ప్రయోజనం - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

prayojanam

శ్రీపురంలో ఉండే కిట్టయ్య ఒక షరాబు. ఊర్లో వారివే కాకుండా చుట్టుప్రక్కల పల్లె ప్రజలవి బంగారు నగలు చేసేవాడు. తీరిక సమయాల్లో పుస్తకాలు, తాళపత్ర గ్రంధాలు చదువుతూ కొత్తకొత్త భాషలు నేర్చుకునేవాడు.

అతడి ప్రక్క ఇంట్లో వీరేశం అనే రైతు ఉండేవాడు. ఇద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. వీరేశం మాత్రం పొలం పని లేనప్పుడు మిత్రులతో కలసి జూదం ఆడేవాడు. అతడు కిట్టయ్యని కూడా ఆటకి రమ్మని పిలిచేవాడు కానీ కిట్టయ్య వెళ్ళలేదు. దాంతో అతడిని మిత్రులతో కలసి ఎగతాళి చేసేవాడు. ‘పెద్ద పండితుడిలాగా ఎప్పుడూ చదువెందుకు? ఎవరికైనా పాఠాలు చెప్పాలా? కావ్యాలు రాయాలా? షరాబుకి తూనికల లెక్కలు వస్తే చాలదా?” అని.

కిట్టయ్య అదేమీ పట్టించుకోకుండా “ఇందులో ఉండే ఆనందం, ప్రయోజనం అనుభవిస్తే కానీ తెలియదు” అనేవాడు.

కొన్నాళ్ళ తరువాత కిట్టయ్యకు నగరం వెళ్ళే పని పడింది. ఒక భాగ్యవంతుడి కుమార్తెకు మంచి సంబంధం కుదరడమే కాకుండా పది రోజులలోనే వివాహ ముహూర్తo నిశ్చయించడంతో జరూరుగా నగలు చెయ్యాల్సి వచ్చింది. అక్కడున్న షరాబులందరిదీ అదే పరిస్థితి కావడం వల్ల నిపుణులైన పనివాళ్ళ కోసం వెతికారు. పట్టణంలోని వర్తకుల ద్వారా కిట్టయ్య పేరు తెలుసుకుని అతడికి కబురు పంపించారు.

నగరంలోనే అతడికి వసతి, భోజన సదుపాయం కలిగిస్తారని తెలియడంతో వచ్చిన అవకాశానికి సంతోషించి కిట్టయ్య బయల్దేరాడు. పొరుగింటి వీరేశం కూడా నగరం చూడడానికి వస్తానన్నాడు కిట్టయ్యతో. ఇద్దరూ కలసి వెళ్ళారు.

పగలంతా నగల తయారీలో సహకరించేవాడు కిట్టయ్య. సాయంత్రాలలో వీరేశాన్ని తీసుకుని వూరు చూసేవాడు. నగరంలో సందర్శనకు ఎంపిక చేసిన ప్రదేశాలు, ఉద్యానవనాలు, దేవాలయాలు చూసారు.

అక్కడ ఉన్న రోజుల్లో కాళికామాత ఉత్సవం జరిగింది. ఒక సాయంత్రం పూట మిత్రుడితో కలసి ఉత్సవానికి వెళ్ళాడు కిట్టయ్య. అక్కడ అయిదేళ్ళ వయసున్న బాలిక తల్లిదండ్రుల నుండి తప్పిపోయింది. పొరుగు రాజ్యం నుండి బంధువుల ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు, కూతురు కోసం ఏడుస్తూ వెతకడం మొదలుపెట్టారు. వారి భాష అక్కడి వారికి తెలియక సహకారం అందలేదు.

వాళ్ళ మాటలు కిట్టయ్య విన్నాడు. బాలిక తప్పిపోయిన సంగతి గ్రహించి దగ్గరలో ఉన్న కొత్వాలుకి చెప్పాడు. కొందరు భటులను రప్పించి తప్పిపోయిన బాలిక వివరాలు తెలుసుకుని వెతకమన్నాడు కొత్వాలు. బాలిక ఆనవాళ్ళు తెలుపుతూ ఆ ప్రాంతంలో దండోరా కూడా వేయించడంతో కొంత సేపటికి బాలిక దొరికింది. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించాడు కొత్వాలు.

తమ మధ్య దుబాసిగా కిట్టయ్య వ్యవహరించక పోతే సులువుగా బాలిక దొరికేది కాదని, బాలికను అప్పగించి పొరుగు దేశపు ప్రజల మనసుల్లో తమ ప్రతిష్ట నిలబెట్టాడని అతడిని మెచ్చుకున్నాడు కొత్వాలు. వీరేశం అదంతా గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు.

నగల తయారీ పని పూర్తయిన తరువాత ఇద్దరూ కలసి తిరుగు ప్రయాణమయ్యారు. అడవి మార్గం దాటుతుండగా వారికి ఆకలి, దాహం కలిగాయి. దూరంగా వారికి ఒక గూడెం కనిపించింది. అక్కడ కొండజాతి మనుషులు ఉన్నారు. అక్కడున్న వారికి సభ్య ప్రపంచం మాట్లాడే భాష తెలియదు. వారి భాష కిట్టయ్యకు తెలియడంవల్ల వాళ్ళ భాషలో పలకరించి మాట్లాడాడు కిట్టయ్య. అతడినీ, వీరేశాన్నీ ఆప్యాయంగా పలకరించి దాహం తీర్చి తినేందుకు తియ్యటి పండ్లు పెట్టారు వాళ్ళు.

ఆ సమయంలో పట్టణం నుండి ఒక వ్యాపారి అక్కడకి వచ్చాడు. రంగురాళ్లు కొనడానికి వచ్చానని చెప్పాడు. కొందరు తమ వద్ద ఉన్న రంగురాళ్ళను చూపించారు. ఆ వ్యాపారి చౌకగా బేరమాడి, జేబులో నుండి ధనం తీసి వారికి ఇవ్వబోయాడు. అక్కడే ఉన్న కిట్టయ్య రంగురాళ్ళలో ఒకదానిని చేతిలోకి తీసుకుని పరీక్షించాడు. కిట్టయ్యకి ఆశ్చర్యం వేసింది. అదొక విలువైన వజ్రం.

“అవి మామూలు రంగురాళ్ళు కాదు. విలువైన వజ్రాలు. ఆ వ్యాపారికి చౌకగా అమ్మవద్దు” అని వాళ్లకి చెప్పాడు కిట్టయ్య. అతడి వైపు వింతగా చూసి ‘నీ మాటలు ఎలా నమ్మాలి?’ అని అడిగాడు నాయకుడు. అప్పుడు కిట్టయ్య “నగరంలోని వజ్రాల దుకాణంలో వీటిని అమ్మకానికి పెడదాము. ఎంత ధనం వస్తుందో మీరు చూడండి. మీరు వస్తానంటే అమ్మించి మంచి ధర ఇప్పించడంలో సాయం చేస్తాను” అన్నాడు.

కిట్టయ్య చెప్పినట్టు నాయకుడు తన వాళ్ళని తీసుకుని బయల్దేరాడు. నగరంలోని వజ్రాల వ్యాపారులు పరీక్షలు జరిపి అవి నిజమైన వజ్రాలని తేల్చారు. పెద్ద మొత్తంలో ధనం ఇచ్చి వాటిని కొన్నారు. నాయకుడి ఆనందానికి అంతు లేకపోయింది. ”ఇంతకాలం మామూలు రంగురాళ్లు అనుకుని ఎన్నో అమ్మేసాము. నీ వల్ల నిజం తెలిసింది” అంటూ కిట్టయ్య చేసిన సాయానికి ప్రతిఫలంగా ఒక వజ్రం అమ్మగా వచ్చిన ధనాన్ని అతడికి కానుక ఇచ్చాడు.

మిత్రుడితో కలసి వూరు చేరుకున్నాడు కిట్టయ్య. తనకి అందిన ధనంలో కొంత భాగం మిత్రుడికి ఇవ్వడమే కాకుండా మరికొంత ధనం వెచ్చించి తమ పల్లెను అభివృద్ధి చేసాడు కిట్టయ్య.

వీరేశం ద్వారా కిట్టయ్య భాషా ప్రతిభ తెలుసుకున్న జనం అతడిని మనస్పూర్తిగా అభినందించారు. అంతేకాకుండా కొత్వాలు ద్వారా రాజుగారికి కూడా కిట్టయ్య పేరు చేరింది. ఒక మంచి రోజున అతడిని సన్మానించాడు మహారాజు. ఆ విధంగా కిట్టయ్య గొప్పతనం రాజ్యమంతా ప్రాకిపోయింది. అప్పటి నుంచి ఆ వూరిలో పిల్లలు, పెద్దలు తీరిక సమయాల్లో పుస్తకాలు చదువుతూ జ్ఞానం పెంచుకోవడానికి వెచ్చించారు.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి