బాబోయ్ ఫోనొచ్చింది - తిరుమలశ్రీ

baaboi phone vachindi telugu story

బదరీనాథ్ ఓ ప్రభుత్వోద్యోగి. ఆ మధ్యే హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చాడు. ఆ మహా నగరంలో హఠాత్తుగా అద్దె ఇల్లు దొరకడమంటే అంత సులభం కాదు. అదీ - ఆఫీసుకు దగ్గరలో!... మొత్తానికి ఎలాగో కొలీగ్స్ సాయంతో ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఫ్లాట్ ఒకటి సంపాదించగలిగాడు, అద్దె కొంచెం ఎక్కువైనా.

కొత్త ఊరు. కొత్త సంసారం... ఆ ఏరియాకు చెందిన కుకింగ్ గ్యాస్ సప్లయ్ ఏజెన్సీ కి వెళ్లి రిజిష్టర్ చేసుకోబోతే, ఐ.డి. తో పాటు అడ్రెస్ ప్రూఫూ కావాలన్నారు. అదీ - అతని పేరులో!... అలాగే, బ్యాంక్ లో ఎకౌంట్ ఓపెన్ చేద్దామని వెళ్తే - అడ్రెస్ ప్రూఫ్ తో పాటు, అదే బ్రాంచ్ లో అకౌంట్ ఉన్న ఖాతాదారు చేత ఇంట్రడక్షన్ కూడా కావాలన్నారు.

కరెంట్ బిల్లు బిల్డర్ పేరులో ఉంది. అతను తన ఫ్లాట్ లో అద్దెకు ఉంటున్నట్లు ఇంటి ఓనర్ రాసిచ్చే లెటర్ కూడా చెల్లదట. ప్రభుత్వపరమైన గుర్తింపు కాగితమే కావాలట!

ఎవరో సలహా ఇవ్వడంతో, తన డిపార్ట్మెంట్ ఐ.డి. ని ఉపయోగించి గవర్నమెంట్ (బి.ఎస్.ఎన్.ఎల్) టెలిఫోన్ ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకున్నాడు బదరీనాథ్, వేయి రూపాయల డిపాజిట్ కట్టి, నిజానికి అతనికి సెల్ ఫోన్ ఉంది. ల్యాండ్ లైన్ అవసరం లేదు. ఐనా అడ్రెస్ ప్రూఫ్ కోసం కనెక్షన్ తీసుకోకతప్పలేదు.

దాంతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, గ్యాస్ ఏజెన్సీ లో పేరు నమోదు చేసుకుని తేలికగా ఊపిరి పీల్చుకున్న బదరీనాథ్ - అసలు సమస్య ఆ తరువాతే ఆరంభమౌతుందని ఊహించలేదు, పాపం!

ముప్పయ్ ఐదేళ్ళ బదరీనాథ్ ది చిరు కుటుంబం - భార్య కమల, పదేళ్ళ కూతరు రాధిక, తల్లి లక్ష్మమ్మాను.

ఓ సారి ఫోన్ మ్రోగితే లక్ష్మమ్మ వెళ్లి రిసీవర్ తీసింది.

ఆమె 'హలో!" అనగానే - అటువైపు నుండి, "హాయ్, స్వీటీ! నిన్నటి నుంచి నీకోసం ట్రై చేస్తూంటే రెస్పాన్స్ లేదేమమ్మా?" అన్న మగ గొంతుక.

"ఏయ్, ఎవరు నువ్వు?" గట్టిగా అడిగింది లక్ష్మమ్మ.

"ఎంత అలిగితే మాత్రం? బాయ్ ఫ్రెండ్ నే తెలియనట్టు నటిస్తావా! నా సెల్ లో చార్జ్ ఐపోయింది డియర్! అందుకే ఇందులో," అన్నాడతను. "ఏయ్, స్వీటీ! సాయంత్రం లవర్స్ పార్క్ కు వెళ్దాం, రెడీగా ఉండు, అక్కడ ఐస్ క్రీమూ, నీ కోపం పోయేలా స్వీట్ నథింగ్సూ తో ఎంజాయ్ చేద్దాం. ఓకే?"

"ఎవడ్రా నువ్వు? ఎవరు కావాలి?" కోపంగా అంది ఆవిడ.

"నువ్వే, నువ్వే... నువ్వే కావాలి!" కొంటెగా అన్నాడు అతను. అంతలోనే, "మీవాళ్లెవరైనా పక్కనున్నారేమిటీ... తెలియనట్టు నటిస్తున్నావ్?... ఓకే! ఈవెనింగ్..." అంటూ, ఫోన్లో
ముద్దులు పెట్టాడు.

చటుక్కున రిసీవర్ పెట్టేసి, అప్రయత్నంగా బుగ్గ తుడుచుకుంది లక్ష్మమ్మ.

"దరిద్రపుగొట్టు వెధవ! నన్ను లవర్స్ పార్క్ కు రమ్మంటాడా! నాకు ముద్దులు కూడా పెడతాడా!!... బదిరీని రానియ్, పోలీస్ కంప్లెయింట్ ఇప్పించి, ఆ పోకిరిగాడి తిక్క కుదుర్చుతాను..." అంటూ కోపంతో గింజుకుంటున్న అత్తగారి వంక తెల్లబోయి చూసి, "ఏమయిందత్తయ్యా?" అనడిగింది కమల.

ఆవిడ జరిగిందంతా చెప్పి, "నా వయసుక్కూడా గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతాడా! వాడికెంత ధైర్యం?" అంది మండిపడుతూ.

కమల నవ్వాపుకుంటూ, "టెలిఫోన్లో మీరు అతనికి కనిపించరు కదండీ? బహుశా అతను తన గర్ల్ ఫ్రెండ్ ఎవరికో చేస్తే... అది రాంగ్ నంబరుకు, మనకు వచ్చుంటుంది" అంది.

ఆవిడ "ఔనా!?" అంటూ విస్తుపోయి, "గర్ల్ ఫ్రెండ్ ఐతే మాత్రం... ఫోన్లో ఆ ముద్దులేమిటీ, అసహ్యంగా!' అంది.

'అది జెనెరేషన్ గ్యాప్!' అని అత్తగారితో అనబోయి ఊరుకుంది కమల.

సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక తల్లి ఆనాటి తన టెలిఫోన్ అనుభవం గురించి చెబుతూంటే... పడిపడి నవ్వారు బదరీనాథ్, రాధికలు.

"నాన్నమ్మా! తప్పకుండా అది తాతయ్యే అయుంటాడు!" అంటూ ఆవిడను రాధిక ఆట పట్టిస్తూంటే...

"తప్పు!" అంటూ కూతురి నెత్తి మీద మురిపెంగా చిన్న మొట్టికాయ వేసింది కమల.

బదరీనాథ్ ల్యాండ్ లైన్ కు రాంగ్ కాల్స్ విరివిగా వస్తూండేవి. వాటిలో తరచుగా వచ్చే కాల్ - రాష్ట్ర మంత్రి ఏడుకొండలు కోసం! రోజుకు అర డజను సార్లైనా అతని కోసం ఫోన్ చేస్తూంటారు, ఎవరెవరో. అది మంత్రి గారి నివాసం కాదనీ, రాంగ్ నంబరనీ చెప్పినా కొందరు నమ్మేవారు కాదు... తమ నంబరూ, మంత్రి గారి నంబరూ పక్క పక్క వయ్యుంటాయనుకునేవాడు బదరీనాథ్. అతని కాల్స్ తమకు వచ్చినట్టే, తమ కాల్స్ అతనికి వెళ్తున్నాయేమోనన్న అనుమానం కూడా కలిగేది. ఆ విషయమై ఒకటి రెండు సార్లు టెలిఫోన్ డిపార్ట్మెంట్ కు పిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పులేదు.

ఓరోజు రాత్రి టీవీ లో న్యూస్ వాచ్ చేస్తూన్న బదరీనాథ్ కుటుంబాన్ని ఓ వార్త ఆశ్చర్యపరిచింది... ఆ రోజు ఉదయం మంత్రి ఏడుకొండలు తన పదవికి రాజీనామా చేసాడని తెలిసి అతని అభిమానులు, మద్దతుదారులూ అతని నివాసానికి ఊరేగింపుగా వెళ్లారు. అతను ఎట్టి పరిస్థితులలోనూ రిజైన చేయడానికి వీల్లేదంటూ నినాదాలు చేసారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలంటూ గొడవ చేసారు. అది కేవలం గాలి వార్త అని చెప్పినా వినిపించుకోలేదు.

మంత్రి గారింటి ఆడంగులే ఆ నిజం చెప్పారంటూ వక్కాణించారు. ఆ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేయవలసి వచ్చింది... తరువాత, మహేశ్వరం లో పర్యటిస్తున్న మంత్రి గారే స్వయంగా వచ్చి, అది అబద్ధపు వార్త అనీ, కిట్టనివారెవరో దానిని పుట్టించి ఉంటారనీ చెప్పాకగానీ, జనాలు కుదుటపడలేదు.

"మంత్రి గారి రాజీనామా నిజమే అయ్యుంటుంది. ముఖ్యమంత్రితో ఏ విషయం లోనో అభిప్రాయభేదం వచ్చుంటుంది. ఆవేశంతో రిజైన్ చేసేసి ఉంటాడు గురుడు. మద్దతుదారుల ఒత్తిడితో ఉపసంహరిచుకుని ఉంటాడు" వ్యాఖ్యానించాడు బదరీనాథ్.

"అంతే అయ్యుంటుంది. నిప్పు లేనిదే పొగరాదు కదా!" అంది లక్ష్మమ్మ.

"మంత్రి గారి రాజీనామా సంగతి ఆయన ఇంట్లోవాళ్ళే చెప్పారంటున్నారు కదా!" అంది కమల.

అంతలో ఏదో గుర్తుకు వచ్చిన రాధిక 'కెవ్వు' మని అరచింది.

త్రుళ్ళిపడ్డా రంతా.

భయపడ్డ అత్తగారు కంగారుగా గుండెల పైన ఊసుకుంటూంటే - కూతురి వంక కోపంగా చూసింది కమల.

"ఏమయిందే? ఎందుకలా గుండెలు అవిసిపోయేలా అరిచావ్?" అంది కోపంగా.

ఆ పిల్ల చెప్పింది ఆలకించి మొదట తెల్లబోయినా, ఆ తరువాత పడిపడి నవ్వారంతా.

ఆరోజు ఉదయం... ల్యాండ్ లైన్ మ్రోగింది. పెద్దవాళ్ళంతా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండడంతో, రాధిక వెళ్లి రిసీవర్ తీసింది.

"మంత్రి గారు ఉన్నారండీ?" అని అడిగారు ఎవరో అటువైపు నుండి.

రోజుకు పదిసార్లు వచ్చే మంత్రి గారి కాల్స్ తో విసుగెత్తిపోయి ఉన్నారు ఇంట్లో అందరూ. అందుకే కొంటెగా, "మంత్రి గారు లేరు. రిజైన్ చేసేసారు!" అని జవాబిచ్చి, ఫోన్ కట్ చేసేసింది ఆ పిల్ల.

ఆ తరువాత ఫోన్ మళ్ళా మళ్ళా రింగ్ ఐనా అట్టెండ్ అవ్వలేదు...

మంత్రి ఏడుకొండలు 'రాజీనామా' వార్తకు మూలం రాధిక అని గ్రహించేసరికి, ఓ పక్క "అలా చెప్పడం తప్పుకాదటే, దయ్యం!" అంటూ ఆ పిల్లను మురిపెంగా మందలిస్తూనే... మరో పక్క రాత్రంతా నవ్వలేక చచ్చింది బదరీనాథ్ కుటుంబం.

ఐతే -

టెలిఫోన్స్ - ముఖ్యంగా, ల్యాండ్ లైన్స్ - కేవలం నవ్వించే సన్నివేశాలకే దారితీస్తాయనుకున్న బదరీనాథ్ - అది ఎల్లప్పుడూ నిజం కాదనీ, ఏడ్పించగలవు కూడాననీ తెలుసుకోవడానికి అట్టే రోజులు పట్టలేదు. కొండొకసారి అది హార్ట్ ఎటాక్స్ కూడా తెప్పిస్తుందనడానికి తానే నిదర్శనం అయ్యాడు.

ఆ రోజు సాయంత్రం - ఆఫీసు నుండి వచ్చి, వాష్ చేసుకుని, సోఫాలో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ వార్తా పత్రిక చదువుతున్నాడు బదరీనాథ్. ఓ కాగితం తెచ్చి తండ్రికి ఇచ్చింది రాధిక.

దాన్ని చూడగానే, 'అమ్మో!' అంటూ గుండె పట్టుకుని సోఫాలో ఒరిగిపోయాడు బదరీనాథ్.

లబో దిబో మంటూ డాక్టర్ కు ఫోన్ చేసింది కమల.

డాక్టర్ వచ్చి బదరీనాథ్ ను పరీక్షించాడు. "ఏదో పెద్ద షాకే తిన్నట్టున్నాడు. కరెంటు తీగ ఏదైనా పట్టుకున్నాడా?" అనడిగాడు.


"లేదు. ఈ టెలిఫోన్ బిల్లు ముట్టుకున్నాడు," అని జవాబు ఇచ్చింది రాధిక.

"అదీ సంగతి! అందుకే హార్ట్ ఎటాక్ వచ్చింది," అంటూ బదరీనాథ్ కు ఇంజెక్షన్ ఇచ్చాడు. దాంతో కొంతసేపటికి కళ్ళు తెరిచాడు బదరీనాథ్.

"పరవాలేదు. మైల్డ్ ఎటాకే. మందులు వేసుకుని రెస్ట్ తీసుకుంటే సరయిపోతుంది" అంటూ మందులు రాసిచ్చాడు డాక్టర్. "ఎందుకైనా మంచిది... కొన్నాళ్ళపాటు టెలిఫోన్ బిల్లులూ, కరెంట్ బిల్లులూ అతనికి చూపించకండి".

కమలకు కొన్ని జాగ్రతలు చెప్పి... ఫీజు జేబులో వేసుకుని, మెడిసిన్ చెస్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు అతను.

బదరీనాథ్ కోలుకునేసరికి వారం రోజులు పట్టింది.

భర్త పూర్తిగా కోలుకున్నట్టు నమ్మకం కలిగాక - ఎందుకైనా మంచిదని డాక్టర్ రాసిచ్చిన మందులవీ దగ్గర పెట్టుకుని, "ఏమిటండీ, ఈ దారుణం? రెండు నెలలకు యాభై వేల బిల్లేమిటి!? అన్ని కాల్స్ ల్యాండ్ లైన్ నుండి మనమెప్పుడు చేసాం?" అంది కమల ఆశ్చర్యము, ఆగ్రహమూ మిళితం కాగా.

బిల్లు తీసుకుని దానికి జతపరచియున్న కాల్స్ వివరాలను పరిశీలించిన బదరీనాథ్ నిశ్చేష్టుడయ్యాడు.

అర్థరాత్రి వేళ... ఇంటర్నేషనల్ కాల్స్... దుబాయ్, పాకిస్థాన్, సాల్మన్ ఐలెండ్స్, క్రిస్ట్మస్ ఐలెండ్స్ వగైరా దేశాలకు చేయబడినట్టు ఆ రికార్డ్ చెబుతోంది! వాటి కారణం గానే బిల్లు మొత్తం యాభై వేలు అయింది!!

అయోమయంలో పడిపోయాడు బదరీనాథ్. తాను కాని, తన కుటుంబం కాని ఇంటర్నేషనల్ కాల్స్ ఎన్నడూ చేయలేదు. కనీసం - అమెరికాకు కూడా. ఎందుకంటే, తన బంధుమిత్రులెవరూ విదేశాలలో లేరు. పుట్టంతా స్వదేశంలోనే ఉంది... పైగా, దుబాయ్, పాకిస్థాన్ లు తప్పిస్తే... సాల్మన్ ఐలెండ్స్, క్రిస్ట్మస్ ఐలెండ్స్ పేర్లు ఎప్పుడూ విననుకూడా లేదు.

అంతలోనే హఠాత్తుగా గుర్తుకు వచ్చింది అతనికి - తన ల్యాండ్ లైన్ కు అసలు ఐ.ఎస్.డి. ఫెసిలిటీయే లేదన్న విషయం!... నవ్వాలో ఏడవాలో తెలియలేదు అతనికి.

ఐతే అతని కుటుంబం మాత్రం ఏడ్చింది, ఆ టెలిఫోన్ బిల్లు మూలంగా... ఆరోగ్యంగా ఉన్న మనిషికి హార్ట్ ఎటాక్ వచ్చినందుకు!... టెలిఫోన్ బిల్లుకు డాక్టర్ బిల్లు కూడా తోడయినందుకు!!

బిల్లు తీసుకుని టెలిఫోన్ డిపార్ట్మెంట్ కు వెళ్ళాడు బదరీనాథ్. జూనియర్ ఇంజనీర్ ను కలుసుకుని విషయం చెప్పాడు.

ముందుగా బిల్లు పేచేసి, ఆనక కంప్లెయింట్ రాసివ్వమన్నాడతను.

బదరీనాథ్ తెల్లబోయి, "చేయని కాల్స్ కు నేనెందుకు బిల్లు కట్టాలి?" అనడిగాడు.

అతను నవ్వి, "అదంతే. 'పే ఫస్ట్ - ప్రొటెస్ట్ లేటర్' అన్నది మా డిపార్ట్మెంట్ తంబ్ రూల్!" అన్నాడు.

ఆ రూల్ తన కేసుకు వర్తించదని అతనికి నచ్చజెప్పబోయాడు బదరీనాథ్. ఫలితం లేకపోయింది.

డిపార్ట్మెంట్ హెడ్ జనరల్ మేనేజర్ (జి.ఎమ్) దగ్గరకు వెళ్ళాడు బద్రీనాథ్. తన గోడు వెళ్ళబోసుకున్నాడు.

బదరీనాథ్ చెబుతూన్నది సానుభూతితో, సావధానంగా ఆలకించాడు జనరల్ మేనేజర్.

"ఎక్చేంజ్ లన్నీ కంప్యూటరైజ్డ్. పొరపాట్లకు ఆస్కారం లేదు. మీరో, మీ కుటుంబ సభ్యులలో ఎవరో ఆ కాల్స్ ను చేసి మరచిపోయుంటారు," అన్నాడు కూల్ గా.

"కంప్యూటర్స్ ను ఆపరేట్ చేసేది మనుషులే. పొరపాటు ఎలాగో జరిగిపోయింది. అది మా దగ్గర మాత్రం కాదు" చికాకును అణుచుకుంటూ అన్నాడు బదరీనాథ్. "జరిగిన పొరపాటును సరిదిద్దవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను".

"సారీ సార్! మా జేయీ చెప్పింది నిజమే. మా సిస్టం ఎంతగా స్ట్రీమ్ లైన్ అయిందంటే... మొదట మీరు బిల్ పే చేస్తే తప్ప మీ కంప్లయింట్ ను యాక్సెప్ట్ చేయదు" అన్నాడు
జి.ఎమ్. పొలైట్ గా.

బదరీనాథ్ తెల్లబోయాడు. "బట్, వై షుడ్ ఐ వే?"

"మీ టెలిఫోన్ డిస్కనెక్ట్ అవకుండా ఉండడానికి" చిరునవ్వుతో సమాధాన మిచ్చాడు జి.ఎమ్.

"దెన్, ఐ విల్ డిమాండ్ సి. బి. ఐ ఇంక్వైరీ!" కోపంగా అన్నాడు బదరీనాథ్.

అతని వంక జాలిగా చూసాడు జి.ఎమ్. బదరీనాథ్ కు వార్తా పత్రికలను చదివే అలవాటు లేదా అని అడిగాడు. రోజూ వాటితోనే ముఖం కడుగుతానని చెప్పాడు బదరీనాథ్, అలా ఎందుకు అడిగాడో అర్ధం కాక.

"మరైతే ఇటీవల దేశంలో జరుగుతున్న సంఘటనల గురించి మీకు తెలిసే ఉండాలే!" అన్నాడు జి.ఎమ్.

"ఏ సంఘటనలను గురించి మీరు మాట్లాడేది?"

"అదే - బాంబ్ బ్లాస్ట్స్... మొదట బోంబే లో, తరువాత డిల్లీ లో, ఆ మధ్య మన హైదరాబాద్ లో. రేపు ఎక్కడో!?" అన్నాడు జి.ఎమ్.

"దేశంలో జరుగుతూన్న బాంబ్ బ్లాస్ట్స్ కూ, నా టెలిఫోన్ బిల్లుకూ ఏమిటి సంబంధం?" అయోమయంగా, అనుమానంగా చూసాడు బదరీనాథ్.

"ఉంది, సార్! బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ను మీరు ఎరుగుదురనుకుంటాను?" మందహాసం చేసాడతను.

"ఆఫ్ కోర్స్, మున్నాభాయ్ ని ఎరుగనివారు ఎవరుంటారు!?

అదంతా ఎక్కడకు దారి తీస్తోందో ఇంకా బోధపడడం లేదు బదరీనాథ్ కు.

"నౌ, లుక్, మై లెర్నెడ్ సార్! ఆ సూపర్ స్టార్ కు అండర్ వరల్డ్ తో సంబంధం ఉందన్న అనుమానం పోలీసులకు ఎలా కలిగిందంటారు?"

అతని ప్రశ్నతో బదరీనాథ్ మస్తిష్కం అర్జెంట్ గా ఆలోచనల అగాధం లోకి జారిపోయింది... సంజయ్ దత్ ఇంట్లోని ల్యాండ్ లైన్ నుండి దుబాయ్ వంటి దేశాలకు చేయబడ్డ కొన్ని
ఫోన్ కాల్స్ ఆధారంగా... పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. దఫాలుగా శ్రీకృష్ణ జన్మస్థానానికి కూడా వెళ్లివచ్చాడు అతను. ఆ కేసింకా ఓ కొలిక్కి రాలేదు...

'తన ఫోన్ బిల్లుకూ, సంజయ్ దత్ కేసుకూ సంబంధం ఏమిటో? అదంతా ఎక్కడకు దారి తీస్తున్నట్లో!?'... పజ్లింగ్ గా చూసాడు బదరీనాథ్.

"మీకు ఇంకా బోధపడలేదా?!" ఆశ్చర్యంగా అడిగాడు జి.ఎమ్. "ఐతే, మీకు బుర్రకు ఎక్కేలా చెప్పడం నా విద్యుక్త ధర్మం!"

బ్లాంక్ గా చూసాడు బదరీనాథ్.

"మీరు ఫోన్ బిల్ గురించి సి.బి.ఐ. దర్యాప్తును డిమాండ్ చేస్తానన్నారు. రైట్?" అన్నాడు జి.ఎమ్. "కాని, సి.బి.ఐ రంగం లోకి దిగితే ఏమౌతుందో తెలుసా?"

"ఏమౌతుంది?"

"మీ కప్ బోర్డ్ లో స్కెలెటెన్స్ ను సృష్టించగలదు ఆ ఏజెన్సీ..."

"వాడ్డూ యూ మీన్?"

"మీ కాల్స్ గమ్యం దుబాయ్, పాకిస్థాన్ వంటి దేశాలు అని మీరు విస్మరించకూడదు".

"బట్, ఆ కాల్స్ మేం చేయలేదు" గుర్తుచేశాడు బదరీనాథ్.

"అని మీరంటున్నారు. కాని, ఆ విషయంలో సి.బి.ఐ. ఆలోచనలు వేరేలా ఉండొచ్చును!" మందహాసం చేసాడు జి.ఎమ్. "దె కుడ్ ఈవెన్ ట్రేస్ యూ టు ద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్స్..."

అదిరిపడ్డాడు బద్రీనాథ్. "ఇటీజ్ రిడిక్యులస్!" ప్రొటెస్ట్ చేసాడు. "నా ఫోన్ కు అసలు ఐ.ఎస్.డి. ఫెసిలిటీయే లేదు!"

"ఓహ్, దట్ కుడ్ స్పెల్ ఫరదర్ ట్రబుల్ ఫర్ యూ..." అన్నాడు జి.ఎమ్. "రెండు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో ఓ ఫేక్ టెలిఫోన్ ఎక్చేంజ్ రాకెట్ ను పోలీసులు బర్స్ట్ చేసారు, గుర్తుందా? ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టం కలిగిస్తూ ప్రైవేట్ కంపెనీలకూ, బిజినెస్ మెన్ కూ రహస్యంగా ఇంటర్నేషనల్ కాల్స్ ను తక్కువ రేటుకు కనెక్ట్ చేసేది ఆ ముఠా... మీరూ అలాగే ఏ దొంగ ఎక్చేంజ్ ద్వారానో అంతర్జాతీయ కాల్స్ ను చేస్తున్నట్లు సి.బి.ఐ. దర్యాప్తు లో తేలవచ్చును!"

హతశుడయ్యాడు బదరీనాథ్. హఠాత్తుగా జబ్బుపడ్డవాడిలా ఐపోయాడు.

"ఐతే నన్నిప్పుడు ఏం చేయమంటారు?" నిస్సహాయంగా అడిగాడు.

"నేనే కనుక మీ స్థానంలో ఉంటే గప్ చుప్ గా బిల్లు చెల్లించేసేవాణ్ణి!" సజెస్ట్ చేసాడతను.

"మై గాడ్! యాభై వేలు! అకారణంగా!!" ఉలికిపడ్డాడు బదరీనాథ్.

"ఇంక్వైరీ వరకు వెళ్తే... అది మరింత కాస్ట్లీ ఆఫైర్ కావచ్చును!"

"బట్, అంత సొమ్ము నేనెక్కన్నుంచి తేను?"

"దట్స్ యువర్ ప్రొబ్లెమ్!" తాపీగా అన్నాడు జి.ఎమ్. "యూ బెట్టర్ గెట్ ద హెల్ ఔటాఫ్ హియర్... బిఫోర్ ద సి.బి.ఐ. స్మెల్స్ ఎ ర్యాట్!"

మెసేజ్ మెదడులో సూటిగా నాటుకోవడంతో - చటుక్కున లేచి నిలుచున్నాడు బదరీనాథ్...

తక్షణమే ఆఫీసుకివ వెళ్లి ప్రావిడెంట్ ఫండ్ నుండి లోన్ కు అప్లై చేసాడు - జి.ఎమ్. సలహా ప్రకారం టెలిఫోన్ బిల్ ను 'గప్ చుప్ గా' పే చేసేయడం కోసమని...!!

విషయం ఆలకించిన బదరీనాథ్ కుటుంబం అవాక్కయింది.

కమల తేరుకుని, "ఏమండీ! ఇవాళ దినపత్రికలో చూసాను - ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా వ్యక్తిగత గుర్తింపు కార్డులను జారీ చేస్తోందట. అందులో చిరునామాతో పాటు అవసరమైన ఇతర వివరాలవీ ఉంటాయట. ఆ కార్డ్ అన్నిటికీ ఉపయోగిస్తుందట," అని చెప్పింది.

ఆమె పలుకులు బదరీనాథ్ చెవులలో అమృతం పోసాయి.

"నిజంగా? ఐతే ఇప్పుడే టెలిఫోన్ డిపార్ట్మెంట్ కు అప్లికేషన్ ఇచ్చేస్తాను, మన ల్యాండ్ లైన్ తీసేయమని!" అన్నాడు, హృదయాన్ని తేలికపరచుకోవడానికి ప్రయత్నిస్తూ.

మరిన్ని కథలు

Markatapuram-Story picture
మర్కటపురం
- యు.విజయశేఖర రెడ్డి
Daridrudu
దరిద్రుడు
- mahesh amaraneni
Giligadi vachche puligadu chachche
గిలిగాడు వచ్చె-పులిగాడు చచ్చె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kotta jeevitam
కొత్త జీవితం
- చచెన్నూరి సుదర్శన్
Yachakulu kaanidi evaru
యాచకులు కానిది ఎవరు?
- యాచకులు కానిది ఎవరు?.
Vimukti eppudo
విముక్తి ఎప్పుడో!
- రాము కోలా.దెందుకూరు.
Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.