నా సుఖమే నే కోరుకున్నా... - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Naa Sukhame Ne Korukunna Telugu Story

మా పక్కింటి వాటాలోకి శారదా వాళ్ళు అద్దెకి వచ్చేక వీధికో కళ... కాంతీ వచ్చాయనిపించింది.

సినీ హిరోయిన్ కి వున్నంత గ్లామరు బిల్డప్పు... నవలా కథానాయికకి వున్నంత అందచందాల వర్ణన లేకపోయినా... ఆ సాధారణ అందం ఆమె వ్యక్తిత్వంతో మిస మిస లాడుతోంది.

ఆమెలో వున్న గొప్పతనమేమిటంటే కలుపుగోలుతనం. అలా అని ఓ పూసుకు తిరగదు... అవసరం అది తనదైనా... మనదైనా ప్రత్యక్షమవుతుంది. తీరిపోయాక డిటాచ్ అయిపోతుంది.

వాళ్ళ నాన్న మునిసిపాలిటిలో పనిచేస్తున్నాడు. తనకో అన్నయ్య కూడా వున్నాడు. రోడ్లు పట్టుకు తిరగడం తప్ప మరే ఉపయోగం లేదు. వాళ్ళ అమ్మకి భక్తి ఎక్కువ. ఎప్పుడూ అధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలుతూంటూంది. అంచేత ఇంటికీ... ఇంటిల్లిపాదికీ అంతా తానే అయి అన్ని పనులూ చేస్తుంటుంది.

శారద మా అమ్మకి కూడా చేదోడు వాదోడుగా వుండడం వల్ల మా అమ్మ దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. అవన్నీ పక్కన పెడితే ఏ అమ్మాయిని చూసినా కలగని మానసిక శారీరక పులకరింతలు ఈమెని చూస్తే కలుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఆమె కనిపిస్తుందా... అని ఆత్ర పడడం... చూశాక అదో మానసిక తృప్తికి లోనవడం జరుగుతోంది. మాట్లాడాలనిపిస్తోంది కాని ఎలా? ఓ స్త్రీ అయితే మరో స్త్రీతో సింపుల్ గా మాట కలపవచ్చు... కాని పెళ్ళికాని యువకుడు మరో పెళ్ళికాని పిల్లతో ఎలా మాట్లాడడం? సినిమాల్లో అయితే యువతీ యువకుల మధ్య 'ఏరా... ఏంట్రా'లతో కథ కలిపేస్తారు... నడిపేస్తారు... నిజ జీవితంలో అంత ఈజీ మాత్రం కాదు.

తను నా మనసులో ఇంత సంచలనానికి కారణమైనా... నేను తన మనసుని స్పృశించలేకపోయాను... అది తెలుస్తూనేవుంది. ఒక పురుషుడు ఎదురైతే ఎలా ప్రవర్తిస్తుందో అలాగే వుంటుంది తప్ప సిగ్గుపడడం... నన్ను చూడాలని ఉబలాటపడం... నేను ఎదురుపడితే తొట్రుపడడం... అబ్బే అలాంటివేం లేవు. వన్వే ప్రేమకథలు నిరంతరం మనసుని కోస్తూ ఇలాగే వుంటాయి. టూ వే అయితేనే రసరమ్యంగా వుంటాయి.నాది త్వరలోనే టూ వే అయితే బాగుండును. వాళ్ళ అమ్మ ఎంతోమంది దేవుళ్ళని కొలుస్తూవుంటుంది. నా మొర ఆలకించి వాళ్ళు ఆమెకి నామీద గోరంత ప్రేమ కలిగిస్తే... దాన్ని కొడంత చేసుకునే శక్తి నాకుంది. నిజం చెప్పాలంటే నా అంత మంచి వాడు ఆమెకీ వాళ్ళ తల్లిదండ్రులకీ ఎక్కడ దొరుకుతారు?(ఇది అతిశయోక్తి కాదండోయ్!).

ఓ రోజు నాకు సెలవు అవడంతో ఒక్కడినే ఇంట్లో వున్నాను. ఇంట్లో వుంటే ల్యాప్ టాప్ మీదా ప్రొజెక్ట్స్ కి కోడ్ రాస్తుంటాను. అన్నట్టు నా గురించి చెప్పలేదు కదూ... పేరు శ్రీకర్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కుదేలయినా నాకు మాస్టర్ స్కిల్స్ వుండడం వల్ల అవే నన్ను ఉన్నత పదవిలో మంచి శాలరీతో కొనసాగేలా చేస్తున్నాయి. మా నాన్నకి అమ్మకి ఒక్కడినే పుత్ర రత్నాన్ని... అందుకే గారాబంగా పెరిగాను. అలా అని చెడిపోలేదు. అందుకే వాళ్ళకి నేనంటే ప్రాణం. నాక్కూడాను. కానీ ఇప్పుడిప్పుడే అదికొంచెం డైల్యుట్ అయి శారద అందులోకి ప్రవేశిస్తోంది. కోడ్ రాయడం పీక్ స్టేజ్ లో వుండగా శారద నాదగ్గరికి పరుగు పరుగున వచ్చి "మా అన్నయ్య నిన్న రాత్రనగా బయటకి వెళ్ళాడు... రోజూ ఆలస్యమైనా రాత్రికే వచ్చేస్తాడు... కాని... నిన్న రాత్రి రా..." చెప్పలేక ఏడవసాగింది.

నేను "ఏం ఫర్వాలేదు... ఎక్కడికి పోతాడు? తాగి ఎక్కడైన పడిపోయుంటాడు. తాగింది దిగితే ఇంటికి వస్తాడు." అన్నాను కాస్త కోపంగా.

"ప్లీజ్... ఇప్పటికే ఆలస్యమైంది అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి వస్తారా కాస్త వెదుకుదాం" అంది.

నేను ‘సరే’ అని లుంగీ బనియన్ లోంచి ప్యాంట్ షర్ట్ లోకి మారి ఆమెతో బయల్దేరాను.

బయటకొచ్చి ఆటో మాట్లాడాను. ఇద్దరం కూర్చున్నాం. రోజువీచే గాలి అయినా మా ఇద్దరి మధ్యాచేరి పులకింతలు రేపుతోంది. అప్పుడప్పుడు తగులుతున్న ఆమె స్పర్శ అర్థం కాని మధురానుభూతికి లోనుచేస్తోంది. తనకవేం పట్టట్లేదు. ఆందోళనగా వాళ్ళన్నయ్య కోసం బయటకి చూస్తోంది. కొంతదూరం ప్రయాణించాక ఆటో చౌరస్తాకి చేరుకుంది. అక్కడ వున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒళ్ళు తెలియకుండా పడుకుని వున్నాడు వాళ్ళన్నయ్య. ‘నేను ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేసింది కరక్టే కదా’ అన్నట్టు చూశాను. ఆమె పట్టించుకుంటే కదా! గబ గబ ఆటో దిగి వాళ్ళన్నయ్య కాళ్ళదగ్గర పట్టుకుని... నన్ను తలదగ్గర పట్టుకోమన్నట్టుగా కళ్ళతో రిక్వెస్ట్ చేసింది. నేను ఆమె కలసి ఆ అన్నయ్యశాల్తీని ఆటోలో కుదేసి అతనికి చెరోపక్కనా కూర్చున్నాం. అతన్నుంచి వస్తున్న వెగటువాసన మధురానుభూతుల్ని మంటగలిపేసింది. ఇంటికి చేరి అతన్ని వాళ్ళింట్లోకి చేర్చి థాంక్సులు తీసుకుని మా ఇంటికొచ్చాను. ఇన్సిడెంట్ చిరాకు కలిగించేదయినా శారదకి నాకూ వున్న దూరాన్ని కొంత తగ్గించింది. తను నన్ను చూసినప్పుడల్లా చిన్నగా నవ్వి విష్ చేయడం... మరీ దగ్గరగా కనిపిస్తే కాస్త మాటల ముత్యాలు రాల్చడం చేస్తోంది.

నాకు కాలం ఎలా దొర్లిపోతోందో తెలియడం లేదు. ఎప్పుడు ఆమె మనసులో మెదిలినా మనసు మధురానుభూతుల మయమవుతోంది. ఓ సాయంత్రం "అమ్మా! నేను శారదని ఇష్టపడుతున్నాను. నాకు తెలిసి నీకు కూడా ఆమె అంటే ఇష్టముంది. నాన్నతో మాట్లాడి మా పెళ్ళికి ఒప్పించవూ! " అన్నాను.

అమ్మ ఆశ్చర్యపోకపోయినా "అది కాదురా మా అన్నయ్య కూతురు నీకు ఈడైనది చిన్నప్పటినుండీ నీ మీదే ఆశలు పెట్టుకుంది. అయినా నేనేం నీ నిర్ణయానికి అభ్యంతరం పెట్టను కాకపోతే... నీ మరదలి మనస్థత్వం నీ చిన్నప్పటినుండీ నీకు తెలుసు. మన కుటుంబాలు కూడా చాలా ఏళ్ళుగా కలిసి మెలిసి ఉంటున్నాయి. అలాంటిది నిన్న గాక మొన్న పక్కింటి వాటాలోకి వచ్చిన శారదని నువ్వు ప్రేమిస్తున్నావంటే అది తాత్కాలిక ఆకర్షణ, వ్యామోహం తప్ప మరోటి కాదని నా అభిప్రాయం! పైగా వాళ్ళ అన్నయ్య తాగుబోతు... నాన్న మునిసిపాలిటీలో చిన్న ఉద్యోగి. ఇంతా కష్టపడి కెరియర్ని తీర్చి దిద్దుకుని తొందరపాటు నిర్ణయాలతో జీవితం నాశనం చేసుకోకూడదని నా సలహా! ఏదేమైనా నీ జీవితం... కాదు కూడదంటే నాన్నని ఒప్పించే బాధ్యత తీసుకుంటాను." అంది.

నాకు సపోర్ట్ చేసే తల్లిదండ్రులుండడం నా అదృష్టం. కాని బాధ్యత నాకే వదలడంతో తొందరపడకుండా కాస్త నిదానంగా మరోసారి ఆలోచించడం మంచిదనిపించి "అలాగేనమ్మా... మరి కొంత సమయం తీసుకుని చెబుతాను" అన్నాను.

*****


సినిమాల్లో చూపించినట్టుగా పార్కుల చుట్టూ తిరగడానికి నా ఉద్యోగం సహకరించక తనకీ ఇంటి బాధ్యతలతో కుదరక కొంతకాలం గడిచిపోయింది. ఆ సమయంలోనే వాళ్ళ అన్నయ్య తాగి లారి కింద పడి చనిపోవడం... వాళ్ళ నాన్న పై ఆఫీసరు పై కోపంతో చెయ్యెత్తడంతో సస్పెండ్ అవడం జరిగిపోయాయి. ఇహ ఆ ఇంటి బాధ్యత శారద భుజాలపై పడింది. ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది. ఆమె ముఖంలో మునుపటి ఉత్సాహం లేదు. బ్రతకడానికి తినాలి. తిన్నందుకు శ్రమించి ఇంట్లోవాళ్ళకి ఇంత పెట్టాలి. ఆమె పరిస్థితికి జాలేసినా నేను తనని పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను.

చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి చదివి పైకొచ్చాను. అమ్మా నాన్నా నా మీద కొండంత ఆశ పెట్టుకున్నారు. మా నాన్న ఒక కంపెనీలో మేనేజరు. మాది డిసిప్లీన్డ్ ఫ్యామిలీ. నా మరదలికి కూడా నేనంటే పంచప్రాణాలు. తనూ నాతో సమానంగా చదువుకుని చక్కటి ఉద్యోగం చేస్తోంది. రేపటి అందమైన భవిష్యత్తుని వదులుకుని ఆమెని చేసుకోవాలనుకోవడం మూర్ఖత్వమే! రేపు శారదతో పెళ్లయినా తన వాళ్ళు కష్టాల్లో వుంటే తను సుఖంగా వుండలేదు. తనూ వుండలేడు. ఆమెలో ఆశలు రేపకపోవడం మంచిదయింది. కొన్ని జీవితాలంతే బురదలో కమలాలు. బాగున్నాయనుకోవాలి అంతేకాని దగ్గరకెళ్ళే ప్రయత్నం చెయ్యకూడదు. వెళితే బురద అంటుకుంటుంది. నాకు లోపలొకటుంచుకుని బయటకి మరోటి వ్యక్తం చేయడం చేతకాదు. రెండున్నర గంటల సినిమా చూసి... అందులో నటించే వాళ్ళ ప్రేమని అనుకరించి జీవితాలని బుగ్గి చేసుకుంటున్నవాళ్ళు ఎంతో మందున్నారు. ఇంట్లో వాళ్ళ మూర్ఖత్వానికి శారద బలైపోతుంది. ఏమీ చెయ్యలేం! అయినా కొన్నాళ్ళ పాటు నా మనసులో కొలువైన తనకి ఏదైనా కానుక ఇవ్వాలనిపించింది. ఒకరోజు తను ఏకాంతంగా వున్నప్పుడు తన చేతిలో లక్షరూపాయల చెక్కుపెట్టి, "ఒక స్నేహితుడిగా ఇస్తున్నాను కాదనకు. రేపు నీ పెళ్ళికి ఉపయోగపడుతుంది" అన్నాను. ఆమె కన్నీళ్ళతో పరిగెత్తుకుని వాళ్ళింట్లోకి వెళ్ళిపోయింది. అప్పడనిపించింది ఆమె నన్ను ప్రేమిస్తోందేమోనని.

అమ్మతో నేను మరదలిని చేసుకుంటానన్న విషయం చెప్పాను. ఆవిడ ఆనందం అంతా ఇంతా కాదు. నిజమే నా మరదల్లో లేనిదీ శారదలో వున్నది ఏదీ లేదు. మనలోని బలహీనతని అదుపు చేసుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి.

*****


మా పెళ్లై రెండు సంవత్సరాలయింది. అమెరికాలో స్థిరపడ్డాం. జీవితం పంచ రంగుల వర్ణచిత్రంలా వుంది. అప్పుడప్పుడు ఎందుకో శారద గుర్తుకొస్తుంది. ఆ క్షణం మనసులో కాస్త బాధేస్తుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పనిపించదు.

మరిన్ని కథలు

Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.
Bandham
బంధం
- B.Rajyalakshmi
Desam kosam
దేశం కోసం
- కందర్ప మూర్తి
Sutakapu manishi
సూతకపు మనిషి
- రాము కోలా.దెందుకూరు
Guru dakshina
గురుదక్షిణ
- పిళ్లా కుమారస్వామి
Telivi okkate chaladu
తెలివి ఒక్కటే చాలదు
- శింగరాజు శ్రీనివాసరావు
Angla nadaka pingla nadaka
అంగ్ల నడక-పింగ్లనడక.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.