కొత్త జీవితం - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

kotha jeevitha telugu story

ఆఫీసుకి బయల్దేరుతున్న నేను ఎదురింటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళబోతున్నావిడ్ని చూసి ఆశ్చర్యానందాలకి లోనయ్యాను.

తను నిజంగా వైష్ణవేనా లేక పక్కనించి చూడ్డం వల్ల నాకలా అనిపించిందా? లేదు లేదు నా కళ్ళు నన్ను మోసం చేయవు. అయినా వెళ్ళి చూసొస్తే సరి. ఎదురుగా వున్న ఆ ఇండిపెండెంట్ ఇల్లు ఖాళీగా వుందని తెలుసు కాని తనెప్పుడు దిగిందో?'

నేను పెద్ద పెద్ద ఆడుగులేస్తూ "వైష్ణవీ!" అని పిలిచి సరిదిద్దుకుని "వైష్ణవి గారూ.." అని పిలిచాను గేటు తీస్తూ..

వైష్ణవి బయటకి వచ్చింది. నా ఆనందానికి అవధిలేదు. పోగొట్టుకున్న పెన్నిధి ఏదో దొరికిందన్న సంతోషం నన్ను నిలవనీయడం లేదు.తనకీ అలాగే వుందని తనని చూస్తే తెలుస్తోంది.

"రా రఘు.. రా.. ఎన్నాల్లయింది నిన్ను చూసి" పక్కకి జరిగింది. నేను లోపలికెళ్ళి కూర్చున్నాను. తను ఫ్యాన్ ఆన్చేసి నా కోసం కాఫీ పెట్టడానికనుకుంటా వంటింట్లోకెళ్ళింది.

నన్ను గతం అంచెలంచెలుగా తనలోకి తీసుకెళ్ళింది.

**** **** **** ****

అప్పుడు మేము విజయవాడలో వుండే వాళ్ళం. మా పక్కింట్ళోకి కొత్తగా వచ్చారు రాజశేఖరంగారు. ఆయనకి ఒక్కగానొక్క కూతురు వైష్ణవి. చూడముచ్చటగా వుండేది. మా కుటుంబం వాళ్ళ కుటుంబం కలిసి మెలిసి వుండేది. మా నాన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారు. రాజశేఖరంగారేమో ఏవో బిజినెస్‍లు చేస్తుండేవారు.

ఒకే స్కూలు ఒకే తరగతి కావడంతో నేను వైష్ణవి కలసి మెలసి తిరిగేవాళ్ళం. నేనంటే ఎందుకో చాలా అభిమానంగా వుందేది. వాళ్ళమ్మ చేసే తినుబండారాలన్ని నా కోసం తెచ్చి ఆప్యాయంగా నాకు తినబెట్టేది.

ఒకనాడు రాజశేఖరంగారు మా నాన్నతో "ఇలా ఎంతకాలం ఉద్యోగాలు చేస్తారు? నాతో చేయికలపండి. బిజినెస్ లో డక్కమొక్కీలు తిన్నవాణ్ణి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే పూచీ నాది" అన్నాడు. మా నాన్న నమ్మి ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ వచ్చిన డబ్బు బిజినెస్ లో పెట్టాడు.

ఇంతకుముందు కన్నా మా ఇంటికి కొన్ని హంగులు సమకూరాయి. రాజశేఖరంగారి దయవల్లనే తమజీవితాల్లో మార్పు చోటు చేసుకుందని అమ్మా.. నాన్న మాట్లాడుకోవడం నేనెన్నోసార్లు విన్నాను.

కొంతకాలం బాగానే జరిగింది. ఉన్నట్టుండి వైష్ణవి బయటకి కనిపించడం మానేసింది. వాళ్ళింట్లో బంధువుల హడావుడి. స్కూలుకి కూడా రావడం లేదు. నాకేం పాలు పోవడంలేదు. తను లేకపోతే పిచ్చెక్కినట్టు వుంది. అమ్మని విషయం అడిగాను. "వైష్ణవి పెద్దమనిషయిందిరా.." అంది.

"అంటే నీ అంత పెద్దదిగా అయిందా? అందుకే సిగ్గుపడుతూ బయటకి రావట్లేదా?" అన్నాను.

"ఏడిశావుగాని వెళ్ళి చదువుకో..ఇహనుంచి నీతో అంత క్లోజ్‍గా వుండదు తను" అంది.

హడావుడి సద్దుమణిగింది. వైష్ణవి బయటకి వచ్చింది. ఎందుకో కొత్తగా..కొత్తందాలతో కనిపించింది. వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నేను కనిపిస్తే తుర్రు మని లోపలికి పరుగెడుతోంది. నన్ను చూసి తనలా ఎందుకు దాక్కుంటోందో అర్థం కావడంలేదు. స్కూలు కొచ్చినా స్నేహితురాళ్ళతోనే వుంటోంది. నేను ఒకనాడు తనని ఒంటరిగా దొరకబుచ్చుకుని కోపంగా "నీకేమయింది..నన్ను తప్పించుకు తిరుగుతున్నావు? నా స్నేహం మానేశావా?" అన్నాను.

వైష్ణవి బెదిరిపోయి చుట్టూ చూస్తూ "నేను ఇదివరకటిలా మగాళ్ళతో మాట్లాడకూడదుట. ఆటలాడకూడదుట. మరీ ముఖ్యంగా నీతో. సిగ్గు పడుతూ వుండాలట. అలా వుండకపోతే పాపం తగులుతుందిట.." అంది కళ్ళనీళ్ళతో.

నా పరిస్థితి అలాగే వుంది. "నువ్వు నాక్కావాలి వైష్ణవి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను" అన్నాను.

తను కూడా "నాకూ అంతేరా..కాని ఏంచేస్తాం?" అంది బేలగా!

ఇదిలా వుండగా బిజినెస్ లో లాస్ వచ్చింది. అది మానాన్న వల్లనే అని రాజశేఖరంగారు రాక్షస అవతారంతో రంకెలెయ్యడం చూశాను. మా నాన్నగారు మానసికంగా కృంగిపోయారు. అప్పటి పరిస్థితుల ఛాయలు నా మీద పడకుండా నన్ను దూరంగా పట్నంలో హాస్టల్లో వుంచి చదివించసాగారు. నాకు వైష్ణవి గుర్తు కొచ్చినప్పుడల్లా చాలా బాధ అనిపించేది. కాని ఆ వెంటనే రాజశేఖరంగారు గుర్తొచ్చి కోపం నషాలానికి అంటేది. నన్ను ఇంటికి మాత్రం రానిచ్చేవారు కాదు.

చాలాకాలానికి నేను ఇంటికి వెళ్ళాను. ఎంతో ఆశతో పక్కింటీ వైపు చూశాను. వేరెవరో వున్నారు. నేను అమ్మను వైష్ణవి గురించి అడిగాను. అమ్మ కళ్ళనీళ్ళతో 'వాళ్ళు కనిపించినంత మంచివాళ్ళు కాదని, నాన్నని నిలువునా ముంచేశారని, ఆ మానసిక వ్యాధితో నాన్న చాలా కృంగిపోయి కోలుకోవడానికి చాలా కాలంపట్టిందని, వాళ్ళు అలా చాలా మందిని ముంచేసి రాత్రికి రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయారని' చెప్పింది కళ్ళనీళ్ళతో.

**** **** **** ****

ఆ తర్వాత ఇంతకాలానికిలా..

"ఇదిగో కాఫీ" అంది.

నేను అందుకున్నాను. "నన్ను చూస్తే కోపంగా వుందా?" అంది హఠాత్తుగా.

నేనేం మాట్లాడలేదు.

"వుంటుంది..ఎందుకుండదు?..మా నాన్న చేసిన మోసానికి మరొకరైతే నన్ను చంపేసేవారు.." అంది ఏడుస్తూ.

"చూడు వైష్ణవి..నాకు నువ్వంటే అప్పుడు ఇప్పుడు అభిమానమే! అందుకే పలకరించాను. నీకు పెళ్ళయిందా?"అన్నాను.

"చెబుతాను.. నీకు చెప్పి కాస్త మనసుని ప్రశాంత పరచుకుంటాను. నాకంటూ ఎవరూ లేరు..ఇన్నాళ్ళకి నువ్వొచ్చి నేనూ మనిషినే అన్న విషయం గుర్తుచేశావు." అని గతం విప్పి చెప్పసాగింది.

**** **** **** ****

మా నాన్న ముంచేసిన వాళ్ళందరూ మా ఇంటిమీద పడి రోజూ గొడవ పడుతూండడంతో, ఒక రాత్రివేళ అక్కడినుండి పారిపోయి మరో వూరెళ్ళాం. అప్పటికే మా నాన్న మీద నాకూ మా అమ్మకి చెప్పలేనంత అసహ్యం కలిగింది. మా అమ్మ నాన్నతో మాట్లాడడం మానేసింది. మా నాన్న విపరీతంగా తాగి ఒళ్ళు తెలియకుండా ఎక్కడో పడిపోయేవాడు. ఒకరోజు అలా పడిపోయివున్న ఆయనమీదనుంచి లారీ వెళ్ళిపోయి కుక్క చావు చచ్చాడు. మా అమ్మ అక్కడ స్కూళ్ళో టీచరుగా చేరింది. నాకు పెళ్ళి చేయాలని సంబంధాలు చూడసాగింది. నేను మీ ఊరెళ్ళి నీతో నా పెళ్ళి విషయం మాట్లాడమన్నాను. అమ్మ "వెళితే మీ నాన్న చేసిన పనికి మన ముఖాన పేడనీళ్ళు పోస్తారు." అంది. నాకూ అది నిజమే అనిపించింది.

ఆ తర్వాత నాకు ఓ తెలుగు మాస్టారితో పెళ్ళి జరిపించింది. మనిషి మంచివాడు. కాని మా నాన్న చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? అతనికి కిడ్నీలు రెండూ పాడయి హృదయ విదారక పరిస్థితుల్లో కన్ను మూశాడు.అతని వుద్యోగం నాకు వచ్చింది.

**** **** **** ****

"లాంగ్ సర్వీస్ లో ప్రిన్సిపాల్ నయ్యాను. ఇక్కడికి పోస్టింగ్ మీద వచ్చాను. ఇందులోకి అద్దెకి వచ్చి నాలుగు రోజులవుతోంది. నా సోదితో నిన్ను విసిగించాను. ఇహ నీ సంగతి చెప్పు. మీ ఆవిడెలా వుంటుంది? పిల్లలేం చేస్తున్నారు?" అంది కళ్ళు తుడుచుకుంటూ.

నాకూ పెళ్ళయింది. నాకో కొడుకు.. ఆర్మీలో వున్నాడు. ఈ మధ్యనే మా ఆవిడ కాలంచేసింది. ఆఫీసుకెళ్ళాలి.. ఇప్పటికే ఆలస్యమైంది. నేను ఒక కంపెనీకి కన్సల్ టెంట్ గా పనిచేస్తున్నాను.

"అన్నట్టు నాకు నువ్వంటే ఎంతో అభిమానం. ప్రేమ. అదృష్టమో, దురదృష్టమో మనిద్దరికీ తోడుండాల్సిన వాళ్ళు లేరు. పెద్దవాళ్ళ మూర్ఖత్వానికి బలయ్యాం. ప్రేమ ఆకర్షణతో మొదలై క్రమ క్రమంగా పరిణతి సాధిస్తుంది. మనిద్దరికి నిజానికి తోడు కావలసింది ఇప్పుడే! ఇప్పటి ఈ జీవితాలు మనవి. మనని ఎవరూ శాసించలేరు. మనమే శాసన కర్తలం. మనిద్దరం ఒకటై మిగిలిన ఈ జీవితాన్ని తృప్తిగా గడుపుదాం! ఏమంటావు? ఈ ప్రపోజల్ నచ్చితే సాయంత్రం ఆరు గంటలకి వస్తాను. తయరుగా వుండు.. బిర్లా టెంపుల్ కి వెళదాం." అన్నాను.

**** **** **** ****

సాయంత్రం ఆరు గంటలు.

వైష్ణవి కొత్తచీర కట్టుకుని..పూలుపెట్టుకుని ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఆమెకి మానసికంగా పదహారేళ్ళు.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి