట్టవలసి ఉన్నా... అది కట్టటం లేదని నీ పైన ఫిర్యాదు.. దీనికి నువ్వేమంటావ్?’’

దాలయ్య చెప్పాడు.

‘‘ ఇచ్చినవాడెవడు? పుచ్చుకున్నవాడెవడు?’’

‘‘ అది కాదు... దాలయ్యా? నేను అడిగిన ప్రశ్న..’’ జడ్జి అసహనంగా వ్యక్తం చేశాడు.

‘‘ ఇచ్చినవాడెవడు? పుచ్చుకున్నవాడెవడు?’’ అన్నాడు దాలయ్య.

ఇక చేసేది లేక జడ్జి మౌనం దాలిస్తే.. మార్వాడీ తరపున లాయరు బోను దగ్గరకు వచ్చి..

‘‘దాలయ్యా? నువ్వు అప్పు తీసుకుని నెలనెలా వడ్డీ చెల్లించకుండా.. నా క్లయింట్ ను ఇబ్బంది పెడుతున్నావ్? దీని వల్ల ..’’ ఇంకా ఏదో చెప్పబోయాడు.

‘‘ ఇచ్చిన వాడెవడు? పుచ్చుకున్నవాడెవడు?’’ - దాలయ్య.

‘‘నేను తెలుగులోనే అడుగుతున్నా... నేనేదో అడుగుతుంటే.. నువ్వు చెప్పిందే చెబుతావే? విసుగ్గా అన్నాడు మార్వాడీ తరపు లాయర్.అంతలో సూర్యారావు లేచి నిలబడ్డాడు.

‘‘ అయ్యా.. జడ్జిగారూ.. నా క్లయింట్ అమాయకుడు.

గతంలో పొగాకు వ్యాపారం చేసేవాడు. ఓ సారి గోడౌన్ తగలబడిపోయి.. మొత్తం అంతా నాశనమయిపోయింది. దాంతో దివాళా తీశాడు.ఇన్సూరెన్సు కూడా లేకపోవటంతో ఉన్న ఆస్తి మొత్తం హరించుకు పోయింది.

అంతే కాదు. అది మతి చలించింది. అప్పట్నుంచి ఇదే వరస...

ఈ సంగతి తెలిసి మార్వాడీ దురాశతో అతనిపై కేసు పెట్టాడు.

దయచేసి సానుభూతితో పరిశీలించి ఇతనికి కేసు నుంచి విముక్తి ప్రసాదించ వలసిందిగా కోరుతున్నాను’’ సూర్యారావు మాటలు జడ్జిని కదిలించాయి.

‘ అమాయకుడయిన దాలయ్యను కోర్టుకు లాగినందుకు మార్వాడీని మందలించారు. పరిహారంగా కోర్టు ఫీజు చెల్లించవలసిందిగా ఆదేశాలు జారీచేశారు.

దాలయ్య నిరపరాధిగా బయటపడ్డాడు.సూర్యారావు పెదాలపై చిరునవ్వు తళుక్కుమంది.

కేసు గెలిచిన ప్రతిసారీ అతను అలాగే నవ్వుకుంటాడు.కోర్టు హాలులో నుంచి బయటకొచ్చి ప్రాంగణం బయట దాలయ్య కోసం ఎదురు చూడసాగాడు. దాలయ్య దగ్గరకు రాగానే ‘‘నువ్వు హామీ ఇచ్చినట్టు.. ఆ కంకణాన్ని నాకు ఇచ్చెయ్’’ కోరాడు సూర్యారావు.‘‘ఇచ్చేవాడెవడు? పుచ్చుకునేవాడెవడు’’- దాలయ్య.‘‘ అయ్.. నేను చెప్పిన మాటలు నాకే అప్పగిస్తావా?’ మర్యాదగా ఆ కంకణం తీసి నాకు ఇవ్వు.. ’’‘‘ ఇచ్చేవాడెవడు? పుచ్చుకునేవాడెవడు? ’’

మళ్లీ చెప్పాడు దాలయ్య.

సూర్యారావు కోపానికి హద్దుల్లేకుండా పోయింది.

‘‘ నేను అడిగింది ఇస్తావా? లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను’’ పళ్లు పటపట కొరుకుతూ దాలయ్య గొంతు పట్టుకున్నాడు.‘‘ ఇచ్చేవాడెవడు? పుచ్చుకునేవాడెవడు?’’ అన్నాడు దాలయ్య తాపీగా. మెల్లగా జనం మూగుతున్నారు. సూర్యారావుకి భయం వేసింది. తనున్న పరిస్థితుల్లో నలుగురి కంటా పడితే పరువు తక్కువ. వృత్తి పరమైన కళంకం. కోపాన్ని నిగ్రహించుకుని బతిమాలటం మొదలుపెట్టాడు.ఏ ప్రయోగానికి దాలయ్య దిగిరాలేదు. మొదటిసారి సూర్యారావుకు ఎదురుదెబ్బతగిలింది. అమాయకుడనుకున్న దాలయ్య ఏకు మేకయ్యాడు.చివరికి ‘ ఇచ్చేవాడెవడు? పుచ్చుకునేవాడెవడు?’ అనుకుంటూ దాలయ్య కళ్ల ముందు నుంచి కదిలి వెళ్లిపోతున్నా...ఏం చేయలేక .. నిస్సహాయంగా చూస్తుండిపోయాడు

ది గ్రేట్ క్రిమినల్ లాయర్ సూర్యారావు...

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి